Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 15


    "ఇంక ఆ విషయం మర్చిపో. బాడితోపాటు మైండ్ ని కూడా ప్రెష్ చేసుకుని రా. వాడు కనిపిస్తే నాలుక మీద కాల్చి వాత పెడ్తాను."


    "టేకిట్ ఈజీ మామయ్యా....!" అంది స్వాతి నవ్వు తెచ్చుకుంటూ.


                          *    *    *    *    *

    
    అబిడ్స్ లో నాకు కొంచెం షాపింగ్ వుంది.


    అది చూసుకుంటుంటే అనుకోకుండా బాల సుబ్రమణియన్ - అదే... 'బాలు' కనిపించాడు. నేను బొంబాయి వెళ్లిపోకముందు మా అక్క ఇంట్లోనే వుండేవాడిని. అందువల్ల మా ప్రక్క వాటాలో వుండిన బాల సుబ్రమణియన్ ముఖారవిందం రోజూ దర్శనం అవుతుండేది.


    అదే అడ్డ పంచె..., అదే పొడుగు చేతుల చొక్కా... ముఖానికి  అవే పిండి కట్లు..., వాటి మధ్య పెద్ద కుంకుమ బొట్టు. మనిషి వేషంలో కాని, బాషలో కాని, రూపు రేఖా విలాసాలలో కాని,  విన్యాసాలలో కాని, భంగిమలలో కాని ఏ విధమైన మార్పూ లేదు. ఈ హంగులకి తోడు - శివుడు గరళాన్ని  గొంతులో దాచుకున్నట్లు బుగ్గని ఎన్నడూ వీడని కారాకిళ్లీ!


    నన్ను చూడగానే గుర్తుపట్టాడు.

 
    "యారూ... మోగనా?" అన్నాడు.


    'నువ్వు మోగుతానంటే నేనెందుకు వద్దంటాను? అలాగే మోగు!'  అని మనసులోనే అనుకున్నాను.

 
    అరవంలో 'హ'ని 'గ' గా పలుకుతారు. అందుకే మోహన్ కాస్తా వాళ్ల నోళ్ళలో పడి 'మోగన్' అయిపోయింది.

 
    నేను ఏదో అనేలోపే - "ఏమండీ.... సౌక్యమా? మిమ్మల్ని చూసి రొంబ కాలం అయింది"అంటూ ఆప్యాయంగా పలుకరించాడు.


    వస్తున్న  కోపాన్ని లోలోపలే అణచుకున్నాను. పైకి మాత్రం మర్యాదగా -" ఆ..... బాగానే వున్నాను. మీరు బాగున్నారా? ఇప్పుడు ఎక్కడున్నారు?" అన్నాను.


     "నాన్ దా మద్రాసులోనే ఉంటిని.  ఇంద వూరి హైకోర్టుల ఒరు కేసు వుంటేనూ అదుకోసందా వస్తివి!" అన్నాడు.


    తెలుగు, అరవం కలిపి హైబ్రీడ్ భాష మాట్లాడటం ఆయనకి మొదటినుంచీ అలవాటే! అచ్చ తెలుగులో హైబ్రీడ్ భాషకి బదులు 'సంకరభాష' అనవచ్చునేమో కాని, ఆ మాట మరీ వంకరగా వుంటుందని  అనలేదు. నిజానికి - సంకర భాష అనేది మాత్రం అచ్చ తెలుగా ఏమిటి? సంకర,  భాష.... అనేవి రెండు అచ్చమైన సంస్కృత పదాలు.. మరి.... అచ్చ తెలుగులో ఏమనవచ్చునబ్బా.... అని మధనపడ్తుండగా -


     "సామీ .. నీంగళ్ ఇప్పుడు కూడా నల్లగుండలోనే వుంటిరా?" అన్న ఆయన ప్రశ్నతో నా ఆలోచనలకు అడ్డుకట్ట పడింది.


    'నల్లగుండ ఏమిటయ్యా... నీ ఇల్లు చల్లగుండా!'అని మనసులోనే అనుకొని, "లేదు.. నేను బొంబాయిలో వుంటున్నాను. మా అక్కావాళ్లు నల్లకుంటలోనే వున్నారు"అన్నాను.

 
    నల్లకుంటకి వచ్చిన తిప్పలు అది! బాల సుబ్రమణియన్ నోట్లో పడి నల్లకుంట కాస్తా  'నల్లగుండ' అయింది. గతంలో ఆయనా, మేమూ ఒకే ఇంట్లో పక్క పక్క భాగాలలో కాపరం చేస్తుండేవాళ్లమని చెప్పాను కదా! మొదట్లో ఆయన మాటలు వింటుంటే చచ్చే నవ్వు వచ్చేది. తర్వాత తర్వాత  అలవాటు అయిపోయి పైకి నవ్వుకోకపోయినా విని ఆనందిస్తూ మనసులోనే హాయిగా నవ్వుకుంటుండే వాళ్లం.


    "మన ఇంటాయన గోడలు వచ్చిందా?" మరో ప్రశ్న వేసి నా ఆలోచనలను  అడ్డుకున్నాడు బాలు.


     "ఆయనండీ.... కోడేశ్వరరావుగారు- ఆయన గోడలి సంగది నేనంటూంట!" అంటూ కొంచెం వివరణ ఇచ్చాడు బాలు.


    కోడేశ్వరరావు అనగానే  కన్యాశుల్కంలోని 'నీ ఇంట కోడి కాల్చా!' అని అగ్నిహోత్రావధానులు తిట్టిన తిట్టు జ్ఞాపకం వచ్చి, నేను కూడా బాలుని అలానే దీవిద్దామనిపించింది. కాని..., ఎంతైనా పెద్ద ముండావిడ - బాగుండదులే...! అని ఊరుకున్నాను.


    కోటేశ్వరరావు గారు (ఆయన్ని కోడిని చేశాడు బాలు) గతంలో నల్లకుంటలో మేం వుండే ఇంటి యజమాని. ఆయన్నే బాలు ఇందాక"  'మన ఇంటాయన' అని ముద్దుగా అనింది. కోటేశ్వరరావు గారు కాస్తా బాలు నోట్లో పడి ఒక్క కోడీలేకపోయినా  'కోడేశ్వరుడు' అయిపోయాడు.

 
     కోడితోపాటు నాకు 'గోడలు' రహస్యం కూడా అవగతమయింది. మేము ఆ ఇంటిలో వున్నప్పుడు ఇంటికి పెద్ద ఆవరణ వున్నా కాంపౌండ్ వాల్ వుండేది కాదు. బాలుగారికీ, మాకు మాకు కూడా మొక్కలు, కాయగూరల పాదులూ వంటివి పెంచడమంటే సరదా! మేము  కష్టపడి పెంచుతుంటే మేకలు, గొడ్లూ వచ్చి తినేసిపోతూ వుండేవి. ప్రొద్దుటిపూట మేమూ, మేము ఆఫీసులకి వెళ్ళాక ఆడవాళ్ళూ కాపలా కాసినా  ఏ రాత్రిపూటో వచ్చి మేసేసి పోతుండేవి. ఈ బాధపడలేక అద్దె డబ్బులు చేతిలో పెట్టేటప్పుడో, ఆనందంగావున్న సమయం చూసో - 'అయ్యా కోటేశ్వరరావుగారూ.. కాస్తంత గోడలు కట్టిద్దురూ...!'  అని వినయంగా విజ్ఞప్తి చేస్తుండేవాళ్లం. ఆయన 'అలాగే ..దానిదేముంది? అలాగే కట్టిస్తాను' అంటూ కాలం గడిపాడే కాని...,  ఆ సత్కార్యం మాత్రం అప్పటకీ, ఇప్పటికీ  చేయనేలేదు. ఈరోజు నేను అక్కడ ఇంటికి వెళ్లినప్పుడు కూడా చూశాను. ఇంటి స్థలం ప్రహరీ గోడలు లేకుండా వెనుకటి లాగానే వుంది. మేము అక్కడ వుండగానే అడిగి అడిగి విసుగొచ్చి అడగడం మానేశాం. మొక్కలు పెంచడమూ మానేశాం.

 
     'అయ్యో ..ఈ బ్రాహ్మడు మద్రాసు వెళ్లి ఐదేళ్ళు దాటినా ఇంకా గోడల సంగతి అడుగుతున్నాడే! పాపం..... ఈయనకి మొక్కలంటే ఎంత శ్రద్దా....?!' అనుకుంటూ -


    "లేదండీ. కోటేశ్వరరావుగారి సంగతి మీకు తెలిసిందేగా! ఆయన ఇప్పటికీ గోడలు పెట్టించనే లేదు. ఆ కాంపౌండ్ అలాగే వుంది!"అన్నాను.

 
    "మురుగా.. మురుగా!" అన్నాడు బాలు.

 
    'ఉన్నట్లుండి మురుగు ఎక్కడ వచ్చిందా...' అనుకుంటూ, ముక్కు చిట్లించుకుంటూ నలువైపులా చూశాను. మురుగు కనిపించే లోపలే బాలుగారి మాటలు వినబడ్డాయి.


     "ఆయన వీట్టు సంగతి కాదు సామీ - నాన్  సొన్నది! అవరి చిన్నగోడలు సంగది. అదే.... ఆయన చిన్నపయ్యన్ రామనాధం లేడూ.... అవణ్ మగళ్ సంగది!" అన్నాడు మళ్లీ.


     అప్పుడు నాకు జ్ఞానోదయమయింది.  ఆయన అన్నట్టి 'మురుగా ..మురుగా!' మనం మామూలుగా అనుకొనే 'రామ రామ!' కి పర్యాయ పదమని. ఆయన కుమారస్వామి  భక్తుడు కనుక మురుగన్ ని తలచుకున్నాడు. అరవ వాళ్లు కుమారస్వామిని మురుగన్ అనీ, కందస్వామి అనీ (స్కందే - కంద అయ్యింది), వేలుస్వామి అనీ (కుమారస్వామికి ఉండే బల్లెం వంటి ఆయుధాన్నివేల్) అంటారు. వీటిలో 'మురుగన్' అనే నామం అత్యంత ప్రసిద్ది పొందినట్టిది.

 Previous Page Next Page