12
మెత్తని స్పర్శ - అభిమాన పూరితమైన స్పర్శ - వెళ్ళ అంచులలో గుండె లోతులలోని అనురాగం ప్రసారించేస్తున్న స్పర్శ - గాయాల బాధను మరిపించి ఏదో అనిర్వచనీయమైన హాయి నందిస్తోన్న స్పర్శ - సమస్తమయిన అశాంతినే దూరం చేస్తూ మనసును ప్రశాంతిలో ఓలలాడించే స్పర్శ.
కళ్ళు తెరిచాడు యతి. నుదుటిపై తడిగుడ్డ వేసి అదుముతోన్న మయూర కనిపించింది. నలిగిన చీర- దీనంగా కన్నీటి చేరవులలా వున్న కళ్ళు - జరిగిపోయిన సంఘటనల్లా చెల్లా చెదురుగా రేగిపోయిన జుట్టు.
ఇద్దరి చూపులూ ఒఅకదానితో ఒకటి చిక్కుకొని వుండిపోయాయి. పసితనపు ఆటపాటలు, తమకు తెలియకుండానే తమ మధ్య అల్లుకుపోయిన అనుబంధం ఆ తరువాత - దారుణమైన దుర్ఘటనలు- ఒక విధమైన అర్ధ చైతన్యావస్థలో మయూర పెళ్ళి - అన్నీ ఆ కళ్ళముందు కదిలిపోయాయి. ఇద్దరి కళ్ళలోనూ నీళ్ళు - ఎన్నెన్నో చెప్పాలని వుంది యతికి. కానీ ఆనాటి రాజ్యలక్ష్మి మాటలు అతని నోరు నోక్కేస్తున్నాయి. జైలు నుంచీ విడుదల కాగానే తిన్నగా వేదాంతయ్య ఇంటికే వచ్చాడు. మయూరకు పెళ్ళయిపోయిన వార్తా విని నిర్ఘాంతపోయాడు- అంత హడావుడిగా ఎందుకు చేయవలసి వచ్చిందో రాజ్యలక్ష్మి ఏడుస్తూ వివరించే సరికి యతి యువరక్తం సలసల మరిగిపోయింది. పిడికిళ్ళు బిగించి "ఏమిటీ అన్యాయం? ఇంత నీచానికి పాల్పడిన ఆ నిక్రుష్టుడికి - ఒక అమాయకురాలిని నిర్ధాక్షిణ్యంగా చెరచిన ఆ రాక్షసుడికి - పువ్వులాంటి మయూరను బలిచేస్తారా? నేనిప్పుడే వెళ్ళి....." అని ఉద్రేకంగా అంటున్న యతిని "బాబూ!" అని భయంగా అడ్డుపడింది రాజ్యలక్ష్మి. కన్నీళ్ళతో చేతులు జోడించి "యతీ - అతి దారుణం జరిగిపోయింది - కానీ ప్రభాకర్ గారి దయవల్ల ఎలాగో సమస్య పరిష్కారమయింది. ఇప్పుడిప్పుడే అందరం స్తిమిత పడుతున్నాం. ఇప్పుడు నువ్వెళ్ళి కుదుటపడ్డ దాని బ్రతుకు పాడు చెయ్యకు" అంది.
ఆ కన్నీటి ముందు - జోడించిన ఆ చేతుల ముందు - యతి వుద్రేకం చప్పబదిపోయింది. మనసు ఎంత ఎదురు తిరుగుతున్నా తనవల్ల మయూరకు ఏ చికాకు కలగకూడదని, అంతలో వెంకటయ్య గారి పిలుపు వచ్చింది. అసలే ఆశాభంగంతో వున్న హృదయం మరింత తెగింపుతో ఉద్యమం లోకి దూకింది.
తన నుదుటి మీద తడి గుడ్డ వత్తుతోన్న మయూర చేతిమీద చెయ్యి వేసాడు. నిలువునా వణికింది మయూర. మామగారు తన మీద వుంచిన విశ్వాసం గుర్తుకొచ్చింది. చెయ్యి వెనక్కు తీసుకుంది. మయూరను కొత్తగా వింతగా చూశాడు. మయూర తల దించుంది. ఒక్క దీర్ఘ నిశ్వాసం వదిలాడు యతి.
"సారీ మయూరా! ఇంక బ్రతకనను కున్నాను. అందుకే నీ దగ్గరకు వచ్చాను. చివరిసారి చూద్దామని . ఇలా బ్రతుకుతానని తెలిస్తే రాకపోదును."
అక్కడ నిలవలేక పోయింది మయూర. ప్రభాకర్ ను వెతుక్కుంటూ వెళ్ళింది. ఏదో అరవిందుడి పుస్తకం చదువు కుంటున్నాడు. తన ఎదుట కన్నీళ్లు ఆపుకోకుండా ఏడుస్తూ నిలబడ్డ మయూరను చూసి కంగారుగా లేచి "ఏమ్మా! యేమయింది ? అతడు క్షేమంగా వున్నాడా?" అన్నాడు గాభరాగా.
మయూర కళ్ళు తుడుచుకుని బొంగురు గొంతుకతో "ఆ! క్షేమంగానే వున్నాడు. ఇప్పుడే కళ్ళు తెరిచాడు. మీరు రండి" అంది.
అతడు బాగుంటే, పైగా కళ్ళు తెరచి మాట్లాడుతుంటే, మయూరకు కన్నిరెందుకు? మనసులోని ఈ ప్రశ్న పైకి రానీయలేదు ప్రభాకర్. యతి మంచం దగ్గరకు వచ్చాడు. పడుకున్నవాడు లేవబోయాడు యతి.
"లేవకు! లేవకు! పడుకో! కళ్ళు తెరచి మాట్లాడగలుగుతున్నావు. అదే భాగ్యం!"
"చావబోతున్న వాడిని బ్రతికించారు. మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోను?"
"పిచ్చివాడా! నువ్వు నాకు కృతజ్నడివై ఉండక్కర్లేదు . నాబాద్యత నేను నిర్వర్తించాను అంతే! పోలీసులు నిన్ను గుండాగా లిస్టులో ఎక్కించారు. నీ ముఖం చూస్తే నీవు గుండావి కావని అర్ధమయింది. ఇందులో ఏదో కుంభకోణం వుందని అనుకున్నాను. అంతేకాక నువ్వు మయూరను వెతుక్కుంటూ రావడంతో, మాకు కావలసిన వాడువని అర్ధమయింది. ఇంక నిన్ను కాపాడుకుందా ఎలా వుంటాను? ఇప్పుడే కాదు - ఇక ముందు కూడా నా దగ్గర ఉన్నంత వరకూ నీకు భయం లేదు - నీకు భయం లేదని తెలిసే వరకూ నిన్ను కదలనివ్వను."
ప్రభాకర్ ఈ మాట అంటున్నప్పుడే వేణు కూడా అక్కడికి వచ్చాడు. సాదారణంగా వేణు తండ్రిని తప్పుకు తిరిగాడు. కానీ, తన యింట్లో ఆశ్రయం పొంది మయూర సపర్యలందు కొంటున్న ఆ వ్యక్తీ ఎవరో తెలుసుకోవాలని వచ్చాడు. మంచం మీద పడుకున్న యతిని చూడగానే త్రుళ్ళి పడ్డాడు. వేణు ముఖం చూడగానే యతి రక్తం సలసల మరిగింది . అతడు తన ఎదుట కూర్చున్న సహృదయుని కొడుకు అనే మాట కూడా మరచిపోయాడు. వేణు పరిస్థితి అలాగే వుంది. ఇద్దరూ ఒకరిని చూసి మరొకరు పగబట్టిన పాముల్లా బుసలు కొట్టారు.
ఇదంతా గమనించి కూడా గమనించనట్లు గంభీరంగా "వేణు! ఇతడు యతి మన మయూర బంధువు . కొన్నాళ్ళు మన యింట్లో వుంటాడు." అన్నాడు. అతి మాములుగా పరిచయం చేస్తున్నట్లు.
వేణు తల దిమ్మెక్కి పోయింది. ఇటీవల తండ్రితో సాన్నిహిత్యం పెరిగిన కొద్దీ, తండ్రి స్వభావం బాగా అర్ధమవుతోంది. యతికీ, తనకూ యెలాంటి పూర్వ పరిచయమో చెప్పడం వల్ల తనకు తండ్రి సానుభూతి లభించదు. యతి సమక్షంలో అవమానం ఎదుర్కోవలసి వచ్చినా రావచ్చును. గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యలేని పౌరుషంతో రగిలిపోయాడు. కనీసం సభ్యత కోసమైనా యతిని పలకరించ లేదు. చరచరా వెళ్ళిపోయాడు.
13
యతి కోలుకుంటున్నాడు. కొద్దిగా లేచి తిరగ గలుగుతున్నాడు. అతను బాగుపడుతున్న కొద్దీ మయూర అతనికి సాధ్యమైనంత దూరంగా వుంటోంది. ఈ విషయం అర్ధం చేసుకున్నాడు యతి. మయూరతో సంభాషణ పెంచడానికి అతడు ప్రయత్నించలేదు. అప్పుడప్పుడు ఇద్దరూ ఒకరినొకరు తారసపడతారు. వాళ్ళ కళ్ళు కలుసుకుంటాయి. అవి మూగగా మాట్లాడుకుంటూ వుండిపోతాయి. ఇద్దరూ తమ వునికినే మరిచి పోతారు. అంతలో ఏదో అలికిడి అవుతుంది. మయూర ఉలికిపడుతుంది. ఏ దెయ్యమో తరుముకొస్తున్నట్లు అక్కడి నుంచి పారిపోతుంది! మయూర యిలా యతికి దూరదూరంగా వుండటం కమలకు చాలా సంతృప్తి కలిగించింది. లేచి తిరిగే ఓపిక రాగానే "ఇక నేను వెళ్తాను" అన్నాడు యతి ప్రభాకర్ తో.
"కూచో !" అన్నాడు ప్రభాకర్.
యతి కూర్చున్నాడు. ప్రభాకర్ కలిగిన ఈ కొద్ది రోజుల పరిచయంలోనూ, అతడంటే చాలా గౌరవం పెరిగింది యతిలో.
"నువ్వు ఇలా ప్రాణాలు పణంగా పెట్టి, నడిపిస్తోన్న ఉద్యమం యేమిటి? దాని గురించి వివరంగా చెప్పు."
యతి తల దించుకున్నాడు. సమాధానం చెప్పలేదు.
"ఓహో! సీక్రేసీ కి భంగం కలుగుతుందని భయపడుతున్నావా? నీకు తెలియని "సీక్రెట్స్' ఈ వుద్యమాలలో ఎన్ని వున్నాయో నాకు తెలుసు. పోనీ ఇది చెప్పు. వెంకటయ్య గారి రామదండు వల్ల దేశానికి మేలు జరుగుతుందని నమ్ముతున్నావా?"
ఈసారి కూడా యతి సమాధనం చెప్పలేకపోయాడు. నిజానికి జైలులో "పులి" ఉరిశిక్ష కళ్ళారా చూసిన నాటి నుంచీ అతనికి ఏది మంచో, యేది చెడో , ఎవరు నాయకులో, ఎవరు వినాయకులో తేలడం లేదు.
యతికి జైలు స్నేహితుడు వీరయ్య. తన పేరు తనకు పలకటం చేతకాక "యిరయ్య " అంటాడు. జైలు ఆవరణలో కొంతమేర కూరగాయల తోటలు ఉన్నాయి. తోట పని తెలిసినవాడని వీరయ్యని ఆ పనిలో పెట్టారు. యతిని మిగిలిన వాళ్ళతో కలవనివ్వటం యిష్టం లేక, అతడిని కూడా ఆ పనిలోనే పెట్టారు. వీరయ్య ఏం మాట్లాడడనీ , మాట్లాడలేడనీ వాళ్లకు తెలుసు. కొన్ని రోజుల్లోనే వీరయ్య యెంత అమాయకుడో యతికి తెలిసిపోయింది. గొడ్డులా పనిచేస్తాడు. ఏదడిగినా అయోమయంగా చూస్తాడు. పేరు మాత్రం "యీరయ్య" అని చెప్తాడు.