Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 17

సత్యమూర్తి పనిలో పడ్డాడు.
షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేయి.
"సైలెన్స్! లైట్సాన్!" అని  మహాలింగం అరిచేడు.
ఏం జరుగుతుందో చూద్దామని సత్యమూర్తి పని ఆపి అటు వేపు చూస్తున్నాడు.
మహాలింగం "స్టార్ కెమెరా!" అన్నాడు. "యాక్షన్!" అని కూడా అన్నాడు.
అప్పుడు శారద తన మిత్రురాళ్లతో షాపులోకి అడుగుపెడుతోంది. ఆమెను చూడగానే సత్యమూర్తి కళ్లు ఆనందంతో మెరిసేయి. శారదా అని గొణుక్కున్నాడు.
ఘాటింగు జరుగుతోంది. సేల్స్ మెన్ శారద బృందానికి కొత్త చీరలు  చూపెడుతున్నాడు.
శారద ఒక చీరను తీసుకుని అడిగింది -
"రంగు పోదుగా?"
"నా ప్రాణం  పోవచ్చేమో గానీ,  రంగు మాత్రం పోదండీ!"
"ఫెంటాస్టిక్. రంగు బాగుంది. డిజైను బాగుంది. బోర్డరు బాగుంది"  అన్నాది శారద స్నేహితురాలు.
"ధర ఎంతని అడుగు - అయిదు వేలంటాడు" అన్నది శారద.
"వేలు కాదమ్మా! జస్ట్, అయిదు  వందలు మాత్రమే" అన్నాడు సేల్స్ మెన్.
"మైగాడ్! ఇంత అందమైన చీర అయిదు వందలకే ఇస్తున్నారా!" అని ఆశ్చరంగా అడిగి, "వెంటనే పేక్ చేయండి!" అని కూడా  అన్నది శారద.
అది కేవలం షూటింగన్న మాట మరచిపోయేడు సత్యమూర్తి.  గబగబా కెమెరా ముందుకు వచ్చి,
"శారదా! వద్దు! ఆ చీర పాత స్టాకు. గోడవున్లోంచి నేనే తెచ్చా! దాని ధర రెండొందల ఇరవై" అని నిజం చెప్పేడు.
మహాలింగం కోపంగా "కటిట్" అని అరిచేడు.
శారద సత్యమూర్తి వైపు చూసింది. కానీ పోల్చుకోలేకపోయింది. మహాలింగం సత్యమూర్తి ముందు చిందులు తొక్కుతున్నాడు-
ఇది షూటింగ్! షాపింగ్ కాదు! అండర్ స్టాండ్ ! అసలింతకీ ఎవర్నువు?"
ప్రొప్రయిటర్ కుర్చీ దిగి వచ్చి సత్యమూర్తిని కోప్పడుతున్నాడు -
"అసలు నీకు బుద్దుందా? స్టాక్ వెరిఫై చేస్తానని చెప్పి షూటింగ్ లోకి దూసుకువచ్చింది చాలక, పాత స్టాకని చెబుతావా? ఇక నాకు నువ్వు వద్దు! వద్దంటే వద్దు!"
కట్లతో ఉన్న సత్యమూర్తిని పోల్చుకోలేక శారద ఆశ్చర్యంగా అడిగింది-
"నా పేరు నీ కెలా తెలుసు?"
సత్యమూర్తి నీరసంగా అన్నాడు-
"నేను శారదా! నేను! సత్యమూర్తిని. నీ క్లాస్ మేట్ ని!"
ఆ మాటకి శారద  బోలెడు ఆశ్చర్యపోతూ అడిగింది -
"మీరా? ఇక్కడేం చేస్తున్నారు?"
"జాబ్ చేస్తున్నాడమ్మా! సేల్స్ మెన్" అన్నాడు ప్రొప్రయిటరు.
అతని మాటని పట్టించుకోవడం లేదు శారద సత్యమూర్తిని అడిగింది-
"ఆ కట్లెమిటి? ఏక్సిడెంటా?"
"అవునమ్మా! ఏక్సిడెంటే, బస్సులోంచి దూకి పడ్డాట్ట కన్నూ మిన్నూ కాన పడితే దెబ్బలు తగలవా?" అన్నాడు ప్రొప్రయిటరు.
సత్యమూర్తి కలగజేసుకుని కంగారుగా అన్నాడు-
"లేదు లేదు రాత్రి కరెంటు పోయి వర్షం వచ్చింది కదా! నడుస్తూ నడుస్తూ డ్రైనేజీలో పడ్డా!"
"మరి నాకు బస్సులోంచి పడ్డానని చెప్పేవెందుకు?" ప్రోప్రయిటరు కోపంగా అడిగేడు.
"తోచక" అన్నాడు సత్యమూర్తి.
                            *        *        *
కథ వింటున్న ఆనందం సత్యమూర్తిని  కోప్పడ్డాడు -
"ఛీ! ఛీ! ఏం కుర్రాడివయ్యా! నిన్ను చూసి నీ కోసం కదిలే బస్సు నుంచి దూకాను శారదా! అని జరిగింది జరిగినట్టు చెప్పి వుంటే ఆ పిల్ల  వలవలా ఏడుస్తూ నీ చేతుల్లో వాలి పోతుంది కదా!"
"చీకటి.... వర్షం.... డ్రైనేజ్.... అని చెబుతే ఆ పిల్లకి నీ మీద ఇంటరెస్ట్  ఏముంటుంది? సింపతీ ఏం కలుగుతుంది" అన్నాడు పరమానందం.
"చేసిన పొరపాటుకి చింతించి ప్రాణం తీసుకుందామని కొండెక్కేవు. ఇంతేగా నువ్వు  చెప్పే కథ" అడిగేడు ఆనందం.
"కాదండీ!" ఇంకా చాలా వుంది అన్నాడు సత్యమూర్తి.
"కానివ్వు" అన్నాడు ఆనందం.
"శారద షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోగానే, ప్రొప్రయిటరు నన్ను గట్టిగా మందలించాడు. నీ లాంటి మనిషి మా షాపులో వుంటే మా నెత్తిన ముసుగే అని కోప్పడ్డాడు. ఎంత క్లాస్ మెట్ అయితే మాత్రం? అసలు ధర  అరిచి చెప్పాలా అని ఆవేశపడ్డాడు. నాకు రావలసిన జీతం అప్పటికప్పుడే లెక్కకట్టించి నా జేబులో పెట్టి  చేతులు జోడించేడు. ఆ విధంగా చింతామణి శారీ మందిర్లో నా ఉద్యోగం వూడిపోయింది" అని గట్టిగా నిట్టూర్చేడు సత్యమూర్తి.
"అనుకున్నంతే! ఆ తర్వాత" అడిగేడు పరమానందం.
మళ్లీ నిట్టూర్చేడు సత్యమూర్తి.
"అదుగో, అదే వద్దు! మాక్కావాల్సింది నీ కథ నిట్టూర్పులు  కావు" అన్నాడు ఆనందం.
"ఒక చిన్న అభ్యర్థన" అన్నాడు సత్యమూర్తి.
"ఏమిటది?" అడిగేడు పరమానందం.
"ఇక్కడ్నుంచి నా కథ అనేకానేక మలుపులు తిరుగుతుంది. అనే కానేకమైన పాత్రలు చోటు చేసుకుంటాయి. అంచేత కథ మధ్యలో దయచేసి అడ్డుపడకండి."
"పడం" అన్నాడు ఆనందం.
"అదేమి టిదేమిటని అడక్కండి."
"అడగం" అన్నాడు పరమానందం.
"మీరే కాదు, మీ మనుషులు కూడా నా అభ్యర్థనని మన్నించాలి"
"తప్పకుండా!" అన్నారిద్దరూ.
అందర్నించి తన క్కావలసిన హామీలు తీసుకున్న తర్వాత ఆగిపోయిన ప్లాష్  బాక్ని ప్రారంభించేడు సత్యమూర్తి.
 
                             *        *        *
శారద తన మిత్రురాళ్లతో నడుస్తోంది.
"అతని పేరేమిటన్నావ్?" అడిగింది వనజ.
"సత్యమూర్తి డిగ్రీలో నా క్లాసుమేట్ సముద్ర గండం నుంచి నన్ను రక్షించేడు. చాలా మంచివాడు" అన్నది  శారద మెచ్చుకోలు ధోరణితో.
"కావచ్చు కానీ, అబద్దాలు చెప్పడం అతని హాబీ కాబోలు అదే నచ్చలేదు" అన్నది వనజ.
చాల్లే ఊరుకో" అన్నది శారద.
"లేకపోతే ఏమిటీ? బస్సులోంచి పడ్డానని ప్రొప్రయిటర్ తో చెప్పి, నీతోనేమో చీకటి..... వర్షం ... డ్రైనేజి.... కాలు జారిపడట మని అబద్దం చెబుతాడా? ఇది మంచి లక్షణమేనా" రెట్టించి అడిగింది వనజ.
"అదే  నాకు  అర్థం కావడం లేదు" అన్నది శారద మూడీగా.
అంత వరకు వాళ్ళిద్దరి సంభాషణ వింటూ మౌనంగా నడుస్తున్న లక్ష్మి గొంతు విప్పింది-
"నాకు అర్థమైంది."
"ఏమిటీ నీకు అర్థమైంది" ప్రశ్నించింది వనజ.
"వ్\ఇవాళ మార్నింగు నేనూ, శారదా రామాలయం బస్టాపు దగ్గర నిలబడ్డాం అవునా?" అని శారదను అడిగింది లక్ష్మి.
"అవును" అన్నది శారద.
"నీ బస్సు వచ్చింది. నువ్వు వెళ్లి పోయావు. నేను నా బస్సు కోసం  ఎదురు చూస్తుండగా  ఈ సత్యమూర్తి ఒంటి మీద దెబ్బల్తో, నెత్తురు వరదల్తో రామాలయం బస్టాపు దగ్గరికి వచ్చి ఎవరి కోసమో వెతుక్కుని, వాళ్లు కనిపించక పోవడంతో మళ్లీ కుంటుకుంటూ వెళ్లి పోయేడు."
"అఫ్ కోర్స్ అయితే" అన్నది వనజ.
"అప్పుడు అర్థం కాని పాయింట్లన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి" అన్నది లక్ష్మి.
"నస పెట్టకుండా నీకు అర్థమైన పాయింట్లేమిటో చెప్పు!" అన్నది శారద.
"మరేం లేదే! ఒకటి ప్లస్ ఒకటి రెండు అని చెప్పడం ఎంత తేలికో, అతని గుప్త ప్రేమ గురించి చెప్పడం అంత సుళువు. నువ్వూ, నేనూ రామాలయం బస్టాపు దగ్గర నిలబడినప్పుడు ఒక బస్సు వెళ్లిపోయింది. గుర్తుందా?"
"అవును, వెళ్లింది. అయితే" అని కుతూహలంగా అడిగింది శారద.
"ఆ  బస్సులో ఈ సత్యమూర్తి వుండి వుంటాడు. బస్సు కదులుతుండగా నిన్ను చూసి వుంటాడు. నిన్ను పలకరించి తరించాలని కదిలే  బస్సులో నుంచి దూకి వుంటాడు. ముక్కూ మొహం పచ్చడి చేసుకుని నీ  కోసం రామాలయం బస్టాపుకి వచ్చి వుంటాడు. నువ్వు లేకపోవడంతో  ఆసుపత్రికి వెళ్లి కట్లవీ కట్టించుకుని చింతామణి శారీ మందిర్ కి వచ్చి వుంటాడు. ప్రొప్రయిటర్ కి జరిగిన కథ యథాతథంగా చెప్పకుండా, టూకీగా డెంటు అయిందని చెప్పేడు. నువ్వు అడిగి నప్పుడు నీ కోసమే పడ్డానని  చెబితే బాధపడతావని చీకటి....వర్షం అని కట్టుకథ చెప్పేడు. నిజం చెప్పి నిన్ను బాధ పెట్టకూడదనే అతని  ఉద్దేశ్యామని అర్థమోతుంది. 

 Previous Page Next Page