ఏం జవాబు చెప్పను?
ఈ అమ్మాయికి మనసనేది ఒకటుందని భావించలేదు. అలా భావించివుంటే అసలు ఈ పనికే ఉపయోగించి వుండేవాణ్ని కాదు. కేవలం ఆమెకు డబ్బే ప్రధానమని అనుకున్నాను. ఆమెకన్నా ఏ విధంగా గొప్ప వాణ్ని నేను?
ఈ ఆలోచన వచ్చేసరికి సిగ్గుతో కుంచించుకుపోయి "నువ్వు నాకు చేసిన సాయానికీ, మళ్ళీ యింత హీనంగా వాడుకొన్నందుకు నన్ను క్షమించు హేమా" అన్నాను.
"మీరే నన్ను క్షమించాలి బాబూ! మీరు చెప్పిన పని నెరవేర్చలేకపోయేను. రవిని నేను మోసం చెయ్యలేను బాబూ, నన్ను క్షమించండి".
"కానీ....కానీ.... నీ ప్రేమ ఫలిస్తుందా హేమా?"
ఆమె మాట్లాడలేదు.
ఒక నిర్ణయానికి వచ్చేశాను. నా వింటి అమ్ముల పొదిలో ఒక బాణం నిరుపయోగమైంది. అయితే అవనీ.
అంతగా కావల్సివస్తే ఆమె కోసం ఈ వేట మానుకొంటాను! అంతే! అంతేకానీ ఈమె ఆశ నిరాశ కానివ్వను. ఈ నిశ్చయానికి వచ్చేక నా మనసెంతో తేలికపడింది. తేలిగ్గా వూపిరి పీల్చేను.
"ఇంకీ విషయం గురించి ఆలోచించకు హైమా! అంతా నేను చూసుకొంటాను" అన్నాను. ఆమె అర్థంకానట్టు చూసింది.
"ఇంతవరకూ నువ్వెవరో ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు అందరికీ నువ్వు నా చెల్లివని పరిచయం చేస్తాను. అప్పుడిక లక్ష్మీనారాయణ నిన్ను కోడలిగా చేసుకోవటానికి ఏ అభ్యంతరమూ వుండదు. పోతే- ఈ రహస్యం మనిద్దరిలోనే వుండిపోతుంది- చివరికి రావిక్కూడా తెలియదు.... తెలియకూడదు".
ఆమె తల బాగా క్రిందికి దించుకొని నేల చూపులు చూస్తూ చాలాసేపు వుండిపోయి తరువాత నెమ్మదిగా అంది-
"రవికి అంతా చెప్పేశాను....."
వేయి వోల్టుళ షాక్ తగిలినట్టు నిశ్చేష్టుడనై చాలాసేపటి వరకూ తేరుకోలేకపోయేను. ఆమె అంది-
"అతడ్ని మోసం చెయ్యటం ఇష్టం లేకపోయింది. ప్రేమలో మోసానికి చోటెక్కడిది బాబుగారూ?"
హిమాలయ శిఖరంలా పెరిగిపోయిన ఆమె వ్యక్తిత్వాన్ని ప్రేక్షకుడిలా చూస్తూ వుండిపోయేను. నెమ్మదిగా నోరు పెకల్చుకుని అన్నాను. "అతడు.... రవి.... ఒప్పుకున్నడా హైమా ....నిన్ను స్వీకరించడానికి వప్పుకున్నాడా?'
ఆమె నెమ్మదిగా తలూపింది.
13
ఇంకో పదిలక్షల కన్ సైన్ మెంటుకి ఆర్డరు వచ్చింది. మొదట దాని తాలూకు డబ్బు ఇంకా రాలేదు. ఆర్డరు తిరిగి కొట్టెయ్యటానికి ఇష్టంలేకపోయింది. ఒక ఆర్డరు అంటే దాదాపు లక్ష రూపాయల లాభం. ఇంకెవర్నన్నా పార్ట్నర్ గా తీసుకుందామన్నాను కానీ లక్ష్మీనారాయణ ఒప్పుకోలేదు. ఇంత లాభసాటి వ్యాపారంలో మెలకువ ఇంకెవరన్నా తెలుసుకుంటే తరువాత తరువాత కాంపిటీషన్ ఎక్కువ అవుతుందన్నాడు. నిజమే అనిపించింది డబ్బు రుచి పులికి మనిషి రక్తంలాంటిది.
ఇద్దరం బ్యాంక్ ఏజంటుని కలుసుకున్నాం. పెర్సనల్ గ్యారంటీ మీదా, స్టాక్స్ మీదా పదిలక్షలూ ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. అగ్రిమెంటు జరిగిపోయింది. కొల్లేట్రల్ సెక్యూరిటీ అరవై ఎకరాల భూమీ, ఇద్దరి ఇళ్ళు ఇంటికి వచ్చి టీ తాగుతూ కూర్చున్నప్పుడు అతడు అన్నాడు.... "ఇరవై లక్షల అప్పులో వున్నాం ప్రస్తుతం మనం- మీకు నిద్రపడుతుందా?"
నవ్వి "మనది కాదు. బ్యాంక్ డబ్బు అది" అని "ఒకలా ఐతే చాలా లాభం వస్తుంది. మనం ఊహించిన దాని కన్నా!" అన్నాను ఆలోచిస్తూ.
"ఎలా?"
"రూపాయి డివాల్యూ అయితే.... దాదాపు పదిశాతం డివాల్యూ అయిందనుకోండి- మనకొచ్చే రెండు లక్షలుకాక, ఇరవై లక్షలమీద ఇంకో మూడు లక్షలు లాభం- మొత్తం అయిదు లక్షలు వస్తుంది."
అతడి మొహం ఆనందంతో వెలిగింది. "అలాగేగానీ అయితే తిరుపతి వెళదాం" అన్నాడు- కోపాన్నీ అసహ్యాన్నీ పళ్ళబిగువున అదిమి పెట్టుకొన్నాను. ఇతడి కోర్కేనే మన్నించి దేవుడుగానీ లాభాలు ఆర్జించి పెట్టేదంటే, ఆ రాతి విగ్రహాన్ని బ్రద్దలు కొట్టెయ్యటానికి నిశ్చయించుకొన్నాను. అంతలో అతడి భార్య "లేకపోతే మాత్రం వెళ్ళకూడదా ఏమిటి? కాటేజి బుక్ చెయ్యండి, సరదాగా అందరం వెళదాం" అంది నావేపు, భర్త గమనించకుండా చూసి నవ్వి.
నేనూ నవ్వి- ఊరుకొన్నాను.
తరువాత సంభాషణ హైమ మీదకు మళ్ళింది.
"అవును అది అడుగుదామని ఇన్నాళ్ళూ అనుకొన్నాను. ఆ అమ్మాయి ఎవరు?" అడిగాడు- అతడి భార్య కుతూహలంగా చూస్తోంది.
"ఎవరో నాకు తెలీదు" అన్నాను.
"అంటే?" అర్థం కానట్టు ముఖం పెట్టేడు.
క్షణం ఆగి నెమ్మదిగా అన్నాను.
"ఆమె ఓ బజారు వేశ్య. నాకోసారి ట్రయినులో కనబడింది. తనకా జీవితం అంటే విసుగు పుడుతోందనీ- మంచిగా బ్రతకాలని అనుకుంటున్నానానీ అంది. ఓ ఛాన్సు ఇచ్చి చూద్దామని నాతో తీసుకొచ్చాను. పాపం- ఇప్పుడు బాగానే వుంటోంది.
లక్ష్మీనారాయణ భార్య కళ్ళల్లో ఈర్ష్య, అనుమానం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అతడు మాత్రం ఈ విషయాన్నినమ్మలేనట్టు చూస్తున్నాడు. ఇంకా విషయాన్నీ పొడిగించటం యిష్టంలేనట్టు లేచి, "మరి వెళ్ళొస్తాను" అని అని బయట కొచ్చేను.
* * *
స్పెక్యులేషన్ చాలా అపారకరమైన వ్యాపారం. ఓడలు బళ్ళవటం- బళ్ళుఓడలవటం అనేది యీ వ్యాపారంలోనే నిజం అవుతూ వుంటుంది. ఈ వ్యాపారంలో ప్రవేశించే ముందు, ఆ వస్తువులకు సంబంధించిన చరిత్ర అంతా బాగా తెలుసుకొని వుండాలి. తెలుసుకొన్న తర్వాత అయినా ఏం జరుగుతుందో చెప్పలేం మనిషి ఊహించలేని చిన్న సంఘటనలేవో జరిగి, ధరల్ని కొద్దిగా మారుస్తూ వుంటాయి. ఆ మార్పు చాలు.
వరుసగా రెండు నెలలవర్షాలు పడకపోయేసరికి, పసుపు ధరలో వచ్చిన రెండు పైసల మార్పు, అంతకుముందే 'ఫార్వెర్డు కాంట్రాక్ట్' లోకి ప్రవేశించిన రామయ్య శ్రేష్టి అనే లక్షాధికారిని తెల్లవారేసరికల్లా రోడ్లమీద నిలబెట్టింది.
అయితే యీ స్పెక్యులేషన్ వ్యాపారంలోకి అతడిని పార్టనర్ గా తీసుకోలేదు నేను. అతనికున్న మూడు నాలుగు లక్షల ఆస్తితో పెద్ద బెట్టింగులు ఆడించి రిస్క్ తీసుకోదల్చుకోలేదు. నేను కూడా ఎక్కువ 'బుల్లింగ్' చేయాలనుకోలేదు. ఒకటే ఒక ట్రాన్సాక్షన్ - అంతే!
దేశపు వాయవ్య ప్రాంతాల్లో 'బెల్లం' మీద ఫార్వర్టు కాంట్రాక్టులు చేసేవారు ఎక్కువగా వున్నారు. ఈ కాంట్రాక్టుల్లో సరుకు మార్పిడి జరగదు. భవిష్యత్తులో ఒక తేదీని నిర్ణయించుకొని' ఆ తేదీనాటి ధరల్లో తేడాని యిచ్చుకోవటమే.
గత అయిదు సంవత్సారాలుగా బెల్లం ధరల్లో 'ట్రెండ్స్' చూసేను. నాకు ప్రాక్టికల్ అనుభవం లేదు. కమర్షియల్ సర్కిల్స్ గురించి తెలీదు. అయితే పుస్తకాల అనుభవమే! నేడు ఎదుర్కోబోయేది ఈ వ్యాపారంలో ఢక్కా మొక్కీలు తిన్న వ్యాపారస్తులదేనని తెలుసు. అందులోనూ- ఆ వాయవ్య ప్రాంతపు శ్రేష్టులు గాలివాటునుబట్టి దేని ధర ఎలా మారుతుందో చెప్పగల అనుభవజ్ఞులు. వారితో పోటీపడటం అనర్థానికి దారి తీస్తుందని నా శ్రేయోభిలాషులందరూ హెచ్చరించారు. విన్లేదు నేను. వారెవరికీ లేని గొప్ప వరం నా కొకటి వుంది. అది - ఠాకూర్ నూరిపోసిన "ఆత్మస్థయిర్యం!"
పాడిన అడవి ఆమ్మేసాను. దాంట్లో కొద్దిగా నష్టం వచ్చింది. అయినా దానికి మూడురెట్లు కార్నివాల్ అమ్మటంలోవచ్చింది. కార్నివాలు పెట్టటం అన్న ఆలోచన నాది- అది ఎంతగా లభిస్తుందో- లెక్కలు చూస్తేనే తెలుస్తుంది. కళ్ళు తిరిగిపోయే లాభాలు వస్తాయో, రెండోవరస పుస్తకాల్లో ఎలా అసలు లెక్కలు వ్రాసుకోవచ్చో వివరించేను.
ఆయన మరి బేరమాడకుండా లక్షాయాభై వేలకి మొత్తం బిజినెస్ అంతా కోనేసుకొన్నాడు. అలాగే క్వారీకూడా అమ్మేసేను. ఆ రోజు ఎంతో హాయిగా వుంది నాకు. కూలీల రక్తాన్ని డబ్బుగా మార్చుకొనే అవసరం తప్పిపోయినందుకు.
ఇక మిగిలింది పీచు తాలూకు ఎక్స్ పోర్టు కాంట్రాక్టు. దాన్నీ బేరం పెట్టేను. అతడు వద్దని శతవిధాల పోరాడేడు, విన్లేదు నేను. బ్యాంకికి ఇచ్చిన గ్యారంటీ నేనే కొనసాగిస్తాననీ, షేరు మాత్రం అమ్మేస్తానని అన్నాను. ఇంత లాభం వచ్చే కాంట్రాక్టు ఇంకొకరికి పోనివ్వటం ఇష్టం లేకపోయింది అతనికి. అది కూడా అతనే కొనుక్కున్నాడు. ఇంకో లక్షవచ్చింది నా చేతికి. అది చాలా తక్కువనీ, ఇంకో యాభై వేలన్నా నాకు రావాలనీ, లక్ష్మీనారాయణ ఈ విషయంలో నన్ను మోసం చేస్తున్నాడనీ తెలుసు నాకు. కానీ అంతగా పట్టించుకోలేదు.
మొత్తం నాలుగు లక్షలు పొగయింది. దాన్ని శంకర్ దాదా పేర డిపాజిట్ చేసి, యాభై లక్షలకి ఫార్వర్డు కాంట్రాక్టు లోకి ఎంటర్ అయ్యాను. మేగ్జిమమ్ బెట్ నాలుగు లక్షలు!
ఈ దెబ్బతో నేను అడవులు పట్టిపోవడం తథ్యమని ఊరులో అందరూ అనుకోసాగేరు. అయినా అంత ఆశ పనికి రాదని చెవులు కొరుక్కోవటం గూడా గమనించేను. నేను చేస్తున్న యీ అనాలోచిత చర్యకి ఊళ్ళో చాలామంది లోలోపల చాలా సంతోషిస్తున్నారని తెలుసు. అయినా నా పట్టు విడవదల్చుకోలేదు. ఠాకూర్ చేతిలో నేను పొందిన తర్ఫీదు- నా జీవితాన్ని అటో ఇటో నిర్ణయించబోతోంది. నాకు నా మీద నమ్మకం లేదు. కానీ ఠాకూర్ మీద వుంది.
శంకర్ దాదా నా ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
"దాదా" అన్నాను. "అడవి పీచు కాంట్రాక్టు అమ్మేసేను. నీ పేరుమీదన్న కార్నివాలు కూడా అమ్మేసేను. వచ్చిన నాలుగు లక్షలూ ఫార్వర్డు కాంట్రాక్టులో పెట్టడం కూడా నీకు తెలుసు. అది నీ పేరుమీదే వుంది. అందులో లాభం వచ్చిందా- మొత్తం డబ్బంతా తీసుకెళ్ళి తాతయ్యకి వడ్డీతోసహా ఇచ్చెయ్యి. ఒకవేళ నష్టంవస్తే....."ఆగేను. నా కంఠం కొద్దిగా వణికింది. "నీ మనవఁడు ఆరులక్షల్తో పరారయ్యేడని రాజానరేంద్రవర్మకీ చెప్పు" అన్నాను.
"బాబూ" అన్నాడు దాదా.
"అవును. నా మీద నమ్మకం వుంచి, ఆరులక్షలూ ఇచ్చి - 'ఎందుకు' అని అడక్కుండా పంపేడు. తిరిగి ఇవ్వలేకపోతే మాత్రం ఈ మనవడ్ని క్షమించమని చెప్పు".
అతడి కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి. "అలాగే బాబూ" అని వెళ్ళిపోయేడు. అందరిలాగా ఈ కాంట్రాక్టు వద్దని వారించలేదు రాజా నరేంద్రవర్మ. ఎప్పటికప్పుడు నేనేం చేస్తున్నానో తెలియచెప్పటానికే ఇతడ్ని నియమించాడని తెలుసు నాకు. అయినా ఇతడు ఎంత విశ్వాసపాత్రంగా నాకు సేవ చేసేడు!
తరువాత రవిని పిలిపించేను.