Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 18

       
    తెల్లవారి అంబిక హాస్పిటల్ కి వెళ్ళిపోయింది. పదకొండున్నర అవుతుండగా ఆమెకు ఆ రోజు కాస్త తీరిక చిక్కింది.


    అంబిక కృష్ణమౌళి గురించి ఆలోచిస్తూ అతనికి తను ఫోన్ చేస్తాను అంది యింతవరకూ చెయ్యలేదు. ఇప్పుడు చెయ్యాలి అనుకుంటూ రిసీవర్ యెత్తి నెంబర్ డయిల్ చేసింది.


    అతని కంఠస్వరం వింటూనే "మీరా! యింటి దగ్గరే ఉన్నారా!" అడిగింది.


    "నీ దగ్గరనుండి ఫోన్ వస్తుంది అని చూస్తున్నాను" అంటూ నవ్వి "ఏమిటి మీ కంపెనీలో ఏదో పెద్ద గొడవ అయిందట" అడిగేడు.


    "ఆ" అంటూ అతనికి నిన్నటిరోజు జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది.


    కృష్ణమౌళి శ్రద్ధగా విని నవ్వాడు. "ఐతే నిన్ను అక్కడందరు అంతగా నమ్మేశారన్నమాట. నా గురించి ఎలాంటి అనుమానం రాలేదు అన్న మాటేకదా" అడిగాడు.


    "ఆహా! నన్ను నమ్మటం ఏమిటి ఏ పనయినా నాకు చెప్తేగాని చేసేటట్టులేరు, ముఖ్యంగా గణేశ్ రావు గారు అదే మావగా"రంటూ నవ్వేసింది.


    అతను గట్టిగా నవ్వేస్తు "ముందు ఆ ముసలాయన్ని మస్కా కొట్టాలి మరి జయరాం!"


    "ఆయన కూడా దారిలోకి వచ్చేశారు నేను ఎంత చెపితే అంతే"నని మళ్ళీ నవ్వింది.


    "ఆహా! సరే మరి..." అంటూ ఆపేశాడు.


    "మీ ఇందు గురించా ఆమె మహారాణిలా ఉంది. ఆ అమ్మాయిగూడా నన్ను తేలిగ్గా నమ్మేసింది. నేను మంచి సంబంధం చూస్తున్నానని చెప్పాను.


    "సంబంధమా!"


    "అదే ఆ మాత్రం మీ కర్ధం కాలేదా! మీరే ఆ పెళ్ళికొడుకు" అంది నవ్వుతూనే.


    అతను గట్టిగా నవ్వేశాడు.


    "ఐతే ప్లానేమైనా ఆలోచించావా!"


    "ఓ ఎప్పుడో ఆలోచించి పెట్టుకున్నాను. ముందు ఇంట్లో వాళ్ళందరూ ఒక దారికి వచ్చిందాకా ఆ ప్లాను ఫలించదుగా అందుకే ఆగాను"


    "ఏమిటా ప్లాన్" నెమ్మదిగా అడిగాడు.


    ఆమె నెమ్మదిగా కంఠస్వరం తగ్గించి రహస్యంగా చెప్పిందన్నీ వివరంగా.


    అతను ఊ కొట్టి వినసాగాడు.


    అంతా చెప్పి "అర్ధమయిందా! చాలా జాగ్రత్త ఎవ్వరికీ తెలియకూడదు. ఇందు వెనక వాళ్ళన్నయ్య ఉండకుండా నేను చూస్తాను" అంది.


    "ఆ అర్ధమయింది, ఐతే రేపటినుండే మొదలన్నమాట. ఐటే ఈ విషయం వెంటనే రాజుకి చెప్పేస్తా" నన్నాడు హుషారుగా.


    రాజు పేరెత్తగానే అంబికకు ఒళ్ళు మండిపోతుంది.


    "ఆ రాజుకన్నీ చెప్పాలని ఉందా! వాడిని తీసుకెళ్ళి ఏ చెత్తకుండీలోనయినా పారేసక్కడ కొద్దిరోజులు ఉండమనండి" అంది కాస్త కోపంగా.


    ఆమెకు రాజు పేరెత్తగానే కోపం వచ్చిందని గ్రహించుకుని నవ్వేసి "సరే ఐతే నేను ఉంటా"నంటూ చెప్పి రిసీవర్ పెట్టేశాడు.


    కృష్ణమౌళికి ఆరోజు చాలా ఆనంద మనిపించసాగింది.


    అమ్మ కోరిక ప్రకారం అంబిక గణేశ్ రావుగారి కోడలయింది. ఇక గణేశ్ రావు గారి కూతురు అమ్మకు కోడలవ్వాలి.


    ఆపని తను చేస్తే తల్లి కోరిక తీర్చినట్టే.


    అతని మనసు తేలికయింది.


    రేపు ఎంతవేగంగా తెల్లవారుతుందా అనిపించసాగింది. ఆ రేపటి రోజు కోసం ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయాడు.


                                      52


    మర్నాడు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటిగంట టైమయింది.


    అంబిక హాస్పిటల్ నుండి భోజనానికి ఇంటికొచ్చేసింది.


    నౌకరు ఫోన్ రింగయితే వెళ్ళి రిసీవరెత్తి ఫోన్ ఇంద్రమ్మకని వెళ్ళి ఆమెను పిల్చుకొచ్చాడు.


    ఎవరా అనుకుంటూ వెళ్ళి రిసీవరందుకుంటూ "హల్లో" అంది.


    "ఆహా నీ కంఠస్వరమేనా! ఎంత తియ్యగావుంది" అంది అవతలి కంఠస్వరం.


    ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎవరా అన్నట్టు.


    ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎవరా అన్నట్టు.


    "మాట్లాడవేమి పంచవన్నెల రామచిలుకా! అలుకా! మరి అలా చూడకా! మొలకా! మరి మురిపించకా! కవ్వించక! ఆగలేనిక! చెంతకు రావేమిక! గుండెల్లో ఒదిగిపోవేమిక! రెచ్చగొట్టకిక...." అవతలి కంఠస్వరం ఇంకా ఇంకా ఏదో అంటూనే ఉంది.


    "యు"


    "ప్చ్ ఎంత చక్కని పలుకులు ఎంత ముద్దు వస్తున్నావు" అందవతలి కంఠస్వరం.


    ఆమెను ఇంకా రెచ్చగొట్టడానికన్నట్టు.


    టక్కున రిసీవర్ పెట్టేసి గిరుక్కున వెనుతిరిగింది. రెండడుగులు ముందుకి వేసి వెళుతుంటే,


    మళ్ళీ ఫోన్ రింగయింది.


    అడుగు ముందుకు వెయ్యబోయి ఆగిపోయింది.


    రిసీవర్ తియ్యాలా వద్దా అన్నట్టు.


    రిసీవర్ తీసిందాకా చెవికోసిన మేకలా చెవులు మారు మ్రోగిపోయినట్టు అరవసాగింది.


    వెళ్ళి రిసీవరందుకుంది "హల్లో" అంది కోపంగా.


    "హా నువ్వేనా నా రాణీ, పూబోణి, అలివేణి, మహారాణి, నా పట్టపు రాణి" అంటూ నవ్వాడతను ఫోన్ లో.


    "హుఁ" అంటూ మళ్ళీ రిసీవర్ టప్ మని పెట్టేసింది.

 Previous Page Next Page