"నాకు ఆత్మహత్య చేసుకోవాలన్నంత బాధగా వుంది" కళ్ళనిండా నీళ్ళతో నవ్వుతూ అంది శ్రీజ.
"కానీ ఆ మాట బయటికి చెప్తే అది చాలా మెలో డ్రమటిక్ గా వుంటుంది. పూర్వకాలం వీరపత్నులు భర్తల్ని నవ్వుతూ యుద్ధానికి పంపేవారట. అలా పంపాలని వుంది నాకు. కానీ ఈ కళ్ళున్నవి చూశావూ, ఇవి మనిషికి దేముడిచ్చిన శాపాలు. మనసుని అద్దంలా పట్టించేస్తూ వుంటాయి. ప్రాక్టికాలిటీ- మెటీరియలిజం గోప్పవనీ, అలా బ్రతకడం గొప్పఅనీ అనుకుంటాం గానీ వాటికన్నా సెంటిమెంటుతో బ్రతకతమే గొప్ప నిఖిల్! ఆగు, నన్ను చెప్పనీ, మళ్లీ యింత అవుట్ లెట్ నాకు రాకపోవచ్చు. మనం వివాహ చేసుకుందాం రేపే. ఆలస్యం వద్దు. తరువాత నువ్వు వెళ్ళిరా! మీ కోసం నేను వేచి వుంటాను. నువ్వు తిరిగి వస్తావని ణా మనసు చెపుతోంది. కానీ నీ వొచ్చేసరికి నీ కొడుకుని నీకు చూపిస్తే, ఎత్తుకోవటానికి బదులు షేక్ హాండివ్వవలసిన వయసులో వుంటాడు వాడు. అప్పటికి ముప్పై ఏళ్ళు వస్తాయి వాడికి. నేను చెపుతున్నదంతా నవ్వులాటగా వుందా నిఖిల్ నీకు? నాకు మాత్రం....నాకుమాత్రం...." అంటూ ఆమె భోరున ఏడ్చేసింది.
ఆమెని చేతుల మధుకు తీసుకున్నాడు అతడు. ఉపశమించాల్సిన దుఃఖానికి ఓదార్పు నిశ్శబ్ధమే.
పురుషుడికి దేవుడు చేతుల్నిచ్చింది కేవలం ప్రేమ ప్రదర్శించటానికి కాదు. దానికన్నా ముఖ్యంగా ....ఓదార్చటానికి.
* * *
తన అంగీకారాన్ని తెలుపుతూ అనూహ్య సంతకం పెట్టి ప్రత్రాన్ని డైరెక్టర్ కిచ్చింది.
"కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు ఆయన. "రేపటినుంచీ మీకిక అభినందనలూ- హడావుడి......."
ఆమె ముందుకు వంగి "ట్రెయినింగ్ ఎప్పటినుంచీ" అని అడిగింది.
"ఇంకో నాలుగు రోజుల్లో ప్రారంభం అవుతుంది. రాశ్యా నుంచి ఇంకో పత్రం రావాల్సి వుంటుంది."
"అన్నట్టు అడగటం మర్చిపోయాను. టీంలో ఎవరెవరు వున్నారు?"
"ఒకటి- టీమ్ కమాండర్ యశ్వంత్, ఆస్ట్రోఫిజిసిస్టు. రెండు నిఖిల్ అని....." ఆయన చెప్పుకుపోతున్నాడు.
ఆమె వినటంలేదు. మొదటి పేరుతోనే ఆమె కర్ణేంద్రియాలు పనిచేయటం మానేశాయి!
యశ్వంత్..... యశ్వంత్.......
రాకెట్ లోంచి శూన్యంలోకి దూకితే ఆ ప్రచండ వేగంతో పయనిస్తూనే మనిషి ఎలా తనచుట్టూ తను రొటేట్ అవుతాడో ఆ పేరు వినగానే ఆమె మనసు ఫీలింగ్ కి లోనయింది. శరీరంలో సత్తువనంతా ఎవరో లాగేసినట్టు ముందు టేబిల్ మీదికి చేతులు ఆన్చి బలవంతంగా తనని తాను నిగ్రహించుకోవలసి వచ్చింది. శరీర కంపనాన్ని అయితే ఆపగలిగింది కానీ - మనసు సంచలనాన్ని ఎలా ఆపగలదు.
ఇంటికెలా వచ్చి చేరిందో ఆమెకే తెలియదు. ఐదు నిముషాలు పట్టింది సర్దుకోవటానికి. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు తను యశ్వంత్ కి రాసిన ఉత్తరం సంగతి.....
ఆ ఉత్తరం.....
తన ఫీలింగ్స్..... తను వాయుపుత్రని ప్రేమించిన విషయం....యశ్వంత్ ఆలోచన్లు తనని ఎలా బాధపెడుతున్నాయో వివరించిన వైనం.... తన మానసిక సంఘర్షణ......
ఇప్పుడు జీవితాంతం తామిద్దరూ ఒకే అంతరిక్ష వాహనంలో ఏళ్ళతరబడి ప్రయాణం చేయాలి. అంతలో ఆమెకు అనుమానం వచ్చింది. అది ఉత్తరంమీద అడ్రస్ రాసిందా? అవును నిజమే. ఇప్పుడు అనుమానం బలపడుతోంది.......అడ్రస్ రాసిందా?
రాయకపోయివుంటే బావుణ్ణు అనుకుంది. ఎందుకా కోర్కె?
ఎలాగూ అతనూ, తనూ కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాయుపుత్ర విషయం అతనికి తెలియకపోతే బావుణ్ణు అని భావిస్తుందా తను? ఇంత హీనంగా ఆలోచిస్తుందా? వాయుపుత్ర తమతో రావడంలేదని తెలిసి ఇక యశ్వంతే గతి అనుకుంటోందా?
ఛీ.......ఛీ.... ఆమె తల విదిలించింది......ప్రతి మనిషి మనసులోనూ చీకటి వుంటుందని తెలుసు. కానీ ఇంత దారుణంగా తన మనసు ఆలోచిస్తుందని ఇప్పుడే తెలిసింది. ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచింది. తనకి యశ్వంత్ వద్దు. వాయుపుత్ర వద్దు. సకల మానవాళి కోసం తానో విధి నిర్వహణ కోసం వెళుతోంది అంతే.....
రెండు వందల అడుగులపైనా ఎత్తున్న ఆ నౌకని యశ్వంత్ తలెత్తి చూశాడు. చాలా రికార్డు టైంలో దాన్ని తయారుచేసారు శాస్త్రజ్ఞులు. వేరే ఇంధనం అవసరంలేదు. సౌరశక్తిమీద నడుస్తుంది. శక్తిని తనలో దాచుకుంటుంది. కానీ ఒకే ఒక ప్రమాదం వుంది. ఏదైనా ఒక గ్రహంకానీ, నక్షత్రంకానీ తన ఆకర్షణ శక్తితో ఈ వాహనాన్ని లోబర్చుకుంటే ఆ పీడన శక్తి నుంచి బయటకు రావడానికి వీలైనంత శక్తి ఈ వాహనానికి వుంది కాని, పొరపాటున అంతకన్నా ఎక్కువ గురుత్వాకర్షణ శక్తికి లోనైతే యిక వారి ప్రయాణానికి అదే ఆఖరు.
యశ్వంత్ మిగతా వివరాలు పరిశీలించాడు. ఎంత కుదుపుకి తట్టుకుంటుంది? ఎంత వత్తిడి భరించగలుగుతుంది? రేడియేషన్ కంట్రోల్ వగైరా వివరాలు.....
అంతరిక్షనౌకలో యశ్వంత్ తో పాటు ప్రయాణం చేయబోయే మిగతావారు ఒకరికొకరు పరిచయం చేయబడ్డారు. యశ్వంత్ కళ్ళు అనూహ్యకోసం వెతకసాగాయి. అతడి మనసంతా టెన్షన్ తో నిండి వుంది. ఇన్నేళ్ళ తర్వాత ఆమెను చూడబోతున్నాడనే ఆనందం.......
దూరం అలికిడి వినిపించడంతో తలతిప్పాడు అతను. ఆక్సిలరీ ప్రఫల్లర్ సిస్టం యానిట్ పక్కనుంచి నెమ్మదిగా నడిచి వస్తోంది అనూహ్య.
ఆమె దగ్గిరగా వచ్చింది.
యశ్వంత్ ఆమె వైపే చూస్తున్నాడు.
ఆమె తలెత్తింది.
ఇద్దరి చూపులూ కలుసుకున్నాయ్.
అక్కడున్న డైరెక్టర్ కి ఇద్దరి పూర్వసంబంధం తెలీదు.
"ఈమె అనూహ్య.... బయోకెమిస్ట్రీలో......." అంటూ పరిచయం చేయబోయాడు.
"నాకు తెలుసు" క్లుప్తంగా అన్నాడు యశ్వంత్. ఇంతలో ఎవరో పిలిస్తే డైరెక్టర్ అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.
"బాగున్నావా అనూహ్యా...."ఆప్యాయంగా అడిగాడు.
అనూహ్యా నవ్వటానికి ప్రయత్నించింది. తను వ్రాసిన ఉత్తరం యశ్వంత్ కి అందలేదని అర్థమైంది. ఈ వాస్తవం రిలీఫ్ గా వుందా? రిలీఫ్ గా వుందన్న భావం బాధపెడుతూంది.
"విధే మనని తిరిగి కలపదల్చుకున్నట్లుంది. ఈ ప్రయాణం నీకు సంతోషాన్నివ్వటం లేదూ?" అన్నాడు.
ఆమె తలూపింది - సంతోషమే అన్నట్టు.
అతడు దగ్గిరగా వచ్చాడు. ఆమె తలూపటం అతనిలో ఉత్సాహాన్ని పెంచింది.
"ఈ ప్రయాణమా? 'నాతో' కలిసి ప్రయాణమా?" అల్లరిగా అతడి పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి. ఎప్పుడోగానీ అతడు అలా నవ్వడు. ఎప్పుడూ సీరియస్ గా వుండే అతడు అలా అరుదుగా నవ్వినప్పుడు మనోహరంగా వుంటుంది.
ఆమెకెందుకో ఆ సమయంలో వాయుపుత్ర గుర్తొచ్చాడు.
11
వాయుపుత్ర చాలాసేపటివరకూ ఆ వార్తని జీర్ణించుకోలేక పోయాడు. అనూహ్యతో జీవితాంతం కలిసి వుండే అదృష్టం కేవలం ఒక స్థానంలో తప్పిపోయింది.
వాయుపుత్ర నెంబరు రెండోది. అంతరిక్షయాన ప్రయాణీకుల లిస్టు ఎన్నెస్సారై తయారు చేసింది. నికోలవస్కీ తరువాత పేరు వాయుపుత్రది.
ఆఖరి నిముషంలో-మొదటి వరుస ప్రయాణీకులలో ఎవరికైనా ఏదైనా ఆటంకం వస్తే - వెంటనే రెండో నెంబరువాళ్ళని పంపటంకోసం వారిక్కూడా ట్రెయినింగ్ ఇవ్వబడుతుంది. ఆ విధంగా వాయుపుత్రకి కూడా ట్రెయినింగ్ కి రమ్మని ఆహ్వానం వచ్చింది. కానీ రెండో స్థానంలో రిజర్వ్ డ్ గా.
అతడు ఆశలు వదిలేసుకున్నాడు. అనూహ్య ఇక కనపడదు. గ్రహంతరాలకు వెళ్ళి మనుష్యజాతికోసం ఒక విశేషమైన పనిచేసే బాధ్యత స్వీకరించమని ఆమెని ప్రోత్సాహించాడే గానీ, మనసులో మాత్రం చాలా వ్యధ ననుభవిస్తున్నాడు. కానీ- మానవ ప్రయత్నంగా నికోలవస్కీ బలహీనతలు ఏమిటా అని అతడు రెండురోజులు పరిశీలించాడు.
కంప్యూటర్ టెక్నాలజీలో నిష్ణాతుడైన ఆ రష్యన్ కి జ్యోతిష్యం అంటే ఎడతెగని నమ్మకం వుందని తెలిసింది. ఆ మాత్రం చాలు వాయుపుత్రకి.
* * *
అనూహ్యకి ఇంట్లో సభ్యుల్ని కన్విన్స్ చేయటం చాలా కష్టమైంది. అన్నా వదినలు, పాప.....ఈ వార్తపట్ల చాలా దిగులుచెందారు. కానీ క్రమంగా సర్దుకున్నారు.
వార్తాపత్రికలు ఈ వార్తని ప్రముఖంగా ప్రచురించాయి. ఫోటోలు.....ఇంటర్వ్యూలు......హడావుడీ....
గాలక్సీ అంతర్భాగంలోకి వెళ్తూన్న ఈ టీమ్ తిరిగివచ్చే ఛాన్స్ లు దాదాపు శూన్యం అని అందరికీ తెలుసు. ఆ భావాన్ని మనసులోనే దాచుకుని అందరూ బెస్టా ఫ్ లక్ చెపుతున్నారు. వచ్చే తరాలకోసం సూర్యుణ్ణి కాపాడే ప్రయత్నంలో ఆత్మార్పణం చేయబోతున్న ఈ టీమ్ లో ప్రతి ఒక్కరికీ ప్రపంచం మొత్తం చేతులెత్తి అభినందించింది. నాల్గయిదు రోజులపాటు సన్మానాలూ-అభినందన సభలూ......
ఆ తరువాత ఈ సభ్యులందరూ ట్రెయినింగ్ కి పంపబడ్డారు.
ఆరు వారాలపాటూ రకరకాల పరీక్షలూ......శారిరక, మానసిక వత్తిడులు.....
గాలక్సీలో- అంతరిక్షంలో -శూన్యంలో ఎన్ని రకాల ప్రమాదాలు ఎదుర్కొనవలసి వస్తుందో - అన్ని రకాల్ని ఊహించి- ఇక్కడ వీరికి ఆ రకంగా శిక్షణ యివ్వబడుతూంది.
ప్రయాణానికి ఇంకో రెండు వారాలుంది.
"రేపట్నుంచీ మీ టీ మ్ లో కొత్త మెంబరు రాబోతున్నాడు" అన్నాడు డైరెక్టర్ యశ్వంత్ తో.
"ఎవరు?"
"వాయుపుత్ర"
యశ్వంత్ విస్మయంతో "అదేమిటి?" అన్నాడు.
"నిక్కోలవస్కీకి ఆరోగ్యం బాగోలేదు. ఆఖరి నిముషంలో విరమించుకున్నాడు" అని నవ్వాడు." .....కానీ అసలు కారణం అదికాదు. అతడికి జ్యోతిష్యం మీద నమ్మకం ఎక్కువ. ఈ రకంగా ప్రయాణం చేస్తే ఇంకో రెండు నెలల్లో చనిపోతావని ఎవరో చెప్పార్ట."
యశ్వంత్ కి ఈ వార్తా సంతోషాన్నే కలుగజేసింది. వాయుపుత్ర చాలా తెలివైనవాడని, ఉత్సాహవంతమైన యువకుడు అని అతడికి తెలుసు. అటువంటివాడు తమ టీ మ్ లో వుండటం తనకెంతో మానసిక స్థయిరాన్ని ఇస్తుంది.
అతడికి తెలియనిదల్లా ఒకటే.
తన 'మాజీ' భార్యకు అతడు ప్రియుడని!
ఆఖరి నిముషంలో జరిగిన ఈ మార్పు షాక్ లా తగిలింది అనూహ్యకి.
ఆమె అప్పుడప్పుడే కొద్దికొద్దిగా సర్దుకుంటూంది. అలా అని యశ్వంత్ తో భవిష్యత్ జీవితాన్ని పంచుకోవాలని కూడా ఆమె అనుకోలేదు. కాలం-విధి-ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుందన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడామె హృదయంలో ప్రేమకన్నా కర్తవ్య నిర్వహణాభావం ఎక్కువ చోటు చేసుకుంది. అటువంటి సమయంలో, యశ్వంత్ తో పాటు వాయుపుత్ర కూడా వాహనంలో వస్తున్నాడన్న వార్త తెలిసింది.
తన ఫీలింగ్స్ ని కూడా ఎవరికీ చెప్పుకోలేని స్థితి ఆమెది.
యశ్వంత్ సామీప్యంలో తను వాయుపుత్రతో కనీసం మాట్లాడను కూడా లేదు. కానీ అతను ఊరుకోడు. తన ప్రేమనీ సామీప్యాన్ని ప్రదర్శించే విధానంలో ఎవరు దగ్గిరున్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోడు. అది యశ్వంత్ కి తెలుస్తే.....
తెలుస్తే....
ఏం తప్పేం వుంది?
కాదు, అదికాదు. తన సందిగ్ధం. యశ్వంత్ లాటి వ్యక్తి మనసు తన ప్రవర్తన వల్లగానీ, తన స్వార్థంకోసం గానీ బాధ పడటం తను సహించలేడు. అతడు తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసు.
వివాహ జీవితం గడిపినన్నాళ్ళూ మూర్ఖత్వంవల్ల అతడిని బాధపెట్టింది. విడిపోయాం అనుకున్నారు ఇప్పుడు తన ఉనికితో తడిని జీవితాంతం బాధపెట్టే హక్కు తనకి లేదు.
ప్రయాణం ప్రారంభమయ్యేవరకూ ఆమె ఆ విషయమే ఆలోచిస్తూంది.
అదృష్టవశాత్తు యశ్వంత్ గానీ, వాయుపుత్ర గానీ ఆమెతో ఎక్కువ మాట్లాడే ప్రయత్నం ఆ శిక్షణాకాలంలో చేయలేదు. ప్రపంచపు అతి సుదీర్ఘయాత్ర నిర్వహించే కార్యక్రమంలో తలముకలయ్యేటంతగా వారు నిమగ్నమై వున్నారు.
* * *
నిఖిల్ శ్రీజ వివాహం సంచలనం రేకిట్టించింది.
ఇంకో రెండు రోజుల్లో ప్రయాణం వుండగా జరిగిన ఈ వివాహం ప్రతివారికీ చర్చనీయాంశం అయింది. శ్రీజ వ్యక్తిత్వానికి అందరూ జోహార్లర్పించారు. ప్రేమంటే అలా వుండాలన్నారు.
ఈ వివాహంపట్ల ఎవరైనా అసంతృప్తిగా వుంటే అది నిఖిల్ ఒక్కడే. తనకోసం భవిష్యత్తుని ఆమె నాశనం చేసుకుంటూందని అతడు భావించాడు. అతడు ఇక తన జీవితంలో ఏనాడూ తన కొడుకునిగానీ కూతుర్నిగానీ చూసుకునే అవకాశం దాదాపు లేదన్న భావం అతడి మనసు కలచివేస్తూంది. కానీ అతను ఎక్కడా బయటపడలేదు. తన పన్లన్నీ నిర్వర్తిస్తూనే వున్నాడు.
పది గంటల పన్నెండు నిముషాలకి వాహనం బయల్దేరిరేట్టూ ముహూర్తం నిర్ణయించబడింది. ప్రపంచపు నలుమూలల్నుంచీ ఫోటోగ్రాఫర్లు, విలేఖర్లూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా టీ.వీ కవరేజి ఏర్పాటు చేయబడింది. రాకెట్ లా- విస్ఫోటనంవల్ల కాకుండా, సౌరశక్తివల్ల నడిచే వాహనం కాబట్టి, రిమోట్ కంట్రోల్ సిస్టమ్స్ లేవు. సోలార్ ఎనర్జీని అందుకునే అద్దాల్లాంటి పరికరాల్లో ఎగరటానికి సిద్ధంగా వున్న తూనీగలా వుంది- "సుహృద్భావ్-"
ప్రోద్దున్నించే జనం అక్కడికి వందల సంఖ్యలో చేరుకున్నారు. వివిధ దేశాల రాయబారులు, ప్రముఖులు, శాస్త్రజ్ఞులు- అభినందనలు- ప్రార్థనలు- కన్నీటి వీడ్కోళ్ళు-
శ్రీజ ఒక్కతే అక్కడ ఒంటరిగా వుంది. నాలుగు నెలలు నిండి అయిదో నెల ప్రవేశింస్తూ వుంది. ఆమె తల్లిదండ్రులు వున్నారుగానీ, ఆమెని మాట్లాడించే ప్రయత్నం ఏమీ చేయలేదు. కూతురు చర్య వారికి స్టుపిడిటీగా కనిపించింది.
పదిగంటలు కావస్తూంది. అందరికన్నా ముందు యశ్వంత్ వాహనంలో ప్రవేశించాడు. తరువాత వాయుపుత్ర, తరువాత అనూహ్య.
నిఖిల్ శ్రీజ దగ్గిరగా వచ్చాడు. కళ్ళనిండా నీళ్ళతో ఆమె అతడివైపు చూసింది. అతడామెని దగ్గరికి తీసుకుని నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు.
"వెళ్ళొస్తాను"
ఆమె అస్పష్టంగా తలూపింది.
అతడిచూపు ఆమె కడుపుమీద క్షణకాలం నిలిచింది. "అదృష్టం బావుండి-కార్యం సాధించుకుని తిరిగివస్తే- అప్పటికి నువ్వు పాతికేళ్ళు కూతురితోనో, కొడుకుతోనో స్వాగతం చెపుతావుకదూ" నవ్వటానికి ప్రయత్నం చేశాడు.
ఇంటర్ పెర్సనల్ కాలర్ శబ్దం చేసింది.
"వెళ్ళొస్తాను"
ఆమె తలూపింది.
అతడు వాహనంవైపు నడిచాడు.
జయజయధ్వానాలతో యుద్ధానికి పంపే సైనికుడికి హారతి నిచ్చినట్టు వేలాది జనం.
అతడు చివరగా వాహనంలోకి ప్రవేశించాడు.
స్పేస్ స్పూట్స్ లేవు.
ఆ వాహనం భూమి వాతావరణం దాటటానికే ఐదురోజులు పడుతుంది. కానీ కాంతివేగం అందుకోవటానికి ఆ తరువాత పదిహేనురోజులు అద్భుతమైన ఆక్సిలరేషన్.
శ్రీజ చూస్తూ వుంది.
వాహనం పైకి లేచింది.
పది అడుగుల పొడవు- పది అడుగుల వెడల్పు వున్న టీ.వీ స్ర్కీన్ మీద లోపలి వ్యక్తులు కనబడుతున్నారు. రాకెట్ లో లాగా హడావుడి ఏమీలేదు. జరగబోయే ప్రమాదాలన్నీ భవిష్యత్తులో ఏమైనా వుండొచ్చేమో కానీ బయల్దేరేటప్పుడు ఏమీ వుండవు. అంత నెమ్మదిగా కదిలింది వాహనం.
వాహనం మబ్బుల వెనక్కు వెళ్ళిపోయింది.
ఆమె అలా చూస్తూనే వుంది.
లక్షల కోట్ల మైళ్ళ దూరంలో వున్న గ్రహాంతర జీవులకు భూమ్మిద ప్రాణుల్ని రక్షించమంటూ సందేశం తీసుకువెళ్తూన్న టీమ్.....
.......ప్రయాణం ప్రారంభమైంది.
(మొదటి భాగం సమాప్తం)