మరో తిరుగులేని అధికారాన్ని ఉపయోగించుకుంది. క్రిమినల్ ప్రొసీజరు కోడ్ సెక్షను 57 ప్రకారం ఇరవైనాలుగు గంటలకి మించి నేరస్తుల్ని పోలీసు కస్టడీలో ఉంచకూడదు. అయితే సెక్షన్ 167 ప్రకారం, ఇంటరాగేషన్ ఇంకా కొనసాగించడానికి అవసరం. నేరానికి సంబంధించిన తిరుగులేని సమాచారం ఉన్నాయనిపించినప్పుడు మేజిస్ట్ర్రేట్ ని మరికొన్ని రోజులు కస్టడీలో ఉంచడానికి అనుమతి కోరవచ్చు . అదే చేసిందామె.
పదిహేను రోజులదాకా అలా ఉంచే ఆమె అధికారానికి అనుకూలంగా మేజిస్ట్ర్రేట్ నుంచి ఉత్తర్వుని పొంది లాయర్ల సంఘానికి మరో షాక్ ఇచ్చిందామె.
ఈ నిర్ణయంతో ఆమె ఏ స్థాయి వ్యక్తులదాకా ప్రశ్నగా మారిందో ఆమె సైతం ఊహించలేదు.
మరో బలమైన గెలుపుతో ఇద్దర్నీ పోలీస్ కస్టడీకి మళ్లించిన మిస్. మేనక సంతృప్తికన్నా ఎక్కువ అశాంతికే గురయ్యింది.
ఆ క్షణంలో ముందు గుర్తుకొచ్చింది. మిత్ర.అతనేదో గైడ్ చేస్తాడని కాదు, అతని చేరువలో కొద్ది సేపైనా ప్రశాంతంగా గాడపాలని మనసు అర్థంకాని విషయం.
ఆమె తన చేంబర్ కి తిరిగివస్తూ ఓ మూల కూర్చున్న స్త్ర్రీ ని చూసి ఎంత నిశ్చేష్టురాలైంది అంటే...
ముందు నమ్మశక్యం కాలేదు!
" రాజీ!" ఆత్మీయంగా పలకరిస్తూ ఇంచుమించు కావలించుకున్నంత పని చేసింది "ఏమిటే? నామీద కోపం దగ్గిందా? నువ్వూ ఈ ఊళ్ళోనే ఉన్నావా?" అరమరికలు లేని ఆప్యాయతని ప్రదర్శిస్తూ చేంబర్ కి నడిపించింది. " కూర్చో"
రాజీ కూర్చోలేదు. తలవంచుకునే అడిగింది- " నిన్ను సహాయం అడగాలని వచ్చాను."
"ఏమిటబ్బా?" రాజీ ముఖకవళికల్ని ఆమె గమనించలేదు. "నేను నీకు సహాయం చేసే స్థితిలో ఉన్నానంటే ఎంత అ దృష్టవంతురాలినే! చెప్పు"
"రణధీర్ ని విడిచిపెట్టాలి."
షాక్ తగిలినట్టు చూసింది మేనక." వ్యాట్? రణధీర్ మీద నీకు ఇంట్రస్టేమిటే?"
"రణధీర్ నా భర్త!"
ఓ మిస్సై ల్ మనసు పొరల్లోనుంచి దూసుకుపోయినట్టు అదిరిపడింది మేనక.
" నువ్వు..... నువ్వు రణధీర్ కి భార్యవెలా అయ్యావు?" మేనక గొంతు కంపించింది.
రాజీ పుట్టుంది ఎలాంటి సాంప్రదాయకరమైన వంశంలోనో తెలిసిన మేనక యిలాంటి బంధాన్ని ఊహించలేకపోయింది.
ఇదేమిటి?మెత్తని పుత్తడివెన్నెల్లా, దేవతల దరస్మితంలా, బ్రతుకొక లలితలతాంతమాలలా, అందమైన ఉదయంలా, స్పందించే హృదయంలా, ఆశల గగనంపైన ఆనందంగా విరిసిన హరివిల్లులా ఉంటే రాజీ బ్రతుకులో ఇలాంటి నికృష్టుడెలా అడుగు పెట్టాడు?
రాజీని కలుసుకోవాలని మనసారా కోరుకుంది కాని యిలాంటి కలయికని ఆమె ఊహించలేదు.
"ఎలా... ఎలా విడిచిపెట్టనే? ఆడదంటే విలువలేని ఓ దుర్మార్గుణ్ణి, ఉన్న పరపతితో ఎలాంటి పాడుపనికైనా సిద్దపడగల క్రిమినల్ ని...నీ భర్త అయనాకానీ నేనెలా విడిచిపెట్టను?"
"అస్సలు వీలుకాదా?" అమాయకంగా అడిగింది రాజీ.
రాజీ కళ్ళలో ఆ క్షణాన కూడా మేనకమీద కోపంలేదు. నిస్సహాయత లాంటచి కన్నీళ్ళు. అవికూడా భయంతో రాలుతున్నాయి తప్ప ఆర్తిగా వెలికిరావడంలేదు.
కళ్ళకింద నల్లటి చారలు, కొడిగట్టుతున్న దీపంలాంటి పాలిపోయిన ముఖం.
బోధపడిపోయింది రాజీ సుఖంగా లేదని. ఇప్పడు రాజీని సూటిగా చూడలేకపోయింది మేనక.
" రాజీ!" కిటికీ దగ్గరకు నడిచి బయటికి చూస్తూ అందామె. చిత్రంగా ఆమె గొంతూ గాద్దదికమైపోతూంది. " నేను మరిచిపోలేదే.... ఒకనాడు ఆప్యాయతకోసం, సానుభూతికోసం అలమటించిపోతున్న రోజుల్లో.... నువ్వు నాకు అందించిన ప్రేమని నేనెలా మరచిపోగలనే? నన్ను నేను అసహ్యించుకుంటూ అమ్మమీద అలిగి అన్నం తినకపోతే నువ్వు ఆరిందెలా తినిపించేదానివి. అప్పుడేమనుకునేద్నో తెలుసా! నాకే శక్తుంటే , దేవుడు అలాంటి శక్తి నాకిస్తే నీకు ఏమన్నా చేయాలనుకునేదాన్ని.ఇప్పుడు ఆ శక్తుంది కాని అది నాదికాదు. అందుకే నాది కాని దాన్ని నీకు పంచలేక... "వెనక్కి తిరిగింది. రాజీ లేదక్కడ.
ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్ని ఎదుర్కొవాల్సి వస్తుందనిపించిన తొలిక్షణమైనందుకేమో ఓ నీటి బొట్టు నిస్సహాయంగా ఆమె కనుకొలకుల్లో నిలిచింది.
ఆఫీసులో ఉండలేకపోయింది. మనసు ఓదార్పుకోసం అలమటించిపోతుంటే క్వార్టర్సుకి వెళ్ళిపోయిన మేనక మధ్యాహ్నం భోంచేయలేదు.
"ఏమైందమ్మా?" అడిగింది అన్నపూర్ణ
తల్లి ముందు ఏనాడూ నిబ్బరాన్ని కోల్పోయినట్టు కనిపించని మేనక యిప్పుడూ అలాగే ధైర్యాన్ని నటించేసింది " ఆకలిగా లేదే!"
"దిగులుగా ఉన్నావెందుకు?"
"ఛ ఛ!కాస్త అలసటగా ఉంది మమ్మీ."
"పిచ్చితల్లీ!" ఆప్యాయంగా ఆమె తల నిమిరింది. " నేను నీకు అమ్మనే.... దిగులుకీ, అలసటకీ తేడా తెలుసుకోలేనా?"
"మమ్మీ!" ఇక నిగ్రహించుకోలేకపోయింది. "నాకు మిత్ర కనిపించాడు. రాజీకూడా వచ్చింది.ఏమిటో... ఆ కుటుంబం... మమ్మీ! ఏమైందో తెలీదు కాని.... వాళ్ళు పూర్వంలా ఉంటున్నట్టు లేదు" అంతకన్న వివరంగా చెప్పలేకపోయింది. " నీకు తెలుసా మమ్మీ? మిత్రా వాళ్ళ నాన్నగారు ఈ మధ్యనే పోయారట. మనకు తెలీనే తెలీదుకదూ?"
చాలా ఒడిదుడుకుల్నీ , కష్టాల్నీ, కన్నీళ్ళనీ ఎదుర్కుంటూ బ్రతికిన ఆమెకు, మేనక మిత్రుల బంధం గురించి తెలీనిదికాదు. ఆ కుటుంబమే ఆదుకోకపోతే-ముఖ్యంగా మిత్ర అండలేకపోతే మేనక ఈ స్థితికి ఎదిగేదాకాదు.
తన ముందున్నది ఎదిగిన కూతురు. ఏనాడూ తన మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పని మేనక ఈ మాత్రమైనా దిగులు వ్యక్తం చేసిందిప్పుడే.
జీవితంలో ఇంతదాకా ప్రేక్షకురాలిలానే గడిపేసిన ఆమె ఇప్పుడూ మాట్లాడలేకపోయింది.
సరిగ్గా అప్పుడు ఎస్సై మురారి వచ్చినట్టు మేసేజ్ తీసుకొచ్చాడు ఆర్డర్లీ.
మామూలుగా అయితే ప్రస్తుత స్థితిలో ఆమె తిరస్కరించేదే కాని డిపార్టుమెంట్ లో ఆమెకు ఆత్మీయుడిలా అనిపించేది మురారి ఒక్కడే. కాదనలేకపోయింది.