ఏం వద్దు. మీ సూట్ కేసు ఇక్కడే ఉంది. ఇక్కడే చెయ్యండి అంది విజిత ఆర్డర్ జారీ చేస్తున్నట్లుగా.
అదేదో సినిమాలో డైలాగ్ 'అంతేగా...అంతేగా' గుర్తుకొచ్చి పైకి అనబోయి బాగుండదని సరే అంటూ స్నానానికెళ్ళాడు బుద్ధిగా.
కాసేపట్లో ఇద్దరూ ఫ్రెష్ అప్ అయ్యారు.
విజిత తన పొడవాటి జడ దువ్వుకుంటుంటే ఆ నల్లని కురులను అలానే చూస్తుండిపోయాడు.
చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ముట్టుకోవచ్చా అని అడిగాడు వినీల్.
నువ్వే జడ వెయ్యి అని దువ్వెన వినీల్ చేతికిచ్చింది విజిత.
నాకు ఎలా వెయ్యాలో తెలీదుగా విజ్జీ అన్నాడు.
నేను చెప్తానులే. అలా చెయ్యి అని నీల్ చేత జడ వేయించుకుంది.
అంతా అయినా తరువాత ఇక ఆగలేక ఆమె అందమైన నుదుటి పాపిటలో ముద్దు పెట్టాడు.
థాంక్స్ నీల్ అంది విజిత.
టిఫిన్ రూమ్ కి తెప్పించుకున్నారు.
ఈలోపు వినీల్ తన లాప్ టాప్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ కి సంబంధించి నోట్ తయారు చేసుకున్నాడు.
అతను ప్రిపేర్ చేస్తుంటే విజిత స్పూన్ తో టిఫిన్ అతని నోట్లో పెట్టింది. తనూ తింది.
అబ్బా ఎందుకు నేను తింటానులే విజ్జీ అన్నాడు.
ఫరవాలేదు. నువ్వు బిజీ కదా నీల్.
టైం పదయింది. కాన్ఫరెన్స్ హాల్ కి వెళ్లారు ఇద్దరూ.
కొద్దిసేపటికి ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్, అతని స్టాఫ్, మీడియా బృందం అంతా వచ్చారు.
వీడియో కవరేజ్ మొదలయ్యింది.
ఇది కూడా లైవ్ పెట్టారు అన్ని నేషనల్, రీజినల్ చానెల్స్ లో.
వినీల్ వెంకటరాజు గారి పి ఏ కి ఫోన్ చేసి చెప్పాడు. లైవ్ వస్తోందని. దాని తాలూకు వివరాలు విజి ఇండస్ట్రీస్ టెక్నికల్ స్టాఫ్ కి చెప్పాడు. అక్కడ వెంకటరాజు గారు లైవ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ చూడొచ్చని.
చైర్మన్ విజిత ని ఆహ్వానించాడు మీడియా తో మాట్లాడేందుకు.
విజిత అందరికి నమస్కరిస్తూ తమ విజి ఇండస్ట్రీస్ స్పెషల్ అడ్వైసర్ వినీల్ మాట్లాడుతారని, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని చెప్పింది. వినీల్ ని అందరికి పరిచయం చేసింది.
వినీల్ ఓ చిన్న కాగితం తన ముందు పెట్టుకున్నాడు.
మీడియా బృందం ఓ అరగంటసేపు రకరకాల ప్రశ్నలు సంధించారు.
అన్నిటికీ అద్భుతంగా సమాధానాలు చెప్పాడు వినీల్.
అతని మెమొరీ చాలా పదును. ఇలాంటి టాస్క్ దొరికిందంటే ఇక అతన్ని ఆపడం చాలా కష్టం.
టక టక అన్నిటికీ తడుముకోకుండా అతికినట్లుగా సమాధానాలు చెప్పాడు.
మీడియా అడిగిన ప్రశ్నలకి వినీల్ ఇచ్చిన సమాధానాలకి వెంకటరాజు గారు, విజిత చాలా ఆశ్చర్యపోయారు.
లైవ్ చూస్తున్న రాజుగారికైతే తను కూడా అలా చెప్పలేనేమో అనిపించింది.
అలా ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా చక్కగా ముగిసింది.
కాన్ఫరెన్స్ మొదలవకముందే వినీల్ మీడియా వారందరికీ ఖరీదైన బహుమతులు అందజేశాడు.
వాళ్ళు చాలా మంచి కవరేజ్ ఇచ్చారు.
ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ వినీల్ ని చాలా మెచ్చుకున్నాడు.
పదకొండుకల్లా ఇద్దరూ రూమ్ కొచ్చారు.
నీల్ ! నీకు థాంక్స్ చెప్పను అంది విజిత.
ఏంటి విజ్జి నేనేమైనా తప్పుగా చెప్పానా అన్నాడు ఆలోచించుకుంటూ.
వినీల్ దగ్గరికెళ్లి అతని మొహం రెండు చేతుల్లో తీసుకుని పెదవులపై ముద్దుపెట్టి థాంక్స్ అంది.
ఓహ్ ఇలా థాంక్స్ చెప్పావా అన్నాడు నవ్వుతూ.
కాబోయే శ్రీవారికి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న కానుకలు ఇస్తుంటా అంది.
థాంక్స్ రా పండు అన్నాడు వినీల్.
ఇద్దరూ రూమ్ ఖాళీ చేసి వినీల్ వాళ్ళ అక్కదగ్గరికి బయలుదేరారు.
****
నీల్ ! దారిలో షాపింగ్ చెయ్యాలి అంది విజిత కారులో కూర్చుంటూ.
సరే అన్నాడు వినీల్. క్యాబ్ డ్రైవర్ కి చెప్పాడు. షాప్పింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆపమని.
ఓ పెద్ద షాపింగ్ మాల్ దగ్గర ఆగింది కారు.
లోపలికి వెళ్లారు విజిత, వినీల్.
ఏం కొనాలి విజ్జీ ముంబైలో అన్నాడు.
మీ అక్కా వాళ్లకు లెండి. మీ అక్క ఫోటో చూపించండి అంది.
మొబైల్ లో తన అక్క, పిల్లల ఫోటో చూపించాడు.
ఓహ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీ అక్క. పిల్లలు ఇంకా క్యూట్ గా ఉన్నారు అంది.
థాంక్స్. అక్కకు ఇద్దరు అబ్బాయిలు. కవల పిల్లలు.
ఓహ్ వెరీ నైస్ అంటూ ఒక చీరల షాప్ లోకి వెళ్ళింది విజిత.
ఫాలో అయ్యాడు వినీల్.
ఆమ్మో ఈ ఆడవాళ్ళ షాపింగ్ గురించి చాలా స్టోరీస్ విన్నాడు వినీల్.
అరే లాప్ టాప్ తెచ్చుకొనుంటే బాగుండేది అనుకున్నాడు. ఆ టైం లో వర్క్ చేసుకోవచ్చు.
చూద్దాం ఎంతసేపు పడుతుందో అని ఆలోచిస్తున్నాడు.
ఓ ఐదు నిముషాల్లో చీర సెలక్షన్ పూర్తయి బిల్ పే చేసింది విజిత తన కార్డుతో. అలాగే పిల్లలకు కూడా డ్రెస్సెస్ తీసుకుంది.
ఓహ్ మై గాడ్ ఏంటి విజ్జీ ఇంత తొందరగానా అన్నాడు ఆశ్చర్యంగా.
నా షాపింగ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది నీల్ అంది నవ్వుతూ.
వెరీ నైస్ అని మెచ్చుకున్నాడు వినీల్.
ఓ గంటలో శశిరేఖ వాళ్ళ సివిల్ సర్వెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ కి చేరుకున్నారు.
కాలింగ్ బెల్ కొట్టగానే, వెయిట్ చేస్తున్నట్లుగా తలుపు తీసింది శశిరేఖ.
వెనకాలే ఆమె పిల్లలు కూడా వచ్చారు.
వినీల్ కళ్లెదుట కనపడేసరికి ఒరేయ్ బుజ్జీ అంది ఆనందంగా శశిరేఖ.
మామయ్యా అని పిల్లలిద్దరూ కేకలు పెడుతున్నారు.
వినీల్ వెనకాల నిలుచున్న విజితను చూసి ఎవరీ కుందనపు బొమ్మ. నీ ఫ్రెండా అంది.
అవునక్కా పేరు విజిత అంటూ ఇద్దరి లగ్గేజ్ లోపల పెట్టాడు వినీల్.
పిల్లలు మమ్మీ మమ్మీ మామయ్య టి వి లో ఏదో చెప్తున్నాడు అని అరుస్తున్నారు.
అందరూ సోఫాలో కూర్చుని టి వి వంక చూసారు.
ప్రొద్దుటి ప్రెస్ కాన్ఫరెన్స్ రిపీట్ చేస్తున్నారు ఇంగ్లీష్ చానెల్స్ లో.
అందులో విజిత, వినీల్ ని చూసి ఏంటిరా ఈ కథ ఎప్పుడు విజి ఇండస్ట్రీస్ లో జాయిన్ అయ్యావు. మాకు చెప్పలేదు అంది.
అదేం లేదక్కా. ఇది తాత్కాలిక హోదా మాత్రమే. నేను సాఫ్ట్వేర్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను.
ఈ మేడం వాళ్ళ ఇంటి పక్కనే నేనుంటాను అంటూ వెంకటరాజు గారి గురించి, జరిగిన సంఘటనల గురించి క్లుప్తంగా చెప్పాడు.
మరి ఈ మేడం అని విజిత వైపు చూసింది.
విజి ఇండస్ట్రీస్ ఓనర్. మా బాస్ అన్నాడు నవ్వుతూ.
ఇంతలో వంటావిడ అందరికీ ఫ్రెష్ జూస్ తెచ్చింది.
పిల్లలిద్దరూ ఆంటీ అంటూ విజిత దగ్గర చేరారు.
విజిత వాళ్ళని ముద్దు చేస్తూ కబుర్లు చెప్తోంది.
విజిత తను కొన్న శారీ, పిల్లల డ్రెస్సులు శశిరేఖకు ఇచ్చింది.
హే ! ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అంది మొహమాటపడుతూ.
తీసుకో అక్కా. లేకుంటే బోరు బోరున ఏడుస్తుంది. అప్పుడు నీకు ఆప్షన్ ఉండదు అన్నాడు.
నాకు ఏదో కొంచెం కొంచెం అర్ధం అవుతోందిరా. ఏమ్మా ! ఏమన్నా రహస్యాలున్నాయా మీ మధ్య అంది విజితతో.
ఇక దాచడమెందుకని వినీల్ తో తన ప్రేమ గురించి శశిరేఖ తో చెప్పింది విజిత.
వన్ సైడ్ లవ్వా ! లేక బుజ్జిగాడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగింది శశిరేఖ.