Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 15


    "నువ్వు ధైర్యం ఇవ్వలేకపోయావా? అయినా ఈ కాలంలో కులం కోసం దూలానికి ఉరేసుకు చచ్చేవాళ్ళున్నారా?"

    "ఉన్నారనడానికి నా ప్రేమకథ సాక్ష్యం!"

    "ఇంతకీ నీ కథానాయకి ఎక్కడ? ఈ సిటీలోనేనా?"

    స్వరూప్ చెప్పాడు.

    మాధవ్ కనుబొమలు ముడిచి, "మా వూళ్లోనా? టీచరా? పేరేమిటి?" అని అడిగాడు.

    "స్వప్న."

    సూటిగా ముఖానికి గురిచూసి బాంబు విసిరినట్టుగా అయింది. స్వప్న, టీచరు! స్వరూప్ ప్రేయసి! తన భార్య!

    కులాలు కలియని కారణంగా విడిపోయిన ప్రేమజంట!

    స్వరూప్ ఆవలించి, "ఇక నిద్రపోరా! పన్నెండు దాటినట్టుంది" అన్నాడు, నిద్రపోవడానికి తనూ ఒత్తిగిలి పడుకొంటూ.

    స్వరూప్ కొద్దిసేపటిలో నిద్రపోయాడుగాని మాధవ్ కి నిద్రపట్టలేదు.

    "ఫలానా రోజు నీ పెళ్లి ముహూర్తం ఖాయపరిచాం. సెలవుపెట్టి వెంటనే బయలుదేరి రా" అంటూ తండ్రి టెలిగ్రాం ఇచ్చినప్పటినుండి జరిగిన సంఘటనలు అతడి మనః ఫలకం మీద సినిమా రీల్ లా కదలసాగాయి!

    తండ్రి టెలిగ్రాం మాధవ్ ని స్థాణువులా చేసింది. పిల్లను తను చూడకుండా, పిల్లను తను మెచ్చకుండానే తన పెళ్లికి ముహూర్తం పెట్టించేశాడా నాన్న?

    కాబయే భార్యమీద తనకు కొన్ని ఆశలున్నాయి. ఉద్యోగం చేయకపోయినా  కాస్త చదువుకొన్నదీ, సంస్కారవతీ కావాలి. గొప్ప సౌందర్యరాశి కానక్కరలేదుగాని తన  పర్సనాలిటీకి  అందానికీ సరిజోడయినదీ అయితే చాలు! బొత్తిగా పతివ్రతా శిరోమణీ అవక్కరలేదుగాని తన నర్దం చేసుకొని తన జీవితంలో పాలూ నీళ్లలా కలిసిపోయేది అవ్వాలి.

     కలత మనసుతోటే మాధవ్ ఇంటికి చేరాడు. పిల్ల వివరాలు తెలిశాకగాని అతడి గుండెలమీద బరువు దిగలేదు. స్వప్న తను చిన్నప్పటినుండి ఎరిగిన పిల్లే. తన ఊహల్లో సరిపోయే వధువు ఆమె తండ్రిని మనసులో ప్రశంసించి కృతజ్ఞత చెప్పుకొన్నాడు.

    పెళ్ళిలో స్వప్న ముభావత కొంచెం బాధ కలిగించినా అది పెళ్లికూతురికి సహజంగా కలిగేసిగ్గుగా సరిపెట్టుకున్నాడు.

    శాస్త్రిగారిచేత శోభనానికి ముహూర్తం తనవాళ్లు పెట్టిస్తున్నారు.

స్వప్నకి రాత్రినుండి జ్వరంగా వుందని, ఈరోజు నోట్లో మంచినీళ్లు కూడా పోయకుండా పడుకొందన్న కబురు మోసుకువచ్చాడు విశ్వేశ్వరయ్య.

    ఆ మాట విన్నాక ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాడు మాధవ్. స్వప్నని చూడడంకోసం బలు దేరాడు.

    ఒక్కరోజు జ్వరానికే స్వప్న బట్టపేలికలా పడింది. జ్వరపు వేడికి ముఖం ఎర్రగా కందిపోయింది.

    "స్వప్నా!" పక్కన ఎవరూ లేకుండా చూసి మాధవ్ స్వప్న బుగ్గలు నిమిరాడు.

    "ఊఁ"  స్వప్న మూలిగింది.

    "నేను, స్వప్నా! మాధవ్ ని ఎలా వుంది?" నిన్న మొన్నటిదాకా స్వప్న స్వప్నే! ఆ తాళి కట్టడంతోనే ఇంత మమకారం ఎక్కడినుండి వచ్చేసింది? ఈమె నాది, నా భార్య అనుకోవడంలో ఎంత మమకారం పెనవేస్తోంది మనసును?

    "అబ్బా! తలనొప్పి!" కళ్లు తెరవకుండానే నీరసం గానే చెప్పింది.

 

       మాధవ్ పక్కనే వున్న విక్స్ తీసి కణతలకి రాశాడు. కాస్సేపు తలపట్టాడు.

    కమలమ్మ అల్లుడి కోసం టీ తీసుకు వచ్చింది.

    మూడు రోజుల వరకు స్వప్నకి ఆ జ్వరం వదలనే లేదు. నాలుగో రోజు కాస్త లేచి కూర్చుంది మూఢమి రావడంతో శోభనం వాయిదా పడింది.

    "వచ్చేనెల ఇరవై ఒకటికి ముహూర్తం కుదిరింది. ఇల్లా తీసుకురా!స్వప్నని వెంట తీసికెళ్లొచ్చు! ఆమెకి కూడా అక్కడికే ట్రాన్శ్ ఫర్ కి ట్రై చేద్దాం! ఇద్దరూ ఒకే చోట వుండొచ్చు" అని చెప్పాడు శీనయ్య.

    ప్రయాణానికి సిద్దమై బయలుదేరే ముందు స్వప్నతో చెప్పడానికి మామగారింటికి వచ్చాడు మాధవ్.

    స్వప్నని స్నానంచేయించి, అట్టలు కట్టిన జుట్టు దువ్వుతోంది వాళ్లమ్మ. మూడు రోజుల జ్వరానికే ఎన్నో రోజులుగా కాయిలా పడ్డదానిలా నీరసించిన స్వప్న ను ఆప్యాయంగా చూశాడు మాధవ్.

    కమలమ్మ అల్లుడు రావడం చూసి దువ్వడం మధ్య లోనే ఆపి స్వప్నని ఒక్కదాన్ని గదిలో వదిలి వెళ్లింది.

    "కూర్చోండి!" స్వప్న కుర్చీ జరిపింది.

    "ఎక్కువ టైం లేదు. నేను వెడుతున్నాను. వచ్చేనెల వస్తాను .నువ్వు లీవ్ పెట్టి నాతో రావడానికి సిద్దంగా  వుండాలి! ఈలోగా నీకు ట్రాన్స్ ఫర్ వస్తేసరే. దీనికోసం నాన్నగారు గట్టిగానే ట్రైచేస్తున్నారనుకో!"

    తల చిక్కు నెమ్మదిగా తీసుకొంటూ మౌనంగా వుంది స్వప్న.

    "వెళ్లాక ఉత్తరం వ్రాస్తాను. జవాబు రాస్తావుకదూ?"

    స్వప్న తలూపింది.

    "మాట్లాడితే నోటి ముత్యాలు రాలుతాయా?"

    "ఏం మాట్లాడను?" స్వప్న బలవంతంగా నవ్వింది.

    "పుట్టిన పాపాయికి ఏడుపు నేర్పమన్నట్టుగా వుంది!" జోక్ చేశాడు. "పంతులమ్మవి! పాఠాలు నువ్వు నేర్పాలి గాని...."

    చాపమీద తల బాగా వంచేసి కూర్చొన్న స్వప్న నుండి సమాధానం రాలేదు. వేళ్లతో జుట్టు కొనల్లో పడిన చిక్కులు విడదీసే ప్రయత్నం చేస్తోంది.

    మామగారూ, బావమరిదీ రావడంతో మాధవ్ కి స్వప్నతో  ఏకాంతంగా మాట్లాడే  అవకాశం తప్పిపోయింది.

    మాధవ్ సిటీలో ఇల్లు తీసుకోవడం గురించి, స్వప్న ట్రాన్శ్ ఫర్ గురించి మాట్లాడారు. మాధవ్ కి టైం కావడంతో లేచాడు.

    వచ్చాక సుదీర్ఘమైన లేఖే వ్రాశాడు స్వప్నకి,తన ప్రేమ నంతటినీ అక్షరాల్లో పొదిగి! తనలో పొంగి పొరలిన భావావేశానికి స్వప్ననుండి వచ్చిన జవాబు రెండు వాక్యాలు!

     "నేను క్షేమం. కాస్త ఆలస్యమైనా ఇల్లు కాస్త మంచిదే తీసుకోండి. అంతవరకు నాకు ట్రాన్స్ ఫర్ వస్తే సరే. కాకపోయినా సెలవు పెట్టగలను - స్వప్న"

    తనకు కలిగిన ఊహలు స్వప్నకి కలుగనందుకు  కొంచెం విచారం కలిగినా అదంతా స్త్రీ సహజమైనా సిగ్గుగా సరిపుచ్చుకోడానికి ప్రయత్నించాడు.

    స్వప్న ముభావతకు అర్దం ఇప్పుడు తెలుస్తోంది!

    పెళ్లికి పూర్వమే మనసు మరొకరికి అర్పించి మూగ బోయిన బొమ్మ స్వప్న!

    ఆ బొమ్మతో కాపురం చేయడం తనకి సాధ్యమా?

 Previous Page Next Page