Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 16


    "కానీ......నారాయణ్, టాగూర్...."

    ఆమె కొద్ది క్షణాలు విస్మయంగా చూస్తుండి పోయింది.

    "ఐ యామ్ సారీ......వాళ్ళకు పార్శిల్ తీసుకెళ్దాం" అంది నొచ్చుకుంటున్నట్టు.

    అప్పుడు హుషారుగా ఆమె వెనుకే హొటల్లో కి నడిచాడు అనిల్.

    ఇద్దరూ కబుర్లు చెప్పుకొంటూ టిఫిన్ కి ఆర్డరిచ్చారు.

    టిఫిన్ పూర్తయ్యే సరికి పార్శిల్ వచ్చింది. అది తీసుకొని లేస్తుండగా  నలుగురువ్యక్తులు శిరీష దగ్గరకు వచ్చారు.

    "పిల్ల బావుంది గదరా..... వీడెవడు మధ్యలో?" శిరీష వాళ్ళను  చూసి  ఒకింత కంగారుపడింది.

    వాళ్ళు మరింత దగ్గరకు వచ్చారు.

    అనిల్ కి పరిస్థితి అర్థమైంది.

    "ఎవరు మీరు.....? ఏమిటి మీ ఉద్దేశ్యం?" అనిల్ భయపడుతూనే అన్నాడు.

    "పిల్ల జాంపండులా ఉంది.... చూస్తూ ఎలా ఊరుకోగలం?" ఒకడు మరింత ముందుకు వచ్చి దాదాపు శిరీషకు ఆనుకొనేలా నించున్నాడు.

    అనిల్ వాళ్ళకు సమాధానం చెబుతాడని ఎదురు చూస్తున్న శిరీషకు ఆశాభంగమైంది.

    అనిల్ వాళ్ళును చూసి భయపడుతున్నట్లుగా గ్రహించి ఆమె ఒకింత  ప్రక్కకు జరిగి "నా దగ్గర పిచ్చివేషాలు వేయవద్దు. మర్యాదగా అడ్డు  తప్పుకోండి." కోపంగా అంది.

    దాంతో వాళ్ళు మరింత రెచ్చిపోయారు. అక్కడున్న పదిపదిహేను  మంది భయంగా  చూస్తున్నారే తప్ప శిరీషను వారినుంచి రక్షిద్దామనే ప్రయత్నంలో లేరు.

    ఒకడు చటుక్కున శిరీష భుజంమీద చేయి వేశాడు.

    దాంతో ఆమె కంగారు పడి అనిల్ వెనక్కు వెళ్ళి నించుంది.

    మరొకడు నవ్వుతూ అనిల్ వద్దకు వచ్చి "తప్పుకో" అన్నాడు గుడ్లురుముతూ.

    అనిల్ కి పిరికితనం ఎక్కువ.

    సాధ్యమైనంత వరకు గొడవలకు దూరంగా ఉంటాడు.

    వారి బారినుంచి శిరీషను కాపాడాలనే  ఉంది. కాని ధైర్యం చాలటం లేదు. ఒళ్ళంతా అప్పటికే చెమటలు పట్టేసాయి.

    అనిల్ పిరికి వాదనే విషయాన్ని వాళ్ళు పసిగట్టి మరింత రెచ్చిపోయారు.

    "ఏమిటి అలా కామ్ గా ఉంటారు వాళ్ళు మీద మీదకొస్తుంటే....." శిరీష అనిల్ ని ఉద్దేశించి అంది.

    "వీడా.....? వీడునిన్ను రక్షిస్తాడా? వీడో అర్బకుడు. వీడికే ధైర్యం ఉంటే నేనునీ భుజమ్మీద చేయి వేయగానే రెచ్చిపోయేవాడు. ప్రక్కకు తప్పుకోరా" ఒకడు పెద్దగా నవ్వుతూ అన్నాడు.

    అనిల్ అంత పిరికివాడు అని ఊహించని శిరీష భయపడిపోయింది. తప్పదు.....తనను తనే రక్షించుకోవాలి....

    ఆలోపు ఒకడు అనిల్ ని ప్రక్కకు లాగి పడేశాడు.

    చూట్టానికి ఆరడుగుల ఎత్తులో ఆజాను బహుడిలా కనిపించే అనిల్ తేలిగ్గా వెళ్ళి ఓ బల్లమీద పడిపోయాడు.

    ఆమెకి అర్థమైపోయింది అక్కడున్న ప్రతి ఒక్కరు ఆ రౌడీలకు భయపడుతున్నట్లు. అనిల్ పిరికివాడు.....ఆమె చురుగ్గా ఆలోచిస్తోంది.

    ఆ నలుగురిలో ఒకడు ముందుకు వచ్చి"దీన్ని పట్టుకెళ్ళి మన జీప్ లో పడేయండిరా...." అన్నాడు ధీమాగా.

    అలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఆమె గాని, అనిల్ గాని ఊహించలేదు.

    ఇద్దరు ముందుకు వచ్చి శిరీష భుజాల్ని గట్టిగా నొక్కి పట్టుకొని జీప్ వేపుకు లాక్కెళ్ళసాగారు.
   
    అనిల్ కంగారుపడుతూ లేచి వాళ్ళకు ఎదురెళ్ళాడు.

    "ఇదన్యాయం.....పట్టపగలు ఓ ఆడపిల్లపై దౌర్జన్యం చేయటం తప్పు.... దయచేసి వదిలేయండి.." అర్థిస్తున్నట్లుగా అన్నాడు అనిల్.

    వాళ్ళు అనిల్ మాటల్ని పట్టించుకోలేదు సరిగదా ఒకడు అనిల్ ని  విసురుగా ప్రక్కకు లాగేశాడు.

    అనిల్ నిస్సహాయంగా చూస్తుండి పోయాడే తప్ప తెగించి వాళ్ళకు అడ్డుగా రాలేక పోయాడు.

    జీప్ మరో పదడుగుల దూరంలో ఉందనగా "హెల్ప్.....హెల్ప్..." పెద్దగా అరిచాడు అనిల్.

    అప్పుడే మిలటరీ జీప్ అటుగా వెళ్తూ, అనిల్ కేకలకు ఆగిపోయింది. శిరీషను పట్టుకున్న అగంతకులు జీప్ ఆగిపోవటంచూసి ఓ క్షణం  ఆమెను వదిలేసారు.

    జీప్ లోంచి ఇద్దరు మిలటరీ సిపాయిలు డిగి శిరీష కేసి రావటం చూసి నలుగురు అగంతకులు పలాయనం చిత్తగించారు.

    శిరీష వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పి అనిల్ ని రమ్మన్నట్లుగా సైగచేసి ముందుకు సాగింది.

    ముందు ఆమె, వెనుక రెండడుగుల దూరంలో అనిల్ మౌనంగా  నడుస్తున్నారు.

    అతనికి సిగ్గుగా ఉంది ఆమెను రక్షించలేకపోయినందుకు. అతని పరిస్థితిని ఆమె సరిగ్గానే అంచనావేసింది.

    "సిగ్గు పడకు మిత్రమా. అన్యాయం జరిగితే ఎదురు  తిరగటం అక్రమం జరుగుతుంటే అడ్డుకోవటం గురించి ఇకనైనా ఆలోచించు. లేదంటే జీవితంలో చాలా విలువైన వాటిని వదులుకోవాల్సి వస్తుంది. ఈ పిరికితనమే నీలో కొనసాగితే నీ జీవితాన్ని కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఈ పిరికితనమే నీలో కొనసాగితే నీ జీవితాన్ని కూడా వదులుకోవల్సివస్తుంది."

    ఆమె మాటల్లో ఎత్తిపొడుపు లేదు. కావాలనే తన అసమర్థతను ఎత్తి చూపుతున్నట్లులేదు. తనలో మార్పు అవసరం అనే ఆమె హితభోధ చేస్తున్నట్లున్నాయి.

    బస్ ఉన వీధిలోకి రాగానే ఆమె కుడివేపుకు చీలిపోతూ అతనికేసి చూసింది. ఆ చూపులు మార్పు అనివార్యం అని ఆఖరిసారి హెచ్చరించి నట్లున్నాయి.

   
                       *    *    *

    "ఒరేయ్ అనిల్..... నీ కోసమే చూస్తున్నాంరా- మంచి బేరం తగిలింది. అది ఒప్పుకుంటే వారంరోజులు మనకు తిండికి ఢోకా ఉండదు....." టాగూర్ అర్థిస్తున్నట్లుగా అన్నాడు.

    "నాకీ నెలాఖరు వరకు ఏదో ఒక ఉద్యోగం రావటం ఖాయం. ఈ  ఒక్కనెల ఎలాగోలా గడిచిపోతే చాలు. ఈ బేరం ఒప్పుకోరా" నారాయణ్ కూడా బ్రతిమిలాడాడు.

    "ఏం బేరం? స్త్రీ పాత్ర ధరించాలా?" అనిల్ నిర్లిప్తంగా అడిగాడు.

    "అదేం కాదు.....ఒక చావు ఏడుపు ఏడవాలి"

    అనిల్ నారాయణ్ కేసి ఆశ్చర్యంగా చూసాడు.

    "అవును.....ఈ పారిశ్రామిక ప్రపంచంలో బంధాలు, బంధుత్వాలు అడుగంటి పోతున్నాయి. మెటీరియలిజం ఎక్కువయిపోతోంది. అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమ, జాలి, కరుణ మచ్చుకుకూడా కనిపించవేమో కొన్నాళ్ళుపోతే. తల్లిదండ్రులకు ఆరోగ్యం సరిగాలేదని కబురొస్తే తల్లి ఒంటిమీద బంగారం మాకే కదా: అని ఆడపిల్లలు ఆలోచిస్తే, తండ్రి వీలునామా ఏదైనా రాసాడా? అని కొడుకులు ఆలోచిస్తున్న కాలం ఇది. అందుకే మనకి బేరం తగిలింది. ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆమె తాలూకు సంతానం ఏడ్చేందుకు ఒక మనిషి కావాలని వెదుకుతుండగా మనకు దొరికిపోయారు. గంటపాటు ఏడిస్తే నూట యాభై ఇస్తారట. ఏడిస్తే పోలా?"

    అనిల్ భారంగా నిట్టూర్చాడు.

    "ఎన్నాళ్ళు.....ఎన్నాళ్ళిలా బ్రతగ్గలం? ఏదో ఒక జాబ్ లో సెటిల్ అవ్వక తప్పదు. సరే ఎప్పుడు?" అనిల్ నిస్పృహగా అన్నాడు.

    మరో పదినిమిషాల్లో శ్మశానానికి తీసుకువెళ్తారట. బయలుదేరాలి మనం....." టాగూర్ బయలుదేరేందుకు సిద్ధపడుతూ అన్నాడు.

    మొత్తానికి రెండు నిమిషాలకు ముగ్గురూ బయటకు వచ్చి బస్ డోర్ని దగ్గరకు  నెట్టి, తాడు పెట్టి కట్టేసి బయలుదేరారు.

    ఓ మామూల పెంకుటిల్లు, దానిముందు ఓ శవం. శవంపై గుడ్డ కప్పి ఉంది.

    చుట్టుపక్కల జనం ఇంకా గుమికూడలేదు.

    నారాయణ్ ని, టాగూర్ ని చూస్తూనే ఇద్దరు యువకులు ముందుకొచ్చి ఇంతలేట్ చేసారేం? త్వరగా మొదలెట్టమని చెప్పండి.....మీ మిత్రుడికి" అన్నారు ఆరాటంగా చుట్టుపక్కలకు చూస్తూ.

    టాగూర్ అనిల్ కేసి చూస్తూ సైగచేసాడు. అనిల్ పెద్దగా ఓ కేక వేసి ఏడుపు లంకించుకున్నాడు. టాగూర్, నారాయణ్ కూడా విచారంగా శవం ప్రక్కనకూర్చున్నారు.

    చూస్తుండగానే చుట్టుపక్కల జనం శవం దగ్గరకు రాసాగారు.

    అనిల్ అద్భుతంగా నటిస్తున్నాడు.
   
    హృదయ విదారకంగా ఉన్న అనిల్ ఏడుపును చూసి చుట్టుప్రక్కల జనం ఓదార్పు మాటలు ప్రవచిస్తున్నారు. ఏడుపు ఏర్పాట్లు చేసుకున్న ఇద్దరు  యువకులు చూస్తుండగానే అక్కడ గుమికూడిన జనం సానుభూతినిసోమ్ముక్రింద మార్చుకోసాగారు.

    అనిల్ కళ్ళముందు నూటయాభై రూపాయలే కనిపిస్తున్నాయి.

    ఈ పీడ ఎప్పుడు పూర్తవుతుందా అని టాగూర్, నారాయణ్ తలలు  వంచుకొనే వాపోతున్నారు.

    అరగంట గడిచింది.

    శవాన్ని పాడెమీద పడుకోబెట్టారు.

    టాగూర్, నారాయణ్ వెనుక వేపు పట్టుకుంటే ఆ ఇద్దరు యువకులు ముందు పట్టుకొని శవాన్ని లేపి భుజాలమీదకు దించుకొని బయలుదేరారు.

    శవానికి ముందుగా నిప్పుల కుండతో అనిల్ బయలుదేరాడు.

    ఊరేగింపు శ్మశానానికేసి బయలుదేరింది. సరిగ్గా  అదే సమయానికి హంపీ షూటింగ్ కి పేకప్ చెప్పి వ్యాన్ లో వస్తోంది.

    వ్యాన్ సరిగ్గా శ్మశానం మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేసరికి శవం  ఊరేగింపు ఎదురుపడింది.

    డ్రైవర్ వ్యాన్ ని ఓ ప్రక్కన ఆపి "ఊరేగింపును శ్మశానంలోకి వెళ్ళనిచ్చి వెళ్దాం మేడమ్ అన్నాడు.

    హంపీ మౌనంగా తలూపింది. ఊరేగింపు మరింత దగ్గరగా  వచ్చింది.

    హంపి చూపులు అనిల్ మీద పడ్డాయి.

    ప్రపంచంలోని బాధలన్నీ మోస్తున్న వాడిలా, సర్వస్వాన్ని కోల్పోయిన  వాడిలా ఉన్నాడు అనిల్. అతని కళ్ళవెంట నీళ్ళు.....

    అతని కళ్ళలోతుల్లో తీరని వ్యధ, కన్నతల్లిని పోగొట్టుకున్న  బాధ  స్పష్టంగా కనిపిస్తోంది.

    అంతే..ఆమె చటుక్కున కెమేరా చేతిలోకి తీసుకుని  అనిల్ మీదకు ఫోకస్ చేసి జూమ్ తో ముందుకెళ్ళి పోయింది.

    అప్పుడప్పుడు దారి మధ్యలో అద్భుతమైన దృశ్యాలు కళ్ళబడితే వాటిని షూట్ చేసుకొనే అలవాటు హంపికుండటంతో యూనిట్  వాళ్ళు  పెద్దగా ఆశ్చర్యపోలేదు.

 Previous Page Next Page