ఇటునుంచి లాభం లేదు అటునుంచి నరుక్కువద్దామనుకున్నాడు. "మధ్యాహ్నం ఏమైనా జరగరానిది జరిగిందా? నీవు మౌనంగా వున్నావని నీ ఫ్రెండ్స్ అనుకోగా విన్నాను..."
"విన్నారుగా! కారణంకూడా వాళ్ళనేఅడగాల్సింది"
"ఏం జరిగిందో తెలియకపోతే నా కెలా తెలుస్తుంది దేవీ?" లాలనగా అడిగాడు అజయ్.
"అజయ్! నామీద ప్రేమ గట్రా అలాంటిదేదైనా వుంటే నన్ను విసిగించక వెళ్ళి పడుకో..."
"ప్రేమ ఉండేకదా దేవీ పెళ్ళాడాను. ఈ రాత్రి కోసం తహతహ లాడాను. ప్రియకోమల్, దేవీ ప్రియా..."
అజయ్ మాటలు పూర్తికాక ముందే కోమల చెవులల్లో వేళ్ళు పెట్టుకుంది. అతని మాటలు వినటం ఇష్టంలేనిదానిలా.
"లాభం లేదమ్మాయ్! మంచిమాటలు చెబితే వినేటట్టు లేవు. బతిమిలాడితే కరిగిపోయేటట్లు లేవు. బలవంతమే తగిన శిక్ష" నవ్వుతూనే అని చటుక్కున కౌగిలిలోకి లాక్కున్నాడు. బలంగా దగ్గరకు హత్తుకున్నాడు.
"వదులు...వదులు...నువ్వుత్త మోసగాడివి నీ మాయమాటలు నమ్మి తెలివితక్కువగా లొంగుతాననుకోకు. ఈ కోమల ప్రేమించనూ కలదు ద్వేషించనూ కలదు నువ్విలాంటి వాడివని, ఇంతనయవంచకుడివని ముందే తెలిసినట్లయితే..."
కోమలని చటుక్కున వదిలేశాడు అజయ్.
"నేను...నేను...మోసగాడినా?"
"దొంగ తాను దొంగనని, హంతకుడు తాను హంతకుడినని, మోసగాడు తాను మోసగాడినని అనుకోడు, ఎందుకంటే వాళ్ళు అంత విశాల హృదయంతో ప్రవర్తించి ఆలోచిస్తారు" వ్యంగ్యంగా అంది.
శరాఘాతం తిన్నట్లయింది అజయ్ కి. "మధ్యాహ్నం ఏమయింది కోమల్" సీరియస్ గా అడిగాడు.
"ఓహో! ఏదైనా జరగొచ్చని, అది మధ్యాహ్నమే జరగొచ్చని ముందే తెలుసన్న మాట. హ్హూ...నేను పిచ్చి బాగులదాన్ని కాబట్టి నాకిలాంటి ముందు జాగ్రత్తలు, మరింత ముందుచూపు తెలియదు. ధనవంతులనేమిటి అన్నింటిలో మహా మహా మేధావులాయె. అన్నీ ముందే తెలుస్తాయి మరి....ఎన్నో జాగ్రత్తలు తీసుకోవచ్చు. నాలాంటి దాని కళ్ళు తేలికగా కప్పవచ్చు. మావాళ్ళ లాంటి మధ్య రకం వారి జీవితాలతో ఆటలాడవచ్చు, ఎందుకంటే మీరు గొప్పవారండీ... గొప్పవారు" అంటూ కోమల మళ్ళీ ఎక్కిళ్ళు పెట్టింది.
కణతలు నొక్కుకుంటూ వుండిపోయాడు అజయ్.
మరోసారి అజయ్ ఎన్నివిధాలో మాటమార్చి అడిగి చూశాడు.
ముందు కోమల నోట్లోంచి వ్యంగ్యబాణాలు వచ్చాయి. ఆపై అవికూడా లేవు. దీర్ఘమౌనం వహించింది.
ఆ రాత్రంతా సోఫామీద పడుకున్న కోమల కదులుతూనే వుంది. మంచంమీద పడుకున్న విజయ్ అటూ ఇటూ మెదులుతూనే వున్నాడు.
ఆ ఇంట్లో ఆ గది బయట వున్నవారు మాత్రం ఆనందంగా కబుర్లు చెప్పుకుని హాయిగా నిద్రపోయారు.
6
చందు గుల్జార్ కబుర్లు చెప్పుకుంటుంటే సీత వేడి చాయ్ తీసుకొచ్చి ఇరువురికి ఇచ్చింది.
"ఇంట్లో వంట్లో అంతా బాగానే వుంది...భయ్యా! మీరొస్తేనే మనసు బాగుండదు" అంది సీతాదేవి.
"బాప్ రే మైనే క్యాకియా?" గుల్జార్ తెల్లబోయి చందుని అడిగాడు.
"ఏముంది భాయ్! నువ్వొస్తావ్ డ్యూటీ గుర్తుచేస్తావ్, నేను వెంటనే బయలు దేరాలి. మన జాబ్, మనకర్తవ్యం మన గోల మన బాధ సీతకేం తెలుసు, వూరక రారు మహ్మాత్ములన్నట్లు నీ రాకకి నా పోకకి సంబంధం వుందాయె. నే వెళితే సీతకితోచదు. అందుకనే నాకు క్యాంప్ పడిందని తెలియంగానే సీత మనసు బాగుండదు. భాయ్! ఈ గుమ్మంలో నీ పాదం మోపటం ఏమిటి సీత మనసు..." అంటూ చందు ఫక్కున నవ్వాడు.