Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 19


    "అడవిలో వాళ్ళు మనకోసం వెతుకుతున్నారు. కేవలం పాడటమేనా.....? రాత్రుళ్ళు పక్కమీద డాన్స్ గట్రా కూడా చెయ్యాలా.......?" అన్నాడు కోపంగా.

 

    "పాట చాలు......" అంది బిక్కమొహంతో.

 

    "అయితే మనసులో గట్టిగా పాడుకో"

 

    "కానీ......"

 

    "పైకి ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను"

 

    బెదిరి ఆమె పక్కకి తిరిగి పడుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది.


                                   *    *    *

 

    అది విశాలమైన హాలు. ఆ హాలు మధ్యలో గుండ్రటి టేబుల్ వుంది. దాదాపు పదహారు మంది కూర్చోవచ్చు దానిచుట్టూ. ఆధునికమైన డైనింగ్ టేబుల్ పై భాగం తిరిగేట్టు, దానిక్కూడ గిర్రున తిరిగే ఏర్పాటు వుంది.

 

    బల్ల చుట్టూ పదహారు మంది వున్నారు.

 

    ఎత్తుగా మొదటి కుర్చీలో వున్న క్యూ దగ్గరికి ఒకమ్మాయి ట్రేలో లక్ష్మీదేవి బంగారు విగ్రహం పట్టుకొచ్చింది. దాన్ని తీసుకుని తనం ముందు బల్లమీద  పెట్టుకుని, అతను చెప్పడం  ప్రారంభించాడు. "ఈ దేశం సమూలంగా నాశనమై, మా దేశంలో లీనంయ్యాక కాబోయే గవర్నర్లకు నా హృదయ పూర్వక స్వాగతం. మీ అందరూ మీ మీ రంగాల్లో నిష్ణాతులు. మైక్రో బయాలజీ రీసర్చి స్కాలర్ల నుంచి, ప్రజల్ని కనుసన్నల్లో ఆడించగల రాజకీయనాయకులు మీలో వున్నారు. మీలో ఒకరు గొప్ప విజయం సాధించారు. వారి కోసం ఒక బహుమతి!" ఏజెంట్ క్యూ తన ముందున్న టేబుల్ ని గట్టిగా తిప్పాడు. అది వేగంగా తిరగడం  ప్రారంభించింది. దాని మీదున్న లక్ష్మీదేవి విగ్రహం ఎదురుగా  కూర్చున్నవారి  ముందునుంచి సాగిపోతూంది. అందరూ ఊపిరి బిగబట్టారు.

 

    టేబుల్  టాప్ స్లో అయింది.

 

    నెమ్మదిగా వచ్చి ఒక స్త్రీ ముందు ఆగింది. ఏజెంట్ క్యూ  వచ్చి ఆ అమ్మాయి వెనగ్గా నిలబడ్డాడు.

 

    "ఏ మనిషి జీవితాన్ని ఎలా నిర్ణయించాలో తెలిపే చక్రం ఇది. ఈ రోజు విజయలక్ష్మి ఈమెను వరించింది. డియర్  ఫ్రెండ్స్...... ఈమె పేరు స్వర్ణరేఖ. కెమిస్ట్రీలో అపురూపమైన శోధన చేసింది. ఈమె సాధించిన విజయానికి ప్రతిఫలంగా మా దేశం ఈ చిన్న బహుమతిని అందజేస్తుంది" అంటూ బంగారు విగ్రహాన్ని ఆమెకి అందజేశాడు.

 

    "దీని ఖరీదు  లక్ష డాలర్లు అంటే...... యాభై  లక్షల రూపాయిలు. కేవలం అడ్వాన్సు మాత్రమే- ఈమె సాధించబోయే అపురూప విజయానికి" అన్నాడు.

 

    స్వర్ణరేఖ ఆ విగ్రహం వైపే చూస్తుంది కన్నార్పకుండా. ఆమెలో ఆనందం లేదు. 'డబ్బు కోసమా తను చేస్తోంది......?' రేఖ కళ్ళు  మూసుకుంది.

 

    ఆమె  పరుగెడుతూంది. వెనుక ఒక కుర్రవాడు పరుగెడుతున్నాడు. ఇక ఎటు పోతుందిలే అన్న ధీమాతో జింకను వేటాడే పులిలా వున్నాడు.

 

    రెండవ దృశ్యంలో ఆమె చేతిలో ఒక బీకరు వుంది. ఆమె అరిచిన అరుపు ఆ గదిలో ప్రతిధ్వనించింది. దాన్ని పైకి ఎత్తి విసిరింది.

 

    ఆమె ఇంకా  గతం  తాలూకు స్మృతుల్లో వుండగానే ఆమె భుజం మీద ఒక  చెయ్యి తట్టింది. ఆమె కళ్ళు విప్పి చూసింది. పక్కన సర్పభూషణరావు.  'తీసుకో' అన్నట్టు చూస్తూన్నాడు. ఆమె విగ్రహం అతనివైపు  తోసింది. ఈ లోపు ఏజెంట్  క్యూ తిరిగి ప్రాంభించాడు. "ఇంత  ఆనందకరమైన సంఘటన పక్కనే మరో  విషాద  సంఘటన  వుంది ఫ్రెండ్...."

 

    ఒక స్త్రీ ట్రేలో పుర్రె పట్టుకొచ్చింది. దాన్ని తీసి తన ముందు పెట్టుకున్నాడు..

 

    "మన మిత్రుడు సర్పభూషణరావు మా దేశానికి సాయం చేస్తున్నాడని మనలో ఎవరో సీక్రెట్  ఇన్ ఫర్మేషన్ పాస్ చేశారు. దాదాపు కోటి రూపాయలు విలువగల ప్రయోగశాల నాశనమైపోయింది. ఇది మనకి రెండోదెబ్బ. చెప్పండి...... మీలో ఎవరు ఆ ద్రోహి.....?"

 

    ఎవరూ మాట్లాడలేదు.

 

    క్యూ బలంగా ఆ బల్లని తిప్పాడు.

 

    పుర్రె అందరి ముందు నుంచి సాగిపోతూంది. అందరూ ఊపిరి బిగపట్టారు. ఈసారి మాత్రం తన ముందు ఆగకూడదని ప్రతివారూ దేవుణ్ణి ప్రార్థించారు.

 

    క్రమంగా వచ్చి అది ఒక వ్యక్తి ముందు ఆగింది.

 

    అతడు చప్పున కుర్చీలోంచి లేచి "ఇది  అన్యాయం...... నాకేం తెలీదు" అని అరిచాడు.

 

    "జాతక చక్రం అబద్ధం చెప్పదు మిస్టర్ భాస్కర్. నీ బహుమతి స్వీకరించు" అంటూ క్యూ బ్రీఫ్ కేస్ తెరిచాడు.

 

    "డబుల్ ఏజెంట్ గా పనిచేశావు. కానీ, ఇప్పటివరకు మాకు  చేసిన  సాయానికి నిన్ను చిత్రహింస పెట్టి ప్రాణాలు తీయడం నాకు ఇష్టంలేదు. నీ ప్రాణాలు నువ్వే తీసుకో. ఇదిగో పిస్టల్....." అంటూ బ్రీఫ్ కేస్ లోంచి పిస్టల్ తీసి ఇచ్చాడు.

 

    అతడు తటపటాయించాడు.

 

    "మరో దారిలేదు భాస్కర్రావ్. నువ్వు చస్తావా.....? నన్ను చంపమంటావా..........?"

 

    "అవును....... నేను డబుల్ ఏజెంట్ నే. భారత్ సీక్రెట్ సర్వీస్  ఏజెంట్ ని. ఈ రోజు  ఇలా నీ స్థావరం  కూడా  తెలుసుకొగలిగాను. చేతులెత్తు మిస్టర్  క్యూ...... నీ ఆటకట్టు....." అన్నాడు.

 

    క్యూ చెతులెత్తకుండా నవ్వుతూ అతని దగ్గరకు వచ్చాడు.

 

    "ఐ విల్ షూట్ యూ......."

 

    క్యూ బెదరలేదు. మరింత సామీప్యానికి వచ్చాడు. నవ్వుతూ "నీతోనే నిజం చెప్పించాను చూసావా....." అన్నాడు.

 

    భాస్కర్ ట్రిగ్గర్ నొక్కాడు. అంతే.... ఏదో షార్ట్ సర్క్యూట్ అయినట్టు కెవ్వున కేకవేసి చేతిని పట్టుకుని విలవిల్లాడి పడిపోయాడు. పిస్టల్ దూరంగా పడింది.

 

    క్యూ బిగ్గరగా  నవ్వాడు. భాస్కర్  మీద బోనులా పై నుంచి అద్దాల కేస్ జారింది. అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. క్యూ వారిని అడిగాడు- "గాలి ...... నీరు...... అగ్ని...... పంచభూతాల్లో మూడు. ఏ భూత సాయంతో ఈ మనిషిని చంపితే బావుంటుంది చెప్పండి ఫ్రెండ్స్.......?"

 

    ఎవరో "నీరు" అని అరిచారు.

 

    క్షుద్ర గణాధిపతులు అరచినట్టు అందరూ "నీరు నీరు" అని అరవడం  ప్రారంభించారు. ఆ ప్రతిధ్వనులు ఆ గదిలో రిథమాటిక్ గా వినిపించసాగాయి.

 

    పైనుంచి అద్దాల  కేసులోకి నీరు కారసాగింది. భాస్కర్ అద్దాలు పగలకొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అవి బుల్లెట్ ప్రూఫ్ లా వున్నాయి.

 

    స్వర్ణరేఖ  చూస్తూంది.

 

    చేప నీటి బయట కొట్టుకున్నట్టు అతడు నీటిలో కొట్టుకోవడం అద్దంలో స్పష్టంగా కనిపిస్తూంది.

 

    సభ్యులు చూస్తున్నారు.

 

    స్వర్ణరేఖ కళ్ళు మూసుకుంది.

 Previous Page Next Page