Previous Page Next Page 
తపస్వి పేజి 19


    "ఇప్పుడెందుకీ కలత? అతనికి ఉద్యోగం పోయినందుకా?"
    "కాదు! అతనంటే నాకు చాలా ఈర్ష్య... అతని రీసెర్చ్ వర్క్ సాగక...ఉద్యోగం పోయి డాక్టర్ గా ఏ పేరూ లేక...అలా కృంగిపోవటమే నాకు కావలసింది..."
    కళ్ళు మూసుకుని మాట్లాడేస్తున్నాడు వామనమూర్తి. ఊపిరిబిగపట్టింది సుధ..
    "కానీ, అతడంటే నాకు గౌరవం....ఆరాధన...." సుధ తేలిగ్గా ఊపిరి వదిలి నవ్వుకుంది.
    "మీ కోరిక నెరవేరింది. అతని ఉద్యోగం ఊడింది. మీకు ఆనందం కలగాలి కదా?"
    "వాడు డర్టీ రోగ్! అంత జరిగినా ఠీవిగా చిరునవ్వుతో తల ఎత్తుకుని వెళ్ళాడు. అతన్ని చూసి మేం జాలిపడేలాకాక, మమ్మల్ని చూసి జాలిపడుతున్నట్లు నవ్వుతూ వెళ్ళాడు. వాడిని మేము పరాభవించినట్లుగా లేదు. వాడే మమ్మల్ని పరాభవించినట్లుగా ఉంది. అది కూడా కాదు. మమ్మల్ని మేమే పరాభవించుకొంటుంటే అతను సానుభూతితో నవ్వుతున్నట్లయ్యింది."
    వామనమూర్తి ముఖంలో వ్యథ చూడలేకపోయింది సుధ..దగ్గరగా వచ్చి అతని తల నిమిరింది..
    ఆ చేతిని తన చేతులతో పట్టుకున్నాడు వామనమూర్తి.
    "ఆనందంగా ఉన్నావా అని అడిగావు కదూ! అవును. చాలా ఆనందంగా ఉన్నాను. ఇలా నీ దగ్గర ఉన్నప్పుడు ...ఎందుకో తెలుసా? ఇప్పుడే నా మనసు నిజంగా బాధపడుతుంది...."
    సుధ చేతిని వదిలేసి వెళ్ళిపోయాడు వామనమూర్తి.
    తమ అనుబంధానికి ఫలితం ఏమిటని సుధ ఎప్పుడూ ఆలోచించలేదు. ఫలితాల గురించి ఆలోచించటం ఏనాడో మానుకుంది...
    ఒకప్పుడు పదవ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాక కాలేజీలో చేరి చదవాలని సుధ చాలా ఆరతపడింది. కాని మిసెస్ కామేశ్వరీ దేవి పడనియ్యలేదు.
    "ఇంతవరకూ చదివించాను. ఇంకానా? నువ్వు అనాథవని మరిచిపోకు!"
    సుధ మరిచిపోలేదు. సుధ మాత్రమే కాదు. ఆ ఆశ్రమంలోని ఎవరూ మరిచిపోరు. మరిచిపోకుండా మిసెస్ కామేశ్వరీ దేవి జాగ్రత్తపడుతుంది.
    "మీరు ప్రయత్నిస్తే నాకు స్కాలర్ షిప్ దొరుకుతుంది" బెదురుతోనే అంది సుధ.
    "చాల్లే! నీ ముఖానికి స్కాలర్ షిప్ ఎవరిస్తారు? బి.ఏ.,యం.ఏ.లు పాసయినా ఉద్యోగం చెయ్యవలసిందేగా! ఈ అనాథ శరణాలయంలోనే పని చెయ్యి! ఈ పిల్లలకు కావలసినవి చూస్తుండు. ఇదంతా నా ఒక్కదాని వల్లా కావటం లేదు. ఇంతకంటే మంచి ఉద్యోగం దొరుకుతుందా?"
    సుధ కళ్ళలో చివ్వున చిమ్మిన నీళ్ళు సంతృప్తిగా చూసుకుంది కామేశ్వరీ దేవి.
    మిసెస్ కామేశ్వరీ దేవి అనాధ శరణాలయంలో మొగపిల్లలు చాలా మంది వృద్ధిలోకి వచ్చారు. కానీ ఆడపిల్లలెవరూ పై చదువులలోకి రాలేదు. మిసెస్ కామేశ్వరీ దేవి రానియ్యలేదు. ఆడపిల్లలలో చాలా మందికి పెళ్ళిళ్ళు చేసి కీర్తి సంపాదించింది. కానీ, అవేవీ అనుకూలమైన సంబంధాలు కావనీ, ఆ పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ఆ పిల్లలు ఏడ్చారనీ, ఒకవేళ అనుకూలమైన సంబంధం వచ్చినా ఆవిడ చెడగొడు తుందనీ.....కొందరు చెప్పుకుంటారు. మొత్తం మీద అనాథ బాలికలకు పెళ్ళిళ్ళు చేయించిన ఖ్యాతి మాత్రం ఆవిడకు బాగా దక్కింది. ప్రతి పెళ్ళి ఆవిడ చాలా ఆడంబరంగా చేయిస్తుంది. ప్రముఖులను ఆహ్వానిస్తుంది. ఎంతో ఖర్చు పెడుతుంది.
    ప్రత్యేకించి సుధపైన ఆవిడకు అభిమానముంటుంది. సుధను వదలలే నంటుంది! అందరూ అలాగే అనుకుంటారు. వదిలీ వదలని పసితనంలో సుధ ఆశ్చర్యంగా అభిమానమంటే ఇలా ఉంటుందా? అయితే అందరూ ఆ 'అభిమానం' కావాలని కోరుకుంటారెందుకు? అని ఆశ్చర్యపోయేది. రాను రాను ఆ 'అభిమానం' అర్ధమయ్యాక ఆవిడను తప్పించుకుని పారిపోవాలని ఆరాటపడేది. ఎలాగైనా చదువుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలని తపించిపోయేది. కానీ, మిసెస్ కామేశ్వరీ దేవి తన విముక్తికి గల మార్గాలన్నీ నిర్దాక్షిణ్యంగా మూసేసిననాడు కుమిలి కుమిలి ఏడ్చింది.
    ఆ సమయంలో ఒకే ఒక ఆశాకిరణం సౌందర్య తోచింది. సౌందర్యను కలుసుకుంది.
    "సౌందర్యా! నాకు ఎలాగైనా కాలేజీలో చదవాలని ఉంది. మిసెస్ కామేశ్వరీ దేవి ఒప్పుకోవటం లేదు."
    "డబ్బు కావాలా?"
    సౌందర్య అలా తేలిగ్గా అడగటం సుధకెలానో అనిపించింది. లోలోపల ఏదో ముడుచుకుపోతున్నట్లు అనిపించింది.
    "నాకు చదువుకోవాలని ఉంది.."
    "చదువుకోవటానికి కాలేజీలో చేరక్కర్లేదు."
    "నువ్వు చదవటం లేదా?"
    "నీకు తెలియదా? నేను కాలేజి మానేశాను...."
    "నిజంగా! ఎందుకు?"
    "ఆ రూళ్ళ కర్ర నియమాలలో ఒదగలేక! నాకు కావలసింది ఒకటి నేర్చుకోవటానికి అక్కర్లేనివి లక్ష చదవాలి. ఎందుకు చదవాలి? ఆలోచిస్తున్న కొద్ది నాకు మతిపోతోంది. ఫిజిక్స్ లో న్యూటన్ మూడవ సూత్రంలో ప్రతి చర్యకూ సమానము, వ్యతిరేకము అయిన ప్రతి చర్య ఉంటుందన్నాడు. దీనినే వేదాంతులు కర్మ సిద్దాంతంగా చెపుతున్నారు. 'శక్తి సృష్టించబడదు. నాశనం కాదు. ఏ రూపంలోనయినా ఒకే విధంగా ఉంటుంది' అంటుంది సైన్స్-ఋషులు తపస్సు చేసి కనుక్కున్న సూత్రమిదే!" శబ్దం ఎల్లప్పుడూ విశ్వంలో ప్రవహిస్తూనే ఉంటుంది" అని కనుక్కొన్నారు శాస్త్రవేత్తలు. జ్ఞానులు శబ్దాన్ని కూడా బ్రహ్మమన్నారు. అక్షరాలన్నారు. ఎంతో సాధన చేసి సంకల్ప బలానికున్న శక్తి మరొకదానికి లేదన్నారు మునులు. డాక్టర్లేమంటున్నారు?" విల్ పవర్" ప్రధానమంటున్నారు. డాక్టర్లో విశ్వాసం లేకపోతే మందు పనిచెయ్యదంటున్నారు. ఎందరు చెప్పినా, ఏ విధంగా చెప్పినా ఒకటే! మనసు ప్రధానమని! కానీ మన మనసును మనమెంత గుర్తిస్తున్నాం? మన మనసుకు నచ్చినట్లు మనమెంత వరకు ప్రయత్నిస్తున్నాం? రచయిత తన మనసుకు తోచినట్లు వ్రాయడు. ఎలా వ్రాస్తే పాఠకులు, సంపాదకులు లేక నిర్మాతలు మెచ్చుకుంటారో... అలా వ్రాయాలని ప్రయత్నిస్తాడు. అందరూ అంతే! ఎలా అయితే నలుగురిలో ఒకడవుతాడో అలాగే ప్రవర్తిస్తాడు. తానేమిటని ఎన్నడూ ఆలోచించడు...నేను...నాకు నచ్చినట్లు..నాకు తోచినట్లు బ్రతకాలనుకుంటున్నాను. అందుకనే అందరికీ విడ్డూరంగా కనిపిస్తాను..."

 Previous Page Next Page