Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 17


    దగ్గిరగా వచ్చి "భాస్కర్!" అంది -
    భాస్కర్ కళ్ళు తెరిచి జ్యోత్స్నను చూసి సంభ్రమంతో దిగ్గునలేచి కూచున్నాడు....
    "జ్యోత్స్నా.... ....మీరు.... ....ఇక్కడికి.... ...." అన్నాడు. ఆశ్చర్యంతో....
    "వచ్చేశాను-" నిదానంగా పూర్తి చేసింది జ్యోత్స్న.   
    "నలుగురూ నాలుగు మాటలూ అనరూ?"
    "అంటే, మనం నష్టపోయేది ఏముంది?"
    "సుశీల నానాగొడవా చేస్తుంది-"
    "కొత్త కాదుగా?"
    "ఎందుకొచ్చారు మీరు?"
    "భోజనానికి?"
    "జ్యోత్స్నా!"
    "అవునండీ! ఇవాళ నేను అన్నం వండుకోలేదు - ఆకలితో మీ దగ్గరికి వచ్చాను - నాకు కాస్త అన్నం పెట్టారా?"
    భాస్కర్ కదిలిపోయాడు - జ్యోత్స్న ఎందుకొచ్చిందో అతనికి అర్థమయింది - ఎవరో దేవత తనముందు సాక్షాత్కరించినట్లు జ్యోత్స్నను చూస్తూ కూర్చున్నాడు.    
    జ్యోత్స్న నవ్వి "మీరిలా ఎంతసేపైనా కూర్చుంటారు- లేవండి - వడ్డిస్తాను" అని, పీటా కంచం అన్నీ అమర్చింది.
    జ్యోత్స్న ఒక్క పీట మాత్రమె వెయ్యటం చూసి భాస్కర్ - "అదేమిటి? మీరొక్కరే తినిపోదామనుకున్నారా?" అన్నాడు -
    "అది మీకోసమే...."
    "ఆకలిగా ఉందని అన్నది మీరు - నేను కాదు -"
    "భలేవారే? నేను...."
    "ఇక్కడికి వచ్చారు -నాకు స్వయంగా భోజనం వడ్డిస్తున్నారు. ఇక నాతో కలిసి భోజనం చెయ్యడానికి సంకోచిస్తున్నారా!"
    "ఛః సంకోచం ఏమీలేదు-"
    "అయితే మీరు కూచోండి మరి! లేకపోతే నేనూ తినను - నా మీద ఇంత దయతో సాక్షాత్కరించిన దేవత సగమే అనుగ్రహిస్తానంటే ఎలా?"
    ఇంక మాట్లాడలేక పోయింది జ్యోత్స్న - తన సంకోచాన్ని వెనక్కు నెట్టి తనూ వడ్డించుకుంది.    
    సుబ్బలక్ష్మి వంట చెప్పుకోదగినంత రుచిగా లేదు- కానీ ఇద్దరిలో ఎవరికీ వంటకాలు రుచిగా లేవని అనిపించలేదు - ఏం తింటున్నారో ఇద్దరికీ తెలియలేదు - ఫలానిరుచి అని చెప్పలేని అపూర్వ మాధుర్యమేదో, వాళ్ళ జిహ్వలు అందించకుండానే మనసు అనుభవిస్తోంది.   
    భోజనాలు పూర్తయిన తరువాత జ్యోత్స్న కంచాలు తనే తీసేసి వంగి సింక్ దగ్గిర చెయ్యి కడుక్కోసాగింది.  
    వెనకనుండి జ్యోత్స్నను చూస్తోంటే భాస్కర్ లో విద్యుత్తులు ప్రవహించాయి. చటుక్కున జ్యోత్స్నను  సమీపించి రెండు భుజాల మీదా చేతులు వేసి జ్యోత్స్నను తనవైపు తిప్పుకున్నాడు-
    తనవైపు తిరిగిన జ్యోత్స్న ముఖం చూడగానే భుజాలమీద నుంచి చేతులు తీసేసి ఒక్క అడుగు వెనక్కి వేశాడు భాస్కర్ -
    జ్యోత్స్న కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి.
    "ఛీ! మీరూ ఇంతేనా?" అంది - భాస్కర్ ని తప్పించుకుని చరచర పైకి వెళ్ళిపోయింది -
    మతిపోయిన వాడిలా అయిపోయాడు భాస్కర్.... "ఛా మీరూ ఇంతేనా?" అన్న జ్యోత్స్న చీదరింపు అతని మనసును ఛెళ్ళు  ఛెళ్ళున కొరడాలతో చరుస్తూంది.  
    రెండు మూడు రోజులు జ్యోత్స్న ముఖం చూడలేక తప్పించుకు తిరిగాడు - అది మరీ నరకంగా తోచింది - జ్యోత్స్నను క్షమాపణ కోరుకోవటమే మంచి మార్గమనుకున్నాడు.
    ఆ సాయంత్రమే పార్క్ లో చెరువు గట్టున కూర్చున్న జ్యోత్స్నను కలుసుకున్నాడు.
    "ఇన్నాళ్ళుగా కనిపించటం లేదేం?" చిరునవ్వుతో అతి మామూలుగా అడిగింది జ్యోత్స్న -
    తెల్లబోయాడు భాస్కర్....
    "జరిగిన దానికి సిగ్గుపడి మీకు ముఖం చూపించలేక పోయాను ."
    "దానికేంముంది లెండి - మొగాళ్ళందరిలోనూ, ఈ బలహీనత ఉంటుందేమో!"
    జ్యోత్స్న ఇలా మాట్లాడటం భాస్కర్ కి నచ్చలేదు. తనకు జ్యోత్స్న పట్లగల మమకారాన్ని జ్యోత్స్న అతి సాధారణమైన బలహీనతగా అంచనా వెయ్యటం కూడా భరించలేకపోయాడు -   
    "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను-" అన్నాడు.
    ఆ మాటలు విని నవ్వింది జ్యోత్స్న-
    సర్వమూ అర్పించుకున్న తన తల్లి ప్రగాఢమయిన ప్రణయమూ. చౌదరిగారు - ఆయన ఇంట్లో పెళ్ళి పందిరీ చెరువులో తేలిన తన తల్లి శవం. ఈ దృశ్యాలన్నీ జ్యోత్స్న కళ్ళముందు కదిలాయి.
    "నవ్వుతున్నారెందుకు?"
    "అనుభవంలోకి వచ్చే అవకాశంలేని అందమయిన ఊహల్ని చూస్తే నవ్వురాదూ?"
    "నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను!"
    "పెళ్ళి! ఒకసారి చేసుకున్నారుగా ?"
    "అప్పుడు చిన్నవాణ్ణి."

 Previous Page Next Page