Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 17

 

    యతి , వీరయ్య తోటలో పని చేస్తున్నారు. ఆ సమయంలో పులిని అటువైపుగా అధికారుల దగ్గరకు తీసికెల్తున్నారు . దూరం నుంచి పులిని చూసి "గురూ గురూ గారు!" అన్నాడు వీరయ్య అస్పష్టంగా. విభ్రాంతితో, యతి వీరయ్యను ఆశ్చర్యంగా చూసాడు -
    "అతడు హంతకుడు - అందుకే మనలో కలవనియ్యకుండా విడిగా బంధించారు. రేపో - ఎల్లుండో ఉరి తీస్తారు ." అని చెప్పాడు యతి . యతి చెప్తున్న దేమిటో తనకు అర్ధం కానట్లు పిచ్చివాడిలా చూసాడు వీరయ్య. "అయ్యయ్యో! అయన హంతకుడు కాదండీ ? దేవుడండీ! నిజంగా దేవుడండీ , గుళ్ళో వున్న దేవుడి కంటే గొప్ప దేవుడండీ! ఈళ్ళు ఇట్టాంటాళ్ళనె ఉరి తీస్తారండీ!" అన్నాడు యేడుస్తూ....
    పోలీస్ అటు రావటంతో "హుష్" అన్నాడు యతి. తలవంచుకుని కన్నీళ్లు తుడుచుకున్నాడు వీరయ్య. జ్వరంలో కూడా ఆవురావురుమంటూ జైలు అధికారులిచ్చిన తిండి తిన్న వీరయ్య ఆ రాత్రి అన్నం తినలేకపోయాడు.
    అందరూ నిద్రపోయి సద్దుమణిగాక , నిద్రరాక కుములుతున్న వీరయ్యను, "పులి నీకు తెలుసా!" అన్నాడు యతి.
    "తెలుసు బాబు ! అయన చెడ్డోల్లకే పులి! మా అటుమంటోళ్ళకి దేవుడు! దేవుడంటే దేవుడు!"
    యతిలో కుతూహలం పెరిగింది.
    'అతడు నీకెలా తెలుసో చెప్పు!" అన్నాడు వీరయ్య కళ్ళు తుడుచుకుంటూ చెప్పటం ప్రారంభించాడు.


                                                                  13

    వీరయ్య కాఫీ తోటల్లో కులిగా పని చేస్తున్నాడు. సిటీకి ఇరవై మైళ్ళ దూరంలో వుందా ఎస్టేట్. కూలి వాళ్ళ కోసం ప్రత్యేకించి కట్టిన వార్డులలో ఒక దానిలో ఉంటున్నాడు . అతడి భార్య పోయింది. ముసలి తల్లి, కూతురు - ఇదే అతని కుటుంబం. కూతురు చాలా చక్కగా ఉంటుంది. హాయిగా పాడుతుంది. ఉన్న దాంట్లోనే ఆ కుటుంబం హాయిగానే వుంటోంది. కూలీల వార్డులకు దూరంగా వుంటాయి కంపెనీ డైరెక్టర్ల క్వార్టర్స్ - అవి కాంపౌండ్ వాల్ తో పూలతోటలతో విశాలమైన గదులతో అన్ని హంగులతో చాలా అందంగా వుంటాయి. వీరయ్యకు తోటపని అంటే చాలా ఇష్టం. అంచేత కాఫీ తోటల్లో కూలి పని అయిపోయాక ఒక డైరెక్టర్ గారింట్లో తోటమాలి పని చెయ్యటానికి ఒప్పుకున్నాడు. డైరెక్టర్ కాస్తో కూస్తో ముట్ట చెబుతారన్న ఆశతో. ఎలాగైనా డబ్బు కూడబెట్టి కూతురికి పెళ్ళి చేయాలన్నదే వీరయ్య ఆశయం. ఒక చిల్లు పిడత కొన్నాడు. ఎప్పటికప్పుడు రూపాయి కాగితాలు, చిల్లర నాణాలూ అన్నీ అందులో వేస్తుంటాడు. తీరిక దొరికినప్పుడల్లా దాన్ని ఆడించి చూసుకుని సంతృప్తి పడుతుంటాడు. తెలిసన వాళ్ళతో చెప్పి సంబంధాలు కూడా చూడమంటున్నాడు.
    ఆ సాయంత్రం వీరయ్య మొక్కలకు నీళ్ళు పడుతుండగా డైరక్టర్ గారు పిలిచి 'వీరయ్యా! సిటి కెళ్ళి బ్రాందీ తీసుకోస్తావా?" అన్నాడు. వీరయ్య సందేహిస్తూ నిలబడ్డాడు. ఇరవై మైళ్ళ దూరం వుంది టౌన్.
    "సైకిల్ మీద వెళ్ళు. వాచ్ మెన్ సైకిల్ తీసుకెళ్ళు.  అయిదు రూపాయలిస్తాను" "అయిదు రూపాయలు" లనే మాట మంత్రంలా పనిచేసింది వీరయ్య పైన . వెంటనే చేతులు కడుక్కుని డైరెక్టర్ గారిచ్చిన వందరూపాయల నోటందుకుని సైకిల్ మీద బయలుదేరాడు. డైరెక్టర్ గారి భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటి కెళ్ళింది. భార్య దగ్గర లేకపోయేసరికి మందు మీద మనసవుతుంది కాబోలు! - అని నవ్వుకున్నాడు.
    సైకిల్ మీద ఇరవై మైళ్ళు వెళ్ళి బ్రాంది సీసాలతో తిరిగివచ్చాడు వీరయ్య. వాచ్ మాన్ వరండాలోనే ఎదురయి చిల్లర జాగ్రత్తగా లెక్కబెట్టి తీసుకొని, అయిదురూపాయలు వీరయ్య చేతిలో పెట్టాడు. నొప్పితో పులిసి పోయినట్లున్న కాళ్ళను అరచేత్తో రాసుకుంటూ సంబరంగా ఆ అయిదు  రూపాయల నోటు మొలలో దోపుకున్నాడు వీరయ్య. ముసలి తల్లి నోట్లో గుడ్డలతో కాళ్ళు చేతులూ కట్టి పడేసి వుంది. వీరయ్య గుండెలు బాదుకుంటూ తల్లి కట్లు విప్పి నోట్లో గుడ్డలు తీసాడు. తల్లి శోకాలు పెడుతూ వీరయ్య కూతుర్ని ఎవరో బలవంతంగా ఎత్తుకుపోయారని చెప్పింది. వీరయ్య తల గిర్రున తిరిగింది. ఆ సమయంలో మెరుపులా గుర్తుకొచ్చింది వాచ్ మాన్ విషపు నవ్వు! మూసి వున్న డైరక్టర్ గారి గది తలుపుల ముందు వరండాలో నిలబడి వున్న వాచ్ మాన్ విషపు నవ్వు. ఆ సమయంలో సాధారణంగా డైరక్టర్ గది తలుపులు మూసి వుండవు. అయిదు రూపాయలు దొరికాయన్న సంబరంలో ఆ విషయం గమనించనే లేదు. అయిదు రూపాయల కోసం అన్ని మైళ్ళు సైకిల్ మీద తిరిగొచ్చాడు. ఈ అయిదు రూపాయలే అబం శుభం తెలియని తన కూతురి జీవితాన్ని భగ్గు మనిపించాయి. కర్ర తీసుకుని ఉద్రేకంగా డైరెక్టర్ గారి ఇంటి మీదకు బయలుదేరాడు. కేకలు వేసాడు - డైరెక్టర్ గారి మనుషులు వీరయ్యను చావబాది అవతల పారేసారు. లేవటానికి కూడా ఓపిక లేకపోయింది వీరయ్యలో. తెలతెలవారుతుండగా వీరయ్య కూతురు వచ్చి "అయ్యా" అని వీరయ్య మీద పడింది ఏడుస్తూ. తండ్రి అవస్థకి ఏడవాలో తన అవస్థకి ఏడవాలో అర్ధం కాలేదు ఆ అమాయకురాలికి. ఆ నిర్భాగ్యురాలే తండ్రిని ఇంటికి నడిపించుకుంటూ వచ్చింది. ఈ విషయం తెలిసి కూలీలు వచ్చిపోయారు. గుంపుగా డైరెక్టర్ ఇంటి మీద పడ్డారు. డైరెక్టర్ ఫోన్ మీద పోలిసుల్ని పిలిపించాడు. పోలీసులు భాష్పవాయు ప్రయోగాలతో , లాఠీ చార్జిలతో - కాల్పులతో కూలీలను చెదరగొట్టారు. చాలా మంది కూలీలు గాయపడి ఆసుపత్రులలో చేరారు. విషయం కోర్టు కెక్కింది. కూతురి పెళ్లి కోసం డబ్బు కూడ బెడ్తున్న కుండ పగలగొట్టి కోర్టుల ఖర్చుల కోసం ఉపయోగించాడు వీరయ్య. ఎంత ఖర్చయినా డైరెక్టర్ కి తగిన శిక్ష పడాలన్నదే వీరయ్య పట్టుదల. వాయిదాల మీద వాయిదాలతో కోర్టులో కేసు నెలల తరబడి సాగింది. వీరయ్య కూలిపని పోయింది. ఆరోగ్యం పాడయింది. చివరకు వీరయ్య కూతురు పిచ్చిదనీ, అది డైరెక్టర్ గారి యింటిమీద పడి గొడవ చేసిందనీ, అది సాకుగా కులీలంతా కావాలనీ గొడవ చేసారనీ , దీని వెనుక సంఘ విద్రోహకారుల ప్రోద్భలం ఉండవచ్చుననీ , రుజువయింది. కేసు కొట్టేసారు.
    వీరయ్యకు లోకమంతా అందకారమయి పోయింది. కూతురు బ్రతుకు పాడయిపోయింది, ఉద్యోగం లేదు. ఆ సమయంలో ఒక వ్యక్తీ వీరయ్య దగ్గరకు వచ్చాడు. అతడెవరో కూడా వీరయ్యకు తెలీదు. అచ్చం కూలీలాగే ఉన్నాడు .... అతడిని చూసిన గుర్తు కూడా లేదు వీరయ్యకి.

 Previous Page Next Page