Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 15


    మర్నాడు ఎనాటమీ థియేటర్ నుండి దిగి వస్తుంటే రాజా వెనుకనుండి వచ్చి కలిశాడు.

 

    "హలో" అన్నాడు.

 

    "హలో" అంటూ అప్రయత్నంగా అతనివంక చూసింది. స్పష్టంగా తెలియటంలేదుగానీ, మనిషిలో ఏదో మార్పు గోచరించింది. దిగులుకాదు, చలాకీతనం లోపించటంకాదు.

 

    "ఎందుకు హఠాత్తుగా 'ఇంక చాలు' అని ఫోను పెట్టేశారు?"

 

    "ఒక్కో సందర్భంలో "నీవు" అనీ మరి ఒక్కో సందర్భంలో "మీరు" అనీ పిలవాల్సి వస్తూ ఉంటుంది సన్నివేశబలాన్ని బట్టి. కారణమేమీ ఉండదు. అది ప్రయత్నపూర్వకంగా చెయ్యటమూ కాదు.

 

    "ఇంక చాలు అనిపించింది కాబట్టి."

 

    "మళ్ళీ ఇవేళ చెయ్యనా?"

 

    "వద్దు."

 

    "ఎందుకని?"

 

    "అసలెందుకు ఫోన్ లో మాట్లాడుకోవటం?"

 

    "కారణం వుండాలా?"

 

    "కారణం అఖ్కర్లేదా?"

 

    ఇద్దరూ మెట్లు దిగుతున్నారు.

 

    "అసలెందుకలా ఫోన్లు చెయ్యటం?" మళ్ళీ తనే అడిగింది.

 

    "చెయ్యాలనిపిస్తోంది కాబట్టి."

 

    "అదే ఎందుకనిపిస్తోంది?"

 

    "అడిగి చెబుతాను?"

 

    "ఎవర్ని?"

 

    "నా అంతరాత్మను."

 

    వెనకనుంచి చిన్న ఈల వినిపించింది. దాని వెంటనే "డి.జి.ఓ" అన్నమాట!

 

    "వస్తాను" అని రాజా త్వరత్వరగా వెళ్ళిపోయాడు.

 

    డి.జి.ఓ. అంటే ఎమ్.బి.బి.ఎస్ తర్వాత గైనకాలజీలో తీసుకునే డిప్లామా అని మాధవికి తెలుసు. డిప్లామా ఇన్ గైనకాలజీ ఎండ్ అబిస్టిక్ ట్రిక్స్. కాని ఇక్కడ సందర్భమేమిటి?

 

    లంచ్ అవర్ లో క్లోక్ రూంలో ఓ సీనియర్ని అడిగింది "ఏమండీ! డి.జి.ఓ. అంటే..."

 

    "డిస్కషన్స్ గోయింగ్ ఆన్. అంటే ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటూంటే చేసే కామెంట్."

 

    "మైగాడ్! లవర్స్."


                                    * * *


    సాయంత్రం బస్సు కోసం వెయిట్ చేస్తుంటే దివాకర్ వచ్చి కలిశాడు.

 

    "ఏమండీ! మాట" అన్నాడు.

 

    మాధవి అతని దగ్గరగా వెళ్ళింది.

 

    "మీరు ఆ రాజాగాడితో ఎందుకు మాట్లాడుతున్నారు?"

 

    "ఏం మాట్లాడితే?"

 

    అతను కొంచెం తికమకపడ్డాడు. "అదికాదండి. వాడి దుర్మార్గం చూశాడు కదా" అన్నాడు తట్టుకుని.

 

    ఆమె ఏమీ బదులు చెప్పలేదు.

 

    "అన్నట్టు మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా?" అన్నాడు ఆమె విముఖత్వాన్ని గమనించి మాటమారుస్తూ.

 

    తల ఊపింది.

 

    "రేపు ఆదివారం క్లినికల్స్ కూ, ప్రీ క్లినికల్స్ కూ మేచ్ వుంది. స్టూడెంట్సంతా వస్తారు. చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది. మీరు కూడా తప్పకుండా రండీ."

 

    "అలాగే అన్నట్లు తల ఆడించింది. దివాకర్ వెళ్ళిపోయాడు.


                                                             * * *


    సాయంత్రం మళ్ళీ ఫోన్ వచ్చింది.

 

    "నేను..."

 

    "తెలుసు" అంది మాధవి.

 

    "కారణం లేదు. కాని కారణంలేని కొన్ని పనులు ఎంత బలమైనవో తెలుసుకుంటున్నాను."

 

    "ఎలాగ?"

 

    "నీకు ఫోన్ చెయ్యకుండా వుందామనుకున్నాను. ఉండలేకపోతున్నాను."

 

    "మంచిదే."

 

    "నీకు కోపమొస్తుందని తెలుసు. అయినా..."

 

    "కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు."

 

    "గుడ్. దీన్నేమంటారు?"

 

    "మిగతావాళ్ళేమంటారో తెలీదుగాని నేనుమాత్రం అజ్ఞానమంటాను" అని ఫోన్ పెట్టేసింది.

 

    మర్నాడు కాలేజిలో రాజా కలిశాడు.

 

    "అలా కాఫీ త్రాగొద్దాం వస్తారా?" అన్నాడు.

 

    ఆమె అంగీకరిస్తుందని అతననుకోలేదు. కాని వెంటనే "పదండి" అంది మాధవి. ఇద్దరూ కలిసి క్యాంటీన్ కి వెళ్ళారు.

 

    "ఏం తీసుకుంటారు?" అన్నాడు.

 

    "ఇడ్లీ సాంబార్."

 

    అతను వెళ్ళి కూపన్ తీసుకుని రెండు ప్లేట్లు ఇడ్లీ సాంబారు తీసుకు వచ్చాడు.

 

    కొంచెంసేపు ఇద్దరూ మౌనంగానే వున్నారు.

 

    "మా తమ్ముడు సైనిక స్కూల్లో చదువుతున్నాడు. హఠాత్తుగా చదువు మాని ఇంటికి వచ్చేశాడు" అన్నాడు కొంతసేపటికి రాజా.

 

    "ఎందుకట?"

 

    అతను జేబులోంచి ఒక ఉత్తరం తీసి ఆమె కందించాడు "చదవండి."

 

    ఆమె ఉత్తరం మడత విప్పి చదవసాగింది.

 

    "అన్నయ్యా!"

 

    నేను స్కూల్లో చేరి మూడునెలలైంది. ఈ మూడు నెలలూ నేననుభవించిన నరకం మీకెవరికీ తెలీకుండా వుండాలనీ, నేనే సరిపెట్టుకుందామని ఎంతో ప్రయత్నించాను.

 

    ర్యాగింగ్ లు. సీనియర్స్ జూనియర్స్ ని ఏడిపిస్తారట. నామీద కొందరు పట్టించారు.

 

    మొదటి రెండు రోజులూ నన్ను భయంకరంగా హింసించారు. బట్టలూడదీయించారు. నా యూరిన్ నాతో త్రాగించారు. ఇంకా అవమానకరమైన పనులన్నీ నాతో చేయించారు.

 Previous Page Next Page