Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 18

    'ఇంకా ఇన్నాళ్ళూ నిర్మల అన్ మారీడ్ అనుకున్నానోయ్..... అమ్మ బాబోయ్...... ఎంత ధైర్యం బాబూ, కాపురం వదిలి వచ్చేసింది' అంటోంది తెలుగు లెక్చరర్ లలిత.   
    'ఏమోయి పద్మా..... ఆవిడా, నువ్వూ అంత క్లోజ్ గా తిరిగారు. ఏం, ఈ మధ్య వెళ్ళడం మానేశావు?' ఆరా తీస్తుంది లెక్కల లెక్చరరు కుముదిని.
    'ఈవిడ మొగుణ్ణి వదిలేసింది. ఈవిడతో తిరిగితే రేపు నేనూ మొగుణ్ణి వదిలేస్తానని మా అమ్మ భయం. ఈవిడ యిన్ ఫ్ల్యూన్స్ నా మీద పడుతుందని మా వాళ్ళ భయం. మా మదర్ తిట్టింది' అంటోంది పద్మ.           
    'నిజంగా ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి..... ఉద్యోగం చేస్తున్నా మొగుడు ఏమన్నా నోరుమూసుకుని భరిస్తాం మనం. మా ఆయనయితే నెల జీతం ఫస్ట్ తారీకే తీసేసుకుంటారు. ఒకచీర కొనాలన్నా ఆయన పర్మిషన్ కావాలి. అలా ఒదిగి వుంటున్నా, ఏదో అంటూనే ఉంటారు. అయినా కాపురాలు చేసుకోవడం లేదూ?' అంది ఫిజిక్స్ ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాసులో పాసయిన సుప్రియ.    
    'ఆ..... ఏం ధైర్యం లెద్దూ..... మొగుణ్ణి, కాపురాన్నీ వదులుకుని యీవిడగారు సాధించింది ఏమిటి? రేపు ఆమె మొగుడు చక్కగా మరో పెళ్ళి చేసుకుంటాడు. అలా ఈవిణ్ణి చేసుకునేందుకు ఎవడన్నా ముందుకు వస్తాడా? ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగాలు చేసినా, ఎన్ని కబుర్లు చెప్పినా మగాడితో మనం సమానం కాదనడానికింతకంటే ఉదాహరణ ఏం కావాలి? కాస్తకి కూస్తకి కాపురాలు వదులుకుంటే నష్టపోయేది మనమే గదా! నిర్మలకి డబ్బుంది, అందం, చదువు, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. కాని అప్పుడంటే ఏదో ఆవేశంలో ఏదో సాధించాననుకొని తృప్తి పడుతుంది. నాల్గురోజులుపోతే ఓ సంసారం, పిల్లలు, ఏ ముద్దూ ముచ్చటా లేకుండా మోడులా బతకాలంటే తనకి మాత్రం విసుగు కాదూ? తొందరపడి, ఆవేశంలో చేసిందని నా అనుమానం.' ఉమ అంది.   
    'నిర్మల మంచిదోయి, సరదాగా ఉంటుంది..... కాని పాపం, ఎందుకిలా జరిగిందో..... నన్నడిగితే మనం ఎన్నో అనుకుంటాం. కన్నెగా ఎన్నో ఊహిస్తాం, నిజ జీవితంలోకి వచ్చేసరికి ఆ ఊహలన్నీ తలకిందులయి ఆ నిరాశకి తట్టుకోలేక కొందరు అనుకున్నవి జరగలేదని అవతల మనిషిలో లోటుపాట్లని భూతద్దంలో మాదిరి చూసి గోరంత కొండంతగా ఊహించి బాధపడతారు - నిర్మల గొడవ అలాంటిదేనని నా అనుమానం, అతన్ని మార్చడానికి కాస్తయినా ప్రయత్నించలేదని నా అనుమానం. ఎంత చెడ్డా వాడయినా కాస్త ఓర్పు చూపితే మారేవాడేమో, తొందరపడి తెంచుకుందేమోననిపించింది నాకు. మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. ఉన్నదానితో అడ్జస్ట్ అవక తప్పదు. ఎవరో అన్నట్టు మేరేజ్ అంటేనే క్షణక్షణం ఇంకొకరి కోసం ఎడ్జస్ట్ అవుతూ బతకడం. ఆ అడ్జస్ట్ మెంటాలిటీ వుండకపోతే మేరేజెస్ ఫేలవుతాయి.' మాధవి అంది.
    'ఆ.... డబ్బుంది అని వాళ్ళవాళ్ళకి మహాగరంట. మాకేం కూతురు బరువా? కాపురం లేకపోతే పీడా పోయింది. ఇలాంటి మొగుడితో మా అమ్మాయి కాపురం చెయ్యదు - అని  తీసుకొచ్చేశారట. పెద్దవాళ్ళు తల్లి తండ్రి నచ్చచెప్పాల్సింది పోయి ఇలా వెనకేసుకు వస్తే వయసు వేడిలో వున్న ఆ పిల్లకి అంతకంటే నాల్గు ఆకులు అహంకారం వుంటుందిగా! అదే కాస్త లేని తల్లిదండ్రులయితే అంత సులభంగా కాపురం పోతే పోయిందని కూతురి బాధ్యత మీద వేసుకుంటారా? ఇంతకంటే నరక బాధల్ని పడ్తూ కాపురాలు చేస్తున్నవాళ్ళు లేరూ?' కాస్త పాతభావాలతో ఛాందసంగా మాట్లాడే హిందీ లెక్చరర్ వరలక్ష్మి సాగదీసింది.               
    'ఏమిటో..... ఈ రోజుల్లో ఇలాంటివి ఎక్కువయిపోతున్నాయి. ఇదంతా స్త్రీ పురోగమనం అనుకోవాలేమో!ఇదివరకయితే పెళ్ళయితే చావయినా, బతుకయినా అక్కడే అనుకునేవారు భర్తలేం చేసినా మన ఖర్మ అనుకుని సహించిపడుండేవారు. ఇప్పుడు కాస్త చదువుకుని లోకజ్ఞానం అలవర్చుకున్నాక, పురుషుడికన్నా తను ఏ విషయంలోనూ తక్కువకాదని గ్రహించిన స్త్రీ పూర్వం మాదిరి పురుషుడి జులుం సహించిపడి వుండలేకపోతూంది. అటు పాతకాలం స్త్రీలాగా అణిగి వుండలేక, ఇటు విదేశీ స్త్రీ మాదిరి పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలు లేక మధ్యస్థంగా ఊగిసలాడుతూంది ఈ తరం స్త్రీ.
    విదేశాల్లో మాదిరి విడాకులు తీసుకుంటే, విదేశాల్లో మాదిరి హృదయ వైశాల్యంతో రెండో పెళ్ళి చేసుకునే పురుషులు మనదేశంలో ఎందరున్నారు? ఇటు వున్న భర్తనీ వదులుకుని, అటు ఇంకో పెళ్ళికి అవకాశం లేక జీవితం వృధా అయిందన్న బాధతో, దిగులుతో బతుకుతుంది ఈ తరం స్త్రీ. ఎంత చదువుకున్నా - పురుషుడితో సమంగా సంపాదిస్తున్నా భర్తకి తల ఒగ్గే బతుకుతున్నారు నూటికి తొంభై మంది. అర్థం చేసుకునే భర్త, అనురాగం పంచే భర్త నూటికి ఏ అయిదుమందికో దొరుకుతారు. మిగతా ఐదుమంది నిర్మలలాంటి చొరవ. తెగువవున్న స్త్రీలు - భర్త జులుం సహించలేక ధైర్యంగా ఎదిరిస్తున్నారు. ఎన్నాళ్ళు గడిచినా స్త్రీ పురోగమనం అంతా వేషభాషల్లో మినహా వ్యక్తి స్వాతంత్ర్యంలో కనబడటం లేదు.' ఆవేశంగా అంది పొలిటికల్ సైన్స్ లెక్చరర్ వనజ.     
    'ఈ ఆవేశాలు మాటల్లో వినడానికి బాగుంటాయి. నిజజీవితంలోకి వచ్చేసరికి ఎందుకూ పనికిరావు ఆవేశపడి నిర్మల కాపురం వదులుకుంది. తరువాత ఇప్పుడు ఆవిడ సాధించింది ఏముంది? ఏదీ, ఇంకా మొన్న మొన్న కనుక జీవితంలో ఏం నష్టపోయిందో గుర్తించడంలేదు. మరో నాలుగేళ్ళుపోతే మోడులా మిగిలిన జీవితం చూసుకుని ఏడవాలి. డబ్బుంటే బతుకు తెరువుకి పనికొస్తుంది గాని డబ్బిచ్చి మానసిక శాంతి, ఆనందం కొనుక్కోగలదా?' సవాల్ చేసింది వరలక్ష్మి.        
    "అసలు చాలారోజులు నిర్మల అన్ మేరీడ్ అనుకున్నా సుమా! మంగళసూత్రం కూడా తీసి పారేసిందేమో, పెళ్ళి కాలేదనే అనుకున్నా." అంది పద్మ.
    "చాలా ఘనకార్యం చేసిందానిలా మేమిద్దరం విడిపోయాం అని తనే గొప్పగా చెప్పుకుంది. ఎవరన్నా ఇలాంటివి బయట పడకుండా దాచాలని చూస్తారు - ఆవిడే గొప్పగా చెప్పుకుంటుంది."                      

 Previous Page Next Page