రాజు గారు పక్కనే ఉన్నారు. ఎన్నాళ్ళనుంచో వెయిటింగ్ రాజు గారిని పెళ్లి చేసుకునేందుకు. కానీ ఈ చాదస్తపు రాజు గారు జాతకాలు, ఆచారాలు పట్టుకుని వెళ్ళాడుతున్నారు అంది ఒకింత విసుగ్గా వినీల్ వంక చూస్తూ.
ఫన్ ఆ లేక ఫ్రస్ట్రేషన్ ఆ అన్నాడు సినిమా గుర్తుకొచ్చి కాస్త విజితని నవ్విద్దాంఅని.
నీకు ఫన్ నాకు ఫ్రస్ట్రేషన్ అంది కోపంగా.
ఓహ్ !! వద్దు వద్దు. ఈ సమయంలో అంత కోపం వద్దు. వెయిట్ చేద్దాం. నువ్వు మంచిదానివి కదా. నీకు అంతా మంచే జరుగుతుందిలే. కాస్త ఓపిక పట్టు అన్నాడు.
కాఫి తాగటం పూర్తయ్యింది. సరే పడుకుందాం పద అని లేచాడు వినీల్. తను రూమ్ లోకి వెళ్లి తలుపేసుకోవడం మేలు. లేకుంటే విజ్జీ కూడా అలానే తన పక్కన కూర్చొనుంటుంది.
***
మరుసటిరోజు డిశ్చార్జ్ అయ్యి రాజుగారు ఇంటికి వచ్చారు.
విజిత డాక్టర్ కాబట్టి తనే కేర్ తీసుకుంటానని చెప్పింది హాస్పిటల్ డాక్టర్స్ తో.
డ్రెస్సింగ్ అవసరముంటే నర్స్ ని పంపిస్తామని చెప్పారు వాళ్ళు.
ప్రొద్దున్నే రాజుగారిని పలకరించి, హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లి హడావుడిగా ఆఫీస్ కి వెళ్ళిపోయాడు వినీల్.
సాయంత్రం కాస్త ఎర్లీ గా ఆఫీస్ నుంచి బయలుదేరాడు రాజు గారిని పలకరిద్దామని. మృణాల్ వాళ్ళు రాజు గారు కొంచెం కోలుకున్నాక నాలుగు రోజులాగి వచ్చి పలకరిస్తామని చెప్పారు.
****
చక చక ఫ్రెష్ అప్ అయ్యి విజిత వాళ్ళింటికి వెళ్ళాడు వినీల్. అబ్బో అప్పుడే ఏడయింది అనుకున్నాడు.
గేట్ తియ్యబోతూ ఆమ్మో వీళ్ళింట్లో కుక్కలు ఉన్నాయనుకుంటా అంటూ కాలింగ్ బెల్ కోసం గేట్ దగ్గర చూసాడు. అమ్మయ్య ఉంది అనుకుని దాన్ని నొక్కాడు.
విజిత బయటికొచ్చింది. తన వెంటే ఓ మూడు కుక్కలు కూడా బయటికొచ్చాయి ఆమెతో పాటు బాడీ గార్డ్స్ లా.
ఓహ్ చుడిధార్లో మెరిసిపోతోంది విజిత. పొడవాటి నల్లని ఒత్తైన జుత్తును చుట్టగా పైకి చుట్టి క్లిప్ పెట్టుకుంది. అందం ఉన్న అమ్మాయి ఎలా ఉన్నా అందమే మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు వినీల్.
గేటు తీస్తూ రండి లోపలి అంది.
ఆమ్మో కుక్కలు అన్నాడు.
ఏమీ చెయ్యవు రండి. నేనున్నానుగా అంది విజిత.
సరే అని విజిత వెనకాలే లోపలికి వెళ్ళాడు. ఆ మూడు కుక్కలు వినీల్ వెంటే ఉన్నాయి చేతులు కాళ్ళు నాకుతూ.
ఇల్లు చాలా పెద్దగా ఇంద్రభవనం గా కనిపించింది. అంత పెద్ద ఇంట్లో వాళ్ళు ముగ్గురే. అఫ్ కోర్స్ నౌకర్లు, వంటవాళ్లు ఉంటారు ఔట్హౌస్ లో. మూడంతస్థుల ఇల్లు. దానికో పెద్ద లిఫ్ట్ కూడా. కింద మొత్తం పార్కింగ్. ఓ ఆరు కార్లు ఉన్నాయి. మొదటి అంతస్థులో రాజు గారు మీటింగ్ హాల్ మరియు ఆఫీస్. రెండో అంతస్థులో రాజుగారు ఆయన భార్య మూడో అంతస్థులో విజిత ఉంటారు.
అంత పెద్ద ఇల్లు చూసి నేను డెఫినిట్ గా ఈ అమ్మాయికి సూట్ కాను అని మరో మారు డిసైడ్ చేసుకున్నాడు వినీల్.
ఇవాళ మా ఇంట్లోనే మీకు భోజనం అంది విజిత.
వద్దు ప్లీజ్. నేను నైట్ ఫ్రూప్ట్స్ తీసుకుంటాను. నీకు తెలుసు కదా అన్నాడు.
నాకు తెలీదు. డాడీ ఇందాక అంటున్నారు మమ్మీ తో మీకు స్పెషల్ వంటలు చేయించమని.
లిఫ్ట్ లో రెండో అంతస్థుకెళ్లారు.
రాజుగారి గదికి వెళ్లారు. మాధవి అక్కడే ఉన్నారు.
వినీల్ ని చూడగానే రాజుగారు మొహం వికసించింది.
రావోయ్ అంటూ ఆప్యాయంగా పిలిచాడు.
అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు వినీల్.
ఎలా ఉన్నారు సర్ అని అడిగాడు.
బాగానే ఉన్నా నీల్. కాకుంటే కదలలేకుండా ఉన్నాను. రిబ్స్ ఒత్తుకుని నొప్పిగా ఉంటున్నాయి. బ్లడ్ ఇచ్చి నాకు పునర్జన్మ నిచ్చావు. నీ ఋణం తీర్చుకోలేనిది. గాడ్ బ్లెస్స్ యు అన్నారు.
అయ్యో నాదేముంది సర్. మీకు ఆ సమయంలో బ్లడ్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది.
విజిత అడిగింది వినీల్ ని. కాఫీ నా, జూస్ ఏమైనా త్రాగుతారా అని.
కాఫీ ప్లీజ్ అన్నాడు.
పోలీస్ కమీషనర్ యశ్వంత్ పొద్దున వచ్చాడు. అన్నీ పాయింట్స్ డిస్కస్ చేసాము. నా అనుమానాలన్నీ చెప్పాను. మీ అన్నయ్య క్లాస్ మేట్ అట కదా అతను అన్నాడు.
ఎస్ సర్ అన్నాడు వినీల్, విజిత ఇచ్చిన కాఫీ త్రాగుతూ.
నీ నుంచి ఒక పెద్ద హెల్ప్ కావాలి వినీల్.
అయ్యో చెప్పండి సర్. ష్యుర్ గా చేస్తాను.
నా పరిస్థితి నీకు తెలుసుగా. ఇంకో రెండు నెలలు బెడ్ నుంచి కదిలే అవకాశం లేదు. విజిత కేమో బిజినెస్ కొత్త. అంత హేండిల్ చెయ్యలేదేమో అనిపిస్తోంది. కాస్త నువ్వు అమ్మాయికి తోడుగా హెల్ప్ చేస్తే బాగుంటుంది. గైడెన్స్ నేనిస్తాను. నువ్వు మేనేజ్ చెయ్యగలవని నా నమ్మకం.
కానీ సర్. నేను మా కంపెనీ లో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్స్ హేండిల్ చేస్తున్నాను. వాటికి ఇబ్బంది అవుతుందేమో అని సందేహం వెలిబుచ్చాడు.
ఒకటి చేద్దాం నీల్. మా బిజినెస్ లో ఎక్కడ నీ అవసరముంటుందో అక్కడ నువ్వు హెల్ప్ చెయ్యి. అది నీకు ముందే చెప్తాను. నీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాను. మీ మేనేజిమెంట్ తో కూడా మాట్లాడుతాను. మీ డైరెక్టర్ ఒకతను నాకు బాగా క్లోజ్. అతని రిక్వెస్ట్ మీదే మీకు మా కంపెనీ సాఫ్ట్వేర్ ఆర్డర్ ఇచ్చాము. మీ కంపెనీకి వచ్చినందువల్ల నాకు చాలా మేలు జరిగింది. ఒకటి నువ్వు రక్త దానం చేసి నా ప్రాణం కాపాడావు. ఇంకొక ముఖ్య విషయం రానున్న రెండు నెలలు మా బిజినెస్ లో నీ సహాయం కావాలి అని చెప్పాడు.
సరే సర్. నేను ప్రయత్నిస్తాను. మీ నమ్మకానికి థాంక్స్ అన్నాడు.
మెనీ మెనీ థాంక్స్ నీల్ అన్నారు రాజుగారు. ఆయనకు కొండంత భారం దింపినట్లయ్యింది. విజి ఇండస్ట్రీస్ అతనికి ఆరో ప్రాణం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. వినీల్ మీద రాజుగారికి బాగా నమ్మకమేర్పడింది. అతను సమర్ధుడు. ఏపనైనా తన తెలివితేటలతో చెయ్యగలడు. ఫలితం ఆశించడు. మోసం చెయ్యడు అనిపించింది ఆయనకి.
రాజుగారు వినీల్ కుటుంబ విశేషాలు అవీ అన్నీ అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళది చాలా మంచికుటుంబం గా ఫీల్ అయ్యాడు.
మాధవి వాళ్లకి వినీల్ నాన్నగారు దూరపు బంధువులవుతారని మాటల్లో తెలిసింది. ఆవిడకి వినీల్ అంటే అభిమానం ఏర్పడింది.
విజిత అన్నీ వింటూ అక్కడే కూర్చొనుంది.
ఇంతలో రాజుగారి ఫోన్ మోగింది. అక్కడే కూర్చున్న నీల్ ఆ ఫోన్ తీసి ఇచ్చాడు. ఆయన పట్టుకోలేడు కదా అని స్పీకర్ ఆన్ చేసి ఆయన దగ్గర పెట్టాడు.
అటునుంచి కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు. విజి ఇండస్ట్రీస్ కి క్రితం సంవత్సరంకు బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు వచ్చిందని. ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర మంత్రి చేతులు మీదుగా ముంబై లో ప్రెసెంటేషన్ ఉంటుందని, తప్పకుండా అటెండ్ అయ్యి అవార్డు స్వీకరించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. వెన్యూ అదీ వాట్సాప్ చేస్తామని చెప్పారు. మంత్రిగారి అప్పోయింట్మెంట్ రేపటికి దొరికిందని అందుకే అంత షార్ట్ నోటీసు లో చెపుతున్నామని చెప్పారు.
రాజు గారు ఫోన్ లో అతనికి థాంక్స్ చెప్పారు ఆనందంగా. ఎప్పటినుంచో రాజుగారి కల బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు కైవసం చేసుకోవాలని. ఇవాళ్టికి నెరవేరింది. విజితని పిలిచాడు.
ఏంటి డాడీ అంటూ వచ్చింది.
ఇంట్లో ఏ స్వీట్ ఉంటె అది తెచ్చి ఈ అబ్బాయికీమ్మా అన్నాడు సంతోషంగా. ఏంటో నీతో అన్నీ శుభవార్తలే వస్తున్నాయి నీల్ అన్నాడు.
ఇతనివల్లే అంటారా డాడ్ అంది విజిత అనుమానంగా వినీల్ వైపు చూస్తూ.
ఏమోనమ్మా నాకు అలా అనిపిస్తోంది. నేను ఈరోజు మీముందు ఉన్నానంటే ఇతనే కదా. ఒప్పుకుంటావా అన్నాడు.
వూ. ఒప్పుకుంటాను డాడీ అంది.