థాంక్స్ అన్నాడు నీళ్లు తాగుతూ.
కారంగా ఉందా.
అహహా లేదు. ఇడ్లీలు చాలా రుచిగా, బాగున్నాయి అన్నాడు మెచ్చుకోలుగా.
కారు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కారిడార్ లో ఆగింది.
వినీల్ విజిత ఇద్దరూ కారు దిగారు. డ్రైవర్ ట్రాలీ తెచ్చి విజిత సూట్ కేస్, వినీల్ బ్రీఫ్ కేస్ అందులో పెట్టాడు.
ఇక నువ్వెళ్లు. మేము లోపలికెళతాం అని చెప్పింది డ్రైవర్ కి.
డ్రైవర్ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.
నేను తీసుకొస్తాను ఇట్లివ్వు అంటూ ట్రాలీ తీసుకున్నాడు.
ఈ చుడీ దార్ లో చాలా అందంగా ఉన్నావు విజ్జీ అన్నాడు ఆమె వైపు ఆరాధనగా చూస్తూ.
థాంక్స్. ఓహ్ అమ్మాయిలను చూడటం, కాంప్లిమెంట్ ఇవ్వడం ఎప్పుడు నేర్చుకున్నావు చదువుల బిడ్డా అంది. నువ్వేమీ తక్కువ కాదు. నాకంటే స్మార్ట్ గా ఉన్నావు. అమ్మాయిలు యిట్టె పడిపోతారు నీకు మీనూ పడ్డట్లు.
పాపం మీనూ చిన్న పిల్ల. తనకేమీ తెలీదు విజ్జీ. కొంచెం ఆప్యాయత అంతే అన్నాడు వినీల్ సమర్ధిస్తున్నట్లుగా.
కొంచెం ప్రేమ కూడా నువ్వు గమనించినట్లు లేదు అంటూ యాడ్ చేసింది విజిత.
బోర్డింగ్ ప్రక్రియ పూర్తయ్యింది.
ఇద్దరూ బిజినెస్ క్లాస్ లో పక్క పక్కనే కూర్చున్నారు.
కూర్చోగానే వినీల్ తనతో తెచ్చుకున్న లాప్టాప్ తెరవబోయాడు.
బలవంతంగా అది క్లోజ్ చేయించింది విజిత.
ఉండే గంట ప్రయాణానికి ఇక్కడ కూడా నీ పెళ్ళాం (లాప్ టాప్) తో మాట్లాడాలనా అని విసుక్కుంది. కాసేపు కామ్ గా కూర్చోవచ్చు కదా అని కసిరింది.
ఆమ్మో ఏంటి నా పైన ఇంత అజమాయిషీ చెలాయిస్తోంది ఈవిడ. కానీలే ఇక్కడ గొడవలెందుకు అందరూ చూస్తారు అనుకుని ఓకే మేడం థాంక్స్. నేను ఒంటరిగా కూర్చోలేను. మీరే కబుర్లు చెప్పండి అన్నాడు.
ఇతనితో గట్టిగా మాట్లాడితే భయపడేటట్లున్నాడు అన్న టెక్నిక్ తెలుసుకుంది విజిత.
ఫ్లైట్ బయలుదేరనీ. మీతో బోల్డు కబుర్లు చెప్పాలి అంది.
ఎయిర్ హోస్టెస్ లు బిజీ బిజీ గా తిరుగుతున్నారు అందరినీ పలకరిస్తూ.
ఒక స్మార్ట్ ఎయిర్ హోస్టెస్ వినీల్ దగ్గరికి వచ్చింది.
సర్ మీరు కోడింగ్ ఎక్స్పర్ట్ వినీల్ గారు కదా. నేను మీ సండే క్లాసెస్ ఫాలో అవుతుంటాను. ఇదే నా లాస్ట్ ట్రిప్. నేను రిసైన్ చేసాను. ఓ ముంబై సాఫ్ట్వేర్ కంపెనీ లో కోడింగ్ టీం లో జాబ్ వచ్చింది.మంచి ప్యాకెజీ. థాంక్స్ సర్. అంతా మీవల్లే అంటూ హిందీ లో చెప్పింది.
ఓ గ్రేట్. కంగ్రాట్స్ అన్నాడు వినీల్ ఆ అమ్మాయితో.
సర్ మీకు అభ్యంతరం లేకుంటే ఓ సెల్ఫీ ప్లీజ్ అంది.
సరే అన్నాడు.
ఆ ఎయిర్ హోస్టెస్ వినీల్ తో సెల్ఫీ తీసుకుంది.
సర్ మీ వైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంది విజిత వైపు చూస్తూ కాంప్లిమెంట్ గా.
నో నో అనబోయాడు వినీల్. అతను ఏదో చెప్పబోతున్నాడు.
ఇంతలో విజిత థాంక్స్ అంది ఆ అమ్మాయితో.
మేడం ప్లీజ్. మీతో కూడా ఒక సెల్ఫీ అని చక చక విజిత తో ఒకటి, ఇద్దరితో కలిపి ఒకటి రకరకాల సెల్ఫీలు తీసుకుంది. థాంక్స్ ఏ లాట్ అని మరీ మరీ చెప్పింది ఇద్దరికీ.
తను అటు వెళ్ళగానే విజిత వైపు తిరిగి ఎందుకలా చెప్పావు అన్నాడు కోపంగా వినీల్.
నిజమే కదా ! కాబోయే భార్య భర్తలం కదా అంది విజిత.
విజ్జీ ప్లీజ్ వే. కొద్దిరోజులు ఆగవే. నేనింకా ఒక నిర్ణయానికి రాలేదు ఆ విషయంలో అన్నాడు.
ముందు పెళ్లి చేసుకుందాం. తరువాత మెల్లగా మీరు నిర్ణయం తీసుకోండి అంది చిలిపిగా ఏడిపిస్తూ.
అటు ప్రక్క కూర్చున్న తెలుగు వృద్ధ దంపతులు వీరి మాటలకు నవ్వుకుంటున్నారు వారి సరసాన్ని చూస్తూ.
దీనితో వాదించలేను. జగమొండి అనుకుని కళ్ళు మూసుకుని చెవిలో ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నాడు పాటలు వింటూ.
ఒక వైపు చెవిలోని ఇయర్ ప్లగ్ లాక్కుని తన చెవిలో పెట్టుకుంది విజిత.
ఉలిక్కి పడ్డాడు వినీల్.
పర్లేదే చదువుల బిడ్డ ఇంగ్లీష్ రొమాన్స్ సాంగ్స్ బాగా వింటాడే అంది. ఇది చాలా మంచి సాంగ్ ఇది. నాకు చాలా ఇష్టం అంది విజిత.
అంటే మన ఇష్టాలు బాగా కలిసిపోయాయి నీల్ అంది నవ్వుతూ ఎదో కొత్త విషయం కనిపెట్టినట్టుగా.
అమ్మా మహాతల్లి. ప్రశాంతంగా పాటలు విననీ. ఇక్కడ అందరూ మనవైపే చూస్తున్నారు అంటూ రెండు చేతులూ జోడించాడు.
మన పెళ్లయ్యేవరకూ ఇలాగే ఉంటది మనతోటి. అర్ధమయ్యిందా చదువుల బిడ్డా అని బెదిరించింది. త్వరగా నన్ను మనువాడు. లేకుంటే దెబ్బయిపోద్ది అంది సినిమా ఫక్కీలో. అతన్ని ఏడిపిస్తుంటే ఆమెకి సరదాగా ఉంది.
ఆమ్మో ఇదేంటిది. పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు. లోపల ఇంకో విశ్వరూపం ఉంది. అయ్య బాబోయ్. దీనితో అస్సలు సెట్ ఎవ్వదు మనకు, అని మరో మారు గట్టిగా అనుకున్నాడు దీనితో ఎట్లైనా పెళ్లి తప్పించుకోవాలని.
బిజినెస్ క్లాస్ వాళ్లకి డ్రింక్స్ ఆఫర్ చేస్తోంది ఎయిర్ హోస్టెస్.
సర్ డ్రింక్స్ అంది వినీల్ శిష్యురాలైన ఎయిర్ హోస్టెస్.
నో థాంక్స్ అన్నాడు వినీల్.
ఓహ్ నైస్ సర్. ఎనీ సాఫ్ట్ డ్రింక్స్ సర్ అడిగింది ఆ అమ్మాయి.
మీరు ఏమీ తీసుకోకుంటే ఆ అమ్మాయి ఫీల్ అయ్యేట్లుంది పాపం తీసుకోండి అంది విజిత వినీల్ చేతిని గోముగా రాస్తూ.
సరే సరే అని తన చేతిని ఒళ్ళో పెట్టుకున్నాడు. ఆ అమ్మాయికి ఫ్రూట్ జ్యూస్ తెమ్మని చెప్పాడు.
గుడ్ బాయ్ అంది విజిత.
ఆ ఎయిర్ హోస్టెస్ వినీల్ కి ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ విజిత తో యూ ఆర్ లక్కీ మేడం అంది వినీల్ వైపు చూపిస్తూ. చాలా మంచి భర్త దొరికాడు మీకు అంది హిందీలో.
ఆ ఎయిర్ హోస్టెస్ మాటలకు పెద్దగా కొరబోయింది వినీల్ కి. జ్యూస్ షర్ట్ పై పడింది.
విజిత తన కెర్చీఫ్ తో అతని షర్ట్ తుడిచింది. చిన్న పిల్లాడు. అన్నిటికీ ఉలిక్కిపడుతుంటాడు అంది టీజ్ చేస్తూ. తినేప్పుడు తాగేప్పుడు చిన్న పిల్లల్లా కెర్చీఫ్ షర్ట్ కి పెట్టుకోవచ్చు కదా. ఈ ప్రాబ్లెమ్ ఉండదు అంది ఎదో పెద్ద అడ్వైస్ ఇస్తున్నట్లుగా.
అప్పటికే అలసిపోయాడు వినీల్. అబ్బా ! దీన్ని భరించడం కష్టంరా బాబూ అంటూ టైం చూసుకున్నాడు. అమ్మయ్య ఇంకో టెన్ మినిట్స్ లో ముంబై లో ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. దీని నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు.
అతని చేష్టలన్నీ గమనిస్తూ మనసులోనే నవ్వుకుంటోంది విజిత. ఇతన్ని ఇలా అల్లరిపెడితె కానీ చెప్పిన మాట వినడు అనుకుంది.
****
పైలట్ అనౌన్స్ చేస్తున్నాడు ఇంకో పది నిముషాల్లో ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్నామని.
దానితోపాటు ఇంకో స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా చేసాడు.
ప్రతివారం ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ కింద ఈ రోజు బెస్ట్ కపుల్ అవార్డు ప్రెసెంట్ చేస్తున్నాము.
మా ఎయిర్ హోస్టెస్ లు పాసెంజర్స్ అందరినీ అస్సెస్స్ చేసి ఎంతో కష్టపడి మార్క్స్ వేశారు.
ఈ రోజు బెస్ట్ కపుల్ గా మిసెస్ విజిత అండ్ మిస్టర్ వినీల్ ని సెలెక్ట్ చేసాము.
ఈ అవార్డు ద్వారా ఒక లక్ష గిఫ్ట్ వౌచెర్స్ మరియు మా ఫ్లైట్స్ ద్వారా ఇండియా లో ఎక్కడికైనా రెండు ఫ్లైట్స్ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.
మేము మిసెస్ విజిత అండ్ మిస్టర్ వినీల్ ని మా క్రూ మరియు కేబిన్ క్రూ తో ఫోటో కు ఆహ్వానిస్తూ ల్యాండ్ అయిన కొద్దిసేపు వరకు వెయిట్ చెయ్యమని కోరుతున్నాము.
వారిద్దరికీ మా ధన్యవాదాలు అని చెప్పాడు.
ఆ అనౌన్స్మెంట్ కు విజిత షాక్ అయినా పెద్దగా పట్టించుకోలేదు. సరదాగా వినీల్ తో ఫోటో దిగొచ్చని ఆనందపడింది.