Previous Page Next Page 
అంకితం పేజి 18

 


    నేనూ అరుంధతీ నవ్వబోయాం..... "..... చివరి రోజుల్లో" అంటూ పూరిచేసాడు. మా  మొహంమీద చిరునవ్వు ఆగిపోయింది. 'బాధ'......గొంతులో చేప ముల్లులా దాన్ని మర్చిపోయామనుకున్నప్పుడల్లా కలుక్కుమని గుర్తు చేస్తూంటుంది.

    లోపలికి వెళ్ళి కూర్చున్నాక అతనన్నాడు. "నేనిక్కడికి రావటానికి రెండు కారణాలున్నాయి. అక్కడ హైద్రాబాద్ లో వుంటే నా 'ఆఖరి నవల' పూర్తి అయ్యేట్టూ కనిపించటంలేదు. రెండోది, అంకిత్ కి ఇలా వున్నప్పుడు నేను మీతో వుంటే కాస్త ధైర్యంగా వుంటుందనిపించింది."

    నా కళ్ళు తడి అయ్యాయి. ఇతడు నాకేమీ కాడు. జీవితపు చివరి అంచున ఉన్నవాడు. అయినా ఎంత చేస్తున్నాడు!!!

    "నేను ప్రతిరోజూ ప్రోద్దున్నా, సాయంత్రమూ సముద్రం ఒడ్డున కూర్చుని ఈ నవల వ్రాయాలని అనుకుంటున్నాను. మధ్యాహ్నం అంకిత్ తో పాటు వుండి కబుర్లు చెప్తాను."

    అరుంధతి కళ్ళు ఆనందంతో మెరిసాయి. ఆమె చాలా ఉద్విగ్నంగా కనిపించింది. ఈ పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో తృప్తి కలిగిస్తాయనటంలో అసహజమైనదేమీ లేదు.

    అతనన్నాడు....... 'కెరటాన్ని చూస్తే నాకు బావున్నాట్టు అనిపిస్తుంది. పైకెగిరి క్రిందపడుతూ మనిషి అస్థిత్వాన్ని నిరంతరం గుర్తు చేస్తున్నట్టుంటుంది. అలాంటి మూడ్ హైద్రాబాదులో దొరకదు. ఒక్కడికి రావటానికి అన్నిటికన్నా చివరి ముఖ్యమైన కారణం..... రాత్రిళ్ళు నీతో కలిసి డ్రింక్ చెయ్యొచ్చునని" అంటూ నవ్వేసాడు.

    అయితే...... అసలు కారణం ఆ రాత్రి డ్రింక్ చేస్తున్నప్పుడు చెప్పాడు. "అర్థరాత్రి మెలకువ వచ్చి చూస్తే 'దయ' ఏడుస్తూ కనిపిస్తుంది. నాకు చాలా బాధగా వుంటోంది. ఇది శాశ్వతమైన వీడ్కోలు అని నాకు తెలుసు. కానీ తను బాధపడటం చూడలేకపోతున్నాను. 'నేను లేకుండా' వుండటాన్ని తననీ క్రమంగా అలవాటు చెయ్యాలి. అందుకే వచ్చేసాను."

    నాకు అతడిని చూస్తే భక్తి భావం కలిగింది.

    ఆ తరువాత మా టాపిక్ సుమద్యుతి మీదకు మళ్ళింది. అప్పటి వరకూ నేను చేసిన ప్రయత్నాలన్నీ చెప్పాను.

    "ఇంతా చేస్తే...... ఆ సుమద్యుతి అంకిత్ అసలు తల్లి అవునో కాదో తెలీదు. అయినా ఆమె అడ్రసు దొరకలేదు. మరొకవైపు డాక్టరు మహారధి పెట్టిన గడువు సమీపిస్తోంది" అన్నాను......"ఆ కిడ్నీలు అమ్మే కంపెనీ గురించి ఎంక్వయిరీ చేసాను. అందులో చాలా రిస్క్ వుంది అన్నారు తెలిసిన డాక్టర్లు. 'కొద్ది; కాలంపాటు అంకిత్ జీవితాన్ని పొడిగించటానికి అతడిని ఎంతో కష్టపెట్టటానికి తప్ప మరెందుకూ అది పనికిరాదట!"

    అరుంధతి బయట లాన్ లోకి వచ్చింది. "రాత్రి పన్నెండు దాటుతోంది. బయట ఎందుకు? లోపలికి వచ్చి మాట్లాడుకోకూడదూ?"

    "అయిదు నిమిషాలమ్మా! ఆఖరి రౌండ్" అన్నాడు జాన్.

    ఆమె కూడా మాతోపాటు కూర్చుంది. నేనన్నాను, "ఆ సుమద్యుతి భర్త లాయరట. హైద్రాబాద్ లో వుండొచ్చునని అన్నారు. కానీ అతడిని ఎలా పట్టుకోవటం? కనీసం పేరుకూడా తెలీదు. నాటకాలేస్తాడట."

    "మీ కాలేజీలో పాత రికార్డులు తీస్తే...... అందులో సుమద్యుతి స్నేహితుల అడ్రసులు ఉంటాయి కదా! అందులో కనీసం ఒకరయినా సుమద్యుతితో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపే అవకాశం వుండదంటావా?" జాన్ అడిగాడు.

    "ఆ ఆలోచన  నాకూ వచ్చింది! నిజానికి అంకిత్ ఆస్పత్రి నుంచి తప్పించుకుని పారిపోయినప్పుడు నేను చేసిన పని అదే! వాడి స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఎంక్వయిరీ చేయటం."

    "మరేమైంది?"

    "ఆ ప్రిన్స్ పాల్ ఒప్పుకోలేదు."

    "ఎందుకు?"

    "అందులో నాదికూడా తప్పుంది....... "నిస్సహాయంగా అన్నాను. "సులభంగా అయిపోతుంది కదా విజయవాడలో సుమద్యుతి పాత ఇంటికి వెళ్ళాను. పాత విద్యార్థుల ఫంక్షన్ అని  చెప్పి అడ్రసు అడిగాను. ఆ ఇల్లు కొన్న ముసలాయన అంత ఉత్సాహం చూపించలేదు. తెలీదన్నాడు."

    "నువ్వు చెప్తూంది ప్రిన్స్ పాల్ గురించి!"

    "ఆ విషయానికే వస్తున్నాను....." అన్నాను. "ఆ తుర్వాత కాలేజీకి వెళ్ళాను. నేను పాత విద్యార్థిననీ, ఈ విధంగా ఫంక్షన్ ఏర్పటు చేయటానికి అడ్రసులు కావాలన్నాను. ప్రిన్స్ పాల్ దాదాపు గెటౌట్ అన్నాడు."

    "ఎందుకు?"

    "ఆ ముసలాయనే ప్రిన్స్ పాల్ కాబట్టి."

    ఇద్దరూ ఒక్కసారి....... "ఉఫ్" అన్నారు.

    "అవును! నేను చేసిన తప్పు అదే! ముందు ప్రిన్స్ పాల్ దగ్గరికి వెళ్ళి వుంటే అనుమానం రాకపోవును. ఇప్పుడు నేను ఆయన దృష్టిలో కేవలం ఆ అమ్మాయి అడ్రసు సంపాదించే మాజీ ప్రేమికుడిగా నిలిచి పోయాను" పేలవంగా నవ్వేను.

    "ఈసారి నేను ప్రయత్నిస్తాను" అప్రయత్నంగా అంది అరుంధతి. అనూహ్యంగా వచ్చిన ఆ ప్రపోజల్ కి ఆశ్చర్యంగా చూసాను.

    "నేను వెళితే ఆయనకి అనుమానం రాకపోవచ్చు."

    ఇదేదో బావుందనిపించింది....... జాన్ కూడా సమర్థించాడు. ముగ్గురం అక్కణ్నుంచి లేచాం. మేమిద్దరం మా పడగ్గదిలోకి వెళ్ళాం. నేను బ్లాంకెట్ తీసి కప్పుకొంటూ వుండగా వినిపించిందా ప్రశ్న.

    "అంకిత్ మీ కొడుకా?"

    నాచేతిలోని బ్లాంకెట్ అప్రయత్నంగా జారిపోయింది. వేళ్ళు వణికాయి. ఆమె ప్రశ్న నాకర్థమైందా? హిపోక్రసీ లేకుండా చెప్పాలంటే-ఆమె పెదవులనుంచి ఆ వాక్యం వెలువడిన మొదటి క్షణమే (అది చివరి వరకూ పూర్తికాకుండానే) అర్థమైంది. కొన్ని రోజుల క్రితమే అరుంధతికి నేను సుమద్యుతి విషయం క్లుప్తంగా వివరించాను. నేను ఆ రోజు రాత్రి కలగన్న విధానం...... అంతకుముందు సాయంత్రమే ఆమెని రిక్షాలో చూసిన సంగతి చెప్పాను.

    ఏమాత్రం తార్కిక జ్ఞానమున్న వ్యక్తి అయినా నేను చెప్పేది నమ్మరని నాకు తెలుసు. నేను అంకిత్ తల్లిదండ్రుల కోసం ఎంతలా వెతుకుతున్నానో ఆమె చూస్తూనే వుంది. ఎంతో నమ్మకంగా నాకా వాస్తవం తెలిస్తే తప్ప నేను సుమద్యుతి కోసం అంతగా శోధించను.

    ఒక కళ ఆధారంగా నేను అంకిత్ తల్లి 'సుమద్యుతి' అని నమ్మి వెతుకుతున్నానంటే ఏ భార్య అయినా నమ్ముతుందా?

    ......భర్తలు చెప్పే కట్టుకథల్ని కొందరు భార్యలు మనస్ఫూర్తిగా నమ్ముతారు.

    ......నమ్మక తప్పక చేసేదేమీ లేదని...... నమ్మతాన్ని అలవాటు చేసుకొంటారు కొంతమంది.

    .......నమ్మినట్టు నటిస్తారు కొంతమంది.

    నమ్మినట్టు నటిస్తూనే తామూ కట్టుకథలు చెప్తారు కొద్దిమంది.

    నిశ్చయంగా పై నాలుగు వర్గాల్లో ఏదో ఒకదాన్లో వుండటానికి అరుంధతి అంగీకరించలేదు. జాన్ డేవిడ్ ఆమెకు స్ఫూర్తి. మంచి కమ్యూనికేషన్ ద్వారా భర్తకి మానసికంగా దగ్గిరవ్వాలనుకుంటుంది.

    అందుకే ఆమెకి నిజాయితీగా చెప్పాను....... "నాకు సుమద్యుతికీ ఏమాత్రం సంబంధం లేదు అరుంధతీ! నేను ఆమెను ప్రేమించినమాట వాస్తవమే. అయితే అది చిన్న వయసులో వుండే ఆరాధన మాత్రమే. అంకిత్ సుమద్యుతి కొడుకు అవునో కాదో కూడా నాకు తెలీదు చీకట్లో వెళ్తున్న వాడికి మిణుగురు వెలుగుకూడా దీపంలాగానే కనపడుతుంది. నా ప్రయత్నం కూడా అలాంటిదే! అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే..... అంకిత్ నా కొడుకే అయిన పక్షంలో ఈ కథ ఎప్పుడో సుఖాంతమై వుండేది! సుమద్యుతి అవసరం ఏముంది? నా కిడ్నీ చాలదూ?"

    అరుంధతి మొహం విప్పారింది. 'థాంక్స్' అంది.

    "ఇంత అనుమానం మనసులో ఇన్నాళ్ళూ పెట్టుకుని బాధపడ్డావా?"

    "బాధ.....మీకు సంబంధం వున్నదేమో అని కాదు. ఆ సంబంధం గురించి నాకు చెప్పేటంత నమ్మకం నామీద ఇన్నాళ్ళ సహచర్యంలో కల్గించుకోలేకపోయానే అని!"

    నేను ఆమెవైపు ప్రేమగా చూసాను. ఈ ప్రపంచంలో చాలా కొద్ది మంది వ్యక్తులు మాత్రమే తమ జీవిత భాగస్వాములవల్ల గొప్ప ఆనందం, సంతృప్తి పోందగల్గుతారు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ని....

    మరుసటిరోజు అరుంధతీ, నేనూ, జాన్ కలిసి విజయవాడ  బయలు  దేరాం. అంకిత్ సెడేషన్ లో వున్నాడు.  సాయంత్రానికి వచ్చేటట్టూ ప్రోగ్రాం పెట్టుకున్నాం. హొటల్లో దిగాం.   

    అరుంధతి కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటిగంటయింది. నిస్సత్తువుగా కుర్చీలో కూర్చుంటూ "ఆయన వప్పుకోలేదు" అంది. నేను విసుగ్గా "....షిట్" అన్నాను.

    ".......నాకో ఆలోచన వచ్చింది" అన్నాడు జాన్.


                         *    *    *

    సరీగ్గా అరగంట తర్వాత మేము డిటెక్టివ్ ఏజెన్సీలో వున్నాం. విజయవాడలోని చిన్న ఏజెన్సీ ఆఫీసు అది. ఒక ఆవిడ టెలిఫోన్ దగ్గిర కూర్చుని వుందంతే. రెండు మూడు టేబిల్స్ ఖాళీగా వున్నాయి.

    "మాకొక సాయం కావాలి" జాన్ ఇంగ్లీషులో అడిగాడు.

    "వెంకట్రావ్ గారు వస్తారు కూర్చుండి."

    "ఆయనెవరు?"

    "మా మేనేజర్....." అంటూ ఎవరికో ఫోన్ చేసింది. పదినిమిషాలు గడిచాక ఆయన వచ్చాడు. పంచెలో వున్నాడు. బహుశా అతడి స్వగ్రామం తెనాలి అయి వుంటుంది.

    జాన్ డేవిడ్, మేము వచ్చినపని చెప్పాము. మాకు సుమద్యుతి ఎందుకు కావాల్సి వచ్చిందో..... దాదాపు పాతిక ప్రశ్నలు వేసాడు. చివరిగా "ఆమె భర్త లాయరన్నారు కదా! ఆయన పేరు ఏమిటి?" అని అడిగాడు. వచ్చింది డిటెక్టివ్ ఏజెన్సీ దగ్గరికి కాబట్టి అన్ని ప్రశ్నలకీ నిజాయితీగానే సమాధానాలు చెప్పాం.

    అయితే, అప్పటికే విసుగెత్తిన నేను "ఆ పేరు తెలిస్తే మీ దగ్గరకెందుకు వస్తాం?" అన్నాను.

    "అదీ నిజమే......" అంటూ వెంటనే వప్పేసుకున్నాడు. "మీకు సుమద్యుతి అడ్రస్ వారంరోజుల్లో తెలియబరిచే బాధ్యత నాది......"

    మేము ముగ్గురమూ ఒకరి మొహం ఒకరం సంభ్రమంగా చూసుకున్నాం. జాన్ కంఠంలో గౌరవం పరుగెత్తుకు వచ్చి చేరుకుంది. మెచ్చుకోలుగా చూస్తూ......"ఎలా?" అని అడిగాడు.

    "చిన్న ప్రకటన ఇస్తాను! ఫలానా రోజు అర్థరాత్రి మీరు మీ బిడ్డని మీ పాత ప్రేమికుడి ఇంటి మెట్లమీద వదిలి పెట్టినట్టయితే.......మీ భర్త లాయరయినట్టయితే...... మీరు ఫలానా కాలేజీలో చదివి వున్నట్టయితే సుమద్యుతిగారూ.......మీరు ఫలానా అడ్రసుని వెంటనే సంప్రదించండి" అంటూ మావైపు గర్వంగా "ఎలావుందీ?" అన్నట్టు చూసాడు.

    "ఓరి దౌర్భాగ్యుడా" అన్న మాటవి కంఠంలోంచి బయటకు రాకుండా అతి కష్టంమీద ఆపుకుంటూ అరుంధతివైపు చూసాను.

    ఆమె చప్పున నా నుంచి తల  తిప్పుకుంది. కానీ ఆ సన్నటి చిరునవ్వు నా దృష్టి పథం నుంచి దాటిపోలేదు. ప్రపంచాభిప్రాయానికి ప్రతీక అయిన డిటెక్టివ్ మాత్రం నావైపు ఇంకా మెచ్చుకోలుకోసం చూస్తూనే వున్నాడు.

    "మీరిలాంటి ప్రకటన ఇస్తే...... పొరపాటున ఆ లాయరుగానీ దీన్ని చూసాడంటే, ఆమెని వదిలిపెట్టటమో, హత్య చేయటమో చేస్తాడు" అన్నాను.

    "మీ కొడుకు బ్రతకాలంటే ఆ మాత్రం రిస్కు తీసుకోక తప్పదు" అన్నాడు. అతడు మాట్లాడేటప్పుడు 'మీ' అన్న పదాన్ని వత్తిపలకటం గమనించాడు. భరించక తప్పదు. ప్రపంచానికి ప్రతీక కదా!

 Previous Page Next Page