Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 13


    క్షణం ఆగారు ప్రధాని. వెంటనే ఏ సమాధానం చెప్పలేదు. మరికొన్ని క్షణాలు ఆలోజించారు.

    "ఎస్! దర్యాప్తు జరుగుతున్నది. ఎవరు దర్యాప్తు చేస్తున్నది, దర్యాప్తులో ఇంతవరకు తేలిన విషయాల గురించి దయచేసి అడగకండి..."

    "వ్వాట్..." ఆశ్చర్యాని ప్రకటించాడు ఆనంద్. అతనితో పాటే అందరిలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవలెననే కుతూహలం కనబడుతున్నది.

    ఇప్పుడక్కడి పరిస్థితి తారుమారయింది. ప్రధాని వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నారు!

    "పోనీ, మీకు ఆ విషయాల గురించి పూర్తిగా వివరాలు అందకపోతే...అందలేదనే చెప్పండి, అవే రాసుకుంటాం! కాని, ఇలా ఏదో సీక్రెసీ అంటూ దాటవేయడం బాగుండలేదు!" అన్నాడు ఆనంద్.

    అతనిలో కించిత్ కూడా భయం లేదు. అసలు అతను ప్రధానితోనేనా మాట్టాడుతున్నది అని అనిపిస్తున్నది అక్కడ వున్న వాళ్ళందరికి.

    ప్రధానిలో ఏమీ చలనం లేదు. తొణకలేదు, బెణక లేదు, తొట్రుపాటు లేదు. ఆవేశం అసలే లేదు. ఆయన ఆలోచన అంతా తను ఏం సమాధానం చెప్పి వీళ్ళందరినీ తృప్తిపరచాలా అన్నట్టు వున్నది.

    "నాటెటాల్! ఆ కేసు గురించి నాకు తెలియకపోవడం కాదు. ఎప్పటికప్పుడు దర్యాప్తులో ప్రగతిని తెలుసుకుంటూనే వున్నాను. సరే, అడిగారు గనుక చెప్పక తప్పడం లేదు. అయితే, ఈ విషయాలు అత్యంత గోప్యంగా వుంచవలసిన బాధ్యత నా మీదే కాదు విషయాలు తెలుసుకున్న మీ అందరి మీద కూడా వుంటుందన్న మాట మరచిపోవద్దు. రేపు ఈ వార్తను దయచేసి ఏ పత్రికలోను వేయకండి......" వాళ్ళకేసి చూస్తూ క్షణం ఆగారు ప్రధాని. 

    "ప్యూర్లీ, ఆఫ్ ది రికార్డ్..." రెట్టించారు ప్రధాని.

    "అలాగే సార్ ...ఆ సీక్రెట్స్ ను కాపాడే బాధ్యత మా అందరి మీద వుంటుందన్న దానికి మేము కట్టుబడి వుంటాం." ఆనంద్ అనడమే తడవు, అంతా తమ అంగీకారాన్ని తెలుపుతున్నట్టు తలలూపారు.

    ప్రధాని గొంతులో గాంభీర్యత చోటు చేసుకుంది.

    ఇప్పుడక్కడ పత్రికా ప్రతినిధులు, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే వున్నారు.

    పరిచారకులంతా తమంతట తామే ముందుగానే దూరంగా వెళ్ళిపోయారు. సెక్యూరిటీ సిబ్బందిని కూడా వెళ్ళిపోమన్నట్టు  సైగచేశారు ప్రధాని. వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోయారు.

    ప్రధాని బట్టబయలు చేసే ఆ కేసుకు సంబంధించిన అతి రహస్యం తెలుసుకోవడానికి రిపోర్టర్లు అందరూ చెవులు రిక్కించుకుని మరీ ఎదురుచూస్తున్నారు...


                        *    *    *


    ప్రధాని నివాసం. సమయం ఉదయం సరిగ్గా ఏడు గంటలవుతుంది.

    డైనింగ్ హాలు. టేబుల్ ముందు ప్రధాని చక్రవర్తి కూర్చుని వున్నారు.

    శ్రీమతి విమలా చక్రవర్తిని వీల్- చెయిర్ లో తీసుకువచ్చింది ఆయా అపర్ణ.

    కుమార్తె మంజు, కుమారుడు అభిషేక్ ఇంకా రాలేదు.

    రిస్ట్-వాచీని అసహనంగా చూశారు ప్రధాని. టైమ్ 07.05 అవుతున్నది.

    7-30కి కార్యదర్శులతో  సంప్రదించవలసి వున్నది. సెంట్రల్ సెక్రటేరియట్ కు వెళ్ళడానికి కనీసం 17 నిమిషాలైనా పడుతుంది. పంక్చ్యుయాలిటీ తప్పడానికి వీల్లేదు.

    రోజులో ఒక్క బ్రేక్-పాస్ట్ టైమ్ లో మాత్రమే కుటుంబ సభ్యులు అందరు తప్పనిసరిగా పాల్గొనే వీలు కుదురుతుంది. మంజు, అభిషేక్ తమ గదుల నుంచీ ఇంకా రాలేదు.

    ప్రధాని విసుగ్గా మరల టైమ్ చూసుకున్నారు. ఆయన ఆతురతను గమనించిన అపర్ణ చకచకా మేడ మెట్లెక్కింది. గదుల తలుపులు తెరచి వున్నాయి, వాళ్ళు లేరు!

    "మేమ్ సాబ్! మంజు అమ్మగారు, అభిషేక్ బాబుగారు ఉదయం అయిదింటికే వెళ్ళిపోయారమ్మా!" నిదానంగా చెప్పాడు వరండాలోని వాచ్ మన్.

    ఖంగుతిన్నది అపర్ణ. ఇద్దరూ కూడబలుక్కున్నట్టు  ఇంత ప్రొద్దుటే ఎక్కడకు వెళ్ళినట్టు? వాళ్ళ ఆలనాపాలనా చూడడానికి, మిసెస్ చక్రవర్తికి సహాయకరంగాను-వెరశి-ఆ ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవడానికే తనను ఆయాగా పెట్టుకున్నది. 

    ఆ ఇంటితో, ఆ కుటుంబంతో తనకు ఆత్మీయత ఏర్పడింది. విడదీయలేని అనుబంధం కుదిరింది. ఇంతకాలంగా ఏ ఒక్కరితోను ఏ మాటాపడకుండా అన్నీ సజావుగా సక్రమంగా జరుపుకుంటువస్తున్నది.

    ఆయానైనా తనకు కనీసం మాటమాత్రమైనా చెప్పకుండా తెల్లగా తెల్లవారకముందే ఎటో వెళ్ళిపోయారు. తన చేతులమీదుగా పెరిగిన మాటనే వాళ్ళు మరచిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమని చెప్పాలి?

    ఇరువురూ చిన్నపిల్లలేం కాదు. మంజుకు పద్దెనిమిదేళ్ళు దాటుతున్నాయి. అభిషేక్ పదిహేడులోకి వస్తాడు.

 Previous Page Next Page