Previous Page Next Page 
చెంగల్వ పూదండ పేజి 17


    నన్ను ఈ ఆలోచనలనుంచి బైటపడేయటానికా అన్నట్టు లక్ష్మీనారాయణ కారు ఇంటిముందు ఆగింది. విండోలోంచి తల బయటకు పెట్టి 'రండి' అన్నాడు.

    దగ్గరగా వెళ్ళి "మీ కారు వద్దు నా కారులో వెళదాం" అన్నాను. డ్రైవర్ నా  కారు తీసుకొచ్చి పక్కగా ఆపేడు. నారాయణ మారిస్ మైనరు దిగి, ప్లియత్ ఎక్కేడు.

    దాదాపు ఇరవైమంది దంపతుల్ని పిలిచేను. అందరూ ఆ ఊళ్ళో బాగా పేరున్న వాళ్ళు, కానీ సంగతి మాత్రం నిజం. నిజమయిన సివిలైజేషన్ అంటే ఏమిటో ఎవరికీ తెలీదు. వాళ్ళల్లో ఇంగ్లీషువాడి నాగరికత వారిమీద పడింది. పోనీ ఆ ఇమిటేషన్ అన్నా సరిగ్గా చేస్తారా అంటే అదీలేదు. ఫోర్క్ తో చప్పుడు చేయకుండా తినటం అందులో ఒక్కరికీ రాదు. ఒకటి గమనించేను- ప్రతివాళ్ళకి ఆ ఇమిటేషన్ కల్చర్ పట్ల చాలా మక్కువ వుంది. అందరికన్నా తమకెక్కువ తెలుసన్న సంగతి ప్రకటించటం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు చూసి నువ్వు ఆపుకోవటానికి చాలా ప్రయత్నించవలసి వచ్చింది. అంతలోనే విచారం- ఎక్కడికి వెళుతోంది నా దేశం? ఈ మూర్ఖులు నా దేశపు సామాన్య కాపిటలిస్టులు.

    సరీగా ఎనిమిదింటికి పార్టీ ప్రారంభం అయింది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వేరుగా అమర్చబడ్డాయి నేప్ కిన్ ఎలా వాడాలో తెలీక ఒకామె అవస్థపడుతోంది. చిన్న పువ్వులా అమర్చిన 'కాసెట్టా' తినే వస్తువో- అలంకారం కోసం అమర్చిందో తెలీక కొందరు తటపటాయిస్తున్నారు.

    ఈ బల్లమించి ఆ బల్ల దగ్గిరకు అతిధుల సంగతి కనుక్కొంటూ లక్ష్మీనారాయణ పక్కనున్న ఖాళీ కుర్చీలో కూర్చొన్నాను. "ఎలావుంది ఈ డిష్".

    "బ్రహ్మాండం- బ్రహ్మాండం" అన్నాడు నారాయణ. ప్రతిమాటనీ రెండుసార్లు స్టెయిన్ చేసే అలవాటు అతడికి వుంది.

    నా పక్కన కూర్చొన్న రామయ్యశెట్టి "మీరిక్కడే సెటిల్ అవుదామను కుంటున్నారా?" అని అడిగేడు.

    "అవుదామనుకుంటున్నాను, ఇక్కడ వాతావరణం నాకు బాగా నచ్చింది అడవీ - సెలయేరూ...."

    "అయితే మా కంపెనీలో కొన్ని షేర్లు తీసుకోండి".

    "ష్యూర్-ష్యూర్".

    అతడి భార్య మధ్యలో కల్పించుకొని "ఆయనొచ్చి పదిరోజులుకాలేదు. అప్పుడే బిజినెస్ మొదలు పెట్టేరా?" అంది. రామయ్యశెట్టిని సమర్థించవలసిన బాధ్యత నామీద పడింది. "ఒకసారి బిజినెస్ లోకి దిగితే అంతే! సిసలైన బిజినెస్ మేన్ అంటే అలాగే వుండాలి" అన్నాను.

    మట్టిపెళ్ళ విరిగిపడుతున్నట్లు బిగ్గరగా నవ్వి "భలేగా చెప్పేరు" అన్నాడు లక్ష్మీనారాయణ.

    ఒకటి గమనించేను. ఈ సంభాషణలో లక్ష్మీనారాయణ భార్య పాల్గొనటం లేదు. తెల్లాషిఫాన్ చీరె కట్టుకుందామె. చెవి వెనుకగా చిన్న జుట్టుపాయను కత్తిరించి చాలా అందంగా అమర్చింది. పెదవులకు వేసీ వేయనట్టున్న లిప్ స్టిక్ జాగ్రత్తగా గమనిస్తేనే గానీ తెలియటం లేదు.

    "మీకెంతమంది పిల్లలు?" అడిగేను.

    లక్ష్మీనారాయణ చెప్పేడు. "ఒక్కడే కొడుకు. బియ్యే ప్యాసయ్యేడు. బిజినెస్ లో పెట్టాలి అని ఆలోచిస్తున్నాను".

    "నా దగ్గిరకి పంపండి. మోడరన్ మేనేజ్ మెంట్ టెక్నిక్స్ లో ట్రయినింగు ఇస్తాను".

    "ష్యూర్- ష్యూర్" అన్నాడు.

    అందరి డిన్నరు పూర్తయింది. లోకాభిరామాయణం మొదలైంది. మాటల సందర్భంలో ఒకరి దృష్టి గోడకు అమర్చివున్న గుండ్రటి చెక్కప్లేటు మీద పడింది. "ఏమిటది" అడిగేడు. అందరి దృష్టి దాని మీదకు మరలింది.

    లేచి వెళ్ళి దాని దగ్గిరవున్న 'యారో' ని తీసుకొన్నాను "అదిగో- ఆ ప్లేటు మీద వున్న ఎర్రమచ్చని గుచ్చుకొనేలా కొడితే పదిపాయింట్లు- దానిని అనుకొని వున్న తెల్ల సర్కిలులో గుచ్చుకొంటే అయిదు, బయట పసుపు అయితే రెండు అదీ ఆట."

    "ఇంత దూరం నుంచి ఎవరయినా కొట్టగలరని నేననుకోను" అన్నారెవరో.

    "కొడితే వెయ్యి రూపాయలిస్తాను" అన్నాను నవ్వి. అంతా నిశ్శబ్దం అయింది.

    "తగిల్తే చాలా?"

    "ఆహ!- చివరికి పసుపు రంగుకి తగిలినా సరే" అన్నాను. అడిగిన యువకుడు లేచి నా చేతిలోంచి 'యారో' తీసికొని విసిరేడు, వెళ్ళి పసుపురంగులో గుచ్చుకొంది. చప్పట్లు మ్రోగేయి. నేనూ నవ్వి అతడి భుజం తట్టి వెయ్యి రూపాయల కట్ట తీసి ఇచ్చేను.

    "వద్దు వద్దు" మొహమాటపడ్డాడు.

    "నోనో - మీరు తీసుకోవాలి" బలవంతం చేస్తున్నట్టు అన్నాను. అతి కష్టంమీద అతడి జేబులోకి నోట్లకట్టని తోసేను. ఇష్టం లేనట్టు నటిస్తూనే తీసుకున్నాడు.

    "ప్లేట్ మీద కొట్టడం కష్టంకాదు. ఎర్ర స్పాట్ మీద  కొట్టాలి" ఎవరో అన్నారు.

    "ఎంతిస్తారు?" ఇంకోమూల్నించి ఎవరో అడిగారు.

    "యాభై"

    మళ్ళీ నవ్వులు.

    "నేను ప్రయత్నిస్తాను" అని బాణం తీసుకొన్నాను. "బెస్ట్ ఆఫ్ లక్" అని యెవరో అరుస్తున్నారు- విసిరేను.

    ప్లేటుకి రెండు అడుగుల దూరంలో గోడకి తగిలి పడిపోయింది. ఈ అవమానానికి అక్కడున్న యువకుల మొహం విప్పారింది- నవ్వుల్లో కొద్దిగా హేళన ధ్వనించింది. నేనూ నవ్వి, అతడివేపు తిరిగి "ఈసారి నేను పందెం కాయలేను. ఏవీఁ ఇవ్వను" అన్నాను.

    "ఇంకోసారి కానీయండి" అన్నాను.

    "నాకు గురి అసలురాదు, చెయ్యి వణుకుతోంది" అన్నాను.

    "యాభయ్యేగా" కవ్వించేడు.

    "యాభైయ్యేకాదు. ప్రయత్నిస్తాను- పదివేలు పందెం" అన్నాను.

    సూది పడేటంత నిశ్సబ్దం గదిలో ఆవరించింది. నా శక్తిమీద అక్కడ ఎవరికీ నమ్మకంలేదు. అయినా పది వేలనేసరికి అందరిలోనూ భయం కలిగినట్లుంది. మొహమొహాలు చూసుకొన్నారు. ఇంకోవైపు పదివేలు సులభంగా సంపాదించవచ్చనే ఆశ కదులుతోంది.

    "పదివేలయితే లక్ష్మీనారాయణగారే కాయాలి" అన్నాడు మొదటి యువకుడు. అంతకు ముందుంనుంచే అటూ యిటూ ఊగుతున్నట్టున్నాడు నారాయణ. అందర్లోనూ తన కివ్వబడిన గౌరవానికి పోంగొపోయి "సరె సరె, నేను సిద్ధం౦ కానీ ప్లేటునికాదు ఎర్రస్పాట్ ని కొట్టాలి" అన్నాడు.

    చింతగింజంత ఎరుపు స్పాట్ మసగ్గా చాలా చిన్నదిగా కనబడుతోంది.

    బాణం చేతుల్లోకి తీసుకొన్నాను- అందరూ వున్నట్టుండి నిశ్శబ్దం అయిపోయారు. లక్ష్మీనారాయణ మొహం టెన్షన్ తో ఎర్రబడింది. వాతావరణం గంభీరంగా మారింది-విసరబోయేను!" అక్కడ్నుంచి కాదు" అరిచేడు లక్ష్మీనారాయణ - అతడివైపు చూసేను- నిజానికి క్రిందటిసారి నేను విసిరింది అక్కడ్నుంచే - నా ముందు విసిరిన యువకుడే నాకన్నా దగ్గిరగా వెళ్ళి - చాలా దగ్గరనుంచి విసిరేడు- అయినా నేను ఏవీ గొడవ పెట్టుకోదల్చుకోలేదు- పది అడుగులు వెనక్కి వచ్చాను- "ఇక్కడ్నుంచి కొట్టనా" అడిగేను- తలూపేడు- "మరీ అంతదూరమా, అన్యాయం" ఎవరో రహస్యంగా నావైపు సానుభూతి పలుకుతున్నారు.

    చూపుడువేలూ, బొటనవేలూ మధ్య 'యారో' ని పట్టుకున్నాను. ఎర్రస్పాట్ వైపే ఏకాగ్రతతో చూసేను. అర నిమిషం గడిచేసరికి ఎరుపు తప్ప నాకేం కనబడటంలేదు. బలం అంతా వేళ్ళమధ్యకి తీసుకొని విసిరేను! హాలంతా చప్పట్లతో మ్రోగిపోయింది. ప్లేటు మధ్య ఎర్రస్పాట్ లో గుచ్చుకొని వుంది బాణం. జైలు ఆవరణలో రబ్బరు ముక్కతో ఇంతకన్నా మూడురెట్లు దూరాన్ని గురి తప్పకుండా కొట్టేవాణ్ని. లక్ష్మీనారాయణ మొహం కాలిన పెనంలా మాడిపోయి వుంది. వెళ్ళి అతని పక్కన కూర్చున్నాను.

    "ఇంటికివెళ్ళి డబ్బు పంపిస్తాను" చెప్పాడు. స్నేహ పూర్వకంగా అతని చెయ్యి నొక్కేను.

    "పందెం ఏమిటి మనమధ్య? మర్చిపోండి, ఏదో సరదాకి కాసేం. అంతే-" అన్నాను.

    "నో..... నో..... అదేమిటి" అన్నాడు లక్ష్మీనారాయణ. చుట్టూవున్న వాళ్ళు ఎటూ మాట్లాడలేక మమ్మల్నే చూస్తూ వుండిపోయారు.

    దూరంగా నిల్చుని మమ్మల్నే గమనిస్తున్న శంకర్ దాదా పెదవుల మీద  కనపడీ కనపడకుండా చిరునవ్వు ఒకటి వెలిసి మాయమైంది.

    "పందెం అన్నాక పందెమే" అంటున్నాడు అతడు. నెమ్మదిగా గుసగుసలు బయలుదేరాయి.

    "నిజమే!" అన్నాను గంభీరంగా. మళ్ళీ హాలు నిశ్శబ్దమైంది. "కానీ మీ  పదివేలు నాకు అందింది."

    "ఎలా?" రామయ్యశెట్టి అడిగాడు.

    "ఇంతమందిని ఇంతసేపు ఆనందపరిచే అవకాశం నాకు నారాయణ కల్పించారు. అదే పదివేలు...." చెప్పాను. హాల్లో చప్పట్లు మ్రోగేయి. లక్ష్మీనారాయణ మొహంలో రోలీఫ్ కనబడింది. నేనా పదివేలూ తీసికొని వుండుంటే అతడు బహుశా నెలరోజులు నిద్రపోయి వుండేవాడు కాదు. దూరంగా ఎవరితోనో శంకర్ దాదా "అయ్యగారికి యిదో లెక్కకాదు" అంటున్నాడు. చుట్టూ చూసేను. అందరూ మళ్ళీ  కబుర్లలో పడిపోయేరు. కుర్చీలో రిలాక్సయి కూర్చుంటూ పక్కకి తిరిగాను.

    అప్పట్టివరకూ నావైపు చూస్తున్న లక్ష్మీనారాయణ భార్య, అటూ చూసేసరికల్లా చప్పున తల దించుకొంది.

                               *    *    *

    రాత్రి రెండయింది. ఊరంతా నిద్రపోతోంది.

    అంతా నిర్మానుష్యంగా వుంది. సెకండ్ షో వదిలి చాలాసేపు అవటంవల్ల వీధులన్నీ ఖాళీగా వున్నాయి. వీధి దీపాల వెలుతురు చీకటిని పారద్రోలలేకపోతోంది.

    నెమ్మదిగా అడుగులు వేసుకొంటూ దూరంగా వున్న పెంకుటింటివైపు నడవసాగేను. దూరంగా ఎక్కడో బీటు కానిస్టేబుల్స్ విజిల్స్ వినబడుతున్నాయి. అలికిడికి లేచిన కుక్క ఒకటి నన్ను గుర్తించినట్టు మళ్ళీ పడుకొంది.

    ఇంటిముందు నిలబడి చుట్టూ చూసేను, ఎవరూ లేరు. అరుగుమీద మాత్రం ఎవరో ముసుగు పెట్టి పడుకొని వున్నారు, జగ్గడనుకుంటా.

    మెట్లెక్కి తలుపు నెమ్మదిగా తట్టాను. కళ్ళు నులుపుకుంటూ తలుపు తీసిన కాంతమ్మ, మసక వెల్తుర్లో నన్ను  గుర్తించి భయంతో అడుగు వెనక్కి వేసింది. పలకరింపుగా నవ్వాను.

    లోపలికి నడిచి కుర్చీలో కూర్చొంటూ-

    "హైమ లేదా" అడిగాను.

    "పడుకొంది" అంది తల వంచుకొని.

    "లేపు" అన్నాను వెనక్కివాలి.

    "ఇప్పుడు బైటకు తీసికెళ్తారా?"

    మాట్లాడలేదు నేను.

    "ఇక్కడే వుండండి. మీకు హాయి! గంటకు ఇరవై రూపాయలు-" అంది ఆశగా చూస్తూ.

    కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను. బయట చీకటి చిక్కటి కాటుకలా వుంది. దూరంగా చౌకు లైట్ల వెలుగులో బొమ్మల్లా కనబడుతోంది. రోడ్డు తిన్నగాసాగి చీకట్లో అదృశ్యమైపోతోంది.

 Previous Page Next Page