Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 2

    స్వప్నదీ అతడిదీ నెలరోజుల పరిచయం మాత్రమే, అదీ చూపుల పరిచయం!

    అవివాహిత అయిన పాతికేళ్ల అందమైన యువతి స్వప్న. హైస్కూల్ టీచరు. రోజూ బడికి వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు అతడు స్కూటర్ మీద కనిపిస్తాడు. ఎక్కడ   వుంటాడో ఏం జాబ్ చేస్తుంటాడో స్వప్నకు తెలియదు. తరచు తెల్లటి డ్రెస్ వేస్తాడు. ఒక విధమైన ప్రత్యేకతతో కనిపిస్తాడు.

    చాలామంది, ముఖ్యంగా స్వప్నలాంటి ఆడపిల్లలు అతడిని చూస్తే అతడు స్వప్నని మాత్రమే చూస్తాడు.
 
    మొన్న అతడు స్వప్నని చూసి నవ్వాడు పలుకరింపుగా.

    తనూ నవ్వింది స్వప్న, జవాబుగా.

    ఆ నవ్వు దేవిబాగ్ కు ఆహ్వానించేంత చనువు ఇచ్చిందా?

    ఛ ఛ! తను చాలా తప్పు  చేసింది. రేపటినుండి అతడి కేసి చూడకూడదు. తను చూపుల కథ ఇక్కడితే ఆపేయాలి.

    ఇల్లు చేరింది స్వప్న.

    ముఖం కడుక్కుని తల్లి ఇచ్చిన టీ తాగి తన గదిలో కుర్చీలో కూర్చొంది. టేబిల్ మీద గడియారంలో ముళ్ళు కదులుతున్నాయి, కాలాన్ని మింగేస్తూ. స్వప్న చూపులు గడియారంమీదే వున్నాయి!

    అయిదూ ముప్పైనిమిషాలు!

     అతడు తన కోసం దేవీబాగ్ లో ఎదురు చూస్తుంటాడా?

    ఆ ఊహ స్వప్న మనసును తీయటి అనుభూతితో వణికించింది.

    ఉహుఁ . అతడెవరో? ఎక్కడివాడో?

    అతడితో తన కథ సాగకూడదనిది! ఈ కథకి... ఇంకా రూపమంటూ ఏర్పడని ఈ కథఖి ఫుల్ స్టాప్ పెట్టెయ్యాలి! రేపు అతడు కనిపించినప్పుడు "రాలేదేం" అని తనని నిలదీసి అడుగుతాడేమో? ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చివేషాలు వేయొద్దని ఖచ్చితంగా చెప్పెయ్యాలి!

    ఆలోచనల మధ్య స్వప్న గుండెలో సన్నని వేదన ముళ్లు తిరగసాగింది.

    తొలి చూపులోనే తన గుండెలో ముద్రపడిన అతడి రూపాన్ని చెరిపివేసుకోగలదా? ఆ చెరపడంలో తన గుండెలో ఎంత లోతైన గాయం ఏర్పడుతూంది! తన ఊహలలోకి,  కలలలోకి కమ్మని పరిమళంలా చొచ్చుకువచ్చే అతని తలపును అటకాయించగలదా?

    అటకాయించాలి!

    లేకపోతే ఉపద్రవం జరిగిపోతుంది. తను చాలా సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది!

    మరునాడు ఉదయం బడికి వెడుతూ తలవంచుకొని నడవసాగింది స్వప్న.

    బడి ఇంకొక పదిగజాల దూరంలో వుంది.

    నెల రోజులుగా పరిచితనమైన  స్కూటర్ శబ్దం వినిపించి స్వప్న గుండె దడదడ లాడించింది. కాని తలెత్తలేదు. ఇంకా వడివడిగా నడవసాగింది.

    స్కూటర్ స్వప్న కి డాష్ ఇచ్చేంత దగ్గరగా వచ్చి ఆగింది.

    "ఏయ్ మొద్దూ!" ప్రేమ వుట్టిపడే గొంతుతో పిలిచాడతడు.అతడి గొంతులో ప్రవహిస్తున్న చనువు ఈ రోజే పలకరిస్తున్నట్టుగా లేదు. ఎన్నో రోజుల పరిచయమున్నట్టుగా... ఉహుఁ! ఎన్నో జన్మలపరిచయమున్నట్టుగా.....

    అతిసమీపంగా వున్న అతడి ముఖంలోకి చూడకుండా వుండలేకపోయింది స్వప్న.

    దూరానికి అందంగా కనిపించే ముఖాలెన్నో దగ్గరైతే వున్న వికృతాలు బయటపడుతుంటాయి చాలామంది విషయంలో. ఇతడిని దగ్గరినుండి చూస్తే దూరానికి కనిపించని అందాలు కనిపిస్తున్నాయి!

 Previous Page Next Page