ఆ తర్వాత నాకు అర్దం అయింది. ఆయన అడిగింది.... కోటేశ్వరరావుగారి చిన్న కోడలు గురించి అని!రామనాధం కోటేశ్వరరావుగారి చిన్నబ్బాయి. అతనికి పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య ఏవో తగాదాలు వచ్చాయి. దాంతో ఆ అమ్మాయి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. వాళ్ళూ, వీళ్ళూ కల్పించుకుని నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. చివరికి విభూతిపిండికట్లు, కుంకుమ బొట్టుతో దైవభక్తుడివలె కనిపించే బాల సుబ్రమణియన్ గారిని పంపితే ఆ రాయబారం శ్రీ కృష్ణ రాయబారంలా కాకుండా, సంజయ రాయబారంలాగా సానుకూల పడవచ్చునని ఆయనని పంపారు. పైగా..... ఆ అమ్మాయి వాళ్లది కూడా మద్రాసే కావడంతో అది తప్పక విజయవంతమవుతుందని ఆసించారు. అయినా లాభం లేకపోయింది. ఆ విషయాలన్నీ నా మనసులో మెదిలాయి.
"లేదండీ... వాళ్ళు తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆ అబ్బాయి మళ్లీ పెళ్లి చేస్కున్నాడు కూడా!" అమమాయి సంగతి తెలీదు"అన్నాను.
"కడవులే.... కడవులే.... ఎన్నా ఇది? రొంబ కలిగాలం!" అన్నాడు బాలు చేతులు పైకి ఎత్తి ఆకాశంలోకి చూస్తూ.
"కడవులూ లేదు..., అడవులూ లేదు... ఊర్కోవయ్యా స్వామీ!" అని మనసులోనే అనుకున్నాను. ఆయన స్వాతిని అవమానపరచిన విషయం నా మనసుని పురుగు తొలిచినట్లు తొలుస్తోంది. ఆ విషయం ఏ విధంగా కదిపి నాలుగు చివాట్లు పెట్టాలా... అని ఆలోచిస్తూంటే ఆ ప్రార్దన ఆయనే తెచ్చాడు -
"చూడు సామీ... మీ అక్కా, బావా సౌక్యమా?" అంటూ.
"ఆ సౌఖ్యమే! అన్నట్లూ... మా స్వాతిని నిన్న మీరు చూశారటగా?కలిసి మాట్లాడరట కూడా!" అన్నాను కోపాన్ని ముఖంలో కనబడనీయకుండా.
"ఆమ..... అవునప్పా! ఆమె నాట్టియం చూస్తిని. రొంబ నల్ల నాట్టియం అప్పా. నాకదా రొంబ సందోషబడిదిని!" అన్నాడు తన్మయత్వంతో.
"ఆ సబలో సొన్నారు. ఆ అమ్మాయికి రెండు గొప్ప పిరుదులు కూడా ఇచ్చినారటగా! నాట్టియ సుందరి, నాట్టియ మయూరి. ఇవి రెండూ మంచి పిరుదులు. శానా బాగున్నాయి. రొంబ ఆనందమాచ్చి!" అన్నాడు మళ్ళీ.
అంతే...!
బాలుగారి 'పిరుదుల రహస్యం' అర్దమైపోయింది. ఆయన నోట్లోపడి 'బిరుదులు' కాస్తా 'పిరుదులు' అయిపోయాయి. ఆయనగారి మీద నెయ్యిలా పేరుకున్న కోపం వెన్నలాగా కరిగిపోయింది. ఆ క్షణంలో ఆయన ముఖంలో తాండవిస్తున్న విష్కాపట్యం, అమాయకత్వం చూస్తుంటే ఆయన పట్ల గౌరవం పెరిగింది.
ఒక భాషలో మంచి అర్దం వున్న మాటకి మరో భాషలో పరమ ఛండాలమైన అర్దం వుండవచ్చు. అలాగే... ఉచ్చారణలో మంచి మాటల రూపం చెడుగా మారవచ్చు. ఇందుకు 'బిరుదులు.. పిరుదులు' కావడమే మంచి వుదాహరణ! ఆయనలో దురుద్దేశం లేనప్పుడు జరిగినదానికి బాధపడవలసిన అవసరం లేదు. హాయిగా నవ్వుకుంటే సరిపోతుంది.
తేలికపడ్డ మనసుతో - "ఇవాళ మా ఇంటికి రండి. మా అక్కా, బావా మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. మీరు వస్తే చాలా సంతోషిస్తారు" అన్నాను.
"లేదప్పా ..రాత్తిరికి టికెట్ తీస్తివి. ఈతూరి తప్పక వత్తును. ఉంగ అక్కనీ, బావనీ శానా అడిగానని చెప్పుమీ. స్వాతికి ఇంకా ఇంకా గొప్ప పిరుదులు రావాలని కోరుకున్నానని చెప్పుమీ!" అంటూ కిళ్లీసారం నిండిన నోటితో చెప్పాడు. ..ఉమ్మి క్రింద పడకుండా తల పైకెత్తి .ఆ విన్యాసంలో నోటి చివర నుంచి ఎర్రని సారం కొంత కారి ఆయన తెల్లని చొక్కా మీద పడింది. అది ఆయన గమనించనే లేదు.
ఇంక బాలుగారిని ఎక్కువగా ఇబ్బంది పెడ్డటం ఇష్టంలేక, నవ్వును ఆపుకోవడం మరీ కష్టమవుతుండడం వల్లనూ ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాను.
అప్పటినుంచి నాకు ఎవరికి బిరుదులు ఇచ్చినా బాలుగారి భీషణ భాషణమే జ్ఞాపకం వస్తూ వుంటుంది.
-ఆంధ్రభూమి మాస పత్రిక....ఏప్రిల్' 98
టాపిక్ ఛేంజ్ బాగుండదు
ఓ కొత్త నటి - "డైరెక్టర్ గారూ... మీరంటే నాకు ఎంతో ప్రేమ! చెప్పలేనంత ప్రేమ.... నిజంగా చాలా ప్రేమ...." అంటూ అవే మాటలు పదేపదే వల్లించసాగింది.
డైరెక్టర్ :అయితే నన్ను పెళ్లాడ్తావా?
కొత్తనటి: నాకు టాపిక్ ఛేంజ్ చేయడం ఇష్టం వుండదు.