Previous Page Next Page 
పర్ణశాల పేజి 17


    తవ్వటం పూర్తయింది. చైతన్య బాబుని గోతిలో పడుకోబెట్టేడు. మూసివున్న ఆ విశాలమైన నేత్రాలవేపూ, ఆ అమయాకమైన మొహంవేపూ చూసేడు.

    "నాయనా" అన్నాడు వృద్ధుడు. "స్వర్గలోకమంటూ వుందో లేదో మనకు తెలీదు. ఈ జీవిని అక్కడికే పంపమని దేముడిని ప్రార్థించటానికి మన తరపున ఎవరూ బ్రహ్మలు లేరు. పెట్టుకోవటానికి మన దగ్గర డబ్బూ లేదు. నీ కొడుకు అదృష్టవంతుడు. వాడి గురించి ప్రార్థించటానికి నువ్వున్నావు. ప్రార్థించు. నీ కొడుకు ఆత్మకోసం నువ్వు ప్రార్థించు."

    చైతన్య నవ్వేడు ఆ నవ్వులో వేదాంతం వుంది - వేదనా వుంది.

    "మమ్మల్నొదిలి వెళ్ళిపోయిన దేవుడి ఆత్మశాంతికోసం, నా కొడుకు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన దేవుణ్ణి ఏం ప్రార్థించను తాతా!"

    వంగి మట్టి తీసుకున్నాడు.

    "బాబూ!" అన్నాడు.

    "పరిస్థితులు బావుండి వుంటే ఎయిర్ కండీషన్ రూముల్లో పెరిగి పెద్దవ్వాల్సిన వాడివి నువ్వు! అది తెలిసేనేమో నిన్ను ఒళ్ళో దాచుకున్న పుడమితల్లిని వర్షంనీరు చల్లగా తడుపుతోంది" గుప్పెట వదిలేడు.

    తననుంచి పుట్టిన దానిని తనలో కలుపుకోటానికి మట్టిపెళ్ళలు పెళ్ళలుగా గోతిలో పడుతోంది.

   
                              *    *    *

    జాజ్ డ్రమ్స్. గిటార్ శబ్దాలమధ్య ఎల్విస్ ప్రిస్లీ కంఠం మట్టి పెళ్ళాలు విరిగి పడ్డట్టుగా వుంది.

    అక్కడ రాత్రికీ, పగలుకీ తేడా లేనట్టు దీపకాంతి పరచుకుని వుంది. రంగు రంగుల బల్బుల వెలుగు, రంగురంగుల ద్రవాల మీదపడి రంగురంగులుగా విశ్లేషణ చెందుతోంది. అక్కడ తాగిన కష్టమర్లు నేలకీ, సోఫాకీ మధ్య త్రిశంకుల్లా వున్నారు. తాగని వెయిటర్లు తెల్లబట్టల్లో శాంతిదూతల్లా వున్నారు. గ్లాసుల్లో ద్రవం అమృతంలా వుంది. ప్లేట్లలో ముక్కలు నరకంలో వేగిన పాపుల ఖండాల్లా వున్నాయి.

    "బేరర్" పిలిచేడు రవి.

    "యస్ సార్" అంటూ వచ్చేడు వెయిటర్.

    "ఇంకో యిద్దర్ని పిలు...."

    వాడికి అర్థంకాలేదు. అలాగే నిల్చున్నాడు.

    "పిలూ! ఐసీ- కాల్ అనదర్ టూ...."

    వెయిటర్ బెదిరిపోయి ఇంకో ఇద్దర్ని పిలుచుకొచ్చేడు. ముగ్గురూ చేతులు కట్టుకొని నిలబడ్డారు. "ఎవడ్రా నాకు దూరదృష్టి లేదన్నది?" లేచి నిలబడబోయి కాళ్ళు తడబడి సోఫాలో కూలబడ్డాడు. "అందుకే పిల్చేను ముగ్గుర్ని, తీసుకెళ్ళి నన్ను టాక్సీలో పడెయ్యండి....."

    ముగ్గురూ చేతులమధ్య తీసుకెళ్ళి టాక్సీలో కూర్చోబెట్టేరు.

    "ఎక్కడికి?" డ్రైవర్ అడిగేడు. తెలిసిన బేరర్ అడ్రస్ చెబుతున్నాడు.

    "నాక్కాబోయే ఆవిడ కొనుక్కున్న మా అన్నయ్య ఇంటికి-" తనలో తనే గొణుక్కున్నాడు. టాక్సీ కదిలి, అయిదు నిమిషాలు ప్రయాణంచేసి ఇంటి ముందు ఆగింది.

    దిగి, తూలిపడబోయి నిలదొక్కుకుని, జేబులోంచి నోటుతీసి అందిస్తూ "చూడు.... పదే కదా" అన్నాడు.

    అతడందించిన వందనోటుని చప్పున జేబులో పెట్టుకుని "పదే సారే" అన్నాడు డ్రైవర్.

    "చూడు బ్రదర్! నామీద నీకున్నపాటి నమ్మకం నా చెల్లెలికి లేకపోయింది ఎక్కడికో వెళ్ళిపోయింది" ఏడ్చేవాడే కాని గూర్ఖా వచ్చి లోపలికి తీసుకెళ్ళాడు.

    పైన కిటికీలోంచి ఇదంతా కిరణ్మయి చూస్తూంది.
   
    అతడు లోపలికి వస్తూంటే క్రిందికి దిగి వచ్చింది.

    "మళ్ళీ బార్ నుంచే కదూ?"

    రవి మూతపడుతున్న కనురెప్పలు పైకెత్తి "మళ్ళీ ఏమిటి? అక్కణ్ణుంచే" అన్నాడు. ఛీత్కారంగా చూసింది ఆమె. "ఈ తాగుడు మనిషి నెక్కడికి తీసుకెడ్తుందో తెలుసా?"

    "స్వర్గానికి."

    "ఆఁ ఆఁ ఇలా ఒళ్ళు గుల్లయితే వెళ్ళాల్సింది అక్కడికే!"

    "ఏం చెయ్యను" మొహం చేతులతో కప్పుకున్నాడు. "బాధ మర్చిపోవటం కోసం తాగాలి. కానీ తాగినకొద్దీ ఈ బాధ యెక్కువ అవుతోందే...."

    ఆమె అతడి పక్కనే కూర్చొని అతడి చేతిని తన చేతిలోకి తీసుకొంటూ, "అందరికీ బాధగానే వుంది. కానీ దీనికి పరిష్కారం యిదికాదు" అంది.

    "మరేం చెయ్యాలి?" మత్తుగా అడిగేడు.

    "మీ అన్నయ్య కనబడతారని నా మనసెందుకో చెబుతోంది. అప్పటి వరకయినా మన విధి మనం నిర్వర్తించాలి...."

    "అంటే?"

    "అంటే...." అంటూ ఆమె ఏదో వివరించబోయింది.

    అతడు మధ్యలోనే అందుకొని, "అంటే నీ పదిలక్షలు - ఇరవై లక్షలు చెయ్యాలి, అంతేగా" అన్నాడు.

    ఆ మాటలు సూటిగా ఆమెకి తగిలేయి. అప్పటివరకూ నిగ్రహంతో అతడి ప్రవర్తనని సహిస్తూ వచ్చింది. ఆమె శారదలా నెమ్మదయినది కాదు. అతడు అనవసరంగా చేసిన ఈ ఆరోపణకి దెబ్బతిన్న పులిలా రెచ్చిపోయింది.

    అతడి మత్తంతా దెబ్బకి దిగిపోయేలా లాగి చెంపమీద కొట్టింది.


                                            11


    చైతన్య రోడ్డుమీద నడుస్తున్నాడు. అతడి పక్కనుంచి ఎన్నో రిక్షాలు, కార్లూ పోతున్నా అతడికి పట్టినట్టు లేదు. అతడేం ఆలోచిస్తున్నాడో అతడికే తెలీదు. ఇప్పుడు అతడిని చూసిన వారెవరూ గుర్తుపట్టలేరు.

    రెండు రోజుల్నించీ తిండిలేకకాళ్ళు తేలిపోతున్నాయి. అయినా దాన్నంతగా పట్టించుకోలేదు. కానీ  అక్కడ కూలీలు, తొందరలోనే బయటవాడని గ్రహించి వెళ్ళగొట్టారు.

    అడుక్కోవటం ఇష్టంలేదు. కానీ భార్య ఆకలి అతడి నిగ్రహాన్ని సడలిస్తూంది. ఇంకేపనీ దొరక్కపోతే అదే చేద్దామన్న నిశ్చయానికి నెమ్మదిగా వస్తున్నాడు.

    ఈ ఆలోచనల్లో వుండగానే ఒక కారు సూటిగా అతడి మీదకు రావటం పక్కనున్న ఎవరో చెయ్యి పట్టుకుని లాగటం - క్షణంలో జరిగిపోయినయ్.

    కారు దూసుకు వెళ్ళిపోయింది. క్షణంపాటు ఇటు చూసిన జనం మళ్ళీ ఎవరి పనులలో వారు మునిగి పోయారు. క్రిందపడిన చైతన్యవేపు చేయి అందిస్తూ, "చావాలని వుందా" అని అడిగాడు.

    "చస్తే బ్రతికిపోయేవాడిని" అన్నాడు చైతన్య బట్టలు దులుపుకొంటూ.

    చైతన్యకి చేయి అందించిన వ్యక్తికి అరవై డెబ్భై ఏళ్ళ మధ్య వయసుంటుంది. అయినా దృఢంగానే వున్నాడు. చూడగానే ఉత్తరదేశానికి సంబంధించినవాడిలా కనబడుతున్నాడు.

    "బ్రతకటం చావటంకోసం కాదు."

    క్రిందపడ్డప్పుడు బెణికిన కాలు సరిచేసుకుంటూ "క్షణ క్షణం చావటంకంటే అదే మంచిది కదా"అన్నాడు చైతన్య.

    సంభాషణంతా హిందీలోనే జరుగుతూంది.

    "ఎవరు నువ్వు?" అడిగేడు ఆయన.

    చైతన్య నవ్వేడు. "నాకూ ఈ ప్రశ్న యీ మధ్యే కలిగింది. దాని గురించే దీర్ఘంగా ఆలోచిస్తున్నాను."

    తన ముందు బికారిలా నిలబడి వున్న మనిషి పైకి కనబడేంత హీనచరిత్రుడు కాడని ఆయనకు అనిపించింది. బట్టలెంత మాసివున్నా గెడ్డం ఎంత పెరిగివున్నా కళ్ళల్లో దీప్తి మనిషిని పట్టిచ్చేస్తుంది.

    "నీ కిక్కడ జరుగుబాటే కష్టమైతే నాతోరా. ఏం పని చెయ్యగలవు నువ్వు!"

    చైతన్య మాట్లాడలేదు. ఏం పని చెయ్యగలడు తను? నిజానికి తనకేమీ చేతకాదు. ఎంత గొప్ప చేదు నిజం!

    "మా యింట్లో పని చెయ్యవచ్చు. నా మనవళ్ళని స్కూలుకు తీసుకెళ్ళవచ్చు..... నా కారు డ్రైవర్ గా వుండొచ్చు.....నా....."

    ఆయన మాటల్ని మధ్యలో ఆపుచేసి, "ఆఁ! డ్రైవింగ్ వచ్చు నాకు" అన్నాడు.

    "మరింకేం అది చాలు" అన్నాడు. యాదృచ్చికమైన ఈ సంఘటన అతడి జీవితాన్ని యింకో మలుపు తిప్పింది.


                              *    *    *

    చైతన్యని తనతోపాటు పాట్నా తీసుకెళ్ళిన వ్యక్తి పేరు శంకర్ లాల్. ఎడిబుల్ ఆయిల్స్ లో  ఫార్వర్డు కాంట్రాక్టు చేస్తూ వుంటాడు. అసలా పనిమీదే ఆయన ఆంధ్రదేశం రావటం జరిగింది.

    స్టేషన్ కి ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికి కారొచ్చింది. ఆయనతోపాటు చైతన్యా, కాంతిమతీ దిగేరు. షా ఆలీ రోడ్ లో ఓ పోష్ బంగ్లా ముందు కారాగింది.

    "ఇదే మా యిల్లు" అన్నాడు శంకర్ లాల్. నౌఖరు పరుగెత్తుకుంటూ వచ్చేడు.

    "వీళ్ళకి మన పాత డ్రైవర్ హౌస్ చూపించు" అన్నాడు. బంగ్లాకి కొద్ది దూరంలో నౌఖర్ల క్వార్టర్లు కట్టబడి వున్నాయి. క్వార్టర్లంటే పెద్దగా ఏమీలేదు. ఓ పెద్దగది, పక్కనే వంటిల్లు -అంతే.

    "చాలు" అన్నాడు చైతన్య ఇల్లుచూసి, "సత్రం అరుగుకన్నా ఇది బావుంది. మన స్టేటస్ కొంచెం పెరిగిందన్నమాట....." మనసారా నవ్వుకున్నాడు.

    చిత్రమేమంటే- అతడో బిజినెస్ మాగ్నెట్ గా వున్నప్పుడు ఎప్పుడూ సీరియస్ గానూ, గంభీరంగానూ వుండేవాడు. సర్వం కోల్పోయేసరికి అతడికి  తలారా స్నానం చేసినట్టు తేలికగా వుంది. ఏ బాదర బందీ లేదు. హాయిగా నవ్వగలుగుతున్నాడు. అయితే ఆ నవ్వు వెనుక ఒక జీవితకాలం నేర్పిన పాఠం వుంది.

    ఇద్దరి స్నానాలు పూర్తయ్యే సమయానికి నౌఖరు వచ్చి పిలుస్తున్నారని చెప్పాడు.

    ముందు గార్డెన్ లో కూర్చొని వున్నాడు శంకర్ లాల్. సాయంత్రం అవటంవల్ల తోటలో చెట్లమీద నుంచి వచ్చే గాలి మనసును సేదతీరుస్తోంది. ఫౌంటెన్ పక్కనే ఇద్దరు కుర్రవాళ్ళు టెన్నీస్ బాలుతో క్రికెట్ ఆడుతున్నారు.

    కాంతిమతి, చైతన్య రావటం చూసి తాతగారి దగ్గరకు పరుగెత్తుకు వచ్చారు. "వీళ్ళు నా మనవళ్ళు" అన్నాడు శంకర్ లాల్  హిందీలో.

    "నమస్తే" అన్నాడు చైతన్య చేతులు జోడించి.

    "హలో" అన్నట్టు పెద్దవాడు స్టయిల్ గా తలూపేడు. మళ్ళీ యిద్దరూ  ఆడుకోవటానికి పోయారు.

    గార్డెన్ టేబిల్ మీదున్న డూప్లికేట్ కారు తాళాలు తీసి యిస్తూ "చాలా నీటుగా వుంచాలి కారుని. ఇలాటి విషయాలలో నేను చాలా స్ట్రిక్టుగా వుంటాను" అన్నాడు. చైతన్య తలూపేడు. కాంతిమతి బంగళాని, తోటనీ, ఆడుకొనే పిల్లల్నీ చూస్తోంది.   

 Previous Page Next Page