"అలా చూస్తావేమిటోయ్ ? నీకు కాలేజిలో సీట్ కూడా ఇప్పించలేకపోతే నేనేం నాయకుణ్ణి? అదీగాక కాలేజిలో చేరి చదవకపోతే నువ్వు విద్యార్ధివి కావు. విద్యార్దివి కాకపొతే నువ్వు విద్యార్ధి నాయకుడివి కాలేవు. విద్యార్ధి లోకంలో ఆందోళనలు జరపలేవు. అంచేత ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే కాలేజిలో చేరిపో? ఎంతగా విద్యార్ధులను నీ కూడా తిప్పుకుంటే, ఎంతగా విద్యార్ధి లోకంలో నీ మాట ఎదురు లేనిదిగా చేసుకుంటే అంత గొప్ప నాయకుడివి అయిపోతావు.'
మిగిలిన విషయాలన్నీ ఎలా వున్నా "చదువు' అనే సరికి యతి మనసు ఆనందంతో ఉరకలు వేసింది. తన చదువు తను చదువుకుంటూనే అన్యాయాన్ని అరికట్టడానికి ఆందోళన జరపడం కంటే కావలసిందేముంది?
యతి చక్కగా అనర్గళంగా మాట్లాడగలడు. ఏ సమస్యనయినా ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించగలడు. ఎవరు కష్టంలో వున్నా ఆదుకోవటానికి సిద్దంగా వుంటాడు. వీటన్నింటికీ మించి ధారాళంగా డబ్బు ఖర్చు పెట్టగలడు. అంచేత యతి అతి త్వరలోనే విద్యార్ధి నాయకుడయి పోయాడు.
అయితే సంఘంలో అన్యాయాలను అరికట్టడానికి ఆందోళన అంటే యేమిటో యతికి అతి త్వరలో తెలిసి వచ్చింది. వెంకటయ్య యతికి తన ఇంట్లోనే ఒక గది యిచ్చాడు. విద్యార్ధులతో అతి త్వరలో నాయకత్వం సంపాదించుకొన్న యతి అతనికి అత్యంత ఆత్మీయుడయిపోయాడు. అంచేత తన వ్యవహారాలు యతి ముందు బాహాటంగా జరుపుకోవటానికి అతడెన్నడూ సంకోచించలేదు.
ఊళ్ళోనూ , చుట్టుపక్కలా అంతటా ఎప్పుడూ యేమి జరుగుతుందో సేకరించి అతనికి అందించడానికి మనుష్యులున్నారు.
ఆ పక్క వూళ్ళో ఒక హరిజనుడ్ని ఒక బ్రాహ్మణుడు బోక్కేనతో బాదినట్లు వర్తమానం అందింది. వెంకటయ్య ఉగ్రుడయిపోయాడు. "చూసావా? కాలం ఇంత మారినా ఇంకా ఈ బ్రాహ్మణుల అహంకారం పోవటం లేదు . నుయ్యి దగ్గరకు ఒక హరిజనుడు నీళ్ళు త్రాగటానికి వచ్చినంత మాత్రాన బ్రాహ్మణుడు అతడ్ని నీళ్ళు త్రాగనియ్యక పోవటమే కాక, బొక్కేనతో కొట్టాడు ఈ అన్యాయాన్ని ఆందోళనతో , ప్రజల దృష్టిలోకి తీసుకురావాలి"
యతికి కూడా ఇది చాలా దురన్యాయ మనిపించింది. ప్రభుత్వం శాసనాలు చేస్తుంది. అవి కాగితాలలోనే వుంటాయి. అమలులోకి రావు - అవి అమలు జరిగేలా చూడవలసిన భాద్యత ప్రజలదే! అంటే తమదే! యతి నాయకత్వాన ఆందోళన మొదలయింది. పెద్ద పెద్ద నినాదాలతో విద్యార్ధులు రోడ్ల వెంబడి ప్రోసేషన్ గా వెళ్ళి దుకాణాలన్నీ మూసేసారు. వాహనాలు కదలనీయలేదు. ప్రభుత్వ కార్యాలయాల పైన రాళ్ళు రువ్వారు. విద్యార్ధులను కాదని తెరిచిన దుకాణాలు తగలబెట్టేశారు. పోలీసులు రంగంలోకి వచ్చారు. లాఠీ చార్జీలు- బాష్పవాయువు ప్రయోగాలు జరిగాయి. కొందరు విద్యార్ధులకు తీవ్రంగా గాయాలు తగిలాయి. అక్కడితో విద్యార్ధులు మరింత రెచ్చిపోయి ఆందోళన మరింత తీవ్రం చేశారు. కొందరికి దెబ్బలు తగిలాయి. మరి కొందరిని తాత్కాలికంగా లాకప్ లోకి తీసుకున్నారు. అప్పటికి ప్రభుత్వం కదిలి సమస్యను విచారిస్తామని హామీ ఇచ్చింది. వెంకటయ్య అజ్ఞ అనుసరించి విద్యార్ధులు ఆందోళన విరమించారు. కానీ, బ్రాహ్మణుడు హరిజనుడికి క్షమాపణ చెప్పుకోవాల్సిందే అని పట్టుబట్టారు. బ్రాహ్మణుడు సిద్దపడ్డాడు. కానీ, హరిజనుడు గడగడలాడుతూ - "ఓయ్- నాయనో! నా వంశం నాశనమయిపోతాదండీ నేను నరకంలో పడిపోతానండీ" అని గోల పెట్టేసి బ్రాహ్మణుడు తనకు క్షమాపణ చెప్పుకోవడానికి ఒప్పుకోలేదు. అతడే ఒప్పుకోనప్పుడు క్షమాపణ ఎవరికి చెప్పుకోవాలని ఆ విషయం వదిలేసారు అందరూ....
అక్కడ హరిజనులకు వేరుగా బావి తవ్విస్తామని ప్రకటించి సమస్యలను పరిష్కరించేసింది ప్రభుత్వం - బావి తవ్వటానికి ప్రారంభోత్సవమూ , మంత్రుల రాక , పార్టీలు అన్నీ అయ్యాయి. మావిడాకుల తోరణాలు చిన్న మట్టి కుప్పలా మిగిల్చి ఎక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. ఈలోగా పోలీసుల దెబ్బలకు గాయపడిన ఒక విద్యర్షి మరణించాడు. యతి చాలా బాధపడ్డాడు. అతనిని కాని, అతని కోసం ఏడుస్తున్న అతని తలిదండ్రుల్ని గాని పట్టించుకొన్న వాళ్ళే లేరు. యతి వెంకటయ్య కీ విషయం చెప్పాడు. వెంకటయ్య ఉద్రేకపడిపోతూ "ఎంత దారుణం జరిగిపోయింది? పోలీసులు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారా? ఈ ఘోరం మీరు ప్రజల దృష్టికి తేవాలి. ఈ పోలీసుల అమానుష చర్యలను అరికట్టాలి" అని అరిచాడు. అంతే! ఊసూరుమనిపోయాడు యతి. విద్యార్ధి మరణశయ్య పక్కన గుండెలు పగిలేలా ఏడుస్తూన్నారు తలిదండ్రులు. మాములు మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నదంతా ఊడ్చి కొడుకుని చదివిస్తున్నారు. ఆ కొడుకు చదువుకుని వృద్దిలోకి వచ్చి తమను ఆదుకోంటాడని ఆ వృద్ద దంపతుల ఆశ - చదువుకుంటానని ఇల్లు వదిలి వచ్చిన బిడ్డ చచ్చిపోయి కనిపించటం వాళ్ళకు భరించరానిదిగా వుంది. వాళ్ళను ఎలా ఓదార్చాలో అర్ధం కాలేదు యతికి - శవ సంస్కారాలయ్యే వరకూ ఆ దంపతుల కూడా వుండి, వికలమైన మనసుతో తిరిగి వచ్చాడు.
హరిజనులకు ప్రత్యేకించి వేరుగా కట్టదలుచుకున్న బావి ప్రారంభోత్సవం తాలూకు మావిడాకులు ఎండిపోయాయి మట్టి కుప్పలు చెదిరిపోయాయి. ఒక చిన్న గొయ్యి మాత్రం అలాగే వుంది.
బ్రాహ్మనుడుకి హరిజనుడికి రాజీ కుదిరి పోయింది . ఇద్దరూ కలిసే సంత కేళుతున్నారు. బ్రాహ్మణుడికి ఒక పది గజాల దూరంలో హరిజనుడు , బ్రాహ్మణుడి సంచీని భుజానికి తగిలించుకొని, భయ భక్తులతో - అతి వినయంగా -