"జాన్! నేన్నీకో విషయం చెప్పాలి. రేప్రోద్దున్న కూడా చెప్పొచ్చు అనుకో. కానీ అంతవరకూ ఆగలేను. అయితే ఇదంతా సిల్లీగా వుండొచ్చు....."
"ఉపోద్ఘాతం ఎక్కువ చెపుతున్నావు."
"అంకిత్ మా ఇంటి మెట్లమీద దొరికినరోజు ముందు రాత్రి నాకొక కల వచ్చింది. నా స్నేహితురాలు ఒకమ్మాయి తన బిడ్డని అక్కడ వదిలిపోయినట్టు-"
"నాన్సెన్స్! నేనిలాంటి కలల్ని నమ్మనని నీకు తెలుసు."
"నన్ను పూర్తిగా చెప్పనీ. నాకు అలాంటి కల రావటానికి కారణం వుంది" అంటూ నా కాలేజీ ప్రేమ (?) వ్యవహారం మొత్తం చెప్పాను.......మొదటిసారి అతడిని సుమద్యుతి పెళ్ళి చూపుల్లో చూసాను. నాకు నచ్చలేదు."
"......అతడు మాటి మాటికీ బొటనవేలిని నిటారుగా వుంచి, మిగతా వేళ్ళపై కదుపుతూ ఉంటాడు. అతడి చూపులో శాడిజం లాంటిది కనబడింది. కేవలం ఇదంతా అతడు ఆమెకు భర్త అవటంచేత నాకు కలిగిన ఫీలింగ్ కాదు."
"నువ్వెంత సమర్థించుకో చూసినాసరే- నువ్వు చెప్పినదాన్ని బట్టి ఆ అమ్మాయికీ నీకూ మధ్య జరిగింది అసలు ప్రేమ వ్యవహారమే కాదు......"
"అది ప్రేమ కాకపోయి వుండొచ్చు. కానీ అతడికి అనుమానం వచ్చే ఛాన్సు వుంది. అంకిత్ నాకు దొరికిన రోజు ముందు సాయంత్రమే ఆ దంపతులు మార్కెట్ దగ్గర నాకు కనపడ్డారు."
"వ్వాట్ వ్వాట్ వ్వాట్........" అవతల్నుంచి జాన్ డేవిడ్ కంఠం సంచలనంగా వినిపించింది.
".......అవును! అప్పుడా అమ్మాయి చేతిలో పసికందు వుంది. నువ్వు చెప్పావు కదా! పగలు జరిగిన సంఘటనల వల్ల మన ఆలోచనలే రాత్రి కలల రూపంలో వస్తాయని! ఇది కూడా అలాగే జరిగి వుండవచ్చు. యాదృచ్చికమైన ఆ సంఘటన గురించి నేను ఎక్కువగా ఆలోచించి వుంటాను. ఐయామ్ సారీ జాన్. నా పిచ్చి ఆలోచన్లతో నిన్ను డిస్టర్బ్ చేసాను."
"లేదు. వుండు. ఫోన్ పెట్టెయ్యకు. నీ అనుమానం ఎందుకు కరెక్ట్ కాకూడదు?"
"కరెక్టు అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను చూడగానే ఆ దంపతుల మధ్య గొడవ జరిగి వుంటుందంటావా? ఆ అమ్మాయి మా ఇల్లు ఎక్కడో తెలుసుకుని- నాకే మాత్రం సంబంధంలేని ఆ బిడ్డని మా ఇంటిముందు వదిలేసి వెళ్ళిందంటావా?" అన్నాను.
ముందేమో నేనొకరకంగా వాదించాను. అతడు దాన్ని వప్పుకుంటున్నాడనే సరికి, ఆ వాదనకి వ్యతిరేకంగా వాదిస్తున్నాను. నిజంగా మనుష్యుల ప్రవర్తనకి ఏ తర్కమూ వుండదు కదూ! కేవలం నా అర్థరహితమైన ఆలోచన్లని బలపర్చుకోవటానికి, అతడినించి సమర్థింపు పొందటానికి మాట్లాడుతున్నానన్న విషయం నాకే తెలుస్తోంది!
"ఏమిటి మౌనంగా వుండిపోయావ్?" అన్నాడు అట్నుంచి.
"ఏం లేదు."
"ఇది ఎస్. టి.డి. ఫోన్ బాబా."
"నా అనుమానం కరెక్టు అవటానికి చాలా లొసుగులు వున్నాయని ఆలోచిస్తున్నాను."
"లొసుగులు వుండటానికి ఎంత అవకాశం వుందో, కాకపోవటానికి కూడా అంతే అవకాశం వున్నది కదా. పారాడిమ్ అంటే అదే! మొత్తం విషయాన్ని పూర్తిగా వేరే దృక్పధంలో చూడగల్గటం! ఒకవైపు నుంచి మనిషిగా కనబడిన బొమ్మ- అప్పుడు పిల్లిలా కనపడినా ఆశ్చర్యపోనవసరం లేదు!!"
"థాంక్స్ జాన్, రేపే విజయవాడ వెళ్తాను. సుమద్యుతి పుట్టింటి అడ్రసు నాకు తెలుసు."
"అనుమానం రాకుండా కనుక్కో" ఫోన్ పెట్టేసాడు.
నా సమస్య దాదాపు పరిష్కారం అయిపోయినట్టు- తేలికయిన మనసుతో నిద్ర కుపక్రమించాను.
అంత తొందరగా పరిష్కారంమౌతే అది సమస్య ఎందుకు అవుతుంది?
6
ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విషాదమేమిటంటే మనం చేసిందే మరొకరు చేస్తే, అది మనకి తప్పుగా కనపడటం.
* * *
ఆ మరుసటిరోజు ప్రొద్దున్నే అంకిత్ ని తీసుకుని నేను ఆస్పత్రికి వెళ్ళాను. కడుపు నొప్పివల్ల అరుంధతి రాలేకపోయింది.
అంకిత్ ని కన్సల్టేషన్ రూమ్ లో కూర్చోబెట్టి నన్ను డాక్టర్ మృణాళిని పక్కగదిలోకి తీసుకువెళ్ళింది.
"రేపు అంకిత్ కి ఫిస్టులా చేద్దామనుకుంటున్నాం."
"అదేమిటి? క్రితంసారే చేసామన్నారు కదా?" విస్మయంగా అడిగాను.
"క్రితంసారి చేసింది. హిమోడయాలిసిస్..... అంటే ఒక చేతినుంచి రక్తం మిషన్ లోకి పంపి, మరో చేతిద్వారా శరీరంలోకి ఎక్కించటం......"
"మరిప్పుడు చేయబోయేది ఏమిటి?"
"పెరిటోనియల్ డయాలిసిస్."
ఒక్కొక్క పేరూ బాంబులా పేలి నన్ను భయపెడుతోంది.
"అంటే-"
"చేతినాళం ద్వారా శరీరంలో రక్తమంతా బయటికి తీసి శుద్ధి చేయటం మాటి మాటికీ కుదరదు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో అసలు కుదరదు. రక్తనాళాలు సన్నగా వుంటాయి కాబట్టి, ఒకటి రెండుసార్లు సూది గుచ్చే సరికి ఆ నాళం 'బ్లాక్' అయిపోతుంది. అందుకని ఫిస్టులా చేస్తాం......"
"అవును......ఆ ఆపరేషన్ చేస్తామని చెప్పారు."
"నిజానికి ఫిస్టులా అంటే ఆపరేషన్ కాదు. రంధ్రం చేయటం! దారి ఏర్పర్చటం అన్నమాట! పెరిటోనియమ్ అంటే- కడుపుకి, ప్రేవులకీ మధ్యనున్న పోర. అందులో ఒక రకమైన ద్రవం వుంటుంది. కడుపుకి రంధ్రంచేసి బయటకి ఒక గొట్టాన్ని శాశ్వతంగా అమరిస్తే, ఇక చేతి తాలూకు రక్తనాళాల అవసరం వుండదు. రోగి ఆస్పత్రికి రాగానే, ఆ గొట్టానికి మిషన్ తగిలింది, పెరిటోనియమ్ ద్రవాన్ని శుద్ధి అవుతుంది."
కన్సల్టేషన్ రూమ్ లో ఏమీ తోచక- అంకిత్ బయటకు వచ్చాడనీ పక్కగదిలో జరుగుతూన్న మా సంభాషణ వింటున్నాడనీ నాకు తెలీదు. ఒక భయంకర పరిణామం తరువాత- దీన్ని వూహించగలిగాను.
"ఈ విధంగా ట్యూబ్ అమరిస్తే మరి ఇన్ ఫెక్షన్ రాదా?"
"వస్తుంది. దానికి రోజూ ఇంక్షన్లు కానీ, ట్యాబ్లెట్లుగానీ వాడాలి. రోజూ ప్రొద్దున్న, సాయంత్రం క్రమం తప్పకూడదు. ఇంజెక్షన్ ఖరీదు ఒక్కొక్కటి వంద......"ముందే వివరిస్తున్నట్టు అంది.
నేను పేలవంగా నవ్వేను. "రక్తశుద్ధి....... చాలా ఖరీదైన ప్రకియ అనుకుంటాను" ఇంగ్లీషులో అన్నాను.
"అవును. మొన్నే ఒక టీచర్ హత్యలాటి ఆత్మహత్య జరిగింది- మా హాస్పటల్ లోనే."
"హత్యలాటి ఆత్మహత్యా? .......ఎలా?" ఆశ్చర్యంగా అడిగాను.
మృణాళిని విషాదంగా నవ్వింది. "కొడుకులా, కూతుళ్ళూ, కోడళ్ళూ అందరూ మంచివాళ్ళే. మీకు తెలుసుగా ఇక్కడ ఒకసారి డయాలిసిన్ చేయాలంటే ఛార్జీ రెండువేలు. ఆ ముసలాయనకి మూడు రోజులకొకసారి రక్తశుద్ధి చేయాలి. పైగా రోజూ ఇంకక్షన్లు.......నెలరోజులయ్యేసరికి ఆయనకీ విషయం అర్ధమైంది. అప్పటికే నలభై వేలయింది. ఆస్పత్రి కొచ్చినప్పుడల్లా కొడుకులు రెండుమూడు వేలకోసం వెతుక్కోవటం గమనించాడు. ఒకేసారి ఆ ఆపరేషన్ కోసమో లక్ష ఖర్చు పెట్టటం వేరు. ఇలా వారానికి రెండుసార్లు జీవితాంతం ఖర్చు వేరు. అందుకే ఆయన డయాలిసిస్ కి నిరాకరించాడు."
"నిరాకరించాడా?" అదిరిపడి అడిగాను.
"అవును. ఆ కుటుంబమంతా ఆయన నిర్ణయం విని గగ్గోలు పెట్టింది కానీ ఆ చేదు వాస్తవాన్ని వాళ్ళు జీర్ణించుకోక తప్పలేదు. మొదట్లో వున్న ప్రతిఘటన తర్వాత తగ్గిపోయింది. ఎంతోకాలం అలా డబ్బు పోయలేనప్పుడు- 'అనవసరంగా ఎందుకు ఆ శరీరం మీద పెట్టుబడి పెట్టటం' అన్నది అక్కడ సత్యం."
"మైగాడ్."
"అవును. అదే జరిగింది. ఆ తర్వాత వారం రోజులకి ఆయన పోయాడు....."
"వారం రోజుల్లోనేనా?"
"రక్తం కలుషితం అవటానికి వారం చాలు" వేదాంత పూర్వకంగా అంది మృణాళిని. ".......మనిషిలో నిరంతరం జరిగే రసాయనచర్య అనుక్షణం కాలుష్యాన్ని రక్తంలోకి పంపుతూ వుంటుంది. అయితే మనకు తెలియకుండానే ఒక నమ్మకస్తుడయిన సైనికుడిలా 'కిడ్నీ' రేయింబవళ్ళు తన పని తాను చేసుకుపోతూ వుంటుంది." ఒక క్షణం ఆమె ఆగి అన్నది- "........ఆరోజు నాకు బాగా గుర్తుంది. రక్త సంబంధీకులందరూ ఆయన మంచంచుట్టూ వున్నారు. మరొకసారి డయాలిసిస్ చేస్తే ఇంకో మూడ్రోజులు బ్రతుకుతాడని మా అందరికీ తెలుసు. అయినా ప్రేక్షకుల్లా ఆయన్ని సాగనంపేము. అందుకే అది హత్యలాటి ఆత్మహత్య అన్నాను."
నేను చాలాసేపు మాట్లాడలేకపోయాను. మనసంతా చేదుగా అయిపోయింది. బహుశా నన్నా మూడ్ నుంచి తప్పించటానికా అన్నట్టు అరుంధతినుంచి ఫోన్ వచ్చింది. "నేను ఆస్పత్రికి వస్తున్నాను."
"అదేమిటీ? నీ వంట్లో బావోలేదన్నావ్ గా!"
ఇప్పుడు బాగానే వుంది."
"ఇక నేనేమి చెప్పినా తను వినదని తెలుసు. తను రావటం నాకూ బాగానే వుంటుందనిపించింది. ఎంత తొందరగా వీలైతే అంత వేగంగా విజయవాడవెళ్ళి సుమధ్యుతి వివరాలు కనుక్కోవాలని మనసు తొందరపడుతూంది. చీకట్లో వున్నప్పుడు చిన్న వెలుగైనా ఆశాకిరణం లాగానే కనపడుతుందేమో.
అరుంధతి ఆస్పత్రిలో వుంటే- తనని అంకిత్ దగ్గరవుంచి నేను ఈ సాయంత్రమే విజయవాడవెళ్ళి- రేప్రోద్దునకల్లా తిరిగి రావచ్చు. కేవలం అడ్రసు తెలుసుకోవటమే కాబట్టి అక్కడ అరగంటకన్నా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
అరుంధతి రాగానే నా ప్రయాణం గురించి చెప్పాను. వివరాలు చెప్పలేదు. సుమద్యుతి గురించి చెప్పటం ఇష్టంలేక కాదు. చెప్పటానికి అది సమయంకాదు అంతకన్నా ముఖ్యంగా......ఇదంతా అరుంధతికి మూర్ఖత్వంగా కనిపించవచ్చు.
అవును మామూలుగా ఆలోచించగలిగే స్థితిలో వుంటే అంకిత్ సుమధ్యుతికి పట్టినబిడ్డ అన్న ఆలోచనకి నేనే నవ్వుకుని వుండేవాడినేమో.
అరుంధతి రాగానే నేను ఇంటికి బయల్దేరాను. అక్కణ్నుంచి స్టేషన్ కి వెళ్ళాను. ఆరోజు అంకిత్ ని అబ్జర్వేషన్ లో వుంచి మరుసటిరోజు ఫిస్తులా చేస్తామని మృణాళిని చెప్పింది. ఆ సమయానికి నేను తిరిగి రాగలను.
స్టేషన్ కి వెళ్ళాను.
రైలు రావటానికి మరో అయిదు నిముషాలు వుందనగా మైక్ లో ప్రకటన వినపడింది.
నా పేరు వినపడటంతో జాగృతుడనై వినసాగాను.