Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 16

 

    ఆరోజు మొక్కలకు కలుపు తీస్తూ ఒకటే ఆయసపడి పోతున్నాడు వీరయ్య - "ఏమిటి వీరయ్యా! ఎందుకలా ఉన్నావ్?" అని అడిగాడు యతి.
    వీరయ్య సమాధానం చెప్పటానికి కూడా ఓపిక లేక ఒగారుస్తూ కూలబడ్డాడు. యతి అతని దగ్గరగా వచ్చి చూసాడు. జ్వరంతో వళ్ళు కాలిపోతోంది.
    "అమ్మయ్యో! జ్వరం వచ్చింది నీకు - పనిలో కెందుకు వచ్చావ్? వార్డన్ తో ఎందుకు చెప్పలేదూ?"
    వీరయ్య దీనంగా చూస్తూ "నాకు తెలవదు బాబయ్యా! ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు నా మాట వింటారు?" అన్నాడు.
    "నాన్సెన్స్!" అంటూ లేచాడు యతి.
    కానీ, అతికొద్ది సమయంలోనే అమాయకంగా అన్న వీరయ్య మాటల్లో నిజం తెలిసి వచ్చింది. ముందు అక్కడే ఉన్న పోలిస్ జవాన్ తో చెప్పాడు. వాడు క్రూరంగా చూస్తూ "ఏయ్! ఇట్టాంటి దొంగవేషాలు కుదరవు - పని చెయ్యండి" అని అరిచాడు. యతి రక్తం కుతకుత వుడికిపోతోంది. ఆ పోలీస్ జవాన్ ని అక్కడికక్కడ రెండు చెంపలూ వాయగోట్టాలన్న వుద్రేకం బలవంతాన ఆపుకున్నాడు.
    "దొంగవేషాలు కావు - వీడికి నిజంగా జ్వరం వచ్చింది. కొంపదీసి వీడు గుటుక్కుమన్నాడంటే , నీ వుద్యోగం పుటుక్కుమటుంది" అన్నాడు యతి తీవ్రంగా. ఈ ధోరణిలో ఈ భాష పోలీస్ జవాన్ కి అర్ధమయింది. ఈ విషయం వార్డర్ కి  తెలిసి- వార్డర్ పోలిస్ సూపరింటెండేట్ కి చెప్పి , అతడు జైలు డాక్టర్ ని పిలిపించే సరికి పూర్తిగా రెండు రోజులు గడిచిపోయాయి. వీరయ్య పోలీస్ జవాన్ బండబూతులు కూడా వినే ఓపిక లేక మూలుగుతూ పడుకుని వున్నాడు. కనీసం వీరయ్య యెలా ఉన్నాడో అయినా చూడటానికి లేకుండా యతి పనిలోకి పోవలసి వచ్చింది, ఆ సమయంలో యతికి గుర్తు వచ్చాడు. వెంకటయ్య- ప్రతిరోజూ వెంకటయ్య ఒకసారి యతిని కలుసుకొని మాట్లాడేవాడు. అప్పుడు చెప్పాడు. "సార్! వీరయ్యకి జ్వరంగా ఉంది డాక్టర్ రాలేదు. అతడికి మంచినీళ్ళు అందించే దిక్కు కూడా లేదు" అని కానీ, వెంకటయ్య ముఖంలో యతి ఆశించినా గభారా, ఆందోళన యేమి కనిపించలేదు. నిదానంగా "అలాగా కనుక్కుంటానుండు?" అన్నాడు. ఆ సాయంత్రం జైలు గదిలోకి వెళ్ళేసరికి యే డాక్టరూ రాలేదని తెలిసింది. వీరయ్య కళ్ళు తెరవలేక పోతున్నాడు. మాట్లాడలేక పోతున్నాడు. 'దాహం' అని సైగ చేశాడు.
    కుండలో నీళ్ళు అల్యూమినియం గ్లాసుతో వీరయ్య గొంతులో పోసాడు. యతి చెయ్యగలిగిందంతే . మందూ మాకూ లేక, జ్వరంతో అల్లాడిపోతూ రాత్రంతా మూలుగుతూనే వున్నాడు వీరయ్య.
    మరునాడు వచ్చాడు జైలు డాక్టర్. అతడు డాక్తరే! కానీ గవర్నమెంటు డాక్టర్. అందుచేత గవర్నమెంట్ వుద్యోగులందరిలోనూ వుండే నిర్లక్ష్యమూ, విసుగూ, అహంకారమూ అతనిలోనూ కనిపిస్తున్నాయి. దానికి తోడు జైలు డాక్టర్ కావడం వల్ల చుట్టు పక్కల వాళ్ళని చీదరించుకోంటున్నట్లుగా చూడటం కూడా తోడయింది.
    వీరయ్య చెయ్యి పట్టుకొని చూడకుండానే , రోగ లక్షణాలేమిటని విచారించకుండానే ఏదో మందు సిరంజిలోకి ఎక్కించి , ఇంజక్షన్ పొడిచి పారేశాడు కసిగా. వీరయ్య బక్క ప్రాణం విలవిలాడి[పోయి కెవ్వు మన్నాడు. "గొడ్డులా అరవకు!" అని చీదరించుకు వెళ్ళిపోయాడు. "డాక్టర్ బాబు ఎవరికే రోగం వచ్చినా సూది మందే యిస్తాడు." అన్నాడు మరో ఖైది-
    వీరయ్యకి ఇంజక్షన్ చేసిన చోట ఇంతలావున వాచిపోయింది. కాపడాలకు కూడా ఆస్కార మెక్కడిది? తన చేత్తోనే చుట్టూ కాస్త నెమ్మదిగా రాసాడు యతి. అతడు తన బలహీనమైన చేత్తో యతి శిరస్సు ను ఆప్యాయంగా నిమిరాడు.
    ప్రకృతి తన బిడ్డలను తానె కాపాడు కొంటుందేమో , ఏ విధమైన వైద్య సదుపాయము లేకపోయినా రెండు రోజులలో వీరయ్య కోలుకున్నాడు. డాక్టర్ వీరయ్యకు పాలు ఇయ్యమని రాసాడు కానీ , ఆ పాలలో సగం ఎవరి కడుపులోకో చేరుకొని సగం పాలు, సగం నీళ్ళు అందాయి. ఆ రెండు రోజులూ కాగానే సగం పాలు కూడా ఆగిపోయి , రొట్టి ఇచ్చారు. అదే ఆవురావురుమని తినేసాడు వీరయ్య. "జ్వరం పడి లేచాక ఇలాంటి ఆహారం తినకూడదు" అని యతి అంటే, వీరయ్య కీళ్ళు నొక్కుకుంటూ "మా కేడవుద్దయ్యా!" అన్నాడు- ఆరోజు పనిలోకి బయలుదేరాడు. "రెండు రోజులు విశ్రాంతి తీసుకో? వెంకటయ్య గారితో చెప్పిస్తాను." అన్నాడు యతి.
    "ఇక్కడ కూడా రికమెండేషన్లేనా బాబూ?" అన్నాడు అదోకమాదిరి నవ్వుతో వీరయ్య - ఆ మాటలు సూటిగా గుచ్చుకున్నాయి యతికి. అమాయకుడనుకున్న వీరయ్య యెంత మాటన్నాడు? అదే సమయంలో వీరయ్య కోసం వెంకటయ్య యే ప్రయత్నమూ గట్టిగా చెయ్యలేదన్నది స్పురణకొచ్చింది. ఇలాంటి వ్యక్తీ బీదల మేలుకోరి ఉద్యమాలు నడిపిస్తాడా?
    "మాకు పనిలోనే సుకం బాబయ్యా" అని పనికే బయలుదేరాడు వీరయ్య. ఈ నిరంతర పరిశ్రమే కారణమేమో , ఈ శారీరకారోగ్యానికి.
    వెంకటయ్యగారు తనను పలకరించడానికి వచ్చినప్పుడు నిష్టూరంగా అన్నాడు యతి. "మీరు వీరయ్య కోసం వెంటనే డాక్టరుని పిలిపించలేదు" అని.
    వెంకటయ్య నవ్వుతూ "అంత వెంటనే పనులు జరిగితే ఇంకా మనం ఆందోళనలు జరపటం దేనికయ్యా!" అన్నాడు - మళ్ళీ మెత్తగా "నేను చెప్పాను అందరితో - అందరూ విన్నారు అంతే వాళ్ళ టైం వాళ్ళు తీస్య్కున్నారు. ఇంకా నయం! నేను చెప్పాను కనుక, అప్పటికయినా డాక్టర్ని పంపించారు. జైల్లో కూడా ఆందోళన లేవదీస్తానేనేమోనని!" అన్నాడు.
    వెంకటయ్య మాటల్లో - మాట్లాడే విధానంలో యే మత్తుమందు వుందో కాని, అంతవరకు వెంకటయ్య మాటలను సందేహించిన యతి, అతడి ,మాటలను నమ్మేసాడు - వెంకటయ్యకు మారుగా అధికారుల్నే తిట్టుకున్నాడు.
    "పులి పట్టుబడ్డాడు !" జైల్లో ఎవరి నోట చూసినా ఇదే మాట! ఏవో తీవ్ర సంచలనం, పోలీసులందరిలోనూ ఏదో టెన్షన్.
    'పులి' అనబడేవాడు పదిమందికి పైగా హత్య చేశాడని విన్నాడు యతి. ఎన్ని రోజుల నుంచో పోలీసులకు చిక్కకుండా తప్పించు కొంటున్నాడట! అతడు యెలాంటి గుండానో! అనుకున్నాడు యతి. ఒక మనిషి యింకొక మనిషి ప్రాణాన్ని ఎలా తీస్తాడు? అతడెంత రాక్షసుడై వుండాలి! ఒక మనిషిని చంపాక ఇంకా స్థిమితంగా ఎలా బ్రతకగలడు? రక్తసిక్తమయిన ఆ స్మృతులు వెన్నంటి వేధించవా? అలా సాగిపోయాయి యతి ఆలోచనలు - ఆ గుందాని చూడాలని చాలా కుతూహలంతో ఎదురు చూడసాగాడు . తీరా సంకెళ్ళతో పోలీసుల మధ్య "పులి" ని చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు . తన గదిలో నుంచి కటకటాల మధ్య నుంచి ఒక్క నిమిషమే పులిని చూడగలిగాడు. అయినా ఆ మూర్తి అతని మనసులో హత్తుకుపోయింది. బక్కచిక్కిన శరీరం, పొడుగ్గా పెరిగిన గడ్డం - కళ్ళలో సాత్విక తేజస్సు - ఇతడా హంతకుడు? అని నివ్వెరపోయాడు యతి. అతడు ఎవరో యోగి పుంగవుడిలా వున్నాడు కాని హంతకుడిలా లేడు. పోలీసులకు చిక్కిపోయిన ఆ సమయంలో కూడా చెక్కుచెదరని చిరునవ్వుతో ఉన్నాడు.

 Previous Page Next Page