"...దయచేసి ఎంక్వియిరీ కౌంటర్ లో సంప్రదించగలరు" ముందు ఇంగ్లీషులో, తరువాత తెలుసులో......
వణుకుతూన్న కాళ్ళతో వేగంగా ఎంక్వయిరీ కౌంటర్ దగ్గరికి పరుగెత్తాను.
"మీరేనా?"
"అవును."
"డాక్టర్ మృణాళిని మీకు ఫోన్ చేసారు. అర్జెంటట"
నా నుదుట చెమటపట్టింది. వేళ్ళు కంపించసాగాయి. నర్సింగ్ హొమ్ కి ఫోన్ చేసాను.
"హల్లో" అట్నుంచి మృణాళిని కంఠం.
"ఏ.....మి.....టి? ఏమైంది?"
"అంకిత్........."
"ఆ....... అంకిత్ కి ఏమైంది?"
"హాస్పిటల్ నుంచి తప్పించుకు పారిపోయాడు!"
* * *
నన్ను చూడగానే డాక్టర్ మహారధి క్షమాపణగా "కూర్చోండి" అన్నాడు.
"ఇప్పుడేం చేయడం డాక్టర్?" కూర్చోకుండా అడిగాను.
"మీరేమీ కంగారుపడకండి. నేను మనుష్యుల్ని పంపించి త్వరగా వెతికిస్తాను."
"పోలీస్ రిపోర్టిస్తే?"
"రిపోర్టా....." అన్నాడతను ఇబ్బందిగా. "నేను పంపేవాళ్ళు రేపు ఉదయంలోగా ఎక్కడున్నా పట్టుకుంటారు."
"రిపోర్టివ్వడంవల్ల వచ్చే నష్టమేమిటీ?" అతను రిపోర్ట్ ఎందుకు వద్దన్నాడో నాకర్థం కాలేదు.
"ఇవ్వచ్చు. కానీ మా హాస్పిటల్ కి చె.....డ్డ.....పే....రు....వస్తే" గొణుగుతున్నట్టు అన్నాడు.
నా కొడుకు కోసం నేను పోలీసుల దగ్గరికి వెళ్ళడం, అది పేపర్లలో పడడం, నేను కంగారు ప....డ...డం.....కూడా ఒకరి వ్యాపారానికి ఆటంకం కలిగించే విషయమని నాకర్థమయింది. జాన్ డేవిడ్ పుస్తకాల ప్రభావం లేకపోయి వుంటే విరుచుకు పడేవాడిని.
నిశ్శబ్దంగా బయటికి వచ్చాను.
అరుంధతీ, నేనూ చెరోవైపూ వెతకాలని నిర్ణయించుకున్నాం. తను చుట్టు ప్రక్కల ఇళ్ళకి వెళ్ళింది. నేను వాడి స్కూల్ కి వెళ్ళాను. అప్పటికే స్కూల్ వదిలిపెట్టారు. బయట నున్న వాచ్ మన్ కి అంకిత్ గుర్తులు చెప్పి ఇటువేపు వచ్చాడేమోనని కనుక్కున్నాను. నా ఉద్దేశ్యం వాడి క్లాస్ మేట్స్ ని కలుసుకుని, వాటి ఇళ్ళలో ఎవరింటికయినా వెళ్ళుంటాడని.
వాచ్ మన్ "తెలీదు" అని చెప్పేసరికి ఒక్కసారిగా నా ముఖంలోకి నిరాశ వచ్చేసింది.
నా ముఖాన్ని చూసి వాచ్ మన్ జాలిపడి "లోపల మేనేజర్ వుంటారు, వెళ్ళి అడగండి" అన్నాడు. నేను దాదాపు పరుగెడుతున్నట్టు లోపలి నడిచాను. స్టాఫ్ రూమ్ దాటినా తర్వాత ఆఫీస్ గదిలో ఒక వ్యక్తి కూచుని ఏవో లెక్కలు చేసుకుంటున్నాడు. దాదాపు నలభై ఏళ్ళుంటాయేమో అతనికి.
నేను వెళ్ళి, నన్ను నేను పరిచయం చేసుకుని పరిస్థితి చెప్పాను.
"మీకు నేనేం సహాయం చేయగలను?" అడిగాడు.
"వాడి క్లాస్ మేట్స్ అడ్రస్ లు ఇస్తే, వారి ఇళ్ళకి వెళ్ళి ప్రయత్నిస్తాను" అన్నాను.
"అవన్నీ బీరువా లాకరులో వుంటాయి. తాళాలు నా దగ్గర లేవు."
"ఇప్పుడెలా? ప్లీజ్! ఏదోవిధంగా మీరు నాకు సహాయం చెయ్యాలి" మొట్టమొదటిసారి నేనొక వ్యక్తి చేతులు పట్టుకుని ప్రార్థించాను.
"సారీ! నేను మీకే విధంగానూ సహాయపడలేను" అతను జాలిగా అన్నాడు.
నిస్పృహగా కుర్చీలో కూలబడ్డాను. నా తల్లోంచి చెమటలు ధారాపాతంగా కారిపోతున్నాయి. అతనేమనుకున్నాడో యేమో, ఫోన్ దగ్గరికి లాక్కుని డయల్ చేయసాగాడు.
"ఎక్కడికి చేస్తున్నారు?" అడిగాను.
"ప్రిన్సిపాల్ సారింటిటికీ! ఆయనొప్పుకుంటే నేను వెళ్ళి తాళాలు తీసుకొస్తాను" అన్నాడు.
నేను అతడివైపు కృతజ్ఞతగా చూసాను. ఎవరన్నారు మనుషులందరూ స్వార్థపరులని?
అతను ఫోన్ లో ప్రిన్సిపాల్ కి నా విషయం చెపుతున్నట్టున్నాడు. అట్నుంచి ప్రిన్సిపాల్ "నో" అంటున్నట్టు అతడి ముఖకవళికలు చూస్తుంటే తెలుస్తుంది.
మేనేజర్ ఫోన్ పెట్టెయ్యబోతూ "సార్! ప్రిన్సిపాల్ గారు ఒప్పుకోవడం లేదు....." అన్నాడు నాతో.
నేను ఒక్క వుదుటున అతడి చేతిలోంచి ఫోన్ లాక్కుని, "సార్! ప్లీజ్!! మా అబ్బాయి కిడ్నీ పేషెంట్.....హాస్పిటల్ నుంచి పారిపోయాడు" అని దాదాపు అరిచాను.
అటువైపు ప్రిన్సిపాల్ అందుకుని "అంకిత్ ఫాదరా మీరు?" అనడిగాడు.
అంకిత్ కిడ్నీ పేషెంట్ అన్న సంగతి చాలా కొద్దిమందికి తెలుసు. అందులో ప్రిన్సిపాల్ ఒకడు!
ఆయన ప్రశ్నకి సమాధానంగా "అవును......అన్నాను.
"సారీ.... నేనెవరో అనుకున్నాను. ఒకసారి ఫోన్ మా మేనేజర్ కివ్వండి" అన్నాడు.
నేను రిసీవర్ మేనేజర్ కిచ్చాను. అటునుంచి ప్రిన్సిపాల్ చెప్పింది విని ఫోన్ పెట్టేసాడు. తర్వాత వాచ్ మన్ ని పిలిచి తన సైకిలిచ్చి ప్రిన్సిపాల్ ఇంటికి తాళాలకోసం పంపించాడు.
నేను వాచ్ మన్ కోసం ఎదురుచూస్తూ నిస్సహాయంగా అక్కడే కూర్చుండిపోయాను. నా జీవితంలో ఇలాంటి దురదృష్ట ఘడియలు వస్తాయని నేనేనాడూ ఊహించలేదు.
నాకు ఇంత టెన్షన్ ని తెచ్చి పెట్టినా అంకిత్ అంటే నాకసలు కోపం రావడంలేదు. వాడికా మిషన్ అంటే ఎంత భయం పేరుకుపోయిందో నేను ఊహించగలను.
అరగంట తర్వాత వాచ్ మన్ బీరువా తాళాలు తీసుకుని వచ్చాడు. రావడంతోనే మేనేజర్ బీరువా తెరిచి ముందు అంకిత్ సెక్షన్ తాలూకు అడ్మిషన్ రిజిష్టర్ తీసి అంకిత్ క్లాస్ మేట్స్ నంబర్స్ ప్రకారం ఒక తెల్ల కాగితం మీద ఒక్కో అడ్రస్ నోట్ చేసి ఇచ్చాడు. అది పూర్తయ్యేసరికి మరో పది నిమిషాలు పట్టింది. నేను అతనికి 'థాంక్స్' చెప్పి బయటకి నడిచాను. అప్పటికి సాయంత్రం ఆరయింది. ఇంకా చీకటి పడలేదు.
ఆ కాగితం మీద ఉన్న పేర్లలో అంకిత్ నోటివెంట తరచూ దొర్లే పేర్లు కొన్ని టిక్ చేసుకుని ఒక్కో యింటికే వెళ్ళాను. లాభం లేకపోయింది.
ఇక రెండే అడ్రసులున్నాయి.
అసలు అంకిత్ ఎవరయినా ఫ్రెండ్స్ దగ్గరికి వెడతాడో లేదో తెలీకుండా వెతుకుతున్నాను. మొన్నటివరకూ వాడి మనస్తత్వం క్షుణ్ణంగా తెలుసనే నా నమ్మకం. కానీ ఆ హాస్పిటలులో.......ఆ బెడ్ మీద వాడి మనసు ఎలా మారిందో ఒక్క భగవంతుడికే తెలియాలి.
ముందుగా మిగిలిన రెండు అడ్రసుల్లో 'కిరణ్; అనే కుర్రవాడి ఇంటికి వెళ్ళాను. నేను గేట్ తీసి లోపలికి వెళ్ళేసరికి, ఆ అబ్బాయి తల్లనుకుంటాను. ప్రశ్నార్థకంగా చూసింది.
"నమస్తే! నేను మీ కిరణ్ క్లాస్ మేట్ కి ఫాదర్ని. చిన్న పనిమీద వచ్చాను" అంటూ వచ్చిన విషయం చెప్పాను.
"కూర్చోండి" అంటూ లోపలికి వెళ్ళి రెండు నిమిషాల్లో కొడుకుని తీసుకుని వచ్చింది.
రాగానే "బాబూ, అంకిత్ గానీ కనిపించాడా?" అనడిగాను ఆత్రంగా.
"అంకిత్! అవునంకుల్......అయిదింటికనుకుంటా...........బీచ్ కి వెళ్ళేదార్లో కనిపించాడు. మా డాడీతో స్కూటర్ మీద వస్తూ చూసా......"
నేను లేచి రివ్వున బయటికి దూసుకువచ్చాను.
క్షణాల్లో కారు స్టార్టుచేసి బీచ్ వైపు పోనిచ్చాను. నా గుండె శబ్దం ఆ కారు చేసే శబ్దం ముందు కూడా ప్రత్యేకంగా వినిపిస్తోంది.
"అంకిత్....." నా గుండె ఆక్రోశించింది.
నా చిన్నప్పటి హాస్పిటల్ సంఘటన గుర్తొచ్చింది. మామూలు బెడ్ మీదే వుండలేకపోయాను. ఇంక వాడు ఆ మిషన్ మీద ఎలా వుంటాడు?
నా టెన్షన్ ని అధికం చేయడానికి రైల్వే గేట్ పడింది. దూరంగా ట్రాక్ చుట్టూ జనాలు విపరీతంగా మూగి వున్నారు. విండో గ్లాసు దించి అటువైపు చూసాను.
నా ప్రక్కనుంచి ఎవరో "పాపం ఎవరో చిన్నకుర్రాడు, పన్నెండేళ్ళు కూడా వుండి వుండవు! అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి..." అనుకుంటూ వెళ్తున్నారు.
అప్పుడు కలిగింది నాకా అనుమానం.
చిన్నప్పుడు నాకొచ్చిన ఆలోచనే అంకిత్ కి వస్తే..........
నేను గట్టిగా "నో" అని అరవాలనుకున్నాను. నా గొంతు నా స్వాధీనంలో లేదు. పిచ్చిబలంతో డోర్ తీసుకుని ట్రాక్ వెంట పరుగెత్తసాగాను. దూరంగా జనం. అక్కడ........ అక్కడ.... నా అంకితేనా.......
రెండుసార్లు కంకరరాళ్ళు జారి క్రిందపడ్డాను. నా చెప్పులు ఎక్కడ పోయాయో తెలీదు. సూదుల్లా వున్న రాళ్ళు చెప్పుల్లోంచి నా పాదాల్ని చీల్చేస్తున్నాయి. అయినా లెక్క చేయకుండా పరుగెత్తసాగాను.
అక్కడికి చేరుకునేవరకూ నా గుండె పనిచేస్తోందో లేదోకూడా నాకు తెలీదు. కానీ, ఆ గుంపుని తొలగించుకుంటూ లోపలికి జొరబడుతుంటే నా గుండె కొట్టుకునే శబ్దం సమ్మెటపోట్లలా గట్టిగా వినిపించసాగింది.
నేను క్షణాల్లో దారి చేసుకుంటూ శవాన్ని సమీపించాను.
ఆ శరీరం ఛిద్రమై వుంది. అంకిత్ ది కాదు.
సుఖమంటే ఏమిటి? దుఃఖానికి అది ఎంత దూరంలో వుంటుంది? చాలా తక్కువ దూరం అనుకుంటాను. సుఖనిద్రలో భంగం కలిగించే చిన్న శబ్దం కూడా విసుగుని కలిగిస్తుంది. అపరిమితమైన దుఃఖంలో చిన్న ఓదార్పుకూడా సుఖాన్ని కలుగచేస్తుంది. మరి ఏది సుఖం? ఏది దుఃఖం? సుఖమంటే ఎక్కువ దుఃఖం లేకపోవటం! దుఃఖమంటే ఎక్కువ సుఖం లేకపోవటం.
అది అంకిత్ శరీరం కాదని తెలిసినప్పుడు నేను పొందిన సుఖం అలాంటిది! తాత్కాలిక ఆనందం!
సమస్య అలానే వుంది. దుఃఖం క్షణంపాటు దూరమైంది.
ఆ కుర్రవాడి తల్లి అనుకుంటాను. హృదయ విదారకంగా ఏడుస్తోంది. తండ్రి నాలాగే- దూరంగా నిలబడి గాంభీర్యాన్ని నటిస్తున్నాడు. చుట్టూవున్న జనం సానుభూతితో ఆ దంపతులవేపు చూస్తున్నారు. సాయంత్రానికి ఈ సంగతిని వారు మర్చిపోతారు. స్నేహితులకి డ్రమెటిక్ గా చెప్పుకోవటానికి ఇదొక మంచి సంఘటనగా మిగుల్తుంది. ఆ దంపతుల కడుపుకోతని ఎవరు పూడ్చగలరు?
"డాడీ..........."
ఉలిక్కిపడ్డాను.
అంకిత్ గొంతు అది.
నిజమా? నమ్మశక్యం కానట్టు చూసాను.
"అంకిత్!....... నా అంకిత్.......
నా చెయ్యి పట్టుకుని లాగుతున్నాడు. ఛివాలున మోకాళ్ళమీద వంగి, వాడిని కౌగిలించుకున్నాను. చనిపోయిన కుర్రవాడి తండ్రిలా గంభీరంగా వుండలేకపోయాను. కళ్ళవెంట నీళ్ళు ధారాపాతంగా కారసాగాయి. అంకిత్ కూడా ఏడ్వసాగాడు.