Previous Page Next Page 
థ్రిల్లర్ పేజి 20


    "ప్లాన్ చెప్తే-"

    అతడు ప్లాన్ చెప్పాడు.

    సంపత్ నోరు తెరుచుకుని విన్నాడు. అతడే గొప్ప క్రిమినల్ బ్రెయిన్ వున్నవాడు. అటువంటిది ఈ ప్లాను వింటూంటే అతడికే మతిపోయింది. దాదాపు పది నిముషాలు చెప్పాడు. అంతా చెప్పి ఆ వ్యక్తి నవ్వేడు.

    "ఎలా వుంది ఈ ప్లాన్?"

    "ఇన్ని తెలివితేటలు నీకెలా వచ్చాయి?"

    "ఎప్పటినుంచో ఆలోచిస్తూ వున్నాను అది ఫూల్ ప్రూఫ్ గా తోచింది. దీన్ని ఎలా కాష్ చేసుకోవాలా అని ఆలోచిస్తే నువ్వు తోచావు."

    మరేమీ ఆలోచించకుండా సంపత్ డబ్బు అతడికి ఇచ్చాడు. "మిగతాది అనుకున్నది అనుకున్నట్టు పూర్తయ్యాక యిస్తాను. ఇందులో కొద్దిగా రిస్కువుందని నీకూ తెలుసు"

    "ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. లక్ష తీసుకున్నాక ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా?" అంటూ అతడు డబ్బు అందుకుని "థాంక్స్" అన్నాడు.

    "బయల్దేరదామా?" సంపత్ అడిగాడు. అతడు తలూపగానే కారు కదిలింది.

                                            *    *    *

    ఇన్ స్పెక్టర్ శాస్త్రి చేతిలో ఫోటోవంకే చాలాసేపు చూస్తూ వుండిపోయాడు.

    పద్ధెనిమిదేళ్ళున్నప్పటి విద్యాధరి ఫోటో - అనుదీప్ పెట్టెలో....

    -అనుదీప్ చెప్పినదంతా నిజమేనా?

    ఏడు సంవత్సరాలు ఈ ఫోటో ముందుపెట్టుకుని అడవిలో వింధ్య పర్వతాల మధ్య తపస్సు చేశాడా?

    అతడు తల విదిలించాడు.

    ఇదంతా నిజమని నమ్మబుద్ధి కావటంలేదు.

    ఏం - ఎందుకు కాకూడదు?

    గౌతమబుద్ధుడు -

    రామకృష్ణ పరమహంస -

    వీళ్ళందరూ కల్పనా సాహిత్యంలో పాత్రలుకారు. చరిత్ర సాక్ష్యాధారాలతో ఋజువు చూపించిన వ్యక్తులు. ఒకప్పుడు భూమ్మీద వున్నవారు. తపస్సు చేసినవారు.

    తనకింత అనుమానం ఎందుకొచ్చిందీ అంటే -

    వాళ్ళందరూ ఒక దీక్షతో - ఒక సత్యం కన్నుక్కోవటం కోసం తపస్సు చేశారు. బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి అరణ్యాల కెళ్ళి తపస్సు చేయలేదు. అయినా అమ్మాయిని ప్రేమిస్తే వెళ్ళి కలుసుకుని ప్రేమిస్తున్నానని చెప్పాలి. కాని అరణ్యాలకెళ్ళి తపస్సు చేయటమేమిటి?

    అతడు అనుదీప్ తల్లిదండ్రులకేసి తిరిగి, "మీ అబ్బాయి ఫోటో ఏదయినా వుందా?" అని అడిగాడు.

    తండ్రి లోపల్నుంచి ఒక ఫోటో తీసుకువచ్చి ఇచ్చాడు. దాన్ని జేబులో పెట్టుకుని బయటకు వచ్చాడు. ఇన్వెస్టిగేషన్ అయితే చేశాడుగానీ, తరువాత ఏం చెయ్యాలో తెలియలేదు. ధర్మారావు ఈ పని తన అసిస్టెంటుకి అప్పగించాడని తెలుసు. ఈ రోజు కాకపోయినా రేపయినా అనుదీప్ ని అతడు పట్టుకుంటాడు. ఇదంతా తను కేవలం తన ఆత్మ సంతృప్తి కోసం చేసింది.

    శాస్త్రి మనసులో మాత్రం అనుదీప్ పట్ల ఈ మిస్టరీ అలాగే వుండిపోయింది. ఈ మిస్టరీ విడగొట్టాలని అనిపించింది. కానీ మరుసటిరోజు నుంచీ అతడు సెలవులో వెళ్తున్నాడు. సంవత్సరానికోసారి భార్య, ఇద్దరు కూతుళ్ళనీ తీసుకుని ఏదయినా దూరప్రాంతానికి వెళ్ళటం అతని అలవాటు. ఈసారి గోవా వెళదామని ప్లాను వేసుకున్నారు. ఈ ఫోటో విశ్వనాథానికిస్తే తన బాధ్యత తీరిపోతుంది.

    ఇంటికి వస్తూ శాస్త్రి మరోసారి అనుదీప్ ఫోటోవైపు చూశాడు. అందంగా, అమాయకంగా వున్నాడు. బహుశా ఇంటి నుంచి మాయమయ్యేముందు ఫోటో అయి వుంటుంది.

    అతడికి అనుదీప్ తల్లిదండ్రులని చూస్తే జాలివేసింది. కూతురు చనిపోవటం, కొడుకు ఇంటిని వదిలిపోవటం.

    అనుదీప్ మీద కోపం కూడా వచ్చింది. మరో అనుమానం కూడా.

    ఇలాటి యువకులు ఆ వయసులో ఏదైనా ఉద్యమంలో చేరి బందిపోట్లుగా మారడం సహజం. ఇతడు కూడా ఈ ఏడు సంవత్సరాలపాటు అలాటి కార్యకలాపాల్లో పాల్గొని, ఏమీ ఎరగనట్టు తిరిగి వచ్చాడా? తీగ లాగితే డొంక కదిలినట్టు - విద్యాధరి ఇచ్చిన కంప్లెయింట్ తో మొత్తం అతని క్రిమినల్ చరిత్ర బయటపడబోతూందా? లేక అతడన్నట్టు అమ్మాయిని ప్రేమించి....

    మైగాడ్, నేనుకూడా చిన్నపిల్లవాడిలా ఆలోచిస్తున్నానేమిటి అనుకున్నాడు. అతడికిదంతా ఒక నవ్వులాట వ్యవహారంగా కనిపించింది. ఒక అమ్మాయి దగ్గిర ఎవరో కుర్రవాడు ఒక కట్టుకథ చెప్తే అదేదో తన కుటుంబ వ్యవహారంలా కమీషనర్ దానిమీద పోలీసుల్ని నియమించటం ఎందుకు? ఒకవేళ అతడి కథంతా ఆ అమ్మాయి నమ్మకపోతే అక్కడే లాగిపెట్టి కొట్టి వుండవచ్చుగా! లేదా అబ్బాయి నచ్చితే, ఇంత డొంకతిరుగుడు ఎందుకు? "నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను' అని ఆవిడే చెప్పొచ్చుగా! ఈ చిన్నపిల్లల వ్యవహారం వల్ల ఎంతమంది పోలీసుల సమయం వృధా....

    మోటార్ సైకిల్ తన ఇంటిముందు ఆపుచేసి శాస్త్రి లోపలికి ప్రవేశించాడు.

    బెడ్డింగ్, రెండు పెట్టెలు గదిలో ఒక మూలగా సర్దివుంచారు. ప్రయాణం హడావుడి కనిపిస్తూంది. కానీ దానికన్నా అతీతంగా మరో గమ్మత్తయిన వాతావరణాన్ని శాస్త్రి పోలీసు కళ్ళు పట్టుకున్నాయి. ఇద్దరు కూతుళ్ళూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. చిన్నమ్మాయి పెద్దదాన్ని చెప్పనా అని అడుగుతూంటే, పెద్దకూతురు వద్దన్నట్టు బ్రతిమలాడుతుంది.

    "ఏమిటి విషయం?" అని అడిగాడు. ఇద్దరూ చప్పున సైలెంట్ అయిపోయారు. మళ్ళీ రెట్టించాడు. చిన్నది ఇక ఉండబట్టలేనట్టు చెప్పేసింది. "ఇవ్వాళ అరుణ బస్ లో ఒక కుర్రాడి చెంపబ్రద్దలుకొట్టింది నాన్నా."

    "ఎందుకు?" అని అడిగాడు.

    ఇంక ఆ అమ్మాయికీ చెప్పక తప్పలేదు.

    "ఎవరో ప్రభాకర్ అని ఒక కుర్రవాడు చాలా రోజుల్నుంచీ వేధిస్తున్నాడు. ఈ రోజు శృతిమించేసరికి చెంప ఫెడేలుమనిపించింది" అని చెప్పి ఆ అమ్మాయి "మరేం చెయ్యను నాన్నా - ప్రతి రోజు వెంటపడి ప్రేమ, దోమ అంటాడు ఇక తప్పలేదు" అంది.

    "అక్కయ్య హీరో అయిపోయింది నాన్నా. ఇద్దరు పోలీసులు కూడా వచ్చారు. ఇన్ స్పెక్టర్ రవిశాస్త్రిగారి అమ్మాయిలమని చెప్పగానే వాడిని చెరోరెక్కా పట్టుకొని లాక్కుపోయారు" అంది నవ్వుతూ. "...అందరూ అక్కయ్యకి కంగ్రాట్స్ చెప్పారు. మహిళా మండలిసభ్యులెవరన్నా వుంటే ఆ బస్సులోనే సన్మానం కూడా చేసి వుండేవారు."

    "ఛా, వూరుకోవే-" అంది సిగ్గుతో అరుణ.

    "ఎన్నిరోజుల్నుంచీ వెంటపడుతున్నాడు?"

    "దాదాపు నెలనుంచీ.... ఇష్టమయితే పెళ్ళి చేసుకుంటాడట."

    "మరి నువ్వేమన్నావ్?"

    తండ్రి నుంచి ఈ ప్రశ్న ఊహించని అరుణ అదిరిపడింది. ఇంతలో తల్లి కల్పించుకుని - "అది అనటమేమిటండీ - చిన్నపిల్ల. వాడికి బుద్ధి వుండొద్దూ. అందమైన అమ్మాయి కనపడితే ప్రేమించెయ్యటమేనా. నా దగ్గరికి తీసుకురావాల్సిందమ్మాయ్, కాళ్ళు విరగ్గొట్టి వుండేదాన్ని. మ రోజుల్లో ఇంత వెధవ్వేషాలేమీ లేవు" అంది.

    "నిజంగానే పెళ్ళి చేసుకోవాలనుకున్నాడేమో" అన్నాడు శాస్త్రి నవ్వుతూ. భార్య గఁయ్ మంది. "చాల్లెండి, మీకూ మతిపోతున్నట్టుంది. వాడెవడో తెలీదు. ఆస్థిపాస్తులు తెలీదు, ఏ కులమో తెలీదు. పైగా బస్ లో కనబడి ప్రేమ అన్నవాడు సంసారం ఏమి చేస్తాడండీ? రేపు ఇంకొకత్తి కనపడితే దాన్నీ ప్రేమిస్తున్నానంటాడు."

    అరుణ మొహం చిట్లించి- ఎవడో పోకిరీ వెధవ గురించి ఇంత డిస్కషన్: ఏమిటమ్మా?" అంది.

    "అన్నట్టు చెప్పటం మర్చిపోయానమ్మాయ్. మనం రేపు గోవా వెళ్ళటం లేదు. ఒక హిల్ ప్లేస్ కి వెళ్తున్నాం" అన్నాడు.

    "ఎక్కడికి నాన్నా?"

    "చిరుగాఁవ్ అని.... వింధ్య పర్వతాల దగ్గిర-"

    "వింధ్య పర్వతాలా! భలే భలే" అంటూంది ఉత్సాహంగా చిన్నకూతురు. శాస్త్రి మనసులో అనుకున్నాడు. "ఈ పనికి ప్రభుత్వం ఎలాగూ దారిఖర్చులు ఇవ్వదు. నా సంతృప్తి కోసం నేనే ఈ చిత్రమైన వ్యక్తి గతాన్ని తవ్వి తియ్యాలి."

                                                                   *    *    *

    ఆమె నుదుటిమీద స్వేదబిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆమె చేతివేళ్ళ కొసలు సన్నగా కంపిస్తున్నాయి. ముందు చాలా సులభం అనుకుందిగానీ విద్యాధరికి ఇప్పుడు తెలుస్తుంది. ఇటువంటి పనులు చేయటం ఎంత కష్టమో.

    చక్రధర్ కేక్ కోశాడు. ఈ పుట్టినరోజు యొక్క ప్రత్యేకత- కొత్త సంవత్సరం తరఫు తన అదృష్టం- విద్యాధరి అందం- అన్నీ పొగడ్తలతో చోటు చేసుకున్నాయి. అన్నిటినీ సహనంతో భరించింది. ఆమె ఆలోచన్లన్నీ అతడి బెడ్ రూం వెనుకవున్న రహస్యపు టరమీదే వున్నాయి. అక్కడికి ఎలా ప్రవేశించాలో అర్థంకావటం లేదు.

    ఆమె అన్యమనస్కంగా వుండటం అతడు గమనించలేదు. ఆమె ఈ రాత్రి తనతో గడపటానికే వచ్చిందన్న నమ్మకంతో వున్నాడు. మామూలుగా వప్పేసుకోవటం కంటే- ముందు ఎదిరించి దెబ్బలాడి, ఇప్పుడు లొంగిపోవటం అతడి అహానికి గొప్ప సంతృప్తినిచ్చింది. ఆ సంతృప్తికి చివరి అంశమైన రాత్రి సంపూర్ణత్వాన్ని సంతరించుకోవటానికి ఇంకా రెండు మూడు గంటల టైముంది. "డిన్నర్ ఏర్పాటు చేయనా?" అన్నాడు.

    ఆమె కంగారుగా "డిన్నరా! వద్దు వద్దు. పార్టీ అయిపోయిందిగా వెళతాను" అంది.

    ఆమె ప్రొఫెషనల్ సీక్రెట్ ఏజెంట్ కాదు- విషయాన్ని చివరివరకూ లాగి, అక్కడయినా తెలివిగా తప్పించుకు బయటపడటానికి.

    అప్పటివరకూ వున్న ధైర్యం ఇప్పుడు లేదు. రేపు మళ్ళీ వచ్చి చూడవచ్చులే అనుకునే స్టేజికి వచ్చింది ముసురుకుంటున్న చీకట్లను చూసి.

    "ఈ రోజు నా పుట్టినరోజు. ఇప్పుడే పుట్టిన పాపాయి మనసు నొప్పించ కూడదు" అంటూ ఒక చీప్ జోక్ వేసి, లేచి "ఈ రోజు డిన్నర్ తీసుకునే వెళ్తున్నారు మీరు. లేకపోతే నా మీద ఒట్టే- నేనిప్పుడే స్నానం చేసి వస్తాను" అంటూ మేడ మీదకు వెళ్ళాడు.

    సడెన్ గా ఆమె రక్త ప్రసరణం హెచ్చింది.

    ఇదే అవకాశం.

    ఇంతకన్నా మంచిది మరొకటి రాదు.

    వంటవాడు, పనికుర్రాళ్ళు - అందర్నీ ముందే పంపివేశాడని ఆమెకి తెలుసు.

    అతడు మేడ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు.

    తలుపు వేసుకున్న శబ్దం వినిపించింది.

    క్రింది బెడ్ రూమ్ తలుపు సగం తెరిచి వుంది. లోపల వాల్ పానెల్స్ కనపడుతున్నాయి. వాటిమధ్య బాత్ రూమ్...

    రహస్యపు అర...

    చెక్కల్లో కలిసిపోయి... జాగ్రత్తగా చూస్తే తప్ప స్పష్టంగా కనిపించకుండా... గీజర్ పక్కగా.

    ఇల్లంతా చీమ చిటుక్కుమంటే వినపడేటంత నిశ్శబ్దంలో ఆమె గుండె కొట్టుకుంటున్న శబ్దం వేగంగా- స్పష్టంగా.

    ఆమె లేచింది.

    ఆమె కాళ్ళు వణికాయి. తటపటాయించింది.

    అతడు వచ్చేస్తే...?

 Previous Page Next Page