Previous Page Next Page 
థ్రిల్లర్ పేజి 21


    పైకి చూసింది. అంతా నీరవం. పై బాల్కనీ లైటు వెలుతురు క్రిందికి పడుతూంది. హాల్లో వెలుతురు బెడ్ రూమ్ లోకి పాకుతోంది. ఆ వెలుగులో వరస చెక్కలు...

    మహా అయితే అయిదు నిముషాలకన్నా ఎక్కువ సమయం వుండదు. సగం వరకూ మూసివున్న తలుపు తెరుచుకుని ఆమె ఆ గదిలోకి ప్రవేశించింది. సన్నటి పరిమళం ఆమెను చుట్టుముట్టింది. అయితే ఆమె దాన్ని గమనించే స్థితిలో లేదు. బాత్ రూం చేరుకుంది. లోపల్నుంచి ఏదో అదృశ్య స్వరం "వద్దు వెళ్ళిపో" అని హెచ్చరిస్తున్నట్టు అరుస్తూంది.

    బెడ్ రూమ్ కి బాత్ రూమ్ ఒక అడుగు ఎత్తులో వుంది. ఆమె మెట్టు ఎక్కింది. వాష్ బేసిన్ పక్కనున్న గీజర్ చేరుకుని రెండు చేతులూ ఎత్తి గోడని తడిమింది. ఒక చెమట చుక్క గుండెల మధ్యనుంచి నాభి మీదకు జారింది. ఆమెకు గీజర్ సరిగ్గా అందలేదు. అరికాళ్ళమీద లేచింది. నున్నటి గచ్చుమీద కాళ్ళు జారుతున్నాయి. దానికితోడు టెన్షన్ ఒకటి. ఆమె చెక్కలమీద చూపుడు వేలు వెనక్కి తిప్పి వరసగా కొట్టుకుంటూ శబ్దం వినసాగింది.

    టక్.... టక్...
    టక్.... టక్...
    టక్.... టక్...
    టక్....
    
    ఆమె అక్కడ ఆపి తిరిగి కొట్టింది. అదేశబ్దం. లోపల డొల్లగా వున్నట్టు -

    అదే -అదే.

    ఆమెకు దాన్ని ఎలా తెరవాలో అర్థంకాలేదు.

    పైగా చక్రధర్ స్నానం పూర్తయిందో లేదో తెలీదు. ఆమె అటూ ఇటూ చూసింది. వాష్ బేసిన్ పక్కన టంగ్ క్లీనర్ కనబడింది. చప్పున దాన్ని అందుకుని చెక్కలమధ్య సందులో దాన్ని పెట్టి ఎడం చెయ్యటానికి ప్రయత్నించింది. దాదాపు నిముషంపాటు ప్రయత్నించాక ఆ చెక్క తలుపు కొద్దిగా బయటకు వచ్చింది. ఆమె టంగ్ క్లీనర్ వదిలేసి రెండు చేతుల వేళ్ళతో ఆ తలుపుని లాగింది. ఒక పెద్ద పళ్ళెం ధడేలున పడినంత శబ్దమయింది ఆ నాలుకబద్ద గచ్చుమీద పడి చేసిన శబ్దం. అంత నిశ్శబ్దాన్ని ఆమె అప్పటి వరకూ ఫీలయింది. ఉలికిపాటుని అణుచుకుంటూ తలతిప్పి వెనక్కి చూసింది.

    బెడ్ రూమ్ బయట అలికిడి లేదు.

    అటు తిరిగి, తలుపు పట్టుకుని లాగింది. ఈసారి సులభంగా అది తెరుచుకుంది.

    లోపల అడుగు పొడవు, అడుగు వెడల్పు వున్న చిన్న అర అది. దానికి ఇనుప తలుపు చట్రంలో బిగించబడి వుంది. ఇనప్పెట్టెకి వున్నట్టు దానికి తాళపు రంధ్రం వుంది.

    ఆమెను ఒక్కసారిగా నిస్పృహ ఆవరించింది. ఈ లోపలి ఇనుప తలుపుని ఆమె వూహించలేదు.

    కానీ అంతలోనే ఆమెకు ఎక్కడో చదివిన విషయం స్ఫురించింది. ఇలాంటి రహస్యపు టరల తాళం చేతులు సాధారణంగా కారు తాళాల గుత్తిలోనో, ఆఫీసు తాళం చెవుల గుంపులోనో కలిసిపోయి వుంటాయి. వాటికి ఏ విధమైన ప్రత్యేకతా వుండకుండా చేయటం కోసం ఈ విధంగా కలిపేస్తూ వుంటారు.

    ఆమె మరి ఆలస్యం చేయలేదు. ముందు తలదిండుల క్రింద వెతికింది. తాళాలు దొరకలేదు. వేగంగా ముందు హాలులోకి వచ్చింది. బల్లమీద కారు తాళాలున్నాయి. అవి తీసుకుని అదే వేగంతో లోపలికి వెళ్ళి ఒకదాని తరువాత మరొకటి ప్రయత్నించింది. మూడో తాళంతో ఆమె ప్రయత్నం ఫలించింది.

    చిన్న చప్పుడుతో తలుపు తెరుచుకుంది.

    లోపల ఒక కాగితాల ఫైలు, చిన్న తోలుసంచి, మరో రెండు మూడు ప్యాకెట్లూ వున్నాయి.

    ఆమెకి కంపించే చేతుల్ని స్వాధీనంలో వుంచుకోవటం కష్టమవుతూంది. ఇంకొక్క నిముషం... వీటిని తీసుకుని బయటపడగలిగితే- ఈ ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టగలిగితే విజయం సాధించినట్టే. ఆమె రెండు చేతుల్తోనూ వాటినన్నిటినీ పట్టుకుని బయటకు తీసింది. లోపల ఇంకా ఏమైనా వున్నాయేమో అని చూసి, ఏమీ లేవని నిర్ధారించుకొని వెనుతిరిగింది.

    ఎప్పుడొచ్చి అక్కడ నిలబడ్డాడో తెలీదు - చక్రధర్ గుమ్మం దగ్గర నిలబడి ఆమెనే గమనిస్తున్నాడు.

    చక్రధర్ ఆమెని చూసి నవ్వాడు.

    శత్రువు సుడిగుండంలో మునిగిపోతూ ఇక ఏ విధంగానూ బ్రతికే ఛాన్సు లేకపోతే అవతలి మనిషి ఎలా నవ్వుతాడో అలా వుంది ఆ నవ్వు.

    మొదట అతడు కూడా ఈ వూహించని సంఘటనకి బిత్తరపోయి వుండవచ్చు. కానీ ఆమెని ఎంతసేపట్నుంచి గమనిస్తున్నాడో, ఈ కాస్త సమయంలోనూ సర్దుకున్నాడు. ఆమె ఎటూ తప్పించుకుపోలేదన్న ధైర్యం అతడిలో అణువణువునా కనిపిస్తూంది.

    విద్యాధరి పరిస్థితి అనూహ్యంగా వుంది! డీప్ షాక్ లోకి వెళ్ళిపోయిందామె. చేతిలో వస్తువులు నేలమీదికి జారిపోకుండా వుండటానికే చాలా కష్టపడవలసి వచ్చింది.

    "ఏదో సి.ఐ.డీ. పని చెయ్యటానికి వచ్చినట్టున్నావే-" అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతడు అడుగు ముందుకువేసి, "చెప్పు. ఈ రహస్యపు అర సంగతి నీకెలా తెలిసింది?" అని అడిగాడు.

    ఈ లోపులో ఆమె కొద్దిగా తేరుకుంది. అతడు తనని చంపేస్తాడా? .... అంత ధైర్యం చెయ్యకపోవచ్చు. ఏం చేస్తాడు? పోలీసులకు ఫిర్యాదు ఇస్తాడా? ఇస్తే తనకి మంచిది.

    ఈ ఆలోచన కలిగేసరికి ఆమెకి ధైర్యం వచ్చింది. అప్రయత్నంగా చేతులవంక చూసుకుంది. ఈ కాగితాలు ... వీటినెలాగయినా తనతోపాటు బయటకు తీసుకు వెళ్ళగలిగితే...

    ఆమె మౌనంగా వుండటంతో చక్రధర్ మరో రెండు అడుగులు ముందుకొచ్చి "మిగతా ప్రశ్నలన్నిటికీ తరువాత సమాధానాలు చెపుదూగానీ ముందా కాగితాలు ఇవ్వు" అంటూ చెయ్యిసాచాడు. అప్పుడు గమనించిందామె తమ చేతులమధ్య వున్న సంచిలాంటి దాన్ని.

    పిస్టల్.

    కాగితాలు తీయటంతో, వాటితోపాటు వచ్చింది. దాన్ని చప్పున బ్యాగ్ లోంచి తీసి అతడికి గురిపెట్టింది.

    అతడు బిగ్గరగా నవ్వేడు.

    "అది ఖాళీ పిస్తోలు. ఎవరూ గుళ్ళునింపి పిస్టల్ ని సంవత్సరాల తరబడి లోపల చీకట్లో దాచుకోరు" అన్నాడు ముందుకువస్తూ.

    తన పని అయిపోయిందని ఆమెకి అర్థమైంది. అతడు దగ్గిరకి వచ్చి ఆమె చేతిలో ఆయుధం సున్నితంగా లాక్కొన్నాడు. ఆమె నిస్సహాయురాలై చూస్తూ వుండిపోయింది. కాగితాలు కూడా తీసుకున్నాడు.

    "ఊఁ ఇప్పుడు చెప్పు. ఎలా తెలిసింది వీటి సంగతి? ఎవరు పంపగా వచ్చావు?"

    ఆమె సమాధానం చెప్పలేదు. అతడు శాసిస్తున్నట్టు - "నాతో రా" అన్నాడు.

    ఇంక ఎటూ దారిలేనట్టు- ఆమె కదిలింది. ఎటూ వెళ్ళటానికి ఆస్కారం ఆమెకి కలిగించకుండా పిస్తోలు లోపల పడేసి కాగితాల్తో సహా ఆమెని తీసుకుని మేడమీదకు వెళ్ళాడు.

    తీరిగ్గా కుర్చీలో కూర్చుని ఒక్కొక్క కాగితమే చూస్తూ, మధ్య మధ్యలో ఆమెవైపు తిరిగి నవ్వుతూ మొత్తంమీద అన్ని కాగితాలూ పరిశీలించటం పూర్తిచేశాడు. ఆ తరువాత సిగరెట్ లైటర్ తీసి వాటిని వెలిగించాడు. ఒక్కొక్క కాగితమే మంటలో వేస్తూ అవన్నీ పూర్తిగా మసి అయిపోయేదాకా ఆగి, తరువాత లేచి ఆమె దగ్గరికి వచ్చాడు.

                                                                     *    *    *

    విశ్వనాథం ధర్మారావుతో మాట్లాడటం పూర్తిచేసి ఫోన్ పెట్టేసి బూత్ బయటకి వచ్చాడు.

    దూరంగా చక్రధర్ ఇల్లు కనబడుతూంది.

    అతడు అటువైపు వేగంగా నడవసాగాడు. ఎదురుగా ఇద్దరు పోలీసులు సైకిళ్ళమీద వస్తూ కనిపించారు. యస్సైని చూడగానే దిగి సెల్యూట్ చేశారు.

    "ఏ ఏరియా మీది?"

    "ఇదే సార్."

    "నాతో రండి. ఆ ఇంట్లోకి వెళ్ళాలి...." అన్నాడు. తనతోపాటు వాళ్ళుండటం మంచిదనిపించింది. చెపుతున్నది యస్సై కాబట్టి వాళ్ళు సైకిళ్ళు తిప్పి, మరేమీ ప్రశ్నించకుండా అతని అనుసరించారు. వాళ్ళు చక్రధర్ ఇంటి కాంపౌండ్ లోకి ప్రవేశించేసరికి అప్పుడే సంపత్ కారులోంచి పోలీసుల్ని చూసి మొహంలో భావాలు బైటికి కనిపించకుండా "ఎవరు మీరు" అని అడిగాడు.

    విశ్వనాథం సంభాషణ పెంచకుండా "చక్రధర్ తో మాట్లాడాలి" అని అతనికి మరి ప్రశ్నలడిగే ఛాన్సు ఇవ్వకుండా గబగబా మెట్లవైపు నడిచాడు.

    ముగ్గురూ అతనిని అనుసరించారు.

                                          *    *    *

    చక్రధర్ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని "నిన్నెవరు పంపించారు? అది చెప్పందే ఈ రోజు వదిలి పెట్టను. చెప్పు, తొందరగా చెప్తే నీకే మంచిది" అన్నాడు.

    విద్యాధరికి భయంస్థానే నిస్పృహ ఆవరించింది. తను పడిన ఇంత కష్టమూ కళ్ళెదుటే మసి అయిపోయింది. తను కొంచెం జాగ్రత్తగా వుంటే ఈ నష్టం జరిగి వుండేదికాదు. ఇప్పుడు ధర్మారావు అంకుల్ కి తను జవాబు చెప్పుకోవాలి. తమ అనుభవరాహిత్యంతో పోలీస్ డిపార్టుమెంటుకి ఒక విలువైన సాక్ష్యాన్ని పోగొట్టింది.

    "ఎన్నాళ్ళనుంచీ సాగుతోంది నా వెనుక ఈ వలపన్నటం?" అన్న ప్రశ్నకి తలెత్తి అతడిని చూసి ఉలిక్కిపడింది.

    చక్రధర్ మనిషిలా లేడు. అతడి మొహంలో విపరీతమైన మార్పు వచ్చింది. కళ్ళు ఎర్రగా నిప్పులు కక్కుతున్నాయి. ఎలాగైనా తనతో నిజం చెప్పించేలా కనపడుతున్నాడు.

    ఆమెకి భయం వేసింది. ఇలాంటి మనుష్యులు ఆవేశంలో యుక్తాయుక్తాలు మర్చిపోతారు. తర్వాత కలుగబోయే పరిణామాలు ఆలోచించరు. ఆ ఆవేశంలో అతడు తనని ఏం చేసినా చెయ్యవచ్చు. ఆమె ఆలోచనల్లో వుండగానే అతడు అల్మైరాలోంచి చిన్న చాకు తీశాడు. "... చూడు విద్యాధరీ, ఈ ఇంటికి ప్రహరీగోడ చాలా దూరం. అరిచినా ఎవరికీ వినిపించదు. నేనిప్పుడు రేప్ చేసినా అడిగే నాధుడు లేడు. నా మీద నిన్ను ప్రయోగించింది ఎవరు ? మర్యాదగా చెప్పు" ఆమె జవాబు చెప్పటానికి నిరాకరిస్తున్న భావన కలగగానే ఊహించని వేగంతో ఆమె చేతిమీద చాకుతో గీరాడు. ఆమె కెవ్వున అరిచింది. చర్మం నిలువునా ఎర్రటి చారబడింది. అతడు బెదిరిస్తాడనుకొంది కానీ, ఇంత తొందరగా ఇలా రాక్షసంగా మారిపోతాడనుకోలేదు. ఆవిడన్నట్టు అతడు దేనికైనా తెగించిన వాడిలాగానే కనబడ్డాడు. చాకు మళ్లీ ఎత్తాడు. ఆమెకెటూ తప్పించుకోవటానికి దారిలేదు.  

    ఆమె చెప్పేద్దామనుకుంది. అనుదీప్ అన్నట్టు తనకి అనువు కాని రంగంలో అడుగుపెడ్తే అంతే. చెప్పేస్తే ఇక అతడూ, ఆ పోలీసులూ చూసుకుంటారు. పేపర్లు కాల్చేసేడు కాబట్టి పోలీసులకి ఇక తన అవసరం ఎలాగూ వుండదు.

    పోలీసులు గుర్తుకు రాగానే ఆమెకి దూరంగా వీధి చివర నిలబడ్డ విశ్వనాథం గుర్తుకొచ్చాడు.

    తనకి కావల్సినప్పుడు బయటనుంచి సాయం లభిస్తుంది అన్న ఆలోచన రాగానే ఆమెలో అప్పటివరకూ వున్న టెన్షన్ పోయింది. 'ఆగు' అంది. "బయట ఒక పోలీసు ఇన్ స్పెక్టర్ నిలబడి వున్నాడు. ప్రతి పది నిముషాలకీ అతడికి నేను క్షేమంగా వున్నట్టు కనపడాలి. లేకపోతే అతడు లోపలికి వస్తాడు" అంది స్థిరంగా. చక్రధర్ మొహంలో మార్పు వచ్చింది. ఆమె చెపుతున్నది నిజమా కాదా అన్నట్టు అనుమానంగా చూశాడు.

 Previous Page Next Page