స్వప్న ముఖం రక్తం చుక్కలేకుండా పాలిపోయింది. ఏ పరువు మర్యాదల కోసం తన ప్రియుణ్ణి పోగొట్టుకొందో ఆ పరువు మర్యాదలు నిలువనేలేదు. ఇలా పెళ్లికావడం అలా విడాకులు తీసుకోవడమా?
ఉహుఁ. అలా జరగకూడదు.
మాధవ్ ని కలుసుకొని అతడి నిర్ణయం మార్చుకొమ్మని ప్రార్దించాలి. ఒక అవకాశం తనకిచ్చి చూడమని అర్దించాలి స్వరూప్ తో తను స్నేహం చేయడం నిజమే అయినా ఇప్పుడు తన సంసారంలో అతడి ఛాయలు పడనివ్వనని హామీ ఇవ్వాలి!
శీనయ్య కోడలి ట్రాన్స్ ఫర్ కోసం గట్టి ప్రయత్నం చేయడంతో, స్వప్నకి ఆర్డర్స్ తొందరగానే అందాయి.
ఆ రోజు అత్తగారింటి మెట్లు ఎక్కుతూ, "ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరిసారి అవుతుందేమో"అనుకొంది స్వప్న దిగులుగా.
"రా, స్వప్నా!" ఆప్యాయంగా ఆహ్వానించింది అత్తగారు. వంటింట్లో పీటవేసి, హడావుడిగా టీకి నీళ్ళు పెట్టింది. "ఆరోగ్యం బాగుందా? ముఖం వాడిపోయింది, ఈ మధ్య చాలా చిక్కావమ్మా!"
"బాగానే వున్నాను, అత్తయ్యా!"
శీనయ్య వంటింటి దగ్గరికి వచ్చి, "ఎప్పుడు రిలీవ్ అవుతున్నావమ్మా?" అని అడిగాడు.
"రేపే రిలీవ్ అవుతున్నాను మామయ్యా! ఎల్లుండి ఫస్టు బస్ కి సిటీకి వెళ్లాలనుకుంటున్నాను బస్ట్ స్టాండ్ కి రమ్మని మీ అబ్బాయికి టెలిగ్రాం ఇవ్వండి!"
"ఇంకా వాడు ఇల్లు తీసుకొన్నాడో లేదో?"
"ప్రస్తుతం వుండడానికి ఒక రూమంటూ వుందికదా? ఇద్దరం కలిసి ఇంటికోసం వెదుక్కుంటాం"
"రేపటితో మూఢమి కూడా వెళ్లిపోతుంది. మా చేతులు మీదుగా ఆ ముచ్చట జరిపిస్తే బాగుండేది! ఈ కాలం పిల్లలకి మా సరదా నచ్చదు!" అర్దవంతంగా నవ్వింది అత్తగారు.
7
బస్సు దిగి ఆత్రుతగా అటు ఇటు కలయజూసింది స్వప్న.
మాధవ్ వచ్చాడా, లేదా? రాకపోతే రాకపోతే.... తన ప్రయత్నం మొదట్లోనే విఫలమైందనుకోవాలి! తన మొండి ధైర్యం తనని వెక్కిరించిందనుకోవాలి!
కాని, మాధవ్ వచ్చాడు.
పాసింజర్లకి కొంచెం అవతల పాంట్ జేబుల్లో చేతులు దూర్చుకొని సీరియస్ గా నిలబడి వున్నాడు.
స్వప్న కళ్ళలో ఆనందం ఒక్క క్షణం తారట్లాడి పోయింది. గబగబా మాధవ్ ని సమీపించింది. "వచ్చారా?" అంది మందహాసంతో.
"ఉఁ" సీరియస్ గానే మూలిగాడు. "నాన్నచేత నాకు టెలిగ్రాం ఎందుకు ఇప్పించావ్?"
"నేను వస్తున్నాను కాబట్టి!" స్వప్న నవ్వడానికి ప్రయత్నించింది.
"నా ఉత్తరం అందలేదా!"
"ఏ ఉత్తరం?"
"అబద్దాలాడకు. త్వరలో నీకు విడాకులందేలా చేస్తానని....."
"నా చేతికి విడాకులందడానికి కనీసం ఏడాది పడుతుంది. ఈలోగా మనం కలిసి వుండవచ్చు కదా?"
"ఏమిటి నీ ప్లాను? నేను అంత చవటనని నీ ఉద్దేశ్యమా?"కోపంగా అడిగాడు మాధవ్.
"ఇక్కడేనా మీరు రభస చేయాల్సింది? ముందు ఇంటికి వెడదాం పదండి!"
స్వప్నే ముందుగా కదిలి బస్ స్టాండ్ గేటు దాటింది. ఆటో పిలిచి ఎక్కి కూర్చుంది. స్తంభంలా నిలబడి ఇటే చూస్తున్న మాధవ్ కి చేసైగ చేసింది.