"మాధవీ! రాజా కేమైనా అవుతుందంటావా?" హాస్పటల్ ప్రాంగణంలో ఆమె అశాంతిగా అటూ ఇటూ తిరుగుతూండగా కల్యాణి అడిగింది భయంభయంగా.
"తెలియదు" మాధవి గంభీరంగా జవాబిచ్చింది.
"సీరియస్ గానే వుంది కదూ?"
తల ఊపింది
"మాధవీ! నీకు భయం వెయ్యటంలేదూ?"
మాధవి నవ్వింది. విచిత్రంగా నవ్వింది. చాలా విచిత్రంగా నవ్వింది. అటువంటి నవ్వు ఆమె పెదవులమీద కల్యాణి ఎప్పుడూ చూడలేదు. మాధవి అంతరంగంలో జరుగుతోన్న సంఘర్షణ ఆమె లేత ఊహకి అందదు. కల్యాణికి ఏడుపొచ్చింది.
అతనికి... ఆ రాజాకేదన్నా జరిగితే... తాను బ్రతికి వుండదు.
ఎందుకు?
అతనంటే తనకు అభిమానమని కాదు.
అతనంటే తనకు ప్రేమనికాదు.
అతనంటే తనకు శతృత్వం లేదని కాదు.
అతని మరణం వల్ల తనలో గొప్ప ఫిలాసఫీ ఏర్పడి, ఏదో మహా ఉపద్రవం జరిగిపోయిందని కాదు.
మానవధర్మంకోసం రాజా బ్రతికుంటే ఆమె ఎంతయినా పగ సాధించగలదు. విగతజీవుడైన అతనిమీద ఆమెకు కారుణ్యం, అర్పణతప్ప ఇంకేమీ వుండవు.
8
రాజాకి ఆపరేషన్ జరుగుతోంది.
అవకాశాలు ఫిఫ్టీ- ఫిఫ్టీ.
ఈ సంగతి డాక్టర్లు ప్రత్యేకంగా చెప్పఖ్కర్లేదు. అతని పరిస్థితి చూస్తే ఎవరికైనా తెలిసిపోతోంది.
ఆపరేషన్ ఇంకో గంట వుందనగా కారులో తెల్లగా, పొడవుగావున్న ఓ నడివయసు దాటినాయనా, ఆయన్తోబాటూ ఓ పది పదిహేనేళ్ళ కుర్రాడు వచ్చారు.
స్టూడెంట్సంతా ఆయన చుట్టూ గుమిగూడారు. వాళ్ళ మాటల్నిబట్టి తెలిసింది ఆయన రాజా తండ్రి అని.
తెల్లగా, స్వచ్చంగా, పవిత్రంగా వున్నాడు. ఆయన ముఖంలో కళ్ళలో ఓ తేజస్సు ఉట్టిపడుతుంది. కుమారుని విషమపరిస్థితిని గురించిన ఆందోళన ఆయన్ని కృంగసీస్తున్నట్లు కనిపిస్తున్నా, ఒక నిగ్రహశక్తి, అగ్ని పర్వతాలను దాచుకునే ఆత్మస్థైర్యం వున్న మనిషిలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు. ఆ కుర్రాడు సుధాకర్ అని మాధవి అర్థం చేసుకుంది.
వీలు చూసుకుని "మాట" అని ఆ కుర్రాడిని దగ్గరకు పిలిచింది.
వచ్చాడు. పెద్ద పెద్ద కళ్ళలో ఎంత మెరుపు, అమాయకత్వం!
"రాజా నీకేమవుతాడు?" అనడిగింది.
"అన్నయ్య."
"నీ పేరు సుధాకర్ కదూ."
అవునన్నట్లు తల వూపాడు ఓసారి ఆశ్చర్యంగా చూసి. తర్వాత అతన్తో మాట్లాడిన తర్వాత ఆమె తెలుసుకోగలిగిందేమిటంటే వాళ్ళది ఒంగోలు ప్రాంతంలోవున్న ఒక పల్లెటూరు. రాజాకి తల్లిలేదు. సుధాకర్ చిన్నప్పుడే పోయింది. రాజా తండ్రి అయిన సీతారామారావుగారికి ఒంగోలులో భారీ ఎత్తు వ్యాపారముంది. ఊళ్ళో పొలాలున్నాయి. అవి చూసుకుంటూ ఒంగోలులోని వ్యాపారం చూసుకుంటూ పల్లెటూళ్ళోనే వుంటున్నాడు.
* * *
రాజాకి తెలివొచ్చింది. ఒక్కనిమిషమంతా గందరగోళం. తలలో వెయ్యి సమ్మెట్లతో కొడుతూన్నట్లు బాధ. కళ్ళముందు చీకటితెరలు. మసక మసగ్గా ఏవేవో రూపాలు.
బాధగా కళ్ళు మూసుకున్నాడు.
ఏం జరిగింది? తానిప్పుడు ఎక్కడ వున్నాడు...?
లీలగా ఏవేవో దృశ్యాలు గుర్తుకొస్తున్నాయి.
క్రికెట్ ఆడుతున్నాడు. పట్టుదలగా, కసిగా ఆడుతున్నాడు. సెంచరీకి దగ్గరగావచ్చాడు. బంతులు మీదకి లేస్తున్నాయి. ఎక్కడ లేని బలంతో ఓ సిక్సర్ కొట్టాడు. తర్వాత ఇంకో బౌన్సర్ వచ్చింది. తిన్నగా తలమీదకు లేస్తోంది. హుక్ చేద్దామని బ్యాట్ పైకెత్తాడు... తర్వాతేదో జరిగింది...
"ఎలావుంది?" అని అడుగుతోందో కంఠం.
అతనేం జవాబు చెప్పలేదు. ఏమీ తెలియటంలేదు.
"రాజా! యు ఆర్ ఆల్ రైట్. కళ్ళు తెరు. కమాన్ లుక్ ఎట్ మి."
చాలా గంభీరమైన కంఠం. ప్రేమగా శాసిస్తున్నట్లు పిలుస్తోంది. మళ్ళీ కళ్ళు విప్పాడు.
డాక్టర్ గారు... ఏప్రాన్ వేసుకుని... తెల్లగా, దేవతలా గోచరిస్తున్నాడు. చిరునవ్వుతో పలకరిస్తున్నాడు.
కొద్దిగా తెలుస్తోంది. ప్రక్కన ఇంకో ఇద్దరు డాక్టర్స్, సిస్టర్స్ కనిపిస్తున్నారు. తాను హాస్పిటల్ లో వున్నాడు! ఏం జరిగింది? తలకేమైనా దెబ్బతగిలిందా?
కదలబోయాడు.
"నో! కదలకు. యుఆర్ ఏబుల్ టు హియర్. ఈజ్ ఇట్ నాట్?"
తలూపాడు. కాని తలంతా ఏవేవో బంధనాలమధ్య బిగించివేసినట్లని పించింది అర్థంకాలేదు.
"ఓ. కే. టేక్ రెస్ట్."
మళ్ళీ కళ్ళుమూసుకుని నిద్రలో పడిపోయాడు.
* * *
క్రమక్రమంగా అన్నీ తెలిశాయి. తలకి బలమైన గాయం తగిలింది. ఆపరేషన్ జరిగింది. చాలా సీరియస్ అయింది. కాని తాను బ్రతికాడు.
తండ్రి అతని ప్రక్కనే వుంటున్నాడు. సుధాకర్ అన్నయ్య మంచాన్ని విడిచి పోవటంలేదు. స్టూడెంట్సంతా వస్తున్నారు, పోతున్నారు. అతని కళ్ళు ఎవరి కోసమో వెదుకుతున్నాయి. ఆ మనిషి కనబడటంలేదు.
"డాడీ!" అని పిలిచాడు.
"ఏమిటి రాజా!"