Previous Page Next Page 
రాక్షసుడు పేజి 17


    ఫాస్టస్ గుండె ఆగి, తిరిగి కొట్టుకోవటం ప్రారంభించింది. కాఫీ కప్పు బల్లమీద పెట్టి, ఇన్ స్పెక్టర్ లేచి "వెళ్లొస్తాను సార్" అన్నాడు. అతడెలా తలూపాడో అతడికే తెలీదు. ఇన్ స్పెక్టర్ వెళ్ళిపోయాడు. రిస్ట్ వాచి శబ్దం ఆ నిశ్శబ్దంలో తన గుండెలమీద కొడుతున్నట్టు ఫీలయ్యాడు ఫాస్టస్. ఆ గదిలో ఒంటరితనం అమితంగా భయపెట్టసాగింది. ఎదురుగా తివాచీ మీద రక్తం మరక నెమ్మదిగా ఆ గదంతా పాకుతున్న భావన కలిగింది. క్రమక్రమంగా అది తనని ఆక్రమిస్తున్నట్లు అనిపించింది. పక్కమీద పడుకుని కళ్ళు మూసుకోవటానికి ప్రయత్నించాడు. అదే మరక. లేచి కూర్చున్నాడు. అదే మరక. భయంతో వణికాడు.

 

    వెయిటర్ రాలేదు. ఆ రోజే కాదు. రెండ్రోజుల వరకూ దాని గురించి ఎవరూ రాలేదు. గుర్తు చేద్దామంటే ఎవరికైనా అనుమానం వస్తుందేమోనని భయం.

 

    ఆ రెండ్రోజులూ ఫాస్టస్ ఏమీ పని చేయలేకపోయాడు. వాటర్ రిపోర్టులు  చదువుతున్నాడే తప్ప ఏమీ తలకెక్కటం లేదు. మూడో రోజు ఇన్ స్పెక్టర్ మళ్ళీ వచ్చాడు. రాగానే యధావిధిగా క్షమాపణలు చెప్పుకుని అడిగాడు.

 

    "అతడికిగానీ నెపోలియన్ బ్రాందీ మీరిచ్చారా?" అని అడిగాడు.

 

    "ఆ... అవును. ఏం?"

 

    "ఏం లేదు. ఈ రోజే పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. అతడి కడుపునిండా బ్రాందీ వుంది. కాబట్టి అతడు ఆత్మహత్య చేసుకున్నది డ్రింక్ లేకపోవటం వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ తో కాదు- ఇంకేదో కారణం అయివుంటుంది... ఏమిటో అది? ఆ బ్రాంది మీరిచ్చిందేనా కాదా అని కనుక్కుని రమ్మన్నాడు. ప్చ్ ... మా డీయస్పీ నిజంగా చంపుతున్నాడు సార్... వెళ్లొస్తాను" అంటూ లేచాడు.

 

    అతడు వెళ్ళాక మిగిలిన నిశ్శబ్దం ఈసారి మరీ భయంకరంగా తోచింది. దానికన్నా ముఖ్యంగా కార్పెట్ మీద ఎండిపోయిన రక్తం మరక.

 

    ఇక లాభం లేదనుకుని, తానే దాన్ని శుభ్రం చేయటానికి పూనుకున్నాడు. గది తలుపు బోల్టు వేసి వచ్చి బాత్ రూమ్ లోంచి బాల్చీ, సోప్ వాటర్ తీసుకున్నాడు. బ్రష్ తో సహా వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని నీళ్ళతో తడి చేయబోతూ వుండగా ఫోన్ మ్రోగింది.

 

    వెళ్ళి అందుకుని "హల్లో" అన్నాడు.

 

    "మీరు అంత శ్రమ పడనవసరం లేదు డాక్టర్ ఫాస్టస్, మా వాళ్ళే వచ్చి గది శుభ్రం చేస్తారు" తాపీగా వినిపించింది అట్నుంచి.

 

    ఫాస్టస్ అదిరిపడి ఫోన్ వంక చూసేడు. పడిపోబోతూన్న రిసీవర్ ని అతికష్టం మీద పట్టుకొని, వణుకుతూన్న కంఠంతో "మీరెవరు?" అని ఆగాడు.

 

    "హోటల్ యాజమాన్యం తరఫున మాట్లాడుతున్నాం ఫాస్టస్! ఎయిర్ కండీషనర్ వేపు చూడండి... గుడ్ ఇప్పుడు మీరు మా వైపు చూస్తున్నారు".

 

    ఫాస్టస్ కి అర్థం కాలేదు. కానీ ఎందుకో అప్రయత్నంగా వెన్ను వణికింది.

 

    "చాలామంది డబ్బున్న వాళ్ళు- చాలామంది డబ్బున్న వాళ్ళ భార్యలూ ఇక్కడ కలుసుకుంటారు డాక్టర్. అందుకే ఎందుకైనా మంచిదని ఈ హోటలు గదుల్లో కన్ సీల్డు కెమేరాలు పెట్టి వుంచాం, మీకు ఆమెకు మధ్య ఏదో రాసకేళి జరుగుతుంది, సరదాగా వీడియో రికార్డింగ్ చేద్దామనుకుంటే, అది హత్యలోకి దారితీసింది. దురదృష్టవశాత్తూ ఆ హత్య మీ గదిలో ఒక మూల జరిగింది. మా కెమేరా కేవలం 'పక్క' మీదకే ఫోకస్ చేయబడి ఉందాయె! అందుకే మరింత పకడ్బందీగా, మీరు బాల్చీ పట్టుకొచ్చే వరకూ ఆగవలసి వచ్చింది. అది రక్తం మరక అని మీకు తెలుసు అన్నది ఇప్పుడు కాసెట్ లో ముద్రితమైపోయింది. మీరిందులో పూర్తిగా ఇరుక్కుపోయారు డాక్టర్" అంటూ ఆగింది అవతలి స్వరం. చాలాసేపటి వరకూ మాట్లాడలేదు.  

 

    నిశ్శబ్దాన్ని చీలుస్తూ "ఇప్పుడు మీకేం కావాలి" అన్నాడు ఫాస్టస్. అతడి కంఠం నూతిలోంచి వచ్చినట్టు హీనంగా ఉంది.

 

    "చాలా డబ్బున్నవాళ్ళు, బాగా కొవ్వెక్కిన ఆడవాళ్ళు ఇందులో చిక్కుకుంటూ వుంటారు డాక్టర్! వాళ్ళు ఇచ్చే దానితో పోల్చుకుంటే, విదేశాల నుంచి వచ్చిన మీరు మాకేమి ఇవ్వగలరు? అలాగే భర్తపోయిన ఆమె నుంచి మేము ఏమి ఆశించగలం?"

 

    "మరి ఇదంతా ఎందుకు?" అడిగాడు ఫాస్టస్ అయోమయంగా.

 

    "ఎందుకో మాకూ తెలీదు. మా తెలుగులో ఒక సామెత వుంది. 'తీగె లాగితే డొంక కదిలిందని' అలా ఏదో బ్లాక్ మెయిలింగ్ కోసం మేము ఏర్పర్చుకున్న ఈ వలలో మీరు అనవసరంగా వచ్చిపడ్డారు. మా తెలుగులో మరొక సామెత కూడా ఉంది. 'శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్ట'దని. కాబట్టి ఇదంతా ఎందుకు జరిగిందో మాకు తెలీదు. మీరున్న కాలంలో మీ అవసరం మా కేదయినా పడిందనుకోండి. అది చేసి పెడుదురు గానీ.... లేదా హాయిగా వెళ్ళిపోదురుగానీ. మా పిల్లలకి మీరు వెళ్ళి పోయాక ఈ వీడియో కాసెట్ వేసి చూపిస్తే వాళ్ళూ ఆనందిస్తారు- హత్యని ఆత్మహత్యగా నోట్ చేసుకోని ఫైల్ క్లోజ్ చేసిన మా దేశపు పోలీసు డిపార్ట్ మెంట్ సామర్థ్యాన్ని కళ్ళారా చూసి..." ఫోన్ కట్టయింది.

 

    అది కాదని ఫాస్టస్ కి తెలుసు.... ఏదో వుంది! ఏ కారణమూ లేకపోతే ఈ పనిచేయరు. ఏమిటది?

 

    -ఆ రోజు నుంచీ అతడికి నిద్ర కరువైంది. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడటం ప్రారంభించాడు. ఏ క్షణం తిరిగి ఇన్ స్పెక్టర్ వస్తాడో అని భయపడసాగాడు. దేని మీదా దృష్టి నిలవటం లేదు. ఏ క్షణం ఆ కాసెట్, "సరదాగా" పోలీసు డిపార్టుమెంట్ కి అందజేయబడినా తన పని ఆఖరు. ఒక్క హత్యేకాదు. హత్యని దాచిపెట్టినందుకు కూడా శిక్ష! తప్పించుకోవటం అసాధ్యం. ఆత్మ రక్షణార్థం అంటే ఎవరూ నమ్మరు. ఎలా...? ఏం చెయ్యాలి...?

 

    ఫాస్టస్ కి అకస్మాత్తుగా 'అతడు' జ్ఞాపకం వచ్చాడు. అతడి మాటలు గుర్తొచ్చాయి..

 

    నా తండ్రి జి.కె.కి చాలా పరపతి ఉంది. కోట్ల కోట్ల డబ్బు మూలుఘ్తూ వుండటంతో పోలీస్ డిపార్టుమెంటు నుంచి ఎక్సయిజు దాకా ఇలాటివి తెచ్చి ఇచ్చి సావనీర్ల కోసం చందాలు వసూలు చేసుకుపోతారు...

 

    దేశం కాని దేశంలో తనని రక్షించగల ఏకైక వ్యక్తి "అతడే".

 

    - ఈ ఆలోచనవచ్చాక అతడు ఎంతో ఎలాక్స్ డ్ గా ఫీలయ్యాడు.

 

    ఆ సాయంత్రం మామూలుగానే 'అతడు' వచ్చాడు. కొంచెంసేపు మామూలు సంభాషణ అయ్యాక ఫాస్టస్ తటపటాయిస్తూ "నువ్వు నాకో సాయం చేయాలి..." అన్నాడు. అతడో క్షణం ఆశ్చర్యపోయి, "ష్యూర్ - చెప్పండి" అన్నాడు సర్దుకుంటూ.

 

    ఫాస్టస్ మాట్లాడలేదు చెపుదామా వద్దా అని కొట్టుమిట్టాడుతూ కొంచెంసేపు వూరుకుని తరువాత ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెప్పటం ప్రారంభించాడు. ఒకసారి మొదలుపెట్టాక అదే ప్రవాహంలా వచ్చింది. తను ఇందులో ఎలా ఇరుక్కున్నదీ, ఇన్నాళ్ళూ తను అనుభవించిన మానసిక వ్యధ- అన్నీ వివరించాడు. అంతా చెప్పి, "వాళ్ళు నా నుంచి ఏం ఆశిస్తున్నారో తెలీదు. ఒకవేళ డబ్బే అయితే..." ఫాస్టస్ బాధగా అన్నాడు- "అది నా దగ్గిర లేదు".

 

    అతడు వినటం లేదు. ఫాస్టస్ బాధని అర్థం చేసుకుని నేనున్నానని ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. అతడికి బాధపడటం తెలీదు. బాధని ఎదుర్కోవటమే తెలుసు. ఫాస్టస్ చెపుతున్నంతసేపూ ఆలోచిస్తూనే వున్నాడు తప్ప అతడి ఫీలింగ్స్ చూడటంలేదు.

 

    "ఈ గదులు సౌండ్ ఫ్రూఫ్ లు కదా".

 Previous Page Next Page