యిద్దరి మధ్య మొదటి రోజు నించి సామరస్యం కుదరలేదు. ఎడమొహం పెడమొహం అయింది యిద్దరిది. ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా కూడా లోపం వుంది లతలో అని అతని అనుమానం. ఓ నెల రోజులు కొత్త మోజులో, కోరికల వేడిలో కాస్త సౌమ్యంగా మాట్లాడింది అతనితో. తన పట్ల అతనికి ఏమి కుతూహలం , ప్రేమ, అభిమానం ఏమి లేవని, కేవలం డబ్బు కోసం చేసుకున్నాడన్న అపోహ ఆమె మనసులో మరీ బలంగా నాటుకుంది. ఎన్నో పుస్తకాలలో, సినిమాలలో నూతన దంపతులు ఒకరినొకరు వదలకుండా అనుక్షణం వుంటారని, స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటారని , ఒకరి కళ్ళలోకి ఒకరు చూసి మైమరుస్తారని ఏవేవో చదివినవన్నీ తనకి అనుభవంలోకి రాలేదని ఉక్రోషపడేది. తను అవిటిది కనక భర్తకి తన మీద ప్రేమ లేదని మనసులో దహించుకు పోయేది. ఆ కోపం, ఉక్రోషం అంతా మాటలలో చూపిస్తూ ప్రసాద్ ని ఎత్తి పొడిచి, హేళన చేసి, ప్రతి నిముషం అతను తన డబ్బు మీద బతుకుతున్నాడని తను అతన్ని అందలం ఎక్కించినట్టు గుర్తు చేసి, అతని మొహం అవమానంతో నల్లబడితే చూసి ఏదో కసి తీరినట్లు తృప్తి పడేది. ప్రతి మాటకి పెడర్ధాలు తీసి రాద్దాంతం చేసేది.
"అబ్బబ్బ --- వేళకి లేకుండా యీ డ్రైవరు ఎటు పోయాడు" ప్రసాద్ ఓసారి అర్జంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చి విసుకున్నాడు.
"కారులో తప్ప కాలు కింద పెట్టారు గాబోలు దొరగారు ....కారులో పుట్టి పెరిగినట్టు ఏం పోజు, నడమంత్రపు సిరి ....' హేళనగా నవ్వేది. పక్క మీద కూర్చుని గదిలో ప్రసాద్ చేసే ప్రతి పనిని విమర్శించడమే పని అన్నట్టు....డ్రస్సు అవుతూ....సెంటు స్ప్రే చేసుకుంటే ....."తేరగా వచ్చిందనేమిటి అలా వంపుకుంటున్నారు...." "మీరు సూటేసుకోడం యిదేనా మొదటిసారి" అని నవ్వేది. 'అబ్బోబ్బో ...బెడ్ కాఫీ తాగుతున్నారే, యిదేప్పటి నుంచీ అలవాటు, ఏ సినిమాలో చూసారేమిటి....' సందు దొరికితే హేళనగా మాట్లాడేది. అతని అలవాట్లన్నీ ఎత్తి పొడిచేది. అతనే క్షణంలోనూ ఆమె డబ్బు మీద బతుకుతున్నానన్న విషయం మరచిపోనిచ్చేది కాదు.
ఇంట్లో వుండే లత ఎత్తి పొడుపులు భరించలేక అతను వీలయినంత వరకు ఆఫీసులో గడపసాగాడు. అతనాఫీసు నుంచి ఆలస్యంగా వచ్చినా లక్ష ప్రశ్నలు వేసి ఆఫీసు నించి ఆలశ్యంగా వచ్చినందుకు రాద్దాంతం చేసేది.
"నీ ఎదురుగా కూర్చుని నీ ఎత్తి పొడుపులు భారించాలంటావా...." "ఏం అబద్దాలా అవి....' అబద్దాలు కాకపోయినా నిజం పదిసార్లు చెప్పినా వినేవాళ్ళకి వెగటుగా వుంటుంది. "నీ డబ్బు మీద బతుకుతున్నానని , లేనివాడి నని ఎన్నిసార్లు రోజుకి అంటే నీకు తృప్తిగా వుంటుంది....' ప్రసాద్ తీక్షణంగా అన్నాడో రోజు.
"వున్నామాటంటే అంత ఉలుకెందుకు . హాస్యంగా అంటే"
"హాస్యం....మొగుడ్ని దరిద్రుడని పదేపదే చెప్పడం హాస్యం. లతా, నాకూ అభిమానం అన్నది వుంటుందని మరచిపోకు. నీ డబ్బు కోసం కాకపోతే నీలాంటి అవిటిదాన్ని చేసుకునే ఖర్మ నాకేం. నాకేం లోటు..... లక్షలు కాకపోయినా ఏదో ఉద్యోగం చేసుకుని భార్య బిడ్డలను పోషించుకోగలను. పదేపదే యింక నన్నేత్తిపొడిస్తే వూరుకొను" ఓ రోజు తీవ్రంగా మనస్సు గాయపడగా అన్నాడు.
ఆ మాటకి --- అంత గట్టిగా ఆమె జన్మలో ఎవరూ ఎదిరించి మాట్లాడలేదేమో , చూస్తుండగానే లత మొహం ఎర్రబడిపోయింది. కళ్ళు తీక్షణమైపోయాయి. ఆ తరువాత లత ఎంత హంగామా చేసిందో చూసిన ప్రసాద్ బిక్కచచ్చి పోయాడు. నన్ను అవిటిదంటావా, కుంటి దంటావా. చూడు నీ కాళ్ళు రేపటికి పడిపోతాయి. నీ కాళ్ళు విరిచేస్తాను. నా డబ్బు తింటూ నన్ను తిడ్తావా.... చేతికందిన వస్తువులన్నీ అతని మీద విసిరేసింది. తలగడలు, పుస్తకాలు, ట్రాన్సిస్టర్, మందు సీసాలు, బ్యాటరీ లైటు అందుబాటులో వున్నవన్నీ విసిరేస్తూ ఏ కింద జాతుల వారో రోడ్డున పడి తిట్టుకుంటున్నట్టు గా నానా తిట్లు తిట్టి పెద్ద పెద్ద పెట్టున గోల ఆరంభించింది. ఆ కేకలకి, ఏడుపులకి కింద నించి తల్లి, తండ్రి నౌకర్లు, చాకర్లు అంత పరుగెత్తి వచ్చారు. అంతవరకు లత ఎత్తి పొడుపులు , తను బాధ పడడం అంతా యిద్దరి మధ్యే వుండిపోయాయి గాని ఆ నోటితో అంతా బట్టబయలు అయింది .
"డాడీ వీడిని పొమ్మను, యింట్లోంచి పొమ్మను. నన్ను కుంటిదాన్నన్నాడు. పొమ్మను డాడీ....నిన్ను....నిన్ను ....చంపేస్తాను" ఆ పిచ్చి ఆవేశం చూచి ప్రసాద్ చకితుడై నోటమాట రానట్టు నిలబడిపోయాడు.
తల్లి వచ్చి కూతుర్ని పొదివి పట్టుకుని ఓదారుస్తూ , బుజ్జగిస్తూ మాట మరిపించడానికి ప్రయత్నించ సాగింది. నారాయణమూర్తిగార్కి సగం విషయం అర్ధం అయి ప్రసాద్ మాడిపోయిన మొహం చూసి అతనక్కడుంటే లత ఆవేశం మరింత ఎక్కువవుతుందని లాక్కెళ్ళి నట్టే వేరే గదిలోకి లాక్కెళ్ళిపోయాడు . అక్కడ ప్రసాద్ ద్వారా ముందునించి లత వైఖరి అంతా విని నిట్టూర్చాడు. "బాబూ! డానికి ఈ లోటుండడం వల్ల ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్సు పెరిగిపోయి ఎవరన్నా దాన్ని లోకువగా మాట్లాడితే పిచ్చి ఆవేశం వస్తుంది. చిన్నప్పటి నుంచి ఒక్కత్తే అవడం వల్ల మంకుతనం, ఎక్కువైంది. రోగిష్టిదని డానికి కష్టం కల్గకూడదని అది అన్నదానికల్లా తల వూపాం. దాంతో డానికి మిగతా అందరినీ చిన్నచూపు చూడడం అలవాటయింది. నీవే సర్దుకోవాలి. దాని బాధ అర్ధం చేసుకుని ఓర్పు వహించాలి ప్రసాద్."
"ఓర్పు ఎంతకని సహించను. ప్రతి నిమిషం కించ పరుస్తుంటే ఎంతకని సాహిస్తాను. కట్టుకున్న వాడన్న గౌరవం కాదు కదా, నౌకరు కి యిచ్చినంత విలువ కూడా ఇవ్వకుండా తీసి పారేస్తుంటే ఎంతకని ఓర్పుకోను. మీకు డబ్బుంది, ఆ డబ్బుకి ప్రలోభపడే యీ పెళ్ళి చేసుకున్నాను. నిజమే, అయితే మాత్రం నేను మనిషిని కానా?" ప్రసాద్ ఆవేశంగా అన్నాడు. ముందు నించి అంతా చెప్పేడు.
"నిజమే, కాని ఏం చెయ్యను చెప్పు. దాన్ని మంచిగా లొంగదీసుకోగలం గాని ఏమాత్రం అధికారం చూపినా అది సహించదు" అంటూ ముసలాయన ప్రసాద్ ని బతిమాడుకుంటూ గంట బోధపరిచాడు.
నీవు నీ కూతురు గంగలో దుమకండి. నేను పోతున్నాను. యింత కంటే అడుక్కు తినడం నయం అనాలన్నంత ఆవేశం వచ్చింది . అయన చెప్పే సంజాయిషీ వింటుంటే. కాని అయన మొహం ఎదుట ఏమనలేక వూరుకున్నాడు ప్రసాద్.
అతని అవస్థ అర్ధం అయింది ఆయనకి. కూతురి మీద పిచ్చి ప్రేమతో అయన నిస్సహాయుడయ్యాడు. కూతురు , అల్లుడి మధ్య సామరస్యం కుదరలేదని వాళ్ళిద్దరిని చూస్తూ అయన గ్రహించాడు. కాని చూసి చూడనట్లురుకున్నాడు. తను చెయ్యగల్గింది ఏమీ లేదని కూతురు మారదని తెల్సు ఆయనకి. ప్రసాద్ నెమ్మదస్తుడు కనక సర్దుకు పోతాడని. అన్నింటిని మరిపింపచేసే డబ్బు ప్రసాద్ నోరు మెదపనీయదు అని అలక్ష్యం చేశాడు. ఈరోజూ ప్రసాద్ ఆవేశం చూసాక, అతని మొహంలో కన్పించిన చిరాకు, నిర్లిప్తత , అతను పొందిన అవమానం అన్నీ చూశాక యిలా చాలారోజులు గడిస్తే అల్లుడి ప్రాణం విసిగితే ఏ డబ్బు అతన్ని కట్టిపడేయలేదని తెల్సుకున్నారాయన.