Previous Page Next Page 
ఆఖరి మజిలి పేజి 18


    ఊహించిన దానికి విరుద్దంగా జరిగితే నిరాశ, నిస్పృహలు కలగడం సహజం.

    కానీ, కృష్ణప్రియకు వాటికి భిన్నంగా జరగడం ఆశ్చర్యం అనిపించింది.

    కుమార్ ప్రవర్తనలో మార్పు రావడమే ఆమె ఊహించలేకపోతుంది.

    తన హాస్పిటల్ లోకి అడుగుపెట్టిన కృష్ణప్రియను చూసి క్షణం ఆశ్చర్యపోయాడు డాక్టర్ కుమార్. ఏ స్వప్నసుందరో...దేవకన్యో ప్రత్యక్షమయినట్టు దిగ్బ్రాంతిగా చూశాడు.

    ఎదురుగా వున్న కృష్ణప్రియకు ప్రతిగా...గ్రీట్ చేయడం కూడా మరచిపోయాడు.

    తన ఊహా ప్రపంచంలోని స్వప్నసుందరి ఎదురుగా వుంటే అందుకోలేని అమాయకుడు కాదు కుమార్...కానీ పక్కనే టింకూ వుండడం వలన అతనికి నిరుత్సాహమే ఎదురయింది.

    లేకుంటే...కృష్ణప్రియను ఏం చేసేవాడో!

    ఆమె, టింకూను అతని చేతులకు అందించడంతో యేదేదో చేయాలనుకున్న అతని చేతులకు సంకెళ్ళు పడగా వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు.

    కాసేపు టింకూను టెస్టు చేసి...ఎక్స్ రేను స్టాండ్ లో వుంచి ఆమెకు ఎక్స్ ప్లెయిన్ చేశాడు.

    ఒక వైపు ఖంగారుగావున్నా,దానిని బయటపెట్టకుండా అతను చెప్పింది వింటూ కృష్ణప్రియ తలవూపింది.

    ఆపరేషన్ ముందు వెనుక కావలసిన మందులు అన్నింటినీ పరస్పరం చర్చించుకున్న తరువాత హాస్పిటల్లో లేనివి ఒక లిస్టుగా ప్రిపేర్ చేశాడు కుమార్.

    టింకూని బ్లడ్ ఎనాలసిస్ టెక్నీషియన్ దగ్గరకు పంపించాడు.

    ఏకాంతంగా కృష్ణప్రియతో వున్న ఆ క్షణాలను ఊహాతీతంగా ఆలోచిస్తున్నాడు కుమార్...కానీ, క్షణాలలోనే రిపోర్టు వ్రాసుకుని టింకూను తీసుకువచ్చాడు టెక్నీషియన్.

    ఎప్పుడూ పని మందకొడిగా చేస్తున్నాడని అతనిపైకి విరుచుకుపడే కుమార్ కు, ఆ రోజు అంతకన్నా యెక్కువగానే కోపం వచ్చింది.

    అందబోయే ఆనందాన్ని  మొగ్గలోనే తుంచిన యమకింకరునిలా  కనిపించాడు  అతను...అందుకే కుమార్ అతన్ని కసురుకున్నాడు.

    కుమార్ కోపానికి కారణం అర్ధంగాక బిక్కముఖం పెట్టుకుని టెక్నీషియన్ వెళ్ళిపోయాడు.

    కృష్ణప్రియ వెళ్ళడానికి లేచి నిలబడితే...అన్నీ మందులు తెప్పించాక ఆపరేషన్ చేస్తానని చెప్పి, వదలలేక వదిలాడు కుమార్.

    ఏదో పోగొట్టుకున్నానన్న  భావం అతని కళ్ళల్లో కొట్టుమిట్టాడుతుంది.

    తన ఉనికినే మరచిపోయినట్టు తనతో మాట్లాడనందుకు కుమార్ మీద  కోపంతో థాంక్స్ చెప్పకుండా బయలుదేరాడు టింకూ.

    ఎలాంటి భావాన్నీ వ్యక్తీకరించకుండా  వెళ్ళి తన కారులో కూర్చున్నది కృష్ణప్రియ.

    టింకూ మాత్రం సీరియస్ గా కుమార్ గురించి ఆలోచిస్తున్నాడు.


                                                           *    *    *


    చిక్కని చీకటి...

    అమావాస్య రాత్రులు కొందరికి కొన్ని అవకాశాలు కల్పిస్తాయి.

    చీకటి నేరాలు చేసేవారికి అమావాస్య ఓ ఆటవెలది...

    చీకటిలో అజ్ఞాతంగా ఉండి కొన్ని పనులు సాధించుకునేవారికి అవి నిజానికి పర్వదినాలు...

    అయితే, ఈ కోవకు చెందినవారికి అవి అశుభ గడియలు. వారిలో అవి అలజడినే సృష్టిస్తాయి...

    కటిక చీకటికి తోడు ఆ ప్రదేశం అంతా నిర్జీవంగా వుంది. ఎదురుగా తారు రోడ్డు నల్లని త్రాసులా మెలికలు తిరిగి వుంది. అయితే ఎక్కడా జనసంచారం ఉన్నట్టు లేదు. ఆ రోడ్డుకు డౌన్ లో మరో మట్టిరోడ్డు దారి చూపిస్తోంది. అది సరాసరి కొండ చరియలు దగ్గరకు వెళుతుంది.

    అక్కడ క్వారీలు వున్నాయి. ఒకప్పుడు అనేక కట్టడాలకు ఉపయోగపడినా ప్రస్తుతం మూతపడ్డాయి.

    అప్పటిదాకా మారుతీ కారును నడుపుతున్న రవిచంద్ర కారును ఆ కొండచరియల మాటున ఆపాడు.

 Previous Page Next Page