Previous Page Next Page 
అంకితం పేజి 16


    "ఏమయ్యావురా నువ్వు? ఏమయ్యావు?

    వాడు వెంటనే సమాధానం చెప్పకుండా "వెళ్ళిపోదాం డాడీ" అన్నాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు, జనాన్ని దూరంగా తోస్తున్నారు. మరణించిన బాలుడి శరీరావయవాలు అక్కడక్కడా విసిరేసినట్టు పడివున్నాయి.

    వాటినుంచి దూరంగా వెళ్తూండగా అంకిత్ అన్నాడు. "నేను ఆ ఆస్పత్రిలో వుండలేను డాడీ. అందుకే చచ్చిపోదామని ఇక్కడికి వచ్చాను."

    వాడి చేతిని పట్టుకున్న నా చెయ్యి వణికింది.

    "అవును డాడీ. నేను అందుకే వచ్చేశాను. దూరంగా రైలు వస్తూకనపడింది. నేను దాకుదామనుకునే ముందే ఆ అబ్బాయి పట్టాల మీదకు వెళ్ళిపోయాడు. ఇంజను కొట్టగానే ముక్కలైపోయాడు. నేను చూస్తూనే వున్నాను డాడీ. ఆ రక్తం చూసేసరికి భయం వేసింది. పరుగెత్తుకు వెళ్ళి తుప్పల వెనక దాక్కున్నాను. బాగా భయం వేసింది. డాడీ.......అంతలో నువ్వొచ్చావు" నడుస్తూ చెప్తున్నాడు వాడు.

    నేను వెనుదిరిగి చూసాను.

    నా కొడుకుని రక్షించిన ఆ బాలుడి మృత శరీరంవైపు.


                         *    *    *

    "అమ్మా, నేనిక ఆ ఆస్పత్రికి వెళ్ళను."

    "ఇంటికి వచ్చాక అంకిత్ తల్లితో అన్న మొదటి మాటలు అవి.

    అంకిత్ ని చూడగానే నాలాగే అరుంధతి కూడా ఏడ్చేసింది. అయితే- తల్లి కాబట్టి - నాలా హిపోక్రసీ లేకుండా భోరున రోదించింది. ఆమె దుఃఖం ఉపశమించిన తరువాత అంకిత్ తన నిర్ణయం గురించి చెప్పాడు. వాడిని కన్విన్స్ చేయటానికి చాలాసేపు పట్టింది మా ఇద్దరికీ.

    "చూడుకన్నా....." అన్నాను అనునయిస్తున్నట్టు "ఇంకెంత నేల రోజులు....."

    "దేనికి? నేను చచ్చిపోవటానికా?"

    పఠేల్మని దెబ్బ తగిలినట్టు చూసాను.

    "ఎ..... ఎవరు చెప్పారు?"

    "నా పక్క బెడ్ మీద పేషెంటు".

    ఆవేశంతో నా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అతికష్టంమీద అణుచుకుని నవ్వేసాను. థాంక్స్ టు జాన్ డేవిడ్.

    విషయాన్ని తేలిక పరుస్తూ....... "వాడి మొహం. నిన్ను భయపెట్టటానికి అని వుంటాడు. నేలరోజులు తిరిగేసరికల్లా నువ్వు నాతోపాటు బీచ్ దగ్గర ప్రొద్దున్నే పరిగెడుతూ వుంటావు. సరేనా?"

    "సరే..... కానీ నాలుగుసార్లు" అన్నాడు.

    "ఏమిటి నాలుగుసార్లు?"

    "ఇంకా నాలుగుసార్లు సూదులు గుచ్చుతారన్నమాట."

    అవును వారానికి ఒకేసారి.

    నెల!

    ఆ విధంగా నా కొడుకు నాకు నెలరోజులు గడువు ఇచ్చాడు.


                                7


    సులభమూ - కష్టమూ అనేవి మనిషికి సంబంధించినవి. చేస్తూన్న పనికి సంబంధించినవి కావు. అన్ని పనుల కష్టసాంద్రతా ఒకటే. మనిషి వాటికి స్పందించే తీరే వేరు.


                         *    *    *

    చాలా రోజుల తరువాత విజయవాడ వీధుల్లో నడుస్తున్నాను. ఏమద మాడ్చేస్తుంది.

    గాంధీ బొమ్మకి కుడివైపు సందులో నాలుగో ఇల్లు!!

    దాన్ని సమీపిస్తూంటే నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఒకప్పుడు ఆ వీధిలోనే స్పుత్నిక్ లా తిరిగేవాడిని. అప్పుడు బరువు బాధ్యతలు లేవు. ఒక గమ్యంగానే, ధైర్యంగానీ లేవు.

    సుమద్యుతిని నేను ప్రేమించానా?

    లేదేమో.

    బహుశా, యవ్వనంలో వుండే ఆకర్షణ అయివుండవచ్చు అది.

    ఎవరుండి వుంటారు ఆ ఇంట్లో?

    పెళ్ళిచూపుల రోజు ఆ ఇంట్లోకి ప్రవేశించినపుడుసుమద్యుతి తండ్రి చూసిన చూపు నాకింకా గుర్తంది.

    ఆయనే వుంటారా? నన్ను గుర్తుపడతారా? పడితే ఆయన రియాక్షన్ ఎలా వుంటుంది? దాదాపు పది సంవత్సరాల తరువాత, కూతురి అడ్రసు వాకబు చేయటానికి వచ్చిన స్నేహితుడి (?) పట్ల ఏ తండ్రి రియాక్షనూ సుహృద్భావంగా వుండదని నాకు నిశ్చయంగా తెలుసు.

    ఆయన-ఇంట్లో వుండకూడదని వేయి దేవుళ్ళకి మొక్కుకుంటూ, మెట్లెక్కాను.

    ఆయన లేరు.

    ఇంకెవరో ముసలాయన వున్నారు.

    "సుమద్యుతి వాళ్ళ అడ్రసు చెప్పగలరా?" వచ్చిన పని సూటిగా చెప్పాను.

    "మీరెవరు?"

    "ఆమె క్లాస్ మేట్ ని. ఈ వూళ్ళోనే చదువుకున్నాం. పాత విద్యార్థులం ఫంక్షన్ ఒకటుంది. అందుకే వచ్చాను."

    "సుమద్యుతి ఎవరు?"

    నేను షాకైనట్టు చూసాను. ఆయన నన్ను ఆట పట్టిస్తున్నాడో, లేక చెప్పటం అయిష్టమై అబద్ధం చెపుతున్నాడో అర్థంకాలేదు. ఇది తమ స్వంత ఇల్లని ఆమె నాకు చెప్పింది.

    ఆ విషయమే ఆయనతో అన్నాను.

    "ఒహొ వాళ్ళా....... ఈ ఇల్లు పదేళ్ళ క్రితమే మాకు అమ్మేసారు".

    ఒక్కసారిగా నన్ను భరించలేనంత నిస్సత్తువ ఆవరించింది. అయినా ఆశ కూడగట్టుకుంటూ, "...... వాళ్ళు ప్రస్తుతం ఎక్కడుంటారో చెప్పగలరా?" అని అడిగాను.

    "తెలీదు" క్లుప్తంగా అన్నాడు. నాతో ఎక్కువ మాట్లాడటం ఆయనకి ఇష్టంలేదని తెలిసిపోయింది. పాత విద్యార్థుల కాలేజీ ఫంక్షన్ అంటే- 'పెళ్ళయిన పదేళ్ళ తరువాత వచ్చే శూన్యతని పోగొట్టుకోవటం కోసం, పాత పరిచయాలని పునరుద్ధరించుకునేటందుకు చేపట్టే అనైతికమైన చర్య' అని ఆయన ప్రగాఢ అభిప్రాయం అయ్యుండవచ్చు.

    నేను నిస్సత్తువగా మెట్లు దిగాను.

    నేను చేస్తున్న పనిలో సార్థకతా శాతం చాలా తక్కువ అని నాకు తెలుసు. వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ దొరికినా చాలనే పరిస్థితి నాది! సుమద్యుతి, తన భర్తకి భయపడి నా ఇంటిముందు తన బిడ్డని వదలటం అనేది నా పిచ్చితనపు ఊహకి పరాకాష్ట అయి వుండవచ్చు. ఆ బిడ్డకోసం ఇప్పుడా తల్లి తన కిడ్నీ ఇవ్వడం కూడా సుదూరమైన ఆశాకిరణమే.

    కష్టాల్లో వున్నప్పుడు మనిషి ఎంత తర్కరహితంగా ఆలోచిస్తాడనటానికి నేనే ఉదాహరణ!

    ఈ విధమైన ఆలోచనలలో నేను మెట్లు దిగుతూండగా పక్క నుంచి వినిపించింది. "మీకు సుమద్యుతి కావాలా?"

    చివాలున తలతిప్పి చూసాను.

    ఇంటిగలాయన కూతురిలా వుంది. ద్యుతి వయసే వుంటుంది. నా వైపు  చూస్తూ ప్రశ్నిస్తోంది.

    "అవును...." అన్నాను చప్పున.

    "ఆమె హైద్రాబాద్ లో వుంటుందనుకుంటాను" అంది ఇంటిగలాయన కూతురు.

    "థాంక్యూ. అడ్రస్ చెప్పగలరా?" ఆశగా చూసాను.

    "తెలీదు. వాళ్ళాయన అక్కడే లాయరు. వాళ్ళకి ఒక కూతురు....."

    "లాయరుగారి పేరు?"

    "తెలీదు".

    మళ్ళీ నన్ను నిరాశ ఆవరించింది. అయినా ఆశ చావకుండా, "గుర్తు తెచ్చుకోండి. ప్లీజ్......" అన్నాను అభ్యర్థిస్తున్నట్టు.

    "నిజంగా ఏమీ తెలీదండీ. అప్పుడెప్పుడో ఏడేళ్ళక్రితం కలిసింది. వాళ్ళు ఇల్లు  అమ్మేసాక కూడా కొంతకాలం ఈ ఇంట్లోనే వున్నారు. అంతే పరిచయం! అదే ఆఖరిసారి చూడటం కూడా. ఆయన ఇంకా హైద్రాబాదులోనే లాయరుగా  ఉంటున్నాడో లేడో కూడా తెలీదు!" అంది. ఒక క్షణం ఆలోచించాను. సుమద్యుతి దంపతులు నాకు మా వూళ్ళో..... అంటే విశాఖపట్నంలో కనిపించారు. ఏ  బంధువులు ఇంటికో వచ్చి వుంటేసరే, లేక హైద్రాబాదులో ప్రాక్టీసు మానేసి అక్కణ్ణుంచి షిప్టు అయివుంటే కష్టం.

    ఏమిటి కష్టం.

    నా ఆలోచన నాకే సిల్లీగా  అనిపించింది.

    వాళ్ళు హైద్రాబాదులో వున్నా...... విశాఖపట్నంలో వున్నా ఒకటే. ఎలా పట్టుకోగలను.  

    ఒకటే వీలుంది.

    ఊళ్ళో వున్న కోర్టులన్నిటికీ వెళ్ళి వెతకటం! హైద్రాబాదులో అయితే హైకోర్టు కూడా వెతకాలి!! పదేళ్ళక్రితం రిక్షాలో అరక్షణంపాటు చూసిన వ్యక్తిని, నల్లకోట్లు వేసుకున్న వందమంది మధ్య వెతికి పట్టుకోవటం సాధ్యమయ్యే పనేనా? అయినా నేను వెళ్ళేరోజు అతడు అదే కోర్టుకి వస్తాడని నమ్మకం ఏమిటి?

    .....అందుకే నా ఆలోచన నాకే సిల్లీగా అనిపించింది.

    ఆమె దగ్గర శలవు తీసుకుని వచ్చేస్తూండగా అంది....... "అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. వాళ్ళాయన నాటకాల్లో వేషాలు కూడా వేస్తాడట. ద్యుతి చెప్పింది."

    మామూలుగానే గుర్తుపట్టలేను. మేకప్ లో ఏం గుర్తుపట్టగలను.

    ఆమెకి నా అడ్రసు ఇచ్చి- ఏమాత్రం వారి గురించి తెలిసినా నాకి టెలిగ్రాం ఇమ్మని చెప్పాను.

    "ఎందుకంత అర్జెంటు?" అర్థంకానట్టు అడిగింది.

    "ఆమె వస్తువు నా దగ్గిర వుండిపోయింది" క్లుప్తంగా అని బయల్దేరాను!

    అది 'ఆమె వస్తువు' అవునో కాదో నాకు తెలీదు.


                         *    *    *

    అరుంధతి మెల్లగా వచ్చి నా పక్కన కూర్చుంది. "........చూడండి" అనునయంగా అంది. "......మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇంతకన్నా ఎవరు మాత్రం చేయగలిగేది ఏముంది? ఒక తండ్రిగా, మీరెంత కష్టపడాలో అంతకన్నా ఎక్కువగానే చేస్తున్నారు."

    నేను మాట్లాడలేదు. విజయవాడనుంచి ప్రయాణం. బాగా అలసటగా వుంది. అయితే అది శారీరకం. అంకిత్ ని రక్షించుకోలేకపోతున్నాననేది మానసికం. అదే నన్ను ఎక్కువ బలహీనపరుస్తోంది.

    అరుంధతి అంటోంది. "......ఎప్పుడైనా నేను ఇరిటేటింగ్ ప్రవర్తించినా, మీ మీద అరిచినా, అది నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక మాత్రమే. అంతే తప్ప మిమ్మల్ని తప్పుపట్టి కాదు."

    ఆమె చెప్పేదంతా నాకు తెలుసు. అయినా ఆమె అలా చెప్పటం నాకు ఎంతో బాగా అనిపించింది. చాలా తక్కువమంది భార్యలకే అలాంటి కమ్యూనికేషన్ యొక్క ప్రాధాన్యత తెలుస్తుందనుకుంటాను.

 Previous Page Next Page