ఇక ఫోన్ రింగయినా తియ్యకూడదనుకుంది.
ఆ కంఠస్వరం ఎవరిదో కాదు. ఆ కృష్ణమౌళిదయివుంటుంది.
ఇన్ని రోజులకి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు.
ఎంత ధైర్యం. వీడి సంగతి... పళ్ళు పటపట లాడించింది.
మళ్ళీ ఫోన్ రింగయింది. వెళ్ళి ముట్టుకోవాలనిపించలేదు.
అతన్ని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ఎదురుగా కనిపిస్తే ఈ చెంపా ఆ చెంపా వాయించాలన్నంత కోపం వస్తుంది ఆమెకు.
మేడమీదనుండి అంబిక చూస్తుంది.
"ఎవరు ఫోన్ చేశారు!" అడిగింది.
వదినలా అడగ్గానే కొద్దిగా కంగారుపడినట్టయింది.
"ఆ ఎవరో" అంది తడబడుతూ.
"రిసీవర్ తియ్యి" అంది అంబిక.
ఇంద్రసేన మాట్లాడలేదు. బొమ్మలా నిలబడిపోయింది అలా చూస్తూ.
అంబిక క్షణంసేపలా చూసి గబగబ మెట్లు దిగివచ్చింది.
ఫోన్ దగ్గరకు వెళ్ళబోతుంటే ఆమెను టక్కున ఆపేసింది ఇంద్రసేన "వద్దు వదినా తియ్య"కంటూ. అంబిక కనుబొమ్మలు ప్రశ్నార్ధకంగా ముడిపడ్డాయి. సమాధానం చెప్పలేనట్టు ఇంద్రసేన చూపులు నేలకంటుకు పోయాయి.
"ఎవరు చేశారు! ఇందాక నువ్వు మాట్లాడావుకదా!" అడిగింది.
"మాట్లాడేను" అంది.
"ఎవరు?"
ఆమె సమాధానం చెప్పేలేదు.
ఫోనలా పంతం పట్టినట్టు రింగవుతూనే ఉంది. ఫోన్ రింగవుతున్న శబ్దం ఇంకా ఇంకా గట్టిగా వినిపిస్తు నరాలు తెగిపోయి తలబద్ధలైపోతున్నట్టుగా అనిపించసాగింది ఇంద్రసేన మనసుకి.
ఆమె మనసులో కంగారు వదినకు తెలిస్తే ఏమనుకుంటుందోనన్న భయం.
అతనలా ఫోన్ చెయ్యటం ఇంటి పరువు పోయినట్టుగా అనిపించసాగింది.
అంబిక రిసీవర్ పట్టుకోబోయింది మళ్ళీ.
చప్పున ఆమె చెయ్యిపట్టి ఆపేసింది.
"వద్దు వదినా తియ్యకు నన్ను అల్లరి పెట్టడానికి చేస్తున్నాడు" అంది ముఖం అదోలా పెట్టుకుంటూ.
"ఎవరు!" అడిగింది.
"పేరు అనవసర"మంది.
"ఇప్పుడు మనం పోనీ అని ఊరుకుంటే ఇంకా రెచ్చిపోతాడు. ఇటువంటి వాళ్ళకి తగినట్టు చెయ్యా"లంది మొండిగా అంబిక.
"వదినా!" అంది కంగారుగా.
"నువ్వు తపపుకో ఎవరు అనుకుంటున్నాడు వాడిపని చెబుతాను" అంటూ ఆడపడుచుని పక్కకు నెట్టేసి రిసీవర్ అందుకుంది.
"హల్లో డార్లింగ్ నువ్వేనా!" అంటూ ఈలవేశాడు ఫోన్ లో అతడు.
ఛ ఛ అన్నట్టు ముఖం పెట్టింది అంబిక.
అతను అన్న మాటలు అంబికకే కాక పక్కనే ఉన్న ఇంద్రసేనకు కూడా వినిపించాయి.
వదిన రిసీవర్ ఎత్తింది అనికూడా గ్రహింపకుండా అలా అనేశాడని అతనిమీద కోపం. వదిన ముఖం చూడాలంటే సిగ్గు కలిగింది ఆమెకు.
"షటప్! ఏమిటా వాగుడు!" కసిరింది అంబిక.
"మీరు ఎవరు!" అతను తడబడినట్టయ్యాడు. కంఠస్వరం గుర్తుపట్టి ఇంద్రసేన కాదని గ్రహించి.
"నేను వాళ్ళ వదినగారు అంబికను" అంది హుందాగా.
"ఓహోహో! తమరా! నమస్కారమండీ" అన్నాడు కృష్ణమౌళి వెటకారంగా.
అతని కంఠస్వరం గుర్తుపట్టిన దానిలా ఒక్క క్షణం అలా వుండిపోయింది ఓరగా ఆడపడుచువైపు చూసింది.
ఇంద్రసేన భయంగా చూస్తుంది ఆమెవైపు.
గుండెల్లోనుండి పొంగివస్తున్న నవ్వు పెదవులమీద రానివ్వకుండా జాగ్రత్తపడుతూ,
"మీరా!" అంది భయం నటిస్తూ.
"నేనెవరో తెలుసుకొన్నారన్నమాట తమరు."
అంబిక మాట్లాడలేదు. మనసులో కోపం లేకపోయినా పైకి కోపము నటించసాగింది.
క్రింద పెదవి పై పంటితో గట్టిగా నొక్కిపట్టింది. తీక్షణంగా చూస్తుంది ఫోనువేపు.
"నా యింట్లోంచి పారిపోయి ఆ జయరామ్ గాడ్ని పెళ్ళి చేసుకున్నావు నాకంటే అందగాడా! నాకంటే చదువుకున్నవాడా! గుణవంతుడా! నాకంటే డబ్బున్నవాడా? ఏంచూసి కోరి పెళ్ళాడి వెళ్ళిపోయావు" అన్నాడు కోపంగా.
అంబిక ఇంద్రసేనవైపు చూసింది.
ఆమె పక్కనవుండి ఫోన్ లో మాటలు నెమ్మదిగా వినిపించినా అక్షరం పొల్లుపోకుండా వినసాగింది.
అంబికన చూడగానే ఇంద్రసేనకూడా ఆమెవేపు భయంగా చూసింది.
ఏం ఫర్వాలేదు ధైర్యంగావుండు అన్నట్టు చేతితో సైగచేసింది.
"నేను తల్చుకున్నానంటే నిన్ను నీ భర్తని వెతికి వేటాడి మరీ తీసుకొనేవాడ్ని, కాని వదిలేశాను ఎందుకో తెలుసా?" అడిగాడు.
అంబిక మాట్లాడలేదు. ప్రతీమాట శ్రద్ధగా ఆలకిస్తుంది.
"ఎత్తుకు పై యెత్తు వేశాను. నీ భర్తగారి ముద్దుల చెల్లెలు ఇంద్రసేనని బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయి అయినా పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను" అన్నాడు దృఢనిశ్చయంతో.
అనుక్షణం తనని తాను హెచ్చరించుకొంటూ వస్తున్న మూలాన వస్తున్న నవ్వు ఆపేసుకోగలుగుతుంది. లేకుంటే ఫక్కున నవ్వేసి వుండేది.
పక్కన ఇంద్రసేన ఉందని చాలా జాగ్రత్తపడుతుంది. బాగా నటించగలుగుతుంది కూడా.
"ఆపండి" అంటూ అరిచింది ఫోనులో అంబిక, ఆమెకు ఒళ్ళు తెలియని కోపంవచ్చింది.