Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 18


    నూటఅరవై... అరవై రెండు... అరవైనాలుగు... అరవై ఎనిమిది... డెబ్బై.

 

    రాజా అప్పటికి తొంభై రెండు పరుగుల్లో వున్నాడు.

 

    అవతలి బ్యాట్స్ మేన్ బాల్ ని ఫేస్ చేస్తున్నాడు. ఓవర్ పూర్తి కావటానికి ఇంకా రెండు బాల్స్ వున్నాయి. అయిదో బాల్ బౌల్ చెయ్యబడింది. స్టంప్స్ కి దూరంగాపడి, దాని దార్నిపోతోంటే, ఊరుకోలేక బ్యాట్ విసరి, సింగిల్ తీయవచ్చునన్న ఉద్దేశంతో ముందుకు పరుగుతీశాడు. పరిస్థితి గమనించి వద్దని రాజా అరుస్తూనే వున్నాడు. కాని అప్పటికే అతను క్రీజ్ దాటి బయటకు వచ్చేశాడు. బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి క్రీజ్ చేరుకునే సావకాశం లేదు. ఫీల్డర్ బంతిని స్టంప్స్ కేసి విసిరి కొట్టాడు. బెయిల్స్ ఊడి క్రిందపడ్డాయి. రన్ అవుట్ అయిపోయి భిన్నవదనంతో పెవిలియన్ లోకి తిరిగి వెళ్ళిపోయాడు.

 

    ఆఖరి వ్యాట్స్ మేన్ వచ్చాడు. ఆ ఓవర్ లో ఇంకా ఒక్క బాల్ మిగిలివుంది. ప్రేక్షకులంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఫీల్డర్సు చుట్టూ క్రమ్మేశారు. బౌలర్ పొజిషన్ లో నిలబడ్డాడు. బంతి బ్యాట్ కి తగిల్తే దానిమీద నుంచే సరాసరి లాగెయ్యటానికి ఫీల్డర్సు రెడీగా వున్నారు.

 

    బాల్ స్పిన్ అవుతూ వచ్చింది. ఒక్కక్షణం తెగించి డిఫెన్సు ఆడదామా అనుకున్నాడు. కాని క్యాచ్ వెళ్ళిపోతుందేమోనని భయంవేసి ఏమయితే అదయిందని బ్యాట్ ని దూరంగా పైకెత్తాడు. బంతి దొర్లుకుంటూ వికెట్లమీదికి వెళ్ళి, వెంట్రుకవాసి దూరంలో వాటికి తగలకుండా వెళ్ళిపోయింది.

 

    తర్వాత ఓవర్ రాజా ఎదుర్కొంటున్నాడు.

 

    అతని స్కోరు నూట డెబ్బయి. అతని ఇండివిడ్యువల్ స్కోరు తొంభైరెండు.

 

    దివాకర్ బౌల్ చేస్తున్నాడు. అతను కసిగా, ఉక్రోషంగా, భయంకరంగా కనిపిస్తున్నాడు.

 

    జుట్టు చెదిరిపోయి వుంది. శరీరం చెమటలు క్రక్కుతోంది. కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి.

 

    రాజా నిబ్బరంగా నిశ్చలంగా ఉన్నాడు.

 

    ఫస్ట్ బాల్ దూసుకు వచ్చింది. కొట్టాడు. ఫోర్ వెళ్ళాల్సింది కాని, బౌండరీలైన్ దగ్గర ఫీల్డర్ ఆపుచెయ్యటం వల్ల రెండు పరుగులకంటే ఎక్కువ రాలేదు.

 

    అతని స్కోరు తొంభై నాలుగునూ, మొత్తం స్కోరు నూట డెబ్భై రెండుకూ జరిగింది.

 

    రెండో బంతి కొట్టాడు. ఎక్కువ ఫోర్స్ ఉపయోగించలేకపోవటం వల్ల కొంచెం దూరమే వెళ్ళింది. సింగిల్ తీయవచ్చు కాని అవతలి బ్యాట్ మేన్ ని ఇటు తీసుకొచ్చి రిస్క్ తీసుకోవటం ఇష్టంలేదు. రన్ తియ్యకుండా వూరుకున్నాడు.

 

    మూడోది... అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంస్. ముట్టుకోవటానికి వీల్లేకపోయింది.

 

    నాలుగు... బాణంలా వికెట్స్ మీదకు వచ్చింది. డిఫెన్స్ ఆడక తప్పలేదు.

 

    అయిదోబాల్... ఫుట్ టాస్. రాజాకి ఒళ్ళు తెలియలేదు. బ్యాట్ ని శక్తినంతా ఉపయోగించి, గురి తప్పకుండా కొట్టాడు. బంతి ఫిరంగి నుంచి వెలువడిన గుండులా ఆకాశంలోకి లేచి పోయింది. ఫీల్డర్సంతా చేతులు పైకెత్తారు. ఎవరికీ అందలేదు. ఎత్తుగా ఎగురుతూవెళ్ళి బౌండరీలైనుకు కొన్ని గజాల అవతల పడింది.

 

    సిక్సర్.

 

    రాజా సెంచరీ సాధించాడు.

 

    ప్రేక్షకులు చప్పట్లు కేరింతలు. ఎవరో అవుట్లు పేల్చారు.

 

    కల్యాణికి గేమ్ ఏమీతెలియదు. అయినా ఆమెశరీరం జలదరించినట్లయింది. ఓరగా మాధవి ముఖంలోకి చూసింది. ఆమెలో ఎటువంటి భావమూ కనబడలేదు. "ఇప్పుడు నీ మనసులో ఏముంది?" అని అడగాలనిపించింది గానీ మళ్ళీ నాకెందుకులే అని ఊరుకుంది.

 

    స్కోరు నూటడెబ్బయి ఎనిమిది.

 

    ఇంకా రెండు పరుగులు చేస్తే డ్రా అవుతుంది. అంతకు ఒక్కపరుగు ఎక్కువ చేసినా ఆట గెలిచినట్టే.

 

    ఆ ఓవర్ లో ఇంకా ఒక్క బాలే మిగిలివుంది. అందులో అతను రన్స్ సాధించలేకపోతే తర్వాత ఓవర్ రెండో బ్యాట్స్ మేన్ ఎదుర్కోవల్సి వస్తుంది. అతను అవుటు కాకుండా కాపాడుకోవటం యించుమించు అసాధ్యం.

 

    ఓవర్ లోని ఆఖరి బంతిని ఎదుర్కొనేందుకు బ్యాట్ నేలమీద ఆన్చి రాజా సిద్ధంగా వున్నాడు.

 

    దివాకర్ లాంగ్ రన్ తీసుకునేందుకు చాలా వెనక్కి వెళ్ళాడు. అక్కడ్నుంచి గిరుక్కున వెనక్కి తిరిగి శత్రువును ఛిన్నాభిన్నం చేసే యుద్ధోన్మాదిలాగా పరుగుతీశాడు. సరిగ్గా లైన్ దగ్గరకు వచ్చేసరికి గిరికీలు తిరుగుతున్న అతని చేతిలోంచి బంతి ధనుర్విముక్త విశిఖంలా వెలువడింది.

 

    బౌన్సర్.

 

    నేలమీద పడి రివ్వుమని లేచింది. ముఖంమీదకు తిన్నగా వస్తోంది. ఎట్లాగైనా బ్యాట్ కు కనెక్ట్ చేసి రన్స్ తీద్దామన్న పట్టుదలతో ఉన్న రాజా తల వంచలేకపోయాడు. జరుగుతున్నదేదో తెలుసుకునేసరికి సమయం మించిపోయింది. ఫట్ మన్న శబ్దంతో బంతి అతని తలని ఢీకొనడం. "అమ్మా!" అని అరిచి అతను క్రింద పడిపోవటం కనురెప్పపాటులో జరిగిపోయాయి. "అరె" అనుకుంటూ గ్రౌండ్ లో వున్న ప్లేయర్సు. బయట వున్నవారు ఖంగారుగా అతని వద్దకు పరుగెత్తుకు వెళ్ళారు.

 

    రాజా తల చిట్లి నెత్తురు వెల్లువలా బయటకు చిమ్ముతోంది. అతను స్పృహ తప్పి పడిపోయి వున్నాడు.


                                                            * * *


    హాస్పటల్లో వెంట వెంటనే రాజాకి ఇన్వెస్టిగేషన్సన్నీ పూర్తిచేశారు. బ్రెయిన్ లో హెమరేజ్ వచ్చి ఒక చోట క్లాట్ ఏర్పడింది. న్యూరోసర్జన్ చివరకు ఆపరేషన్ చెయ్యాలని నిర్ణయించాడు. రాజా డీప్ కోమాలో వున్నాడు.

 

    హాస్పటల్ దగ్గర స్టూడెంట్స్ చాలామంది గుమిగూడి వున్నారు. మాధవీ, కల్యాణీ కూడా వెళ్ళారు.

 

    రాజా- మాధవిల మధ్య పందెంగురించి కల్యాణికి తప్ప ఇంకెవరికీ తెలియదు.

 

    మాధవి హృదయంలో అగ్నిపర్వతం బ్రద్దలవుతోంది. ఇదంతా తనవల్లే జరిగిందా? తాను అతన్ని, దివాకర్నీ ఇద్దర్నీ రెచ్చగొట్టిందా? రాజా మీదకు దివాకర్ని ఉసిగొల్పిందా?

 

    రాజాకి... ప్రాణాపాయం ఏర్పడితే?

 

    ఆమె ఒళ్ళు జలదరించింది. అతన్ని గురించి తన మనస్సులో ఏముంది? ఆమెకి తెలీదు. ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో ఆమె కాలేజి బ్యూటీగానేగాక చాలా అల్లరి పిల్లగా, రాలుగాయిగా ప్రసిద్ధి పొందింది. అందరితోనూ సోషల్ గా వుండేది. కాని ఎవరి ప్రవర్తనన్నా మితిమీరితే పాపం దిమ్మతిరిగిపోయేటట్లు బుద్ధిచెప్పేది. అటువంటి ఆమెతో రాజా ఢీ కొన్నాడు. రెండు మెరుపు కత్తులు జిగేల్ జిగేల్ మంటూ యుద్ధానికి తలపడినట్లయింది.

 Previous Page Next Page