Previous Page Next Page 
ఫస్ట్ క్రష్ పేజి 14

 

స్వీట్ బాక్స్ తెచ్చి మీకు కావలసిన స్వీట్ తీసుకోండి అని మూత తీసింది. అందులో రెండు లాలీపాప్స్ కూడా ఉన్నాయి. ఒక స్వీట్ చేతిలోకి తీసుకుని ఆ లాలీ పాప్స్ జేబులో వేసుకున్నాడు ఎవరూ చూడకుండా. 
మూడు కుక్కలూ వినీల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాయి.
ఇంకొన్ని స్వీట్స్ తీసుకోండి. వాటికి పెట్టకుండా మిమ్మల్ని తిననివ్వవు అంది విజిత నవ్వుతూ. వినీల్ చేతికి స్వీట్స్ బాక్స్ ఇచ్చింది. వినీల్ వాటికి ఒక్కొక్కటి తినిపిస్తున్నాడు. 
వినీల్ అని పిలిచారు రాజుగారు.
చెప్పండి సర్ అన్నాడు పక్కన ఉన్నా.
రేపు అవార్డు అందుకునేందుకు నువ్వు విజిత ముంబై వెళ్ళాలయ్యా అన్నాడు. రేపు మధ్యాన్నం వెళ్లి ఎల్లుండి రిటర్న్ వచ్చేయొచ్చు ప్లీజ్ అన్నాడు.
పెద్దాయన మొదటి అసైన్మెంట్. ఏం చేద్దాం తప్పేట్లు లేదు అనుకున్నాడు వినీల్. అతనికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ మొహమాటం డామినేట్ చేస్తోంది.
నేను పి ఏ కి చెప్పి రేపు మధ్యాన్నం ఫ్లైట్ కి టికెట్స్ బుక్ చేయించమంటాను. మా కారు నిన్ను ఆఫీస్ దగ్గర పిక్ అప్ చేసుకుంటుంది అన్నాడు.
సరేనండి అన్నాడు వినీల్.
ఏమ్మా విజ్జీ ఏమంటావు అని అడిగాడు.
సరే డాడ్. వెళతాము అంది వినీల్ వైపు చూస్తూ. అతను మామూలుగానే కనిపించాడు.  తనేమైనా ఇబ్బందిపడుతున్నాడా అన్న సందేహం కలిగి అలా చూసింది.  అలాంటిదేమీ లేదు.  అమ్మయ్య అనుకుంది.
వంటావిడ వంట రెడీ అని చెప్పింది.
వెళ్ళు నీల్. నీతో కలిసి కూర్చుందామని మొన్న మీ ఆఫీస్ లో ఇన్వైట్ చేసాను. ఇదిగో ఇలా బెడ్ కి పరిమితం అయ్యాను. మా ఆవిడ, అమ్మాయి నీకు కంపెనీ ఇస్తారు అన్నాడు ఫీల్ అవుతూ.
అయ్యో ఫరవాలేదు సర్. 
డైనింగ్ టేబుల్ పై చాలా వంటకాలు ఉన్నాయి. వాటిని చూస్తూ అబ్బా అని మూలిగాడు. తను రాత్రి చాలా పరిమితంగా ఫ్రూప్ట్స్ తింటాడు. సరే తప్పదు ఇవాళ్టికి. లేకుంటే వీళ్ళు ఫీల్ అవుతారు.
అది గమనించింది విజిత. బలవంతమేమీ లేదు. మీకు నచ్చినవి ఎంత కావలిస్తే అంత తినండి అంది. 
థాంక్స్ అన్నాడు అమ్మయ్య అనుకుంటూ.
మాధవి కబుర్లు చెపుతోంది. ఆమెకు ఎక్కువ మాట్లాడటం ఇష్టం.
విజిత వినీల్ ఇద్దరూ వింటున్నారు ఆసక్తిగా.
బోజనాలయిందనిపించి రాజు గారికి మాధవి కి చెప్పి బయటికి వచ్చాడు వినీల్.
తనూ అతనితో బయటికి వస్తూ రేపు మనం ముంబై వెళ్ళాలి అంది విజిత.
అవును అన్నాడు.
నేను వచ్చి పిక్ అప్ చేసుకుంటాను. సరేనా అంది.
సరే అన్నాడు.
మేమేమైనా ఇబ్బంది పెడుతున్నామా నీల్ అంది 
ఆబ్బె లేదు లేదు అన్నాడు వినీల్.
థాంక్స్ అంది.
నీల్ మీ నాన్నగారి నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా అని అడిగింది.
లేదు విజ్జీ. వస్తే నేను నీకు ఇమ్మీడియేట్ గా చెప్తాను. సరేనా అన్నాడు.
ఏమో నీ కోడింగ్ లో పడి మర్చిపోతావేమో అని అడిగాను అంది. 
గుడ్ జోక్ అన్నాడు వినీల్ నవ్వుతూ.
బై అని చెప్పి తన ఇంటికి వచ్చేసాడు.
ఎందుకో అతనికి చాలా చిరాకుగా ఉంది. అన్నీ ఉన్న ఈ విజిత ఎందుకు తన వెంటబడుతుందో అతనికి అర్ధంకావడంలేదు. ఇంత పెద్ద ప్రపంచంలో ఆమె వూ అంటే క్యూ లో కోటి మంది నిలబడతారు. తనకెందుకో అంత ఐశ్వర్య అందాల రాశిని చేసుకోవాలంటే భయం గా ఉంది. చిన్నప్పటినుంచి తను పెరిగిన వాతావరణం వేరు. ఎంతో స్వేచ్చ్చగా, స్వతంత్రంగా గడిపాడు. ఇప్పుడు రాజుగారికి అల్లుడైతే ఆమ్మో అనుకున్నాడు. ఆ ఆలోచనే కాస్ట్లీ గా ఉంది. సరేలే చూద్దాం. కాలం నిర్ణయిస్తుంది. దానికే వదిలేద్దాం అని లైట్ ఆపి మంచమెక్కాడు తన కలల రాణి సాఫ్ట్వేర్ కోడింగ్ ని తలచుకుంటూ.  


****


ప్రొద్దున్నే నాన్నగారినుంచి ఫోన్.
ఆయనతో చాలా సేపు మాట్లాడాడు వినీల్.
వారి మాటల్లో ముఖ్య సారాంశం వినీల్ పంపిన జాతకం గురించే.
ఆయన ఆ జాతక పొంతనలు గురించిన సంగతులు వివరంగా చెప్పడం, వినీల్ వినడం అంతా జరిగింది. 
సుదీర్ఘ ఫోన్ టాక్ తరువాత, టిఫిన్ ఏం  చెయ్యాలా అని ఆలోచనలో ఉండగానే కాలింగ్ బెల్ మోగడం టిఫిన్ బాక్స్ బుట్ట వినీల్ చేతిలో పెట్టడం చక చక జరిగిపోయాయి.
బాల్కనీ లోకి వెళ్లి చూస్తే విజిత నవ్వుతూ చెయ్యి ఊపింది. 
థాంక్స్ చెప్పాడు వినీల్ తానూ చెయ్యి ఊపుతూ.
చక చక రెడీ అయ్యి ఆఫీస్ కి బయలుదేరాడు.
వెళ్ళగానే మృణాల్ కేబిన్ కి వెళ్లి అన్ని విషయాలు పూస గుచ్చినట్లు చెప్పాడు.
వాళ్ళ అమ్మాయి విజిత ని నీకిచ్చి పెళ్లి చేస్తాడేమో వినీల్ అని సందేహం వెలిబుచ్చాడు మృణాల్ ఆనందంగా.
నో నో మృణాల్. అలాంటిదేమీ లేదు. రాజు గారు రెండు నెలలు బెడ్ రెస్ట్ కదా. అందుకే రిక్వెస్ట్ చేసాడు తమ బిజినెస్ వ్యవహారాలలో విజితకు హెల్ప్ చెయ్యమని అని చెప్పాడు వినీల్. తన ముంబై ప్రయాణం విషయం రెండు రోజులు కూడా చెప్పాడు.
మృణాల్ వినీల్ వైపు చూసి కన్ను గీటి ఎంజాయ్ మై బాయ్ అన్నాడు.
అయ్యయ్యో మృణాల్ నీకు నా గురించి తెలుసు కదా. అలాంటిదేమీ లేదు అన్నాడు భుజాలు తడుముకుంటూ.
సరేలే చూద్దాం అని నవ్వాడు మృణాల్. క్యారీ ఆన్, బెస్ట్ విషెస్ చెప్పాడు.
టిఫిన్ బాక్స్ ఆఫీస్ కి తెచ్చుకున్నాడే కానీ  బాగా బిజీగా ఉండటంతో తినలేకపోయాడు వినీల్.
పన్నెడవుతోంది.
విజిత నుంచి కాల్. అరగంటలో పిక్ అప్ చేసుకుంటాను అని.
రెండు గంటలకు ఫ్లైట్. ఒక గంట ముంబై ఫ్లైట్ ప్రయాణం. 
సరే అన్నాడు.
తను చెప్పినట్లుగా అరగంటకు ముందే వచ్చేసింది విజిత. క్రిందనుంచి ఫోన్ చేసింది వచ్చానని.
ఆఫీస్ బాయ్ ముందే వెళ్లి ఓ చిన్న బ్రీఫ్ కేసు కారులో పెట్టాడు వినీల్ సర్ ది అని చెప్పి.
ఓ ఐదు నిముషాలకు వినీల్ కారు దగ్గరకొచ్చాడు. వెంట అతని టీం మేట్ మీనూ అతని బుట్ట పట్టుకొచ్చింది. 
వినీల్ సర్. మీ టిఫిన్. ప్రొద్దున్నుంచి తినలేదు మీరు. దారిలో తినండి అంటూ కారులో పెట్టింది. మిస్ యూ అని చెప్పింది వయ్యారాలు పోతూ. మీనూ కేరళ అమ్మాయి అయినా తన తెలుగు చక్కగా మాట్లాడుతుంది. వీనుల వినబుల్ గా ఉంటుంది.
థాంక్స్ మీనూ బై అని చెప్పి కారు ఫ్రంట్ సీట్ డోర్ తియ్యబోయాడు అక్కడ కూర్చుందామని.
వెనుకకు వచ్చి కూర్చోండి అంది విజిత ఆర్డర్ వేసినట్లుగా.
ఓకే మేడం అని వెనుక సీటు లో విజిత పక్కన కూర్చున్నాడు. 
పాపం మీ మీనూ మిస్ అవుతున్నట్లుంది మిమ్మల్ని. మనతో తీసుకెళదామా అంది నవ్వుతూ.
అహహా వద్దు. మార్నింగ్ నుంచి నేను టిఫిన్ తినకపోయేసరికి కంగారుపడుతోంది అన్నాడు వినీల్.
ఓహ్ అయితే నేను తినిపిస్తాను ఉండండి అని బుట్టలో బాక్స్ తీసింది. ఇడ్లీలపై కారప్పొడి నేతితో ఘుమ ఘుమ లాడుతోంది హాట్ ప్యాక్ లో. స్పూన్ తో ఓ ముక్క తీసి వినీల్ నోట్లో పెట్టబోయింది.
అయ్యయ్యో మేడం మీరెందుకు. నేను తింటానుగా అని హాట్ ప్యాక్ విజిత చేతిలోంచి తీసుకుని స్పూన్ తో ఇడ్లీలు తినడం మొదలుపెట్టాడు. 
కొర పోతుంటే వాటర్ బాటిల్ అందించింది మూత తీసి. మీ మీనూ తలచుకుంటూ ఉందేమో అంది నవ్వుతూ. పాపం మిమ్మల్ని బాగా మిస్ అవుతోంది. 

 

 Previous Page Next Page