Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 20


    నీటి అడుగున అతడి శరీరం అచేతనమైంది.

    
                                      *    *    *

 

    మనిషికి ఒక అవయవం బలహీనమైతే, అది చేయవలసిన పనిని మిగతా అవయవాలు చేస్తాయన్న వాస్తవాన్ని ఆ రోజే నేత్ర ప్రత్యక్షంగా చూశాడు.

 

    అతడు పూర్తిగా లోపలికయినా రాలేదు, కళ్యాణి గుర్తు పట్టేసింది.

 

    "అన్నయ్యా" అంటూ దగ్గరకొచ్చింది. ఆమె కంఠంలో కొద్దిగా  అయినా  అనుమానం లేదు.

 

    అప్పటికి అతడు ఆమెను మరికాస్త ఏడిపించడానికి "భాసక్ర్ వున్నా  డాండీ......" అన్నాడు. విదేశీ గూఢచారులను కూడా ఏమార్చగల అతడి కంఠం ఆమెను  తప్పుదోవ పట్టించలేకపోయింది. ఆమె ఒక్క వుదుటున అతని దగ్గరకు వచ్చి అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. ప్రతి విషయాన్నీ ఎంతో మామూలుగా తీసుకునే అతడు కూడా ఆ స్పర్శకి చలించాడు.

 

    పార్వతమ్మ సరేసరి. ఒక్క పెట్టున శోకం మొదలు పెట్టింది. గంభీరంగా  వున్నది గజపతిరావు ఒక్కడే. "అప్పుడు పోయాడని ఏడ్చావు. ఇప్పుడు వచ్చాడని ఏడుస్తున్నావు. నీ ఏడుపుకి అర్థం ఏమైనా వుందటే...." అంటూ  తిట్టాడు గజపతిరావు.

 

    నేత్ర నవ్వాడు. అతడికి తన క్లాస్ మేట్ గుర్తొచ్చాడు. యస్పీరెడ్డి అని తరువాత సినిమా ప్రొడ్యూసర్ అయ్యాడు. కథ బాగా తయారవలేదని తాగేవాడు కథ బాగా వచ్చిందని తాగేవాడు. షూటింగ్ అన్న ప్రకారం జరగలేదని తాగేవాడు. అనుకున్నట్టు అయిన రోజూ తాగేవాడూ. ప్లాప్ అయితే ఆ విషాదంలోనూ, సక్సెస్ అయితే ఆ ఆనందంలోనూ తాగేవాడు. ఆ సాయంత్రం తాగడానికి  కారణం పగలంతా వెతుక్కునేవాడు.

 

    "భాస్కర్  ఎక్కడున్నాడో తెలిసిందిరా........?"

 

     వచ్చేస్తాడు తాతయ్యా...... త్వరలోనే"

 

    ఈ లోపు కల్యాణి అతని చేతికి రాఖీ కడుతూ" ఇది నీ కోసమే వుంచాను. భాస్కర్ అన్నయ్యకి ఈ సంవత్సరం లేదు" అంది చిన్న  పిల్లలా.

 

    "ఆర్నెల్ల తరువాత ఇప్పుడా"- అనలేదు నేత్ర.

 

    మామూలు కంటికి అది తగరం ముక్క, పెనవేసిన దారం  పోగు. మరో  దృష్టితో చూస్తే, ఆప్యాయతకి అనురాగం పెనవేసిన చక్కటి అనుభూతి "నువ్వు నాకెంతో కావలసిన వాడివి అన్నయ్యా" అన్నట్టు.

 

    నేత్ర నవ్వి "వాడు  ఏడుస్తాడు. రాగానే వాడికీ కట్టు" అన్నాడు. అతడి మాటలు పూర్తవకముందే ఇంటి వ్యాన్ ఆగింది. ముందు వ్యాన్ ఆగింది. ముందు సీట్లోంచి  చీఫ్ దిగాడు. వెనుక నుంచి  నలుగురు మనుష్యులు శవాన్ని  దింపుతున్నారు. ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. భాస్కర్  శవం నేల మీదకు  చేర్చబడింది.

 

    నేత్ర నిర్విణ్ణుడయ్యాడు. తన ప్రాణాలకు బదులుగా మరో సీక్రెట్  ఏజెంట్ ప్రాణాలు తీసుకున్నందుకు శత్రువు విజయగర్వంతో నవ్వుతున్నట్టు అనిపించింది. గజపతిరావు, పార్వతమ్మ షాక్ తగిలినట్టు చూస్తున్నారు.

 

    "ఎవైంది....? ఏవైందన్నయ్యా.....?" అని కళ్యాణి నేత్రని అడుగుతూంది. కాలి అడుగుల్ని గుర్తు పట్టగల  ఆ ఆ అంధురాలికి  నాలుగు భూజలమీద  నిశ్శబ్దంగా  వస్తున్న శరీరం ఆమె అన్నయ్యదని చెప్పగల  సాహసం అక్కడ ఎవరికీ లేదు. ఎంతో  దయనీయమైన స్థితి.

 

    ముందు తేరుకున్నది నేత్రే. కళ్యాణిని పొదవి పట్టుకుని, నెమ్మదిగా భాస్కర్ శవం దగ్గరికి తీసుకెళ్ళి స్పృశింపచేశాడు. ఆమెకు మొదట అర్ధంకాలేదు. ముందు "అన్నయ్యా" అంది. చలనం లేని శరీరం జరిగిన వాస్తవాన్ని స్పర్శతో తెలియచెప్పింది. ఒక్కసారిగా అక్కడ అగ్ని పర్వతం బ్రద్దలయింది.

 

    ఆ అమ్మాయిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. "వాడి మీద  కోపంతో వచ్చే సంవత్సరం కడతానన్నాను. నా మీద  కోపంతో వచ్చే జన్మవరకూ కట్టించుకోనని వెళ్ళిపోయాడు....." అంటూ ఏడుస్తోంది కళ్యాణి.

 

    నేత్ర అక్కడ వుండలేక ముందు వరండాలోకి వచ్చాడు. అక్కడ చీఫ్ పక్కన ప్రతిమ వుంది.

 

    "ఇదంతా నావల్లే...... నావల్లే....." అంది ప్రతిమ కంటినిండా నీటితో. జరిగింది. వాళ్ళకి భాస్కర్ మీద అనుమానం రావడానికి కారణం నేనే. చిన్నపిల్లలా తెలిసీ తెలియని ఉత్సాహంతో నేను చేసిన  పని భాస్కర్ ని బలి తీసుకుంది" అంది రుద్ధ కంఠంతో. ఆమె జీవితంలో ఎప్పుడూ  ఇంత బాధపడలేదు. ప్రతిదాన్నీ ఎంతో తేలిగ్గా, హుషారుగా తీసుకునే ఆ అమ్మాయికి  ఇది నిజంగా పెద్ద దెబ్బ.

 

    "ఊరుకో..... నువ్వు మాత్రం  ఏం చెయ్యగలవు......?" అన్నాడు నేత్ర, ఆమె చేతిమీద చెయ్యివేసి ఓదారుస్తూ, అతడి  చేతికి చెల్లెలు కట్టిన రాఖీ వుంది.

 

    ఆ రాఖీ తనని పరిహసిస్తున్నట్టు అనిపించింది.

 

    ఆమె బెడ్ రూం  ఆధునీకత మూర్తీభవించినట్టుంది. ఆమె ముందు గ్లాసులో విస్కీ  వుంది. స్వర్ణ రేఖ గ్లాస్ తీసుకుని సిప్  చేసింది. తలుపు తోసుకుని సర్పభూషణరావు ఆనందంగా లోపలకు వచ్చాడు. "యాభై లక్షలు..... చూశావా....... తల్లీ....... నువ్వు సాధిస్తావనే నమ్మకంతో అంత ఖరీదైన విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడు. నీ మీద అతడికి అంత నమ్మకం వుంది" అన్నాడు.

 

    ఆమె ఆ మాటల్ని పట్టించుకోకుండా "చాలా  దారుణంగా చేశాడు నాన్నా మర్డర్" అంది.

 

    "మరి ఆ ఏజెంట్ మన ఆర్గనైజేషన్ని అంతే మోసం చేశాడుగా అమ్మా" అన్నాడు. ఆమె మాట్లాడకుండా సిప్ చేసింది.

 

    "నీ మనసీరోజు అంత బాగోలేనట్టుంది. షాట్ తీసుకోలేదామ్మా...." అంటూ ఆమె చేతికి ఇంజక్షన్ ఇస్తూ "చూసింది మరిచిపో. ఆనందంలో  విహరించు. లైఫ్ ఈజ్ టు  ఎంజాయ్" అన్నాడు.

 

    ఆమె అద్దంలోకి చూసింది. ప్రతిబింబం మసగ్గా కనపడుతూంది. ఇంజక్షన్ పని చేస్తోంది.

 

    ఒక గాంధీ టోపీ, ఒక ఇన్ స్పెక్టర్ టోపీ, నోట్ల కట్టలు గిర్రున తిరుగుతున్నాయి. ఆమె బిగ్గరగా నవ్వింది.

 

    "బావుందా అమ్మా......?"

 

    "బాగుంది నాన్నా...... అయామ్ హ్యాపీ...... అయామ్ హ్యాపీ...." ఆమె  నవ్వుతూ అంది. ఇంతకు ముందున్న విషాదం లేదు. "ఈ దేశాన్ని సర్వనాశనం చెయ్యాలి. ఈ దేశాన్నే కాదు. ఈ ప్రపంచాన్నే సర్వనాశనం చెయ్యాలి" అని  బిగ్గరగా  నవ్వింది.

 

    అప్పుడే లోపలికి వచ్చిన హంసలేఖ అక్క వైపు ఆశ్చర్యంగా , దిగులుగా చూసింది. ఆమె ఏదో అనబోతూ వుంటే తండ్రి ఆమెని అక్కడ నుంచి  తీసుకు వెళ్లిపోయాడు.


                                   *    *    *

 

    "జీవితం బండి చక్రం వంటిది. పుట్టుకతో ప్రారంభమై  మరణంతో  అంతమవుతుంది" అన్నాడొక తత్వవేత్త. అది నిజమైతే అవ్వొచ్చునేమో కాని,  ఈ  బండి చక్రంకు పరిధిమాత్రం ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క పరిణామంలో వుంటుంది. రవుతుపల్లిలో పుట్టినవాడు బర్రెలు కాస్తూ పెద్దవాడై అదే  వూళ్ళో రైతు కూలీగా చచ్చిపోవచ్చు. పత్తిపాడులో పాలేరు కొడుగ్గా పుట్టినవాడు ప్రధాన మంత్రయి పారిస్ లో శేష జీవితం గడపోవచ్చు. జీవిత పరిణామాలకి కాలం కొలబద్ద కాదు.

 Previous Page Next Page