అతన్ని భరించటం మాధవికి దుస్సహంగా పరిణమించింది. "ఇప్పుడే వస్తాను" అని చెప్పి అతనేదో అడుగుతున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చేసింది.
ఆ సమయానికి స్టేజిమీద మంచి మిమిక్రీ ఐటమేదో జరుగుతోంది. ప్రేక్షకులంతా తన్మయులై చూస్తూ వుండటంచేత ఆమెనెవరూ గమనించలేదు.
మాధవి అలా నడుస్తూ ఆడిటోరియంకు కొంచెం దూరంగా వెళ్ళింది.
అక్కడ నిర్మానుష్యంగా వుంది. చీకటి బీభత్సంగా అలుముకున్న చెట్లు.
ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా నిలబడింది. రెండు నిమిషాలు గడిచాయి.
ప్రక్కన అలికిడి అయితే ఉలికిపడి తలత్రిప్పి చూసింది.
రాజా!
ఒక్క క్షణం... మాధవి ఒళ్ళు జలదరించినట్లయింది. కాని అంతలోనే తమాయించుకుంది.
అటూఇటూ చూసింది. దగ్గర్లో తామిద్దరూ తప్ప ఎవరూ లేరు. ఎదురుగా వచ్చిన అతని ముఖంలోకి సూటిగా చూసింది.
"మాధవీ"! అన్నాడు.
కొంచెం ఆశ్చర్యం. అతని కంఠంలో ఎదురుచూసిన కటుత్వం లేదు. కరుకుదనంలేదు. మృదువుగా వుంది.
"ఏం?" అంది.
"నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావా?"
ఏం చెప్పాలో తెలీలేదు. అంత డైరెక్ట్ గా 'నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావా?' అంటే ఏం చెబుతుంది?
మౌనంగా ఊరుకుంది.
"మాట్లాడవేం?"
"మన ఇద్దరి మధ్యా ఈ ప్రసక్తి ఎందుకు?"
"ఎందుకంటే..." కొంచెం తడబడ్డాడు "ఆరోజు కల్యాణిని అవమానించటానికి ప్రయత్నించింది నేను కాదు."
"నువ్వుకాదు, నీ మనుషులు" అంది అప్రయత్నంగా, అక్సిగా.
"నా మనుషులు కూడా కాదు."
ఆమె నమ్మలేదు. "సరే! అయితే ఏమిటి?" అంది విసుగ్గా.
"ఈ ఇరవై రోజులూ చాలా మధనపడ్డాను. నువ్వు నన్ను నలుగురిలో అవమానించినా కోపం రాలేదు. నిజం మాధవీ! నీ మీద కోపం రాలేదు. నీకు దగ్గరగావచ్చి నా నిర్దోషిత్వాన్ని చెప్పాలని అవకాశంకోసం ఇన్నాళ్ళు ఎదురుచూశాను!"
ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. ఆ వాతావరణంలో ఎక్కువసేపు వుండాలనిపించలేదు. గిరుక్కున వెనుదిరిగి ఆడిటోరియంవైపు నడిచింది.
"మాధవీ!"
ఒక్కక్షణం ఆగింది.
"నన్ను నమ్మవా?"
మళ్ళీ జవాబు చెప్పలేదు. నెమ్మదిగా నడుచుకుంటూ ఆడిటోరియంవైపు వెళ్ళిపోయింది.
6
"మాధవీ! నీకు ఫోను" అని చెప్పింది ఒక స్టూడెంట్ వచ్చి.
లేడీస్ హాస్టల్లో తన రూము దగ్గర్నుంచి ఫోన్ దగ్గరకు వెళ్ళింది.
"మాధవీ! నేను" రాజా గొంతు గుర్తుపట్టింది.
"ఏం కావాలి?"
"ఏం కావాలో తెలీదు. నీతో మాట్లాడాలని మనసు ఉవ్విళ్ళూరింది."
"అంటే?"
"మాధవీ! నేనంటే కోపం పోలేదా?"
జవాబు చెప్పలేదు.
"పోనీ ఇది చెప్పు. నేనిలా ఫోన్ చేస్తున్నందుకు కోపం వస్తోందా?"
"లేదులే" అంది మనసులో భావాన్ని మనసులోనే దాచుకుని.
"నేను చెప్పిన మాటలు నమ్మవా?"
"దేన్ని గురించి?"
"ఆరోజు కల్యాణిమీద జరిగిన అఘాయిత్యానికి కారణం నేను కాదని."
ఆమె ఏమీ జవాబు చెప్పలేదు.
"నువ్వు నమ్మలేదు.. అవునా?"
"నేను నమ్మకపోతే నీకు వచ్చే నష్టమేమిటి?"
"నువ్వు నమ్మితే నాకు వచ్చే లాభముంది."
"ఏమిటది?"
"నీ స్నేహం."
"ఎందుకది?"
"నాకు కావాలనిపిస్తోంది కనుక."
"నీకు కావాలనుకున్నవన్నీ తేలిగ్గా దొరుకుతాయా?"
"తేలిగ్గా దొరకవు. కాని కష్టపడితే దొరకవచ్చుననే ఆశ."
"ఏం చేసుకుంటావు ఆ స్నేహంతో?"
"నేనింకా అంతదూరం ఆలోచించలేదు. మొదట అది పొందడం వరకే తాపత్రయపడుతున్నాను."
"నిన్ను నేను చెంప పగలగొట్టాను. నా స్నేహం దేనికి?"
"చెప్పలేను. బహుశా నా చెంప పగలగొట్టిన ఘనత నీకు దక్కినందువల్లనేమో!"
"థ్యాంక్స్."
"దేనికి?"
"కాంప్లిమెంట్స్ పే చేసినందుకు."
"మాధవీ జీవితంలో ఎప్పుడూ తెలియనిది ఫేస్ చేస్తున్నాను... బాధ."
ఈ సంభాషణ ఎక్కడికో పోతున్నట్లనిపించింది. "ఇంక చాలు" అని ఫోను పెట్టేసింది.
ఆ రాత్రి జరిగిందంతా చెప్పింది కల్యాణితో.
కల్యాణి భయపడింది. "ఎందుకతన్తో అంతదూరం మాట్లాడావు?" అన్నది.
"ఏమయింది?"
"లేనిపోని కాంప్లికేషన్స్ వస్తే?"
"వస్తే రానియ్యి. కాంప్లికేషన్స్ లేని జీవితం ఉప్పులేని పప్పులాంటిది?"
"అసలతని మీద నీ అభిప్రాయమేమిటి?" అనుకోని ప్రశ్నవేసింది కల్యాణి.
ఇలాంటి ప్రశ్న ఎదురుచూడలేదు. మాధవి నవ్వింది.
"ఇంతవరకూ ఏ అభిప్రాయమూ లేదు" అన్నది ఆమె కంఠస్వరంలో పలికే పద్ధతిలో నిజాయితీ వుంది.
* * *