Previous Page Next Page 
అంకితం పేజి 17


    నేను కృతజ్ఞతా పూర్వకంగా ఆమెవైపు చూసాను.

    అప్పటివరకూ నేను అనుభవించిన బడలిక.......ఆ ఆత్మీయతవల్ల క్రమక్రమంగా దూరమయింది.

    అంతలో ఫోన్ మ్రోగింది. "హలో" అంది.

    "మీరు అంకిత్ ఫాదర్ కదూ."

    "అవును. మీరెవరు?"

    "నా పేరు గోపాల్రావ్. డాక్టర్ గోపాల్రావ్!"

    "చెప్పండి."

    "మీ సమస్య మాకు తెలుసు."

    నేను మొహం చిట్లించాను. "ఏమిటి మీరు మాట్లాడేది?"

    "అంకిత్ గురించి......"

    "అయితే?"

    "అంకిత్ విషయం మీరు అనుమతిస్తే...... మా కంపెనీ ఉద్యోగి వచ్చి మీతో మాట్లాడతారు."

    "మీది ఇన్సూరెన్స్ కంపెనీయా?"

    "కాదు."

    "మరి?"

    "ఆ విషయాలన్నీ మా మనిషి పెర్సనల్ గా వచ్చి మాట్లాడతాడు. ఇంతకన్నా వివరాలు ఫోన్లో చెప్పటం సాధ్యంకాదు."

    కోపంగా ఫోన్ మధ్యలో పెట్టేసే వాడినే అంకిత్ ప్రసక్తి కాకపోతే.

    కష్టంమీద  విసుగు అణుచుకుంటూ, "మీరేమీ చెప్పకుండా అప్పాయింట్ మెంట్ అడిగితే ఎలా?" అన్నాడు.

    "అంకిత్ కిడ్నీ విషయం."

    నా గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. "వెంటనే రాగలరా?" ఉద్వేగంగా అన్నాను.

    "ఒక గంటలో మా ఉద్యోగి మీ ఆఫీసు దగ్గిర వుంటారు" ఫోన్ పెట్టేసాడు అవతలి వ్యక్తి.

    సరీగ్గా ఒక గంట తరువాత ఒకముప్ఫై ఏళ్ళ స్త్రీ మా ఆఫీసుకి వచ్చింది. ఆమె పెర్రు ఉన్మీల.

    "గంట క్రితం మా ప్రొప్రయిటర్ గారు మీతో మాట్లాడారు."

    "అవును. మీకోసమే ఎదురు చూస్తున్నాను." అంటూ ఇంటర్ కమ్ నొక్కి రెండు కాఫీలు పంపమని చెప్పి, ఆమెవైపు తిరిగి, "మీరు ఏ విషయం మాట్లడదల్చుకున్నారు? అంకిత్ గురించి మీకు ఎలా తెలిసింది?" అని అడిగాను.

    "అంకిత్ కిడ్నీ సమస్య గురించి మాకు ముందునుంచే తెలుసు. మా కంపెనీలో ఒక ఏజెంట్ ఇలాంటి వివరాలు సేకరిస్తూ వుంటాడు. ఎప్పటికప్పుడు కొత్తగా అడ్మిట్ అయే పేషెంట్లు గురించి మేము తెలుసుకుని, వారిని కలుసుకుని సాయపడతాము."

    "ఏ విధంగా-"

    కిడ్నీ అమ్మటంద్వారా."

    ఉలిక్కిపడ్డాను, ఆమె కొనసాగించింది.

    "అవును. మేము మీకు కిడ్నీ సంపాదించి పెడతాము. దానికి రెండు నుంచీ నాలుగువారాల దాకా పట్టవచ్చు. అఫ్ కోర్స్! ఊరికే కాదనుకోండి. కొంత డబ్బు వసూలు చేస్తాం."

    "మీ కంపెనీ పేరు?"

    ఆమె నవ్వింది. ".......నిజానికి మా కంపెనీకి పేరంటూ లేదు. ఇచ్చేవాళ్ళకీ, పుచ్చుకునే వాళ్ళకీ మధ్య వారధిలా వుంటాం అంతే."

    కాఫీలు వచ్చాయి తాగుతూ అడిగాను. "మీరిచ్చే కిడ్నీ పూర్తిగా ఆరోగ్యవంతంగా వుంటుందా?"

    "లేనిపక్షంలో డాక్టర్లే ముందు నిరాకరిస్తారు కదా!"

    "నిజమే!.... ఇదంతా న్యాయబద్ధంగా జరుగుతుందా?"

    "దాత అనుమతి తీసుకునే మేము ఇదంతా చేస్తాం. వారి అనుమతి పత్రాన్ని మీకు అందచేస్తాం కూడా."

    "ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నందుకు క్షమించండి."

    ఉన్మీల నవ్వింది......... "అనుమానాలు నివృత్తి చేసుకోవటం మంచిదేగా, అడగండి."

    "ఇంకేమీ లేదు. ఆఖరి ప్రశ్న. రక్తసంబంధం లేని వారి కిడ్నీని శరీరం రిజెక్ట్  చేస్తుందని విన్నాను."

    "మేమొక కిడ్నీ అమ్మినందుకు రెండు లక్షల రూపాయలు ఫీజుగా తీసుకుంటాం. సంవత్సరానికి యాభైవేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల్లో అప్పు చెల్లించాల్సి వుంటుంది. మధ్యలో కిడ్నీ రిజెక్ట్ అయితే అప్పు చెల్లించనవసరంలేదు."

    నా అనుమానాలన్నీ పటా పంచాలయ్యాయి. సమస్య ఇంత సులభంగా పరిష్కారం అవుతుందనుకోలేదు. ఆమెవైపు కృతజ్ఞతగా చూసాను. "థాంక్స్.......మా డాక్టర్ తో మాట్లాడి ఏ విషయం తెలియజేస్తాను గంటలోపే."

    ఉన్మీల లేచి, తన బ్యాగ్ లోంచి విజిటింగ్ కార్డు తీసి అందించి, "ఫోన్ చెయ్యండి" అని చెప్పి వెళ్ళిపోయింది.

    గంట తర్వాత ఫోన్ చేసి........వద్దని చెప్పాను.


                        8

    గాడ్ ప్రపోజెస్.

    మాన్ డిస్పోజెస్!

   
                                     *    *    *

    అరుంధతీ నేనూ మృణాళిని ఎదురుగా కూర్చున్నాం. అంకిత్ ఆరోగ్యం గురించి మాట్లాడాక ఉన్మీల ఇచ్చిన ఆఫర్ గురించి చర్చించాం.

    ఆమె కొంచెంసేపు మవునంగా వూరుకుని "మీ ఇష్టం" అంది.

    "ఇందులో మీ హాస్పిటల్ అధికారులకి కూడా వాటా వుంటుందా?"

    ఆమె విస్మయంగా చూసి "మీకెలా తెలుసు?" అంది.

    "అంకిత్ విషయం వాళ్ళకి తెలియటంతో అనుమానం వచ్చింది. అదేమీ ఫర్వాలేదుకానీ, ఈ ప్రపోజల్ ఎంతవరకూ మంచిది?"

    "చెప్పలేం. రక్తసంబంధం వున్న వారివే ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాయి. ఇక కనీసం దూరపు బంధుత్వంకూడా లేకుండా ట్రాన్స్ ప్లాంట్ చెయ్యడంవల్ల రిస్క్ లో పడతాం. డోనర్స్ కిడ్నీని బాడీ రిసీవ్ చేసుకోవడానికి ఫిఫ్టీ పర్సెంట్  మాత్రమే ఛాన్స్ వుంది. చూస్తూ చూస్తూ మనం వుండలేక ఎవరి కిడ్నీ పడితే వారిది ట్రాన్స్ ప్లాంట్ చేసినప్పుడు అంకిత్ శరీరం దాన్ని గుర్తించక, ఆ కొత్తగా వచ్చిన అవయవాన్ని రిజెక్ట్  చేస్తే మనం అంతాచేసి వృథా అవుతుంది."

    "అలాంటి సమయంలో మందులవల్ల సరిచేయవచ్చని మహారధిగారన్నారు కదా?" అన్నాను. మహారధి అన్న పేరు వత్తి పలుకుతూ.....

    "నిజమే కాని    అందువల్ల మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వుంటాయి. అంకిత్ చిన్నకుర్రాడు కాబట్టి ఆ మందులవల్ల అతనిలో ఎదుగుదల ఆగిపోవచ్చు. లేదా మెంటల్ గా డల్ గా మారవచ్చు."

    నేను సీట్లో వెనక్కువాలాను. ఎ.సి. పని చేస్తున్నా నా నుదురంతా చెమట పడుతుంది. తిరిగి మృణాళిని కొనసాగించింది. "ఈ పరిస్థితిలో ఉన్మీల తెచ్చిన ఆఫర్ కూడా మీరు తిరస్కరించడం మంచిది అని నేను  చెప్పడంలేదు. కాని కాస్త ఆలస్యమయినా అంకిత్ కి మళ్ళీ ఎలాంటి ఎఫెక్ట్స్ రాకుండా జాగ్రత్తపడాలి కదా" అంది.

    అరుంధతి సడన్ గా నావేపు తిరిగి "మీరింకేదో మార్గముందన్నారు" అనడిగింది. నేను తల కాస్త ఎత్తి "అవును వుంది. కాని అది ఇంకా రిస్క్ తో కూడుకున్న పని. అయితే అంతకన్నా మరో మార్గం అనేది ఇకలేదు" అన్నాను.

    మృణాళిని "ఏమిటది?" అంది ముందుకు వంగుతూ.చెప్పక తప్పదు అన్నట్టు చెప్పాను "అంకిత్ తల్లిని వెదకడం."

    అరుంధతి ఉలిక్కిపడింది. నేను చెప్పాను. "అంకిత్ తల్లి తప్ప ఈ ప్రపంచంలో వాడిని ఎ శక్తీ రక్షించలేదని అర్థమైంది. అందుకే ఈ క్షణం నుండి నేనామెను వెదికే ప్రయత్నం చేస్తాను."

    "ఎలా ఆమె ఎవరో మనకి తెలీదు కదా? పదకొండేళ్ళనాటి మాట. ఆమె ఇప్పుడు ఎక్కడవుందో" అరుంధతి స్వగతంగా అంది.

    నేనేదో అనబోయాను. నర్స్ వచ్చి మిమ్మల్ని డాక్టర్ మహారధి పిలుస్తున్నారని చెప్పటంతో లేచాను. మృణాళిని కూడా నాతోపాటు లేచి "మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను" అంది.

    నేనేదో అనబోయాను. నర్స్ వచ్చి మిమ్మల్ని డాక్టర్ మహారధి పిలుస్తున్నారని చెప్పటంతో లేచాను. మృణాళిని కూడా నాతోపాటు లేచి "మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను" అంది.

    "థాంక్యూ" అంటూ బయటకు నడిచాను. అరుంధతి కూడా నా వెనకే బయటకి వచ్చింది. ఇద్దరం మహారధి గదిలోకి వెళ్ళాం.

    మమ్మల్ని చూడగానే ఆయన "రండి, కూర్చోండి" అన్నాడు.

    మేమిద్దరం కుర్చీల్లో కూర్చున్నాకే "అంకిత్ విషయం మాట్లాడాలని పిలిచాను" అన్నాడు.

    నాకు తెలుసు. అంతకుమించి మాట్లాడ్డానికి ఇంకేముంటుంది. "చెప్పండి డాక్టర్!" అన్నాను.

    "వీలయినంత త్వరగా ఆపరేషన్ చేసి అంకిత్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాలి" అన్నాడు. నేను మౌనంగా కొద్దిగా తలదించుకున్నాను.

    "అంకిత్ పరిస్థితి ఏమీ బావోలేదు. అతను ఆ మెషిన్ అంటేనే భయపడుతున్నాడు. మెషిన్ ఆం చేసే గంట ముందునుండీ అతనిలో బి.పి. బాగా పెరిగిపోతుంది. మనం తాత్సారం చేస్తే, టెన్షన్ ని తట్టుకోలేక అంకిత్ మరో ప్రమాదానికి గురయ్యే అవకాశముంది."

    "మరో ప్రమాదమా.......?" అరుంధతి వణుకుతోన్న గొంతుతో అడిగింది.

    "అవును! బి.పి. పెరిగితే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది."

    నేను ఉలిక్కిపడ్డాను, అరుంధతి ఒక్కసారిగా టేబుల్ మీద తల పెట్టుకుని బిగ్గరగా ఏడవసాగింది. ఆమెను చాలా సేపు సముదాయించాల్సి వచ్చింది. దుఃఖం ఉధృతం తగ్గినా ఆమె ఇంకా సన్నగా వెక్కుతూనే వుంది.

    నేను మహారధి వైపు తిరిగి "సాధ్యమైనంత త్వరగా అంకిత్ తల్లిని వెదికి పట్టుకునే ప్రయత్నం చేస్తాను" అన్నాను.

    "అంకిత్ తల్లినా? ఆవిడ మీకు ముందే తెలుసా?" అనడిగాడు.

    "లేదు! అయితే త్వరలోనే తెలుసుకుంటాను......" స్థిరంగా అన్నాను.

    మహారధి భుజాలు కుదిపి "ఏమో...... మీ ఇష్టం...... అయితే ఈ నెలలోపు అంకిత్ కి ఆపరేషన్ జరగకపోతే మాత్రం అతను మనకు దక్కడు" అన్నాడు.

    నేను లేచాను. అరుంధతి చేయి పట్టుకుని బయటికి నడిచాను.

    నా కొడుకు తల్లిని వెదికే ప్రయత్నం మరింత దీక్షతో మళ్ళీ మొదలు పెట్టడానికి.


                          *    *    *   

    మేము ఇంటికి వెళ్ళేసరికి జాన్ డేవిడ్ ఉన్నాడక్కడ. నేను అతడిని చూడగానే ఆనందమూ, ఆశ్చర్యమూ మిళితమైన స్వరంతో "ఎప్పుడొచ్చావ్?" అని అడిగాడు.

    "ఇప్పుడే..... అంతేకాదు. నీ ఇంట్లోనే ఒక నెలరోజులపాటు గెస్ట్ గా వుండబోతున్నాను."

    అతడి చెయ్యి పట్టుకుని సంతోషంగా వూపేస్తూ "నిజంగానా?" అని దాదాపు అరిచాను. ఆ పరిస్థితుల్లో ఒకరు తోడుండటం చాలా  ఆనందంగా అనిపించింది.

    "నువ్వు 'దయ'కి కృతజ్ఞతలు చెప్పాలి నెలరోజులు పాటు ఎడబాటు భరించటానికి తను అనుమతి ఇచ్చింది" అతడి మాటలు పూర్తి కాలేదు.

 Previous Page Next Page