నిర్మల కేసు మూడు నెలల్లో హియరింగుకి వచ్చే ఏర్పాటు చేశారాయన. నిర్మల భర్తగట్టి లాయరుని పెట్టుకున్నాడు. తన క్లయింట్ సంఘంలో పెద్దమనిషిని, ఉన్నతోద్యోగి అని, మర్యాదా హోదా కలవాడని, అతనికి స్త్రీ వ్యసనం ఎంత మాత్రం లేదని, భార్య అతనితో కాపురం చెయ్యకుండా వెళ్ళిపోవడంలో అతని నేరం ఏమీ లేదని, అతను అందరి భర్తలమాదిరేనని, భార్యనెప్పుడూ కొట్టి తిట్టి హింసించలేదని, అతని భార్యే నేలమీద విహరించడం మాని ఆకాశంలో విహరించినట్లు, సినిమాలలో, నవలల్లో మాదిరి భర్తలేడనిలేనిపోని పిచ్చి పిచ్చి ఆలోచనలతో కాపురం పాడు చేసుకుని వెళ్ళిపోయిందని, కలలకి వాస్తవాలకి తేడా గుర్తించలేక అవివేకంతో కాపురం వదులుకుంటే ఆ తప్పు నా క్లయింట్ ది కాదని వాదించాడతను.
అతను భార్య వెళ్ళిపోయాక తనవైపు ప్రయత్నాలు తను చేశాడు. రెండు ఉత్తరాలు రాసినా రాలేదు. నా క్లయింట్ చేసేది లేక వూరుకున్నాడు. ప్రతివాది తండ్రి లాయరు. తన క్లయింటు విడాకులు కోరుతుందని నోటీసు పంపితే, ఎలా అన్నా కాపురం నిలుపుకోవాలన్న కోరికతో నా క్లయింట్ విడాకులకి అంగీకరించలేదు. ప్రతివాది ఇప్పుడు వస్తే ఆమెతో కాపురం చెయ్యడానికి సిద్ధంగా వున్నాడు నా క్లయింటు. నా క్లయింటు మగవాడు. ఇంట్లో భార్యలేకుండా రెండు సంవత్సరాలనుంచి ఇబ్బందులు పడుతున్నా, రెండో పెళ్ళి చేసుకోకుండా భార్య ఎప్పుడన్నా తిరిగి వస్తుందన్న ఆశతో ఎదురు చూశాడు.
ఆఖరికి ఇల్లుగడిచే మార్గం లేక ఇంట్లో వంటకి, పనిమనిషిని కుదుర్చుకున్నాడు. నా క్లయింట్ భార్య వుండగా ఇంకో స్త్రీతో సంబంధం ఎప్పుడూ పెట్టుకోలేదు. ఇంట్లో ఆడమనిషి వున్నంత మాత్రాన ఏవేవో సంబంధాలు అంటకట్టడం అన్యాయం. లోకులు కాకులు, వారిమాటలు లెక్కచెయ్యనక్కరలేదు. నా క్లయింట్ హిందూ వివాహ ధర్మాన్ని గౌరవించే మనిషి. నా క్లయింట్ ఇప్పటికీ కాపురం నిలుపుకోవాలని ఆరాటపడ్తున్నాడు కనక కోర్టువారు దయవుంచి ఈ కాపురం చక్కపరచమని వేడుకుంటున్నాను" అంటూ చాలా ధాటిగా ఉపన్యాసాలు దంచాడు. అతని మాటలు జడ్జిగారు నమ్మినట్టే కన్పించారు.
శివశంకరంగారు తన వాదనలో 'మొదటినుంచి నా క్లయింట్ కి' అతనికి మనసు కలవలేదు. నా క్లయింట్ ని మానసికంగా మాటలతో హింసించేవాడు. సుఖసంతోషాలు వున్న కాపురం ఏ ఆడది వదులుకోదు. కలవని మనసులతో కలకాలం కల్సి నరకం నరకం అనుభవించడం కంటే విడిపోయి ఎవరి బతుకులు వారు బతకటం నయం అనుకుంది నా క్లయింట్. ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒక ఇంట్లో బతికేకంటే విడిపోయి కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది నా క్లయింట్. కోర్టువారు దయవుంచి ఆమెకి విడాకులు ఇప్పించవలసిందని కోరారు.
మరి మూడు నెలల కేసు నడిచాక వచ్చిన జడ్జిమెంటులో ప్రకాశరావు అందరి భర్తలకంటే విపరీత ధోరణులతో ప్రవర్తించలేదని తనకు నమ్మకం కలిగిందని, నిర్మల చిన్న విషయాలని కొండంతలుగా ఊహించుకుని కాపురం వదిలి వెళ్ళిందని తమకు నమ్మకం కల్గినందువల్ల ప్రకాశరావు ఇప్పటికీ ఆ భార్య తిరిగివస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనక హిందూ వివాహ ధర్మాన్ని గౌరవించి ఆమె తిరిగి భర్తదగ్గిరకి వెళ్ళాలని తాము కోరుతున్నామని, విడాకులకి తగినంత కారణం కనబడలేదని, కాపురానికి వెళ్ళేది మానేది నిర్మల ఇష్టపడి, కోర్టు బలవంతంగా ఎవరిచేత కాపురాలు చేయించలేదని - ఇద్దరూ ఇష్టపడి పరస్పర అవగాహనతో తిరిగి పెళ్ళికి వప్పుకుంటే కోర్టుకి ఏం అభ్యంతరం ఉండదని 'కర్ర విరగకుండా పాము చావకుండా' తీర్పు చెప్పారు జడ్జిగారు.
అంటే ప్రకాశరావు అంగీకారం లేనిదే నిర్మల పెళ్ళి చేసుకోడానికి వీలులేదు. కావాలని ప్రకాశరావు కక్ష తీర్చుకుంటున్నాడని ఈ విషయంలో తమింక ఏం చెయ్యలేరని గ్రహించాక శివశంకరంగారి నడుము విరిగినట్లయింది. ఆ దెబ్బతో ఆయన పూర్తిగా హతాశులయ్యారు. నిర్మల పైకి ఎంత లెక్కలేనట్టు నిర్లక్ష్యం చూపాలన్నా ఆ దెబ్బతో ఆమె ఆశలూ అడుగంటి కృంగిపోయింది. విరక్తి, నిర్లిప్తత మరింత పెరిగాయి. ఆమె మొహం మరింత వాడిపోయింది. శివశంకరంగారు తప్పు చేసినవాడిలా కూతురికి, భార్యకి మొహం చూపలేనట్టు తప్పించుకుని తిరిగారు. ఆ దెబ్బతో ఆయన బ్లడ్ ప్రెషర్ మరింత పెరిగింది. డాక్టరు 'మనసు ప్రశాంతంగా ఉంచుకోకపోతే మందులిచ్చి ప్రయోజనంలే'దని మందలించారు.
"దానదృష్టం అంతే. దానికి మీరేం చెయ్యగలరు? మనం చేతులారా చేసుకున్నాం.
ఇప్పుడిలా బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుని నన్ను అన్యాయం చేసిపోదామనుకుంటున్నారా? మీరిలాగే వుంటే రేపే నేను దాన్ని లాక్కెళ్ళి మొగుడి దగ్గిర వదిలి వస్తాను. జాగ్రత్త. అది కాపురం అక్కరలేదనుకుని వచ్చింది. దానికి లేని బాధ మీకెందుకు? ఏదో తొందరపడి వచ్చినా అది తప్పు తెలుసుకుంటే ఎప్పుడో వెళ్ళేది. అది నిశ్చింతగా ఉండగా మధ్య మీరెందుకిలా దిగులుపడి ఆరోగ్యం పాడుచేసుకుంటారు?" అని శారదాంబ చాలా గట్టిగా మందలించింది.
పక్కనే ఉన్న నిర్మల వంక చూసి "చూశారా.... ఓ ఆలోచనా పాడు లేకుండా ఆవేశంలో చేసిన తొందరపాటు పనివల్ల ఎందరి మనసులు, ఎందరి జీవితాలు అల్లకల్లోలం అవుతాయో చూడు..... ఏ మాత్రం ఆవేశం లేకనా ఏం జరిగినా ఓర్చుకుంటూ ఆడవాళ్ళు కాపురాలు చేస్తున్నారు? ఊ..... ఆ..... అంటే విడిపోవడానికి ఇదేం విదేశం కాదు. వచ్చేయడం తేలికే కాని ఆ తరువాత వచ్చే పరిణామాలు ఎదుర్కోవడం ఎంత కష్టమో అర్థం అయిందా?" అందావిడ గంభీరంగా. నిర్మలకి తల్లి మాటలకి దుఃఖం పొంగి వచ్చింది. ఇంట్లో తల్లి, అన్నలు, పనివాళ్ళు అందరూ తనేదో ఘోరాపరాధం చేసినట్లు, తండ్రి అనారోగ్యానికి తనే కారణం అన్నట్టు చూస్తున్నారు.
"డాడీ..... నన్ను పంపేయండి డాడీ! అక్కడికి. ఇక్కడ నావల్ల మీ అందరికీ బాధలెందుకు? నా ఖర్మానికి నన్ను వదిలేయండి. నేను వెళ్ళిపోతాను. అక్కడ బతకలేకపోతే చస్తాను. రేపే వెళ్ళిపోతాను నేను...." ఏడుస్తూ ఆవేశంగా అని అక్కడ నించి పారిపోయింది.
"నీరూ..... నీరూ..... అమ్మా!" శివశంకరంగారు ఆదుర్దాగా పిలిచారు. "మీరసలు మనుషులేనా? బుద్ధీ జ్ఞానం అసలున్నాయా! అదసలే కుమిలిపోతూంటే ఎదురుగా అలా మాట్లాడతావా? నీవసలు తల్లివేనా..... సవతి తల్లిలా దాన్ని ట్రీట్ చేస్తున్నావు. అది ఇంట్లో ఉందని, ఎవరో వూర్లోవారు వుండి తినిపోతున్నారన్నట్లు ప్రవర్తిస్తున్నావు. ఇదుగో శారదా, అది నా ప్రాణం..... దాన్ని నీవు ఇకమీదట ఏమన్నా మాట దక్కదు. ఓ ఆడపిల్ల పెళ్ళవగానే చచ్చినట్టే లెక్క మీకు. పుట్టింట్లో వుంటే కన్నతల్లే విషంగా మారుతుందని నిరూపిస్తున్నావు. సరే, నీ ప్రవర్తనతో నా కళ్ళు తెరిపించావు. నీకిష్టం వున్నా లేకపోయినా నా ప్రాణం ఉన్నన్ని రోజులు అది అదిక్కడే ఉంటుంది. నా తదనంతరం ఏం చెయ్యాలో చేస్తాను. దాని గురించి ఎవరేం మాట్లాడినా ఇహ సహించను." ఆయన చాలా తీవ్రంగా భార్యని మందలించి కూతురి గదిలోకి వెళ్ళారు. నిర్మల తలగడలో మొహం దాచుకుని ఏడుస్తూంది. "నీరూ..... తల్లీ...... ఇలా చూడమ్మా...... ఛ..... ఏడు పేమిటమ్మా?" అన్నారు తల నిమురుతూ.