అప్పుడు ఆమె తెప్పరిల్లింది...
పరిసరాలతోపాటు పరిస్థితి అర్ధం అయింది.
అతని చేతివెంట రక్తం ఇంకా కారుతూనే వున్నది.
అంతే...ఆమె తన చీర కొంగును సర్రున చింపింది. అతని ఎడమచేయిని అందుకుని తెగినచోట నొక్కిపట్టి కట్టుకట్టింది.
రవిచంద్ర ఆమెవైపు కృతజ్ఞతా పూర్వకంగా చూశాడు.
"ఐయామ్ సారీ...చిన్న విషయానికి సాగదీసి రాద్ధాంతం చేశాను...పద రవీ..." అతని నడుము మీద చేయివేసి కారువైపు అడుగులు వేసింది.
ఇద్దరూ కారులో కూర్చోగానే గ్లాసెస్ పైకి లేపింది.
ఏసి ఆన్ చేశాడు రవిచంద్ర...
మరొకచేత్తో స్టీరియో ఆన్ చేసిందామె.
చల్లని ఆ వాతావరణంలో అతనిని తన హృదయానికి హత్తుకుంది.
ఇరువురి పెదవులు దగ్గరయ్యాయి...తనువులు ఒకటయ్యాయి...
ఈసారి ఆమె అతని చర్యలను అడ్డుకోలేదు.
మనస్పూర్తిగా అతనికి అంకితమైపోయింది.
అంటే...తను తన ఇష్టపూర్వకంగా పెళ్ళి కాకుండానే మైలపడిపోయింది.
ఆ అనుభవం ఒక తీపిగుర్తో...ఒక చేదు అనుభవంగా మిగులుతుందోననే ఆలోచనతో కళ్ళలో నీళ్ళు ఊరాయి నీలిమకు...
ఒక్కసారి ఎక్కి ఎక్కి ఏడ్చింది...
"ఏయ్...వాట్ హేపెండ్...పీడకల ఏమయినా వచ్చిందా?"
అప్పటివరకూ సీట్లో ఆదమరచి నిద్రపోతున్న నీలిమ భుజంతట్టి లేపుతూ అడిగాడు రవిచంద్ర.
నీలిమ ఉలిక్కిపడి మేలుకొన్నది...
క్షణం పరిసరాలను గమనించింది.
కారులో ప్రయాణం కొనసాగుతూనే వున్నది...రాత్రి డిన్నర్ అయ్యాక కారులో నాగార్జునసాగర్ నుండి బయలుదేరారు.
అప్పుడే హైదరాబాద్ సిటీలోకి ప్రవేశించింది కారు...
"మాట్లాడవేం డియర్..." ఆమె నడుము సుతిమెత్తగా నొక్కుతూ అడిగాడు.
"అవును...నిద్రపోయాను...నిద్రలో" అంటూనే హాండ్ కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుంది.
సరిగ్గా కారు అబిడ్స్ సెంటర్ లోకి ప్రవేశించగానే ఎలర్టు అయింది నీలిమ.
"రవీ...ఇక్కడ ఆపు...కొద్దిదూరమేగా దిగి నడిచి వెళ్ళిపోతాను..."
"నో...నో...ఇంత అర్దరాత్రి ఒంటరిగా వెళతావా...హాస్టల్ దగ్గిరే దిగుదువుగానీ..."
"వద్దు ఇక్కడ దింపేయి...మా వార్డెన్ కళ్ళలో పడితే ప్రమాదం...దగ్గరేకదా వెళ్ళగలను"
"నీలూ...హాస్టల్ గేటుదగ్గర డ్రాప్ చేస్తాను..."
"అబ్బ....నేను వెళతాను అంటున్నానుగా...రేపు వుదయాన్నే హాస్పిటల్ కు వెళ్ళాలి" మత్తుగా ఆవలిస్తూ అన్నది నీలిమ.
"నీలూ...ఈ రాత్రివేళ హాస్టల్ కు వెళ్ళవలసిందేనంటావా...నా గదికి వెళదాం రాకూడదూ...రేపు సరాసరి హాస్పటల్ కు వెళ్ళవచ్చు"
రవిచంద్ర మరల బ్రతిమలాడాడు...
"సారీ రవీ...చెప్పానుగా మా వార్డెన్ రాక్షసి అని...కాలేజీలో ప్రిన్సిపల్ టి.సి. ఇచ్చి వెళ్ళిపొమ్మన్నట్టు గదిలో నుంచి సామాను బయటకు విసిరేసి వెళ్ళగొడుతుంది"
"ఓ కే డియర్...గుడ్ నైట్...రేపు సాయంత్రం హాస్పిటల్ దగ్గరకు వస్తాను..."
రవిచంద్ర చేయి వూపి కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు.
మెల్లగా నడుచుకుంటూ హాస్టల్ ను సమీపించిన నీలిమ నిర్ఘాంతపోయింది.
హాస్టల్ మెయిన్ గేటు లోపల వైపు తాళం వేసి వుంది.


