ఆఖరికి సరే చూద్దాం ఏమవుతుందో -మరోసారి వస్తాడో లేదో అనుకుంది. శ్యామల అనుమానం నిజమే అయింది. మళ్ళీ నెలగడిచేసరికి రెండోసారి తయారయ్యాడు అతను. ఈసారి శ్యామల మీద దయతలచినట్టు ఐదొందలతో సరిపెట్టాడు. శ్యామల కోపంపట్టలేకపోయింది. శ్యామల కోపానికి, ఆమె బెదిరింపులకి దడవనట్లు నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోయాడు అతను.
శ్యామల దిగులు, ఆరాటం హెచ్చయింది. ఆ సంఘటనతో, ఎవరితో ఈ విషయం చెప్పుకోవాలో కూడా అర్ధం కాలేదు. రంగారావుతో యీ విషయం ఎలా చెప్పాలో- చెప్పకుండా ఎన్నాళ్ళు దాచగలదు తను అన్నది ఆమెకి పెద్ద సమస్యగా తయారయింది. ఆ సమస్యకి పరిష్కారం అతి కొద్ది రోజులలోనే జరిగిపోయింది.
ఆ రోజు ఊరికి వెళ్ళిన రంగారావు అనుకోకుండా ఒక రోజు ముందు వచ్చారు. శ్యామల అలవాటుగా ఎదురురాలేదు గుమ్మంలోకి బెడ్ రూములోకి వెళ్ళారు. అక్కడ లేదు. ఉషను ఆడిస్తున్న ఆయాని 'అమ్మగారెక్కడ' అన్నారు రంగారావు. "ఎవరోవస్తే అమ్మగారు పుస్తకాల గదిలో మాట్లాడుతున్నారు బాబూ" అంది ఆయా వినయంగా.
"ఎవరు? ఆడా- మగా?"
ఎవరో మొగవాడేనండి" రంగారావు ఎవరా అని ఆశ్చర్యపడి, ఎవరో చూద్దామని లైబ్రరీ వైపు నడిచాడు. గది తలుపులు ఓరగా వున్నాయి. గదిలో శ్యామల గొంతుతో మరో అపరిచితుడి గొంతు వినిపించింది. ఆ మాటలు చెవినపడగానే అప్రయత్నంగా గుమ్మంముందు ఆగిపోయారు రంగారావు.
"నిజం జమీందారుగారికి తెలిస్తే మీ యిద్దరి గతి పాప భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా? మర్యాదగా నేనడిగింది యిచ్చేస్తే యీ రహస్యం బయటికి పొక్కదు "మొగగొంతు." యిప్పటికి రెండుసార్లు అయింది. ఇలా యిస్తున్నంతకాలం నువ్వు మళ్ళీ మళ్ళీ అడగవని నాకు ఏమిటి నమ్మకం" శ్యామల గొంతు తీక్షణంగా వుంది.
"ఇక రాను, మాట యిస్తున్నాను."
"నిన్ను నమ్మమని ఎక్కడుంది. ఛీ నీవింత దుర్మార్గుడివని అనుకోలేదు. నన్నెందుకిలా పీడిస్తావు, నీకు నేనేం అపకారం చేశాను. పాప మీద నీకెందుకింత పగ"
ఆ మాటలు విన్న రంగారావు గారు ఒక్కక్షణం వింటున్నది ఏమిటో అర్ధం కానట్టు నిలబడ్డారు. మరుక్షణం ఆయన మొహం నల్లబడింది. ఆయనకి తెలియకుండానే గదిలోకి అడుగువేశారు. ఆయన్ని అలా అనుకోకుండా హఠాత్తుగా చూసిన ఇద్దరూ నిశ్చేష్టులైపోయారు. శ్యామల పై ప్రాణాలు పైనేపోయాయి! రంగారావు యిద్దరి వంక ఒకసారి చూసి "ఏమిటిది? ఏమిటా రహస్యం?" గంభీరంగా అడిగారు. తుఫాను ముందు ప్రశాంతతల నిశ్చలంగా గంభీరంగా అడిగారాయన.
అతను శ్యామల వంక, ఆయనవంక చూసి మరుక్షణం అక్కడనించి పారిపోబోయాడు. "అడుగు కదిపావంటే నరికేస్తాను, ఆ రహస్యం ఏమిటో చెప్పు"
రంగారావు గుమ్మానికి అడ్డంగా చేతులు పెట్టి గంభీరంగా అడిగారు.
అతను ఒక్కక్షణం నిస్సహాయంగా చూసి తడబడ్తూ "ఉష అనాధ కాదు - ఆవిడకి తెలుసు -- గట్టిగా అడగండి ఆమె చెప్తుంది" అంటూనే ఆయన పక్కనించి దూసుకుపోయాడు.
రంగారావు ఒక్కక్షణం తెల్లపోయి, తేరుకుని చూసేసరికి శ్యామల కూడా లేదక్కడ. రాబోయే ప్రళయాన్ని ఊహించి ఆరోజంతా శ్యామల రంగారావు గారినించి మొహం చాటుచేసుకు తిరిగింది. ఆయనకి వంటరిగా కనబడకుండా జాగ్రత్తపడింది. ఆయనకి కోపం విజ్రుంభిస్తే తట్టుకు నిలబడ్డం కష్టం అని ఎవరినోటో వింది. కాని అలాంటి పరిస్థితి అప్పటివరకు ఆమెకి తటస్థపడలేదు. కాని యిప్పుడు ....... శ్యామల కేం చెయ్యాలో, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అంతుబట్టలేదు. కాని ఆశ్చర్యంగా రంగారావు ఆ విషయం మరిచిపోయినట్టు ఏం జరగనట్టు గంభీరంగా వుండిపోయాడు రోజంతా.
ఆ రాత్రి బాగా పొద్దుపోయాక ఆయన పడుకునివుంటారన్న నమ్మకంతో చడీ చప్పుడు లేకుండా గదిలోకి ప్రవేశించింది శ్యామల. మెల్లిగా నడిచి మంచం చేరేంతలో లైటు వెలిగింది ఆమె బిత్తరపోయింది. రంగారావు సోఫాలో కూర్చుని వున్నారు. శ్యామల వంక ఒక్కక్షణం పట్టిపట్టి చూశారు.
"నీకోసమే చూస్తున్నాను. ఇంతాలస్యం చేశావేం?" ఆయన గొంతు ప్రశాంతంగా వుంది. తుఫాను ముందు ప్రశాంతి అనుకుని చిన్నగా వణికింది శ్యామల. "ఉషని పడుకోబెడుతున్నాను" తడబడుతూ జవాబిచ్చింది.
"రా, ఇలా కూర్చో - " సోఫా చూపారాయన ఆమె ఊహించిన కోపావేశానికి బదులు ఈ శాంతం, సౌమ్యత ఆమెనింకా బెదిరిస్తున్నాయి. అలజడితో సోఫాలో ముడుచుకు కూర్చుంది. రంగారావు గంభీరత శ్యామల వంక చూసాడు.
"శ్యామలా - నీవు అందమైన దానివని. తెలివైనదానివన్న సంగతి తప్పించి నీ గురించిగానీ, నీ పుట్టుపూర్వోత్తరాల గురించి గానీ నాకేం తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నమూ చెయ్యలేదు. అయినా నీపై నమ్మకముంది. నీ ప్రవర్తన మీద విశ్వాసంతో నిన్ను పెళ్ళాడాను. వంశ ప్రతిష్టలకి ప్రాణం పెట్టే నేను నీ కోసం అవన్నీ తృణప్రాయంగా ఎంచి నిన్ను చేపట్టాను. నా యెడల నీ కెలాంటి భావం ఉన్నాలేకపోయినా, కేవలం మానవ ధర్మంగా నేనుంచిన నమ్మకానికి విశ్వాసానికి బదులివ్వాలి నువ్వు- అవునంటావా?" అతి సున్నితంగా, మెత్తగా మొదలైన ఈ సంభాషణ యెక్కడికి దారి తీస్తుందో గ్రహించి వణికింది శ్యామల - ఆయన వంక చూడలేక తల వాల్చుకుంది. "ఉష యెవరు?" ఈసారి ఆయన గొంతు మరింత గంభీరమైంది. శ్యామల మాట్లాడలేకపోయింది.
"ఇప్పుడింకా మాటలు మింగి ప్రయోజనం లేదు- రహస్యం దాచి లాభం లేదు. నేనేదో ఒక నిర్ణయానికి వచ్చేలోపల నువ్వు చెప్పదలచింది చెప్పడం మంచిది. ఆ తరువాత విచారించినా ప్రయోజనం లేదు." శ్యామల కళ్ళలో నీరు తిరిగింది. "ఉష ఎవరో నీకు తెలుసన్న సంగతి తెలుస్తూనే వుంది. మధ్యాహ్నం జరిగింది చూశాక, విన్నాక ఏమాత్రం బుద్ధివున్నవాడికన్న అర్ధం అవుతుంది. ఇంక యిప్పుడు నేను అడిగేది అది ఎవరికి పుట్టిందని"
కరకుగా అడిగారు శ్యామల ఒక్కసారి తలెత్తి చురుకుగా చూసింది. కళ్ళు నీటి పొర్లతో మెరిశాయి. "మీరు ఊహించినది సరిగాదు --పొరబడ్తున్నారు."