బుజ్జిగాడు కూడా ప్రేమిస్తున్నాడు అంది విజిత నవ్వుతూ.
శశిరేఖ ఆశ్చర్యపోతూ ఏంట్రా బుజ్జీ నువ్వు ప్రేమలో పడ్డావా అంది పెద్దగా నవ్వుతూ.
పిల్లలిద్దరూ ప్రేమంటే ఏంటో అర్ధం కాక మామయ్య ఎక్కడో పడ్డాడు అనుకుని ఏంటి మామయ్యా నీకు దెబ్బలు బాగా తగిలాయా అని అడిగారు.
అవున్రా చాలా పెద్ద దెబ్బలు తగిలాయి అన్నాడు వినీల్ పెద్దగా నవ్వుతూ.
బావగారు ఎన్నిరోజులు క్యాంపు అక్కా
ఆయన లాస్ట్ వీక్ కెనడా వెళ్ళాడురా. అక్కడనుంచి ఇంకో రెండు దేశాలు వెళ్లి ఇంకో రెండు వారాల తరువాత వస్తారు.
మరి నాన్నగారు వాళ్ళకు మీ విషయం తెలుసా అంది శశి అనుమానంగా.
జాతకాలు పంపడం, వాళ్ళ నాన్నగారు అంతా సరిపోయిందిరా కానీ ఒక్క చిన్న అంశం కుదరలేదు మీ జాతకాల మధ్య అని చెప్పడం అంతా వివరించాడు అక్కకి.
అబ్బా నువ్వెక్కడి వాడివిరా. నువ్వు విజితని అంతగా ప్రేమించితే ఇక్కడే జాతకాలు సెట్ చేసి నాన్నగారికి పంపాలి. నేను, అన్నయ్య అలానే చేసాము అంది. నాన్నగారు వందకు వంద సరిపోవాలంటారు. అలా చూస్తే నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. అసలు ప్రేమ పెళ్లిళ్లకు జాతకాలు ఎవరూ చూడరు అని చెప్పింది శశిరేఖ.
అలా ఎలానే జాతకాలు కుదర్చడం అన్నాడు అర్ధం కాక. అసలు నా జాతకం నాకు తెలీదు అన్నాడు.
మరి నాకు చెప్పొచ్చుకదా. నా దగ్గర నీ జాతకం కూడా ఉంది. ఇక్కడే కంప్యూటర్ లో మీ ఇద్దరి జాతకాలు చెక్ చేసి, టాలీ చేసి నాన్నగారికి పంపితే సరిపోయేది. ఒక్కటి చెప్పు. నాన్నగారికి పంపిన జాతకంలో విజిత పేరు రాసి పంపావా అని అడిగింది.
లేదక్కా. డేట్, టైం, ప్లేస్ మాత్రమే పంపాను. అది ఎవరిదో రాయడం మర్చిపోయాను.
బతికించావురా బాబు. నేను ఒక పని చేస్తాను. విజిత జాతకం డీటెయిల్స్ నాకు పంపు. నేను ఇక్కడ కంప్యూటర్ లో మీ ఇద్దరివీ టాలీ చేసి నాన్నగారికి నేను నా తరఫున కొత్త సంబంధం అని పంపుతాను. అప్పుడు ఓకే అవుతుంది అని చెప్పింది శశిరేఖ.
అబ్బా ! ఏం ఐడియా చెప్పావే అక్కా. అయితే నువ్వే పూనుకుని మా ఇద్దరి పెళ్లి చేయించాలి అన్నాడు. పాపం ఈ అమ్మాయి తొమ్మిదో తరగతి నుంచి వెయిట్ చేస్తోంది పిచ్చి పిల్ల అన్నాడు.
ఆ బాధ్యత నాకొదిలెయ్యరా. నేను నాన్నగారికి తగ్గట్లు జాతకాలు పంపిస్తాను. ఆయన ఓకే చేసేట్లు చేసే పూచీ నాది. కాకుంటే విజిత డాడీ ఒప్పుకుంటారా అన్నది మీరు చూసుకోవాలి అన్నాడు.
అది మేడం చూసుకుంటారు అన్నాడు విజిత వైపు చూపిస్తూ.
ఏమ్మా విజిత వీడితో పెళ్ళికి మీ డాడీ ఒప్పుకుంటారా అని సందేహంగా అడిగింది శశిరేఖ.
ఒప్పుకుంటారండీ అంది కాన్ఫిడెన్స్ గా.
అసలు ఈ రోబో ఎలా నచ్చాడు నీకు ఆశ్చర్యంగా అడిగింది శశిరేఖ.
ఏమోనండి. నా ఫస్ట్ క్రష్ నీల్ అంది. అతన్నే ఫాలో అవుతున్నాను నేను.
ఈకాలంలొ విజిత లాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా అని మనసులో అనుకుని విజిత దగ్గరకొచ్చి 'గాడ్ బ్లెస్స్ యు రా విజ్జీ' అని నుదుటి మీద ముద్దు పెట్టింది శశిరేఖ. నువ్వు ఎంత లక్కీ నో నేను చెప్పలేనురా బుజ్జీ అంది వినీల్ తో.
నీల్ తో నా పెళ్ళైతే నేనే అదృష్టవంతురాలినండి అంది విజిత.
వెరీ నైస్. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇక భోజనాలకు లేవండి అంది శశిరేఖ.
మేనల్లుళ్ళనిద్దరినీ చెరో వైపు ఎత్తుకుని డైనింగ్ కి తీసుకెళ్లాడు వినీల్. ఇద్దరూ చెరోవైపు మామయ్య కు ముద్దులు పెడుతున్నారు.
బుజ్జిగాడు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బుడుగులిద్దరికీ ఆన్లైన్ వీడియో క్లాసులు తీసుకుంటుంటాడు. ఇదిగో వీళ్ళు కూడా వీడి మాదిరి తయారవుతున్నారు పుస్తకాల పురుగుల్లా అంటూ నవ్వుతూ చెప్తోంది శశిరేఖ.
ఒరేయ్ నీకిష్టమైనవన్నీ చేసాను. వంటావిడను పక్కన పెట్టి అన్నీ నేనే స్వయంగా నీకోసం వండాను అని చెప్పింది.
థాంక్స్ అక్కా. విజ్జీ, మా అక్క నాకు రెండో అమ్మ. నా విషయాలన్నీ మా అక్కతోనే షేర్ చేసుకునేవాడిని చిన్నప్పటినుంచి. తన చదువును కూడా ఒక్కోసారి పక్కనపెట్టి నా చదువుపై దృష్టిపెట్టి నా సందేహాలు తీర్చేది. మై స్వీట్ మదర్ అన్నాడు శశిరేఖ వైపు ఆరాధనగా చూస్తూ.
బుజ్జిగాడు నాకు మొదటి కొడుకు. ఇదిగో ఈ బుడుగులిద్దరూ వాడితరువాతే అంది శశిరేఖ.
అయితే మీరు నాకు అత్తగారన్నమాట. అందమైన అత్తగారు అంది విజిత నవ్వుతూ.
****
ఐటమ్స్ చాలా డెలీషియస్ గా ఉన్నాయండి అంది విజిత మెచ్చుకుంటూ.
థాంక్స్ విజ్జీ.
ఇంకేంటి నీ కబుర్లు. నువ్వు చదివింది భీమవరం కదా అని కొందరి పేర్లు చెపుతుంటే అవును వాళ్ళు తెలుసు అంటోంది విజిత.
మా అమ్మ గారు మీకు బంధువని చెప్పింది.
మీ అమ్మగారి పేరు.
మాధవి. ఆవిడ ఇంటిపేరు అవి చెప్పింది విజిత.
ఓహ్ మాధవి అత్తా. నాకు బాగా తెలుసు. చాలా సార్లు ఫంక్షన్స్ లో కూడా కలిసాము. మా నాన్నకు కజిన్ అవుతుంది. అరే మనం విచిత్రంగా భలే కలిసాము. ఒరే బుజ్జీ మాధవి అత్తయ్యా అని ఆవిడ గురించి కబుర్లు చెప్పింది వినీల్ కి. మా వాడు చిన్నప్పుడు ఎక్కడికి వచ్చేవాడు కాదు విజ్జీ. ఇంట్లో పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాడు. నేను మమ్మీ ఫంక్షన్స్ కి వెళుతుండేవాళ్ళం. అందుకే మాకు పరిచయాలు ఎక్కువ. మీ నాన్నగారు పేరు కూడా చాలా సార్లు విన్నాను. మీ తాతయ్య గారి పేరుతో ఒక స్కూల్ కూడా కట్టించారు. భీమవరం సగం పైగానే తెల్సు మాకు అంది శశిరేఖ నవ్వుతూ.
ఇంటర్మీడియట్ తరువాత ఎం సెట్ లో టెన్త్ రాంక్ వచ్చింది. నా రాంక్ కు ఇన్స్పిరేషన్ మీ బుజ్జిగాడే. అతన్ని చూసే నాకు చదువు మీద విపరీతమైన శ్రద్ధ పెరిగింది. మా డాడీ కూడా ఆశ్చర్యపోయేవాడు ఏంటమ్మా ఈ చదువు ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేవాడు. అందుకే నీల్ ఆంటే నాకు ఇష్టం. ప్రతిదీ పట్టుదలగా చేస్తాడు. ఇక ఎం బి బి స్ హైదరాబాద్ లో చేసాను. నాన్నగారు కూడా ఆ సమయంలోనే హైదరాబాద్ లో ఇండస్ట్రీస్ పెట్టారు. నేను ఎక్కడ ఉన్నా మీ బుజ్జి గాడి ని కనిపెడుతూ ఉండేదాన్ని, చివరకు అమెరికాలో ఎం ఎస్ చేసేప్పుడు కూడా అంది విజిత నవ్వుతూ.
ఓహ్ బాగుంది నీ లవ్ స్టోరీ. నీకు బాగా ఓపిక ఎక్కువ విజ్జీ. అవును ఇందాకటినుంచి అడుగుదామనుకుంటున్నా ఏంటి నీ జడ అలా వేసుకున్నావు అంది శశిరేఖ.
అప్పుడు జడ ముందుకు వేసుకుని చూసుకుంది విజిత. అవును చిన్నపిల్లలు వేసినట్లుంది. అప్పుడు గుర్తొచ్చింది పొద్దున్న నీల్ వేసాడు తన జడ. ఇది, ఇది తొందరలో వేసుకున్నాను శశి అంది తడబడుతూ.
అర్ధమయ్యిందిలే. మా బుజ్జిగాడి మార్క్ కనిపిస్తోంది నీ జడలో అంది శశి నవ్వుతూ.
అక్కడే ఉన్న పిల్లలు ఆల్రెడీ ఒక చెవి ఇటు వేసి ఉంచారు మమ్మీ ఆంటీ ఏం మాట్లాడుకుంటున్నారా అని. వాళ్లకు మాంచి మసాలా న్యూస్ దొరికింది. ఏంటి మామయ్యా నువ్వు ఆంటీకి జడ వేసావా అంటూ వినీల్ ని ఆటపట్టించండం మొదలుపెట్టారు.
ఏరా జడ వెయ్యడమేనా ఇంకేమన్నా ముందుకు వెళ్ళావా అంది శశి.
ఆబ్బె అదేం లేదక్కా. తను చెయ్యి నొప్పి ఆంటేను హెల్ప్ చేసాను అంతే అంతే అన్నాడు వినీల్. ఆమ్మో అసలు సంగతి తెలిస్తే కొంపలు అంటుకుపోతాయి అనుకున్నాడు మనసులో.
అన్నీ గమనిస్తూ నవ్వుకుంటోంది విజిత.
ఫరవాలేదులేరా. మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు. అవునుగానీ విజ్జీ ఆటలు, పాటలు, మ్యూజిక్ ఏమన్నా హాబీస్ ఉన్నాయా నీకు అంది.
క్లాసికల్ నేర్చుకున్నాను. లైట్ మ్యూజిక్ పాడగలను. చెస్ నా ఫేవరెట్ గేమ్ అంది విజిత.
ఓహ్ నైస్. నా కోసం ఒక్క పాట పాడు అంది.
త్యాగరాజ కృతి 'సామజ వరగమన' పూర్తిగా చాలా హృద్యంగా పాడింది.
అందరూ అలానే వింటూ ఉండిపోయారు.
చాలా బాగుంది నీ వాయిస్ విజ్జీ. చాలా బాగా పాడావు అంది శశి.
వినీల్, పిల్లలు క్లాప్స్ కొట్టారు హుర్రే అంటూ.
విజ్జీ మా అక్క రచయిత. తెలుగు లో రచనలు చేస్తుంటుంది అన్నాడు వినీల్.
ఓహ్ వెరీ నైస్. నాకు తెలుగు రచనలు చదవడం చాలా ఇష్టం అని కొంత మంది రచయితల, రచయిత్రుల పేర్లు చెప్పింది.