Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 18


    మనిషి ఎప్పుడూ చిన్నవాడే! కాలం ముందుకు గడిసే కొద్దీ - అనుభవాలు పండినకొద్దీ - గతంలోకి ఎప్పుడు చూసుకున్నా చిన్నగానే కనిపిస్తాడు."  
    "ఆనాడు నాకు జీవితంలో చదువు ఒక్కటే ప్రధానంగా కనిపించింది. ఎలాగైనా నా చదువు కొనసాగాలని ఇంకేమీ ఆలోచించకుండా పెళ్ళి చేసుకున్నాను. కానీ, ఈనాడు నాకు ప్రేమకంటే విలువైనది ఏదీలేదనిపిస్తోంది."
    "జీవితంలో ప్రతిదశలోనూ ఏదో ఒకటే ప్రధానంగా తోస్తుంది. ఒకనాడు చదువు ప్రధానంగా తోచింది - ఈనాడు ప్రేమ ప్రధానమని పిస్తోంది - ముందు ముందు ఈ రెండింటికంటే విలువైనది మరొకటి ప్రధానమైనదని మీరు గుర్తించవచ్చు. ఆనాడు నా ముందు మిగిలినవన్నీ తుచ్ఛమైనవిగా తోచవచ్చు...."  
    "జ్యోత్స్నా: నాలో నమ్మకం లేదా?"
    "నమ్మకం లేకపోతే ఇంతసేపు మీతో కూచుని మాట్లాడగలిగేదాన్ని కాను. మీలో నాకు పూర్తిగా నమ్మకముంది. కాని మనసు మీరు కుదుట పరచుకోగలరని, స్థిమితంగా ఆలోచించుకోండి. మంచి చెడ్డలు మీకే అర్థమవుతాయి...."
    "నీకు అన్నీ తెలుసు .. నా కోరిక అన్యాయమంటావా?"
    "ఇది న్యాయమనీ, ఇది అన్యాయమనీ, ఎవరు చెప్పగలరు సందర్భాలనుబట్టి న్యాయ న్యాయలూ మారిపోతుంటాయి - మంచితనంతో ఆలోచించగలిగిన ప్రతి మనసూ ఎప్పటికప్పుడు మరింత వికసిస్తూ ఉంటుంది. ఈ వికసిన శీలమే మానవత్వానికి పునాదులు ఏమో? ఆస్పత్రిలో ఇల్లాలిని అనాధగా వదిలి - ఆ ఆలోచనే లేకుండా మరొకరితో సుఖపడగలిగే దశలో ఉందా, మీ మనసు? ఉందని చెప్పండి - ఈ క్షణంలో పెళ్ళి చేసుకుందాం!"
    భాస్కర్ మాట్లాడలేదు.
    జ్యోత్స్న నవ్వి "చీకటి పడింది - లేవండి - వెళ్దాం?" అంది.    
    ఎప్పటిలా తన సైకిల్ దగ్గిరకి నడిచి చెయ్యి ఊపాడు భాస్కర్.
                                       9
    సుశీలకు ఆపరేషన్ చేసేరోజు నిశ్చయించాక వెంకట్రావు వచ్చాడు.
    ఆపరేషన్ కి వరసగా పేషెంట్స్ నందరినీ సిద్ధం చేసింది నర్స్- వాళ్ళంతా ఒకరినొకరు పట్టుకుని క్యూలో ఆపరేషన్ థియేటర్ లోకి నడుస్తోంటే ఆ క్యూలో సుశీలని చూడలేకపోయాడు భాస్కర్.   
    ముఖం పక్కకు తిప్పుకున్న భాస్కర్ భుజంపైన ఆప్యాయంగా తనచేత్తో తట్టాడు వెంకట్రావు.
    ఆపరేషన్ అయిదు నిముషాల్లోనే పూర్తయింది - ఆ తరువాత సుశీలని అదుపులో పెట్టడమే కష్టమయి పోయింది - కంటికి కట్టు కట్టారు - కదలటానికి వీల్లేదు.  
    భాస్కర్ వస్తే అతడు మొదటినుంచీ అశ్రద్ధ చేశారనీ, అందుకే తన జబ్బు ఇలా ముదిరి పోయిందనీ సతాయించేది. అది భరించలేక రాకపోతే "అసలు మీకు నా సంగతి కావాలా? ఇలా మంచం మీద పడి ఉన్నానే! కనీసం చూడటానికైనా రావద్దూ? అని ఏడ్చేది - ఆపరేషన్ జరిగి కళ్ళకు కట్టుకట్టి ఉన్న ఆ సమయంలో ఏడవ కూడదని ఎవరెంత చెప్పినా వినేది కాదు. భాస్కర్ ని సాధించటానికి ఏ ఉపాయమూ దొరక్క, తనను తను హింసించుకుని ఆ రకంగా భాస్కర్ ని సాధించాలని చూసేది.
    కట్లు విప్పారు.
    డాక్టర్ వెంకట్రావునీ, భాస్కర్ నీ తన గదిలోకి పిలిచి "అయామ్ సారీ: ముందే చెప్పాను. ఆపరేషన్ చేసినా లాభంలేదని. ఆవిడ అతిదగ్గరవి కొద్దిగా చూడగలదేమో! అంతకంటే ఆశలేదు." అని చెప్పాడు.
    సుశీలను ఎలా ఓదార్చాలా అనుకుంటూ భాస్కర్ వచ్చేసరికి సుశీల సంబరంగా "ఈ డాక్టర్ నిజంగా దేవుడండీ! నాకిప్పుడు అన్నీ చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఇంటి కెళ్ళగానే కొబ్బరి కాయలు కొట్టాలి - సత్యనారాయణ వ్రతం కూడా చెయ్యాలి-" అంది.       
    తెల్లబోయిన భాస్కర్ ఏదో మాట్లాడబోతుంటే వెంకట్రావు అతనిచేతిని గట్టిగా నొక్కి "వెరీగుడ్ సుశీలా: మనం చాలా అదృష్టవంతులం- నీకు కళ్ళు బాగుపడినందుకు ఇంటికి వెళ్ళగానే పార్టీ ఇద్దాం-" అన్నాడు.   


    "అలాగే నాన్నా?" అంది సుశీల ఉత్సాహంగా.   
    భాస్కర్ బొమ్మలా నిలబడి ఆ తండ్రీ కూతుళ్ళను చూశాడు.
    ఆ రోజే సుశీలని ఇంటికి తీసుకొచ్చేశారు - అడిగిన అందరికీ తన కళ్ళు బాగుపడి పోయాయనీ, చక్కగా కనిపిస్తున్నాయనీ చెప్పింది సుశీల -
    ఆ సాయంత్రమే అందరికీ పార్టీ ఏర్పాటు చేశాడు వెంకట్రావు - ముందుగానే సుశీలని ఒక కుర్చీలో కూచోబెట్టి "అనవసరంగా కదలకు - ఇంకా నీరసంగా ఉన్నావు-" అన్నాడు. తల ఊపింది సుశీల.      
    జ్యోత్స్నతో భాస్కర్ అంతకు ముందుగానే "మా మాఁ వగారు సాయంత్రం పార్టీ ఇస్తున్నారు, సుశీలకి కళ్ళు బాగుపడినందుకు - అందరూ రాకపోతే ఆయన ఊరుకోరు. మళ్ళీ మళ్ళీ పిలిపించుకోకుండా వచ్చేసెయ్యండి." అని చెప్పాడు - అంచేత జ్యోత్స్న వచ్చి సుశీల ప్రక్కన కూర్చుంది -  
    తను అంతగా తిట్టిపోసిన తరువాత జ్యోత్స్న పార్టీకి వస్తుందని సుశీల అనుకోలేదు - వచ్చినా తన ప్రక్కన కూచుంటుందని అసలు అనుకోలేదు - అంచేత తన ప్రక్కన కూచున్నది రేవతి అనుకుంది.    

 Previous Page Next Page