"సర్జికల్ ఓ.పి. వుంది. నిన్న మనవాడికి జరిగిన పరాభవం విని మిమ్మల్ని అర్జంటుగా పరామర్శిద్దామనీ...
"పరామర్శిద్దామనా? అభినందిద్దామనా?"
"సారీ. అభినందిద్దామని. మీకేదైనా అవసరం వుంటే కబురు చెయ్యండి. వుంటా" అంటూ వెళ్ళిపోయాడు.
"వీడెవడు? జిడ్డు" అన్నది మాధవి.
కల్యాణి ఏమీ జవాబు చెప్పలేదు. రాజా ఎక్కడైనా కనిపిస్తాడేమోనని బితుకు బితుకుమంటూ చూస్తోంది.
రాత్రి హాస్టల్లో విద్యార్థినులంతా వివిధ ప్రశ్నలు వేసి మాధవిని వేధించారు అసలేం జరిగిందో రాబట్టుదామని. ఆమె అన్నిటికీ ముక్తసరిగా సమాధానాలు చెప్పి తప్పించుకుంది.
ఈ సంగతి ప్రిన్సిపాల్ దాకా వెళుతుందా? ఆఫీసునుంచి కబురొస్తుందా? అని కొంచెం సంశయించింది మాధవి. అలంటి సంఘటనలేమీ జరక్కపోవటం చూసి ఆశ్చర్యపడింది.
మధ్యాహ్నం లంచ్ అవర్ లో క్లోక్ రూం దగ్గరకు పోతుంటే రాజా కనిపించాడు. స్నేహితులతో వున్నాడు. కల్యాణి గుండె వడివడిగా కొట్టుకుంది.
కాని రాజా ఏమీ అనలేదు. ఏమీజరగనట్లు వాళ్ళ ప్రక్కనుంచే వెళ్ళిపోయాడు.
"రాజా! ఎందుకు వాళ్ళనలా వదిలేస్తున్నావు?" అనడిగాడు ఓ స్నేహితుడు బాధగా.
రాజా ఏమీ జవాబు చెప్పలేదు.
"రాజా! అవకాశంకోసం చూస్తున్నావా? లేక వాళ్ళముందు ఓడిపోయావా? నువ్వలా ముభావంగా వుండటం మాకు చాలా ఇన్ సల్ట్ గా వుంది."
"నాకు లేని ఇన్ సల్ట్ మీకెందుకురా?" అన్నాడు రాజా నవ్వి -
"ఎందుకంటే... నువ్వు ఘోర అవమానం పొందికూడా సైలెంట్ గా వున్నందుకు."
"నేను ఓడిపోను" అన్నాడు రాజా.
స్నేహితుడు అతనివంక ప్రశ్నార్థకంగా చూశాడు.
"నేను గెలుస్తాను" అన్నాడు మళ్ళీ నవ్వి.
స్నేహితుడికి అతని ధోరణి అర్థంకాలేదు.
"నేను... నేను... సాధిస్తాను."
5
ఫ్రెషర్స్ డే వచ్చింది. అప్పటికి సీనియర్సూ, జూనియర్సూ అంతా ఏకమైపోయారు. జరిగింది అందరూ మరిచిపోయినట్లే కనిపించారు.
ఛీఫ్ గెస్ట్ గా పోలీస్ సూపరింటెండెంట్ వచ్చారు. ఆయన తన ధోరణిలో సందేశం అందించాక జూనియర్స్ పరిచయం మొదలయింది. కాలేజి ప్రెసిడెంట్ ఒక్కొక్క జూనియర్ నీ పేరు పేరునా పిలుస్తున్నాడు. ఒక్కొక్కరూ స్టేజి మీదకు వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళాలి.
"జొన్నబత్తుల అప్పారావు పేరు చూసి పల్లెటూరి చిన్నోడనుకునేరు. ఇతనెప్పుడూ పల్లెటూరి మొహం చూడలేదుట."
............
"కుక్కలా బాబూరావు..."
ఆడిటోరియంలోంచి భౌభౌమనే శబ్దాలు మిన్నుముట్టాయి. పాపం ఆ కుర్రాడు స్టేజిదాకా వచ్చి బిక్కుబిక్కుమంటూ ఆగిపోయాడు.
"భయపడకు బాబూ. నీ కంపెనీ ఇక్కడ చాలా, అదిగో వినిపించటంలా ఆ జాతి శబ్దాలు?"
... ... ... ... ...
"రేవనూరి దశరథరాం."
ఓ చిన్న పిల్లాడు ముద్దుగా, బొద్దుగా, తెల్లగా, మెరుస్తూ స్టేజి ఎక్కాడు.
"జింబో ఆఫ్ ది క్లాస్. జింబో ఆఫ్ ది క్లాస్" అని ప్రెసిడెంట్ ఇంట్రడ్యూస్ చేశాడు.
"యస్. ఎగ్రీడ్. ప్రొసీడ్" అన్న కేకలు మార్మోగాయి.
... ... ... ... ...
"పిల్లి గాంధీ."
మ్యావ్ మ్యావ్- అన్నివైపుల నుంచీ శబ్దాలు.
"ఇతనికి పిల్లి అంటే భయం. పైగా అబద్ధాలంటే ప్రాణం"
... ... ... ... ...
"నాసిక సుబ్బారావు."
నిజంగా ఆ అబ్బాయి ముక్కు పొడుగ్గా వుంది. ఇంటిపేరుకు తగ్గట్లు.
"ఇతనికి జలుబు వారసత్వం."
"ముక్కు సుబ్బన్న, ముక్కు సుబ్బన్న" అని ఆడిటోరియంలోంచి కేకలు.
పరిచయాలు అయినాక ఎంటర్ టైన్ మెంట్స్.
"పరువమా చిలిపి పరుగు తీయకు" అని ఓ కుర్రాడు అతి సిన్సియర్ గా పాడేస్తున్నాడు.
ఓ సీనియర్ ఆ పాటకు లయబద్ధంగా స్టెప్స్ వేస్తూ చేతులు వూపుతూ ఆడిటోరియం చుట్టూ పరిగెత్తసాగాడు.
మిమిక్రీ.
ఓ స్టూడెంట్ ఎన్.టి.రామారావు- ఎనాటమీ థియేటర్ లోకి వచ్చి డిసెక్షన్ చేస్తే ఎలా వుంటుందో అభినయిస్తున్నాడు. "ఔరా, ఏమిటిది?" ఇది శవమా? లేక సజీవ మానవదేహమా? అయ్యారే. ఏమి కండపుష్ఠి, ఏమి ఈ దండవైభవము, బయటనే ఇటులున్న యెడల లోపల ఈతని నరములునూ, రక్తనాళములునూ ఎంత ఠీవిగా వుండునోకదా. ఈతని తీరుచూడ బ్రతికి యున్నప్పుడు ఆసనములకూ, వ్యాయామమునకూ అలవడిన రీతి కన్పట్టుచున్నది. బహుళ వేకువఝామునే లేచి, కసరత్తులుచేసి కాఫీలూ, టీలూ గాక చద్ది అన్నము మాత్రము తిని పెంచిన శరీరము రీతి గోచరించుచున్నది... ఆ! ఇవి అన్నియు నాకేల! ఈ స్కాల్ వెల్ తో ఇప్పుడే ఇతని చర్మమును ఛేదించి లోని భాగములను శోధించెదను."
....... .......
ఇంకో కుర్రాడు.
"రాగం తానం పల్లవి" రాజబాబు పాడితే ఎలావుంటుందీ? ఆ పాటకు జయమాలిని డ్యాన్స్ చేస్తే ఎలావుంటుందో అభినయిస్తున్నాడు.
"మాధవి సీట్లు ఖాళీలేనందువల్ల కల్యాణికి కొంచెం దూరంగా కూర్చుంది. దివాకర్ ఆమె ప్రక్కనచేరి చెవిలో జోరీగలాగా ఒకటే రొద చేస్తున్నాడు. తనకు ఆటలంటే ప్రాణంట. క్రికెట్ అంటే పడి చస్తాడుట. ఇండియాలో ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ తర్వాత తనేనట. అసలు రంజీ ట్రోపీకి, టెస్ట్ మ్యాచ్ లకూ సెలక్ట్ కావాల్సినమాటేగానీ వెధవ రాజకీయాలవల్ల అవకాశాలు రాకుండా పోతున్నాయట.