Previous Page Next Page 
చెంగల్వ పూదండ పేజి 16


    బ్రతకాలి, నాకు మిగిలిందింకా ఒకటి వుంది.

    "పగ!"

    అవును. "పగ!"

    పగ తీర్చుకోవాలి! పగ తీర్చుకోవాలి! లేచేను. నాలో ఏదో  ఉన్మాదం ప్రవేశించింది. పగ! ప-గ- గట్టిగా అరుస్తున్నానేమో- నాకే తెలియదు. పిచ్చెక్కిపోతోంది. నాకు- అదొక్కటేతెలుసు నాకు. తల విదిలించేను. గట్టిగా  అరవాలనిపిస్తోంది. బట్టలు చింపుకొని వికృతంగా నవ్వుతూ రోడ్డుమీద పరుగెత్తాలనిపిస్తోంది. అరుస్తున్నాను-"లక్ష్మీనారాయణా-నిన్ను బ్రతకనివ్వను, నిన్ను బ్రతక...."

    భుజం మీద  ఎవరిదో చల్లగా చెయ్యిపడింది. వెనక్కి తిరిగి చూసేను.

    రాజా నరేంద్రవర్మ.

   
                                                 9

    ప్రహరీ గోడ గేటు దగ్గర నిలబడ్డాను. పదిహేనుమంది దాకా  దాదాపు పనిలో వున్నారు. ఇద్దరు రోడ్డు మీద మట్టిపోసి, గట్టిగా  చదునుచేస్తున్నారు. ఒకడు తెల్లసున్నం పోసిన ఇటుకరాళ్ళు వరుసగా సర్దుతున్నాడు. ఇద్దరు గులాబీ మొక్కలకి నీటి కాలువలు తవ్వుతున్నారు. కొందరు గదమంచె లెక్కిరంగులు వేస్తున్నారు. ఆ రంగులు స్పెషల్ గా రాయపూర్ నుంచి తెప్పించినవి. రంగులు కలిపి ప్రయోగాలు చేయటంలో శంకర్ దాదాకి  మంచి అనుభవం వుంది.

    రోడ్డుమీద వెళ్ళేవాళ్ళు క్షణం ఆగి, ఇంటిని పరకాయించి చూస్తూ సాగిపోతున్నారు.

    "అద్భుతం" అంటున్నారెవరో. పక్కవాడితో కష్టపడి పనిచేసిన కూలివాడికి రోజుకు దొరికేది నా చేతిలోవున్న సిగరెట్ పెట్టె ఖరీదులో సగం. ఉహూఁ నేను అలా ఆలోచించకూడదు.

    దృష్టి ఇంటిమీదకు మరల్చేను.

    ఇంటిముందు చిన్న స్విమ్మింగ్ పూల్ తయారయింది. పోర్టికో వెడల్పుగా అందంగా.....హుందాగా వుంది. మెయిన్ గేట్ నుంచి పోర్టికో వరకూ వేసిన ఎర్రరోడ్డుకి ఇరువైపులా పెంచిన గడ్డి పచ్చగా మెరుస్తోంది.

    శంకర్ దాదా వచ్చి నా పక్కన నిల్చున్నాడు. పనివాళ్ళు చేస్తున్న దానిని తిలకిస్తూ- చాలా తొందరగా జరిగిపోయింది పని" అన్నాను.

    "అవును" తలూపేడు. "ఇంత పెద్ద ఇల్లు రెండు నెలల్లో తయారవటం అంటే సామాన్యమైన విషయం కాదు" అన్నాడు.

    అంతకుముందు అమెరికన్ మాగజైన్ తో చదివిన "పెర్టు" సి.పి.ఎం' మీద ఆర్టికల్ జ్ఞాపకం వచ్చింది. "ఎవరన్నా  పందెం కడితే ఇంతకన్నా పెద్ద యింటిని ఇంకా తక్కువ టైమ్ లో కట్టించగలను" అన్నాను.

    "దగ్గిరుండి కట్టించటం సులభమే కాని, అక్కడెక్కడో వుండి ఉత్తరాలమీద పని జరిపించటం అంటే మాటలు కాదు".

    "తొందరగా వచ్చేసేవాణ్ని. కానీ తాతయ్య బలవంతం చేసేడు" చెప్పాను.

    "మీరు లేని లోపం ఏదైనా కనపడుతోందా?' అనుమానంగా అడిగేడు.

    "అహఁ అటువంటిదేమీ లేదు. నాకు చాలా తృప్తిగా వుంది. నీలాంటివాడు  చేతిక్రింద వుంటే, కుర్చీలోంచి లేవకుండానే ఎంత పనైనా చేయించుకోవచ్చు".

    "నాలాంటివాళ్ళు ఎక్కడయినా దొరుకుతారు బాబూ, కానీ కుర్చీలో కూర్చునే అన్ని విషయాలు గమనిస్తూ కావాల్సిన పన్లు చేయించుకోవటం అంటే మాటలు కాదు. ఆ శక్తి మీ తాతగారిలోనే చూసేను, యిప్పుడు మీలో చూస్తున్నాను-"

    మాట మర్చి, "నాదో చిన్న అనుమానం" అన్నాను.

    "చెప్పండి బాబూ-"

    "ఆ రోజు లాడ్జిలో నన్ను గది మర్పించాడు మేనేజరు" ఆగేను. "ఆ రెండో  గదిలో  మైక్రోఫోను ఆరేంజి చేసింది నువ్వే కదూ!"

    శంకర్ దాదా  ముడతలుపడ్డ చెక్కిళ్ళమీద  నవ్వు వెలిసింది.

    "పెదబాబుగారు కూడా  అప్పుడు ఈ ఊళ్ళోనే వున్నారు బాబూ! జరిగినదంతా వారికి ఎప్పటికప్పుడు వినవించటమే నేను చేసిన పని-"

    ఇంతలో ఎదురింటిముందు కారు ఆగింది. ఇంటి ఓనరు దిగి, లోపలికి వెళ్ళబోయి, మమ్మల్ని గమనించి, మావైపుగా వచ్చాడు. శంకర్ దాదా అతన్ని చూసి "నమస్తే సాబ్, రండి - రండి" అన్నాడు ఆహ్వానిస్తూ. అతడు నావైపు చూస్తూ. ఈయన.....అన్నాడు ప్రశ్నార్థకంగా.

    "మా యజమాని, ఈ రోజే వచ్చారు" అన్నాడు దాదా.

    అతను నాకు చెయ్యి అందిస్తూ, "మిమ్మల్ని కలుసుకొంటున్నందుకు చాలా సంతోషంగా వుంది" అన్నాడు.

    నేనూ చెయ్యి అందించేను. "నాకూ....." అన్నాను. బాగా కండపట్టిన అతడి చేయి మెత్తగా అసహ్యంగా తగిలింది.

    "ఇంత తొందర్లో పూర్తి చేయగలిగారంటే - చాలా పకడ్బందీగా ప్లాన్ వేసి వుండాలి మీరు."

    "ఇంత చిన్న చిన్న ప్లాన్ లు కూడా మనం వేయటం మొదలుపెడితే మన టైము అంతా దీనికే వేస్టు అవుతుంది. దీనికి ప్లాన్ వేసింది నా గుమస్తా" అని శంకర్ దాదాని చూపించేను.

    "నిజవేఁ....... నిజవేఁ......." అన్నాడు అతడు తలూపుతూ. "పెద్ద పెద్ద డిసిషన్ లు మనం తీసుకోవాలి" అర్థంతరంగా గొప్పవాడై పోయి, స్టేటస్ నిలుపుకునే తాపత్రయం అతడు వాడే ఇంగ్లీషు పదాల్లో కనిపించింది.

    "ఇంతవరకూ నా ఇల్లు ఈ ఊళ్ళోకల్లా పెద్దది, ఇక నుంచి మీది" నవ్వేడు. "అందులోనూ ఎదురెదురు".

   
    "నాలుగు రోజుల్లో మంచి ముహూర్తం వుందట. ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళందరికీ పార్టీ ఇద్దామనుకొంటున్నాను. గృహప్రవేశం సందర్భంలో" అన్నాను మాటమారుస్తూ. "ఎలాగూ ఈ ఊళ్ళోనే సెటిల్ అవుదామనుకొంటున్నాను కాబట్టి అందర్నీ పరిచయం చేసుకోవాలి కదా!"

    "అవునవును. అందరూ మిమ్మల్ని కలుసుకోవాలకొంటున్నారు....."

    "మీరు ఆ రోజు నాతో తప్పకుండా రావాలి. నాకెవరూ తెలీదుకదా" అభ్యర్థిస్తున్నట్లు అడిగేను. అతడి మొహంలో ఆనందం స్పష్టంగా కనిపించింది. "అలాగే అలాగే...." అన్నాడు ఉబ్బితబ్బిబ్బవుతూ.

    "సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకొందాం" అన్నాను షేక్ హేండిస్తూ.

    "మంచిది-" అని కదలబోతూ "మీ పేరు?" అని అడిగేడు.

    "మోహన్, కృష్ణమోహన్" అన్నాను.

    "అలాగా, బావుంది.....బావుంది.....నా పేరు లక్ష్మీనారాయణ " అన్నాడు

    "ఎంత ఖర్చయింది ఇప్పటికి?"

    "లక్ష. ఇంకో ఇరవై వేలదాకా ఖర్చ వుంటుంది" పుస్తకం చూడకుండానే చెప్పేడు.

    "రేపు పార్టీకి ఓ పదివేలు ఖర్చు పెట్టవలసి వుంటుంది".

    తలూపేడు.

    "బైదిబై- ఆ అడవి పాడటం ఏమయింది?"

    "మనకే వచ్చింది".

    "గుడ్. పీచు?"

    "స్టాకు రెడీగా వుంది. షిప్ కుదర్లేదు. అదే ఆలస్యం".

    "ఆ క్వారీలో' పని ఎలా జరుగుతూంది?"

    "అన్నిటికన్నా అందులోనే ఎక్కువలాభం వచ్చేట్టు వుంది.

    పనిచురుగ్గా సాగుతోంది. ఆ రంపపుపొడి కాంట్రాక్టురు మొత్తం అంతా తనే కొనుక్కుంటా నంటున్నాడు".

    "వెంటనే అమ్మేయండి. మనం తొందరగా డబ్బు 'రొటేట్' చెయ్యాలి. ఎక్కువ సమయంలేదు. ఖర్చు పెట్టిందికాక పదిహేను పర్సెంట్ లాభం చూపిస్తానని తాతయ్యతో పందెం కాసేను. ఇప్పటికి రెండులక్షలు ఖర్చయింది".

    ........ఆరు లక్షలకి- సంవత్సరంన్నరకి పదిహేను పర్సెంట్- అంటే లక్షా ముప్ఫె అయిదువేలు సంపాదించాలి. సంవత్సరంన్నరలోనూ మూడు లక్షల ముప్ఫె అయిదువేలు.

    చాలా కష్టమైన ఆట.

    ఆలోచనల్లో వుండగానే పక్కన ఏదో గొడవ జరుగుతూ వుండటం చూసి అటు తిరిగేను.

    శంకర్ దాదా ఎవరి మీదో అరుస్తున్నాడు. ఎవరో ముసలివాణ్ని కసిరి వెళ్ళిపొమ్మంటున్నాడు.

    "ఏమిటి విషయం?" అడిగేను.

    'మన క్వారీలో పనిచేసే కూలీ బాబూ! ఇంట్లో చిన్నపిల్లకి బావోలేదట. వారం రోజుల కూలీ ఈవేళ కావాల్ట' అన్నాడు. అతడివైపు చూసేను. అరవై ఏళ్ళుంటాయి. అస్థిపంజరానికి చర్మపు బట్టలు తొడిగినట్లున్నాడు.

    "మేనేజర్ని అడక్కుండా ఇక్కడికెందుకు వచ్చేడు?"

    "అలా ఇవ్వరు బాబూ" అన్నాడా వృద్ధుడు.

    అవును ఒకసారి వారం రోజుల కూలి ఇచ్చేస్తే మళ్ళీ కనబడరు. అలాగే ఉడాయించేస్తారు" అన్నాడు దాదా.

    శంకర్ దాదా వైపు తదేకంగా చూసేను. "మనిషి మంచితనంమీద అంత తక్కువ నమ్మకం పెంచుకోవటం సాటి మనిషిగా అవమానం గాదా" -అన్నట్టు.

    "మా పిల్లకి అస్సలు బావోలేదు బాబూ" దీనంగా చేతులు జోడించాడు అతడు. అతడికి బావోలేనట్టుంది- జోడించిన చేతులు సన్నగా వణుకుతున్నాయి వృద్ధాప్యంతో ముడతలుపడ్డ చెక్కిళ్ళమీద నీటిచుక్క తళుక్కుమంది- గాజుకళ్ళు ఆర్తిగా చూస్తున్నాయి- జేబులోంచి ఇరవై రూపాయలు తీసేను, "ఇదిగో వారం రోజులకి కూలీ! ఎగ్గొట్టకుండా రా-" అన్నాను.

    వణుకుతున్న చేతుల్తో అందుకొని, నావైపు నీళ్ళు నిండిన కళ్ళతో చూసేడు. నేను వూహించినంత తొందరగా వంగి, నా కాళ్ళుస్పృశించి, "తప్పక వస్తాను బాబూ- తప్పకుండా" అని గొణుక్కుంటూ వడివడిగా వెళ్ళిపోయేడు నిశ్చేష్టత నుంచి తేరుకొని దాదావైపే తిరిగి నవ్వేను, అతడు నవ్వలేదు.

    నెమ్మదిగా అన్నాడు. "అనుభవం లేనప్పుడు ఈ కష్టాలు వింటూంటే రక్తం పరుగెత్తి ఏదో చెయ్యాలనిపిస్తుంది బాబూ! అలా చేసేస్తూపోతే, అనుభవం వచ్చేసరికి ఏవీఁ మిగల్దు" కొరడాతో కొట్టినట్టు నిలబడిపోయేను.

    నిజమే! పచ్చి నిజం! నాక్రింద దాదాపు వెయ్యిమంది దాకా పన్జేస్తున్నారు. అందరికీ తలో కథా వుండొచ్చు. ఇలా సహాయం చేసుకుంటూపోతే ఏవీ - మిగల్దు. నాలో పెట్టుబడిదారుణ్ని ఇంకా బలంగా నిర్మించుకోవాలి.

    ........అంతకు ముందు రాత్రి పదివేల రూపాయల్ని చాలా సులభంగా వదిలేసుకోగలిగిన నేను - ఈ ఇరవై రూపాయల కోసం ఇంత ఆలోచిస్తున్నాను-

    ఆలోచిస్తూనే డబ్బు సంపాదించడానికి వీలైన మార్గాలన్నీ వెతికేను దొరికింది! "మీ పేరుమీద  కార్నావాల్ ఒకటి ప్రారంభిద్దాంమనుకొంటున్నాను దాదా" అన్నాను. శంకర్ దాదా, మామూలు బిజినెస్సుల్లో మనం అనుకున్నంత డబ్బురాదు మనుష్యుల బలహీనతమీద ఆడుకోవాలి, తప్పదు."

    శంకర్ దాదా వెళ్ళిపోయేడు. ఎంతో అసంతృప్తిగా వుంది. ఇదో ఏగోనీ.....

    వికలమయిన మనస్సుని అదుపులో పెట్టుకోవటానికి చాలా శ్రమపడవలసి వచ్చింది.

 Previous Page Next Page